Friday, April 19, 2024
Friday, April 19, 2024

జన్యుమార్పిడితో ప్రజారోగ్యం నాశనం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార డిమాండ్‌తో వ్యవసాయ ఉత్పత్తి 2050 నాటికి 70శాతానికి విస్తరించాలి. అయితే ఫుడ్‌ అండ్‌ ఎగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ అంచనాప్రకారం, ప్రతిఏటా ప్రపంచంలోని 40శాతం పంటలు తెగుళ్లవలన నాశనం అవుతున్నాయి. వాతావరణ మార్పులతో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్‌ విత్తనాలను అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహ లాడుతున్నాయి. కలుపునివారణ మందులవలన భూమి విషతుల్య మౌతుందనే వాస్తవాన్ని ప్రభుత్వం కాదనలేకపోతున్నది. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారంచేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనంచేసే జన్యుమార్పిడి పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది. భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్‌ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులుకూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపుమందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోప్రక్క హెర్బిసైడ్‌ టాలరెంట్‌ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతిచ్చి హెర్బిసైడ్‌ కలుపు నివారణ మందులను యధేచ్ఛగా వాడుకోమంటున్నారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలలో ఆహారంలో జన్యుమార్పిడి పంటలను, హెర్బిసైడ్‌ కలుపు నివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్‌ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేచ్ఛనిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. జన్యుమార్పిడి పంటలతోపాటుగా హెర్బిసైడ్స్‌ వాడకంతో భూమి నాశనమవటం, ఏ మందులకూ లొంగని ‘‘సూపర్‌ వీడ్స్‌’’, ‘‘సూపర్‌ వీడ్స్‌’’ అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువ పురుగుమందులువాడే అవసరంపెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమై ప్రకృతివిచ్ఛిన్నమై కాన్సర్‌ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతున్నది.
జన్యుమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్యప్రచారం చెప్తోంది. 1980లో ఆయిల్‌మిషన్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో వంటనూనెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ హైబ్రిడ్‌విత్తనాలతోనే హెక్టారుకు 3012కేజీల దిగుబడిని రైతులు సాధించారు. డిఎంహెచ్‌ 11 జన్యుమార్పిడి విత్తనాలతో 30శాతం అధికదిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వం అసత్యప్రచారంచేస్తున్నది. రుజువులను చూపించలేక పోతున్నది. ఎన్‌డిడిబిడిఎమ్‌హెచ్‌1 సాంప్రదాయ విత్తనంతో 2924 కేజీల దిగుబడిని, ఎన్‌డిడిబిడిఎంహెచ్‌4 సాంప్రదాయ విత్తనంతో 3012 కేజీల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారంచేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్‌ టాలరెంటు విత్తనం జిఎమ్‌ మస్టర్డ్‌ వలన 2626 కేజీల దిగుబడి మాత్రమేవచ్చింది. అదేమంటే మీరు సైన్సుకువ్యతిరేకం అని దబాయిస్తున్నారు. ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవనూనెను ఉత్తర భారతదేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మనదేశంలో వంటనూనెల ఉత్పత్తిలో 40శాతం ఆవనూనెదే. ఆవపంట 80లక్షల ఎకరాల్లో 60 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నారు. 1993-1994లోనే, ఆవనూనెలో స్వయంసమృద్ధిని సాధించారు. దేశీయఉత్పత్తి అన్ని అంతర్గత అవసరాలను తీర్చింది. ఆవనూనె దిగుమతి అవసరంలేదు. దక్షిణ భారతదేశంలో ఆవనూనె వాడకం చాలా తక్కువ. ఊరకనే ఇచ్చినా వాడరు. తక్కువ ఉత్పత్తివుండి, ఎక్కువమంది ప్రజలువాడే పామాయిల్‌, వేరుశనగనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనెలకు ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పుడు రైతులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతిచేస్తున్న పామాయిల్‌, సన్‌ ఫ్లవర్‌ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూర్‌, ఇండోనేషియా, ఉక్రెయిన్‌ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్‌, వేరుశనగ, నువ్వులనూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతుధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటేలేదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతుకు దిక్కేలేదు. బీటీ కాటన్‌ వలన కలిగిన దుష్పరిణామాలన్నిటికీ మోన్సాంటో లాంటి బహుళజాతుల సంస్ధలే కారణం అని ప్రజలు గుర్తిస్తున్నందున కార్పోరేట్‌ సంస్ధలు కొత్తముసుగులో ప్రవేశిస్తున్నాయి. బార్‌, బార్నేజ్‌, టెక్నాలజీని దిల్లీ యూనివర్సిటీ అధ్యయన బృందం మనదేశంలో పబ్లిక్‌సెక్టార్‌ రంగంలో కొత్తగా కనుగొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బార్‌, బార్నేజ్‌, టెక్నాలజీపై బేయర్స్‌ కంపెనీకి పేటెంట్‌ వుంది. 