Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డార్విన్‌ సిద్ధాంతం తొలగింపు తగదు

డాక్టర్‌ సోమ మర్ల

మానవ పరిణామ క్రమాన్ని తెలుసుకొని తార్కిక జ్ఞానాన్ని సంతరించుకునేందుకు డార్విన్‌ మానవ పరిణామ సిద్ధాంతం మహత్తరమైంది. ఈ సిద్ధాంతాన్ని సిబిఎస్‌ఇ పదవ తరగతి సైన్సుపాఠ్యాంశాల నుండి ఎన్‌సిఇఆర్‌టి తొలగించడంపై 1800 మందికి పైగా శాస్త్రవేత్తలు, మేథావులు గతవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహించుకోవాలని వీరు ఎన్‌సిఇఆర్‌టికి లేఖ రాసారు. ‘‘శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించుకునేందుకు మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం అత్యంత కీలకం’’. విద్యార్థులను విజ్ఞానవంతులను చేసే అవకాశాన్ని ఇవ్వకపోడం ‘‘విద్యా వ్యవస్థను అవహేళన’’ చేయడం అవుతుంది. పాఠ్యాంశాల నుండి చార్లెస్‌ డార్విన్‌ సిద్ధాంతాన్ని మానన పరిణామంలో చుట్టరికపు సంబంధాల గుర్తింపు, సూక్ష్మజీవుల తీరు తెన్నులులాంటి విషయాలను తొలగించారు. ఇది అత్యంత విచారకరం. పాఠ్యాంశాల నుండి ముఖ్యంగా మానవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడంపై శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ తక్షణం తొలగించిన పాఠాలను తిరిగి చేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. లేఖపై సంతకం చేసినవారిలో ఐఐటి కాలేజీలు, ఐఐఎస్‌ఇ ఆర్‌, ఐసిఎఆర్‌, టిబిఎఫ్‌ఆర్‌, సిఎస్‌ఐఆర్‌లాంటి సుప్రసిద్ధ కాలేజీలకు చెందిన శాస్త్రవేత్తలు, మేథావులున్నారు. చాలా కేంద్ర విశ్వవిద్యాలయాల నుండి ప్రొఫెసర్లు సంతకాలు చేశారు. జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే జీవశాస్త్ర పరిణామక్రమాన్ని అధ్యయనం చేసి తగినంత విజ్ఞానం తప్పనిసరి. జీవుల మనుగడ ప్రకృతిలో ఆమె లేదా ఆయన స్థానం అర్థం చేసుకోవడం కూడా జీవశాస్త్రం అధ్యయనానికి ముఖ్యమైనవి. సమాజంలో నిత్యం మనం ఎదుర్కొనే అనేక సమస్యలను విశ్లేషించుకోవడానికి, అలాగే అంటువ్యాధులు, పర్యావరణం, వాతావరణం, ఔషధాల ఆవిష్కరణలాంటి వాటికి పరిణామక్రమ జీవశాస్త్ర అధ్యయనం ఎంతో అవసరం.
ఇటీవల తలెత్తిన కోవిడ్‌ మహమ్మారి రోగలక్షణ శాస్త్రంలో జన్యువుల విశ్లేషణలో ప్రకృతి చాలా కీలకమైనపాత్ర నిర్వహించిందని రోజువారీ జీవనంలో రద్దీగా ఉండటం వల్ల గుర్తించలేకపోయాము. ఇది క్రమంగా పరివర్తనం చెందింది. శాస్త్ర పరిశోధనలు ఈ అంటు వ్యాధి మరింతగా విస్తరించకుండా నియంత్రించ డానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. జన్యుపరిణామ క్రమం అధ్యయనం మూలంగా రోగాణువులలో వ్యాధులకు గురవుతున్న జన్యువులు, ఎంజైములను అర్థం చేసుకొనేందుకు ఉపయోగం కలిగింది. తద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమైంది.
మన విశ్వం అనేకరకాల జీవజాతులు, పశుపక్ష్యాదులు, మొక్కలు, సూక్ష్మ జీవులతో కూడిన ఎంతో వైవిధ్యభరితమైంది. జీవవైవిధ్యాన్ని, వివిధజాతుల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు సహాయపడ్డారు. అలాగే హైబ్రిడ్‌ సంబంధిత మొక్కలు అవిష్కరించడానికి శాస్రవేత్తల కృషి ఎనలేనిది. ఫలితంగా పంటల దిగుబడి పెరిగింది. మేలైన పంటలు వేసేందుకు ఆహార ఉత్పత్తిని పెంచేందుకు విశ్వంలో జీవులన్నిటినీ ఆకలికి గురికాకుండా మనుగడ సాధించేందుకు శాస్త్రవేత్తలు ఉపయోగపడ్డారు. వివిధ జీవుల పుట్టుకను