Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జాతీయోద్యమం ` వారసత్వం

గడ్డం కోటేశ్వరరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌)

(నిన్నటి తరువాయి)

భారతదేశాన్నుండి బ్రిటీషువారు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేశ ఆర్థిక స్థితితో పాటు ఇతర రాజకీయ, సామాజిక అంశాల్లో వారసత్వంగా సంక్రమించిన కొన్ని సమస్యలను ఈ సందర్భంగా పేర్కొనడం అవసరం. సూర్యోదయానికై ఎదురు చూస్తున్న చీకటి వ్యవస్థగా ఆనాటి ఆర్థిక వ్యవస్థను పరిగణించవచ్చు.
1) బ్రిటీషు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు భారతదేశాన్ని పాలించారు. మన ఆర్థిక వ్యవస్థ బ్రిటీషు పెట్టుబడిదారీ వ్యవస్థతోనూ, దాని ద్వారా ప్రపంచ పెట్టు బడిదారీ వ్యవస్థతోనూ, పెట్టుబడిదారీ మార్కెట్లతోనూ ముడేసి ఉంది. 1750వ సంవత్సరం తర్వాత మన ఆర్థిక వ్యవస్థ బ్రిటీషు పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక ఉపాంగంగా రూపొంది బ్రిటీషు పెట్టుబడిదారీవర్గ దోపిడీకిగురయింది. మన దేశ ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని బ్రిటీషు పెట్టుబడిదారీ వ్యవస్థ లేక ఆ వర్గాల కనుసన్నల్లో ఆ వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారు.
2) భారతదేశంలోని ఉత్పత్తి వ్యవస్థనూ, క్రమాన్ని, బ్రిటీషు పరిశ్రమల అభివృద్ధికి అనుగుణంగా బలవంతంగా మనదేశ వ్యవస్థ మీద రుద్దారు. బ్రిటీషు పరిశ్రమలకు ముడి సరుకులను ఎగుమతి చేసే మార్కెట్‌గా, బ్రిటన్‌ పరిశ్రమల్లో తయారైన సరుకులను దిగుమతి చేసుకునే/కొనుగోలు చేసే మార్కెట్‌గా భారత దేశాన్ని బ్రిటీషు పాలకులు మార్చారు. మనదేశం నుండి ఆహార పదార్థాలు, పత్తి, జనపనార, చమురు దినుసులు, ఖనిజాలు ఎగుమతి అయ్యేవి. గుండుసూది నుండి బిస్కట్‌లు, యంత్రాల వరకు బ్రిటన్‌ నుండి దిగుమతి అయ్యేవి.
ఇవన్నీ కూడా వలస ఆర్థిక వ్యవస్థ లక్షణాలే! అయితే స్వాతంత్య్రానంతరం కూడా ఈ స్థితి కొన్ని సంవత్సరాలు కొనసాగింది. మన దేశంలో శ్రమ సాంద్రత పరిశ్రమలుగా అభివృద్ధి అయిన జౌళి, వస్త్ర పరిశ్రమల్లో ఈ స్థితి కొనసాగింది. ప్రపంచ పెట్టుబడిదారీ మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున మన పరిశ్రమలు ఆ విధంగా కొనసాగవలసి వచ్చింది. మన దేశాన్ని దోపిడీ చేయడం ద్వారా బ్రిటీషు పరిశ్రమలు సాంకేతిక అభివృద్ధి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవడం, పెట్టుబడి సాంద్రత లేక యంత్రసాంద్రత పద్ధతులను అనుసరించి తమ ఉత్పత్తులను పెంచు కున్నాయి. మనవిదేశీవ్యాపారంలో వలసపాలన కాలంనాటి లక్షణాలు స్వాతంత్య్రా నంతర కాలంలో కూడా కనిపించాయి. మన ఎగుమతుల్లో వినియోగవస్తువులు, ముడిసరుకులు 68 శాతం కాగా, దిగుమతుల్లో తయారీవస్తువులు 64 శాతం ఉండేవి.