2001లో బార్నేజ్‌, బార్‌స్టార్‌ టెక్నాలజీని బేయర్స్‌ కంపెనీ వాడిరది. యూరప్‌లో జన్యుమార్పిడి ఆహారాలను తినరు. పంటలకు అనుమతిలేదు. యూరప్‌ దేశాలు జీఎమ్‌ పంటలను గట్టిగా వ్యతిరేకించాయి. యూరప్‌ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలున్నాయేమో అని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జీఎమ్‌ లేబుల్స్‌ అతికించమని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అమెరికాలో శక్తిమంతమైన విత్తనసంస్ధల వత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్‌ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మనదేశంలో జన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని అనుమతించబోమని ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగాచెప్పిన బీజేపీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. ఎమ్‌ఎన్‌సీల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. ఆర్‌యస్‌యస్‌ అనుబంధ సంస్ధయిన స్వదేశీ జాగరణమంచ్‌ జన్యుమార్పిడి ఆవాలను వ్యతిరేకించింది. అయినా విత్తన కార్పొరేట్‌ కంపెనీలు తమ అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి శక్తినిచూపి ధారా మస్టర్డ్‌ హైబ్రిడ్‌ డిఎమ్‌హెచ్‌11 కు అనుమతులను పొందాయి. అమెరికాలో ‘‘లైబిలిటీ లా’’ వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడతారు. మనదేశంలో మీకేమీ కాదన్న ప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జీఈఏసీ సభ్యులు, ప్రభుత్వం-ఎవరిదీ బాధ్యత? 2015లో ప్రపంచ ఆరోగ్యసంస్థ గ్లైఫోసేట్ను ‘‘మానవ క్యాన్సర్‌కు ముఖ్య కారణం’’ గా వర్గీకరించింది. నాన్‌ హాడ్కిన్స్‌ లింఫోమా సహా 10రకాల క్యాన్సర్లకు కారకమైన గ్లైఫోసేట్‌ ఆధారిత హెర్బిసైడ్‌ వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించనందుకు మోన్‌శాంటో/బేయర్‌ కంపెనీపై లక్షకుపైగా కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. జీన్‌ క్యాంపెయిన్‌ జన్యుశాస్త్రవేత్త డాక్టర్‌ సుమన్‌ సహాయ్‌ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి వాణిజ్య బీటీ పత్తిపంటకు సంబంధించిన భద్రతా డేటా ఏదీ పబ్లిక్‌డొమైన్‌లో ఉంచలేదన్నారు. అక్టోబర్‌ 25, 2022న పర్యావరణ విడుదలకు ఆమోదం లభించిన జీఎమ్‌ ఆవాలకు కూడా అదే విధానాన్ని అవలంబించి విత్తనాల విడుదల తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారా? మన దేశంలో జీఎమ్‌ ఆవాలు పండిరచడానికి అన్ని అడ్డంకులు తొలగిన తరువాత ఇతర జీఎమ్‌ పంటలకు కూడా వరద గేట్లను తెరుస్తారు. బీటీ వంకాయ, బీటీ బెండ, గోల్డెన్‌ రైస్‌, వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప-అన్నిటిలో కాస్తోకూస్తో జన్యుమార్పుచేసి వ్యవసాయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కార్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ప్రపంచ ద్రవ్యపెట్టుబడిని ఎదిరించలేని ప్రభుత్వాలన్నీ లొంగిపోయి మాన్సాంటో, బేయర్స్‌లాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. జీఎమ్‌ ఆవాలు ప్రవేశపెట్టటానికి బలమైన అమెరికా ఒత్తిడి వున్నదని జర్నలిస్టు రష్మీ సెహగల్‌ అంటున్నారు.
మన దేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం. 66 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 53శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. దేశ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం క్రమేపీ 15శాతానికి తగ్గింది. జన్యుమార్పిడి పంటలు మననేలను, నీటిని కలుషితం చేస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రక్రియ కోలుకోలేనిది. వివిధ వాతావరణ పరిస్ధితులున్న భారతదేశం జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తిమంతమయినది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు. జీవ వైవిధ్యం మన బలాలలో ఒకటి. అది నాశనంచేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూ క్షేత్రాలలో మోనోక్రాప్‌తో కోర్పోరేట్‌స్ధాయి వ్యవసాయంవైపు నడిపిస్తున్నారు. వ్యవసాయంలో వున్న వారిలో సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికే 86శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. జీఎమ్‌ సాంకేతికత పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలో ఖరీదైన జీఎమ్‌ విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులను కొనలేరు. పెంచనున్న విధ్యుత్‌ చార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీసధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారికి ఏమవుతుంది? దిల్లీ సరిహద్దులలో సంవత్సరంపైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్ఫూర్తితో మరింత శక్తిమంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతుసంఘం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img