3) దేశంలో ఉత్పత్తి అయిన అదనపు విలువ, పరిమాణం, వినియోగం, దేశాభివృద్ధి క్రమానికి కీలకమైందని ఆర్థిక శాస్త్రవేత్తలంటారు. అనగా ఆర్థిక వ్యవస్థలో పొదుపు చేసిన అదనపు విలువలోని భాగాన్ని, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకూ, విస్తృతికీ ఏ విధమైన పెట్టుబడులుగా, ఏ వర్గాలకు, ఏ రంగంలో వినియోగించుకుంటారనేదే ఆర్థిక ప్రక్రియలో మౌలికమైంది. బ్రిటీషు పాలన కాలంలో మన దేశ జాతీయోత్పత్తిలో (జి.యన్‌.పి.) సుమారుగా మూడు శాతం మాత్రమే వినియోగార్హమైన మిగులుగా ఉండేది. పెట్టుబడి సమీకరణకు ఆ పరిమాణం నామమాత్రమైంది. మన సామాజిక మిగులు లేక పొదుపులో గణనీయమైన భాగం వలస వ్యవస్థ పాలనా నిర్వహణకూ, పాలనాధికారుల వ్యయాలకూ, సైన్యాన్ని పోషించడానికీ, ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవనానికీ వినియోగించడం వల్ల మిగులు పరిమాణం తక్కువగా ఉండేది. అది అభివృద్ధిని కుంటుపరిచింది. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య అసమాన అభివృద్ధికి దారితీసింది. స్వాతంత్య్రానంతరం ఈ స్థితి కొనసాగింది.
4) భారతదేశ పాలనాపగ్గాలు బ్రిటన్‌చేతిలో ఉండటంవల్ల, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన అంశాలనిర్ణయాలు బ్రిటీషు పాలక వర్గాలు చేస్తున్నందు వల్ల, భారతదేశంలో శైశవదశలో ఉన్న పరిశ్రమలకు (అప్పటికే కొన్ని పరిశ్రమలు మనదేశ పెట్టుబడిదారీ వర్గం ప్రారంభించింది) ఏ విధమైన రక్షణా లేకుండా పోయింది. (మనదేశ జాతీయబూర్జువావర్గం బ్రిటీషు పాలకవర్గాలను వ్యతిరేకించ డానికి ఇదొక కారణం) బ్రిటన్‌తో సహా, మిగిలిన పెట్టుబడిదారీ దేశాల్లో (దాదాపుగా అన్నింటిలో) పరిశ్రమలకు ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి. ఆ విధంగా వాళ్ళ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గాలను పెంచి పోషించాయి. ఆ మేరకు వలస దేశాల్లోని పెట్టుబడిదార్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడిరది. భారతదేశంలో కూడా ఆ విధంగానే జరిగింది. జాతీయ బూర్జువావర్గం తన వస్తుగతమైన స్థితిరీత్యా (ూపjవష్‌ఱఙవ తీవaశ్రీఱ్‌వ) బ్రిటీషు పాలక వర్గాలకు ఆ మేరకు ఎదురు నిల్చింది.
స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాలంలో, ప్రత్యేకించి కమ్యూనిస్టులు ఆ ఉద్యమంలో పాల్గొన్న తరవాత, ప్రజా సంఘాలను నిర్మించి ప్రజా పోరాటాల ద్వారా జాతీయ విముక్తి ఉద్యమాన్ని పటిష్టవంతం చేయాలనే సంకల్పంతో, అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెసువాదులు అనేక నూతన విలువలను ఆ పోరాట కాలంలో ప్రజా జీవనంలోకి తీసుకెళ్ళారు. గాంధీజీ జీవన పద్ధతులు, సంకల్పం, సత్యసంధత, తొణుకూ బెణుకూలేని మానసిక స్థైర్యంతోపాటు కమ్యూనిస్టులు అనుసరించిన త్యాగమయ జీవనం, దృఢ సంకల్పం, పోరాట పటిమలు జాతీయో ద్యమంలో పెనవేసుకుపోయాయి. పొరపాట్లు దొర్లినా, ప్రజల హృదయాల్లో నుండి కమ్యూనిస్టులను గానీ, చిత్తశుద్ధి గలిగిన కాంగ్రెసు నాయకులను గానీ బ్రిటీషు పాలన తొలగించలేకపోయింది. కాంగ్రెసు నాయకత్వంతో సహా కమ్యూనిస్టులు ప్రతిపాదించి, ప్రచారం చేసి, పెంపొందించిన విలువలను కొన్నింటిని ఇక్కడ మననం చేయడం సముచితం.
1) పోరాట కాలంలోనే అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విధానాలనూ, విలువలనూ కమ్యూనిస్టులు స్వతంత్య్రోద్యమంలోకి తెచ్చారు. ఆనాటి కాంగ్రెసు నాయకత్వం అందులో కొన్నింటిని అంగీకరించి, మరికొన్నింటిని తిరస్కరించింది. వలస వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక విధానాలు, రాజకీయ విలువలను ఆ కాలంలోనే సృష్టించారు. ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, పత్రికాస్వాతంత్య్రం, వాక్‌ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, మెజారిటీ అభిప్రాయాన్ని మన్నించడం, మైనారిటీ అభిప్రాయాన్ని గౌరవించడం, ప్రజా సంఘాలను ఏర్పర్చుకునే స్వేచ్ఛ, ఆందోళన, సమ్మెహక్కు లాంటివి ఆ కాలంలో సృష్టించిన విలువలు. ఈ విలువలను నిర్వచించి, ప్రచారం చేయడంలో కాంగ్రెసు నాయకత్వంతో పాటు, కమ్యూనిస్టులూ ఉన్నారు. స్వాతం త్య్రానంతర కాలంలో ఈ విలువలు జాతీయ విలువలుగా గుర్తింపు పొందాయి.
2) స్వయం సమృద్ధమైన, స్వయం పోషకమైన ఆర్థికాభివృద్ధి జరగాలంటే స్వతంత్ర ఆర్థికాభివృద్ధి జరగాలని, ఆనాడు కమ్యూనిస్టులు తమ పత్రాల్లో పలు సందర్భాల్లో వక్కాణించారు. కాంగ్రెసు నాయకత్వం ఈ భావాలను అంగీకరిం చింది. స్వాతంత్య్రానంతర కాలంలో మనదేశ అభివృద్ధి వ్యూహంలో ఇవి అంతర్భాగమైనాయి. విదేశీపెట్టుబడుల మీద ఆధారపడరాదనీ, దేశప్రయోజ నాలనే నిబంధనల మేరకే వాటిని అంగీకరించాలనే విధానం నెహ్రూలాంటివారు అంగీకరించారు.
3) వ్యవసాయరంగంలో సంస్కరణలు ఆనాటి పోరాటాల్లో ఒక ప్రధానాంశం. వ్యవసాయ విప్లవం కోసం పోరాడిన కమ్యూనిస్టులు, దున్నేవానికే భూమి అనే నినాదాన్ని మహాత్మాగాంధీతో కూడా అంగీకరింపజేసే స్థితికి తీసుకెళ్ళారు. వ్యవసాయ సంబంధాలను పునర్వ్యవస్థీకరించాలనీ, భూస్వామ్య విధానాన్ని రద్దు చేయాలనీ, మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలనీ, కౌలుదారీ సంస్కరణలు చేయాలనీ, రైతాంగాన్ని క్లిష్ట సమయాల్లో ఆదుకోవాలనీ కమ్యూనిస్టు పార్టీ నినదించింది. అవన్నీ స్వాతంత్య్రం తరవాత వివిధ దశల్లో మనదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో, కార్యక్రమాల్లో ప్రధానాంశాలైనాయి. తెలంగాణ, కయ్యూర్‌, తెభాగా, వర్లీ ఆదివాసుల పోరాటాలు అందుకు సాక్ష్యాలే!
4) ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి కృషి అవసరమనీ, పెద్ద పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పరాయి దేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదని కూడా చెప్పింది. ప్రజోపయోగ పరిశ్రమలను ప్రభుత్వమే ప్రారంభించా లనే అంశాన్ని కూడా ముందుకు తెచ్చింది. గుత్తాధిపత్యానికి అవకాశం లేని వ్యవస్థ నిర్మించాలని కూడా పార్టీ తన విధాన ప్రకటన చేసింది.
5) ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలనేది మరో నినాదం. సోషలిజం, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలను వ్యాప్తి జేయడంలో కమ్యూ నిస్టులు ముందుపీఠిన నిలిచారు. సాంఘిక, సామాజిక పీడనలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కార్మిక సంక్షేమం మీద కాంగ్రెసు సభలో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించింది కమ్యూనిస్టులే.
6) లౌకిక భావాల వ్యాప్తి, మత సామరస్యాన్ని పాటించాలని కమ్యూనిస్టులు వీధుల్లోకి వచ్చి, మత కొట్లాటలను నిలుపు చేయడానికి ప్రయత్నించారు. తమ ప్రాణాలను పణంగాపెట్టి మైనారిటీలను కాపాడారు. మతోన్మాదాన్ని నిరసిస్తూ, హేతువాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేస్తూ ఉద్యమాల్లో పాల్గొన్నారు.
7) భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని నినదించి, ఉద్యమాలు చేబట్టింది కమ్యూనిస్టులే! ఆ తర్వాత కాలంలో కాంగ్రెసు నాయకత్వం కూడా అందుకు అంగీకరించి, తన కమిటీలను ఆ విధంగా నియమించుకుంది.
8) స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయాలని సాయుధ పోరాటాలు కూడా చేసింది కమ్యూనిస్టు పార్టీ. వేలాది కమ్యూనిస్టు కార్యకర్తలను పోరాటాల్లో బలిదానం చేసింది కమ్యూనిస్టు పార్టీ. తెలంగాణ, కయ్యూర్‌, పున్నప్ర `వాయలార్‌, తెబాగా పోరాటాలు చరిత్రలో సాక్ష్యాలుగా నిలబడిపోయాయి.
9) అలీన విదేశాంగ విధానం స్వాతంత్య్రానంతర కాలంలో అనుసరించిన విదేశాంగ విధానం. స్వాతంత్య్ర పోరాట కాలంలోనే సామ్రాజ్యవాద వ్యతిరేక, వలస వ్యతిరేక విధానాల ప్రాతిపదికగా దేశ విదేశాంగ విధానం ఉండబోతుందనే సంకేతం నెహ్రూ లాంటివారు ఇచ్చారు. ఆ విధానానికి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది.
10) సంపూర్ణ స్వాతంత్య్రం (పూర్ణ స్వరాజ్‌) నినాదాన్ని కాంగ్రెసు మహాసభలో తీర్మాన రూపంలో మొదటిసారి ప్రతిపాదించింది కమ్యూనిస్టులే. ఆనాడు కాంగ్రెసు లోని పెద్దలు (నెహ్రూ, బోసులు మినహా) ఆ నినాదాన్ని వ్యతిరేకించినప్పటికీ, తరవాత కాలంలో అదే ప్రధాన నినాదమైంది.
స్వాతంత్య్ర పోరాటంతో వీసమెత్తు కూడా సంబంధం లేనివారూ, ఆ కాలంలో బ్రిటీషు దోపిడీ పాలనను చూడ నిరాకరించినవారూ, చూసినా వారు శత్రువులు కాదు, మరో మతంవారే శత్రువులనే మతవిద్వేషాలను, వైషమ్యాలను రెచ్చగొట్టిన వారూ, దేశ విభజనకు కారకులైనవారూ, నిజాలను కప్పిపుచ్చి, వారసత్వ అర్హత లేకపోయినా, అందులో తాము ప్రధాన భాగస్తులమని చరిత్ర పుటలను తిరగ రాయించ ప్రయత్నిస్తున్నారు. భగత్‌సింగ్‌, సూర్యసేన్‌, అజాద్‌, రాజగురు లాంటి విప్లవ వీరకిశోరాలు ఉరికంబం ఎక్కుతూ కూడా తాము నమ్మిన సోషలిజాన్ని కలలుగంటూనే ఉరితాడును కౌగలించుకున్నారు. వారి వారసులే కమ్యూనిస్టులు. ఇప్పుడు కాషాయదళం కూడా భగత్‌సింగ్‌, ఆయన అనుచరుల త్యాగాలను రాజ కీయంగా ‘‘సొమ్ము’’ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచారం చేస్తూ, భగత్‌సింగ్‌కు కూడా ‘‘కాషాయ’’ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారు. చరిత్రను వక్రీకరించడమంటే ఇదే! ప్రతిఘటన లేని కమ్యూనిస్టు ‘‘ఉద్యమ బలహీనతే’’, కాషాయదళానికి ఆ అవకాశం ఇస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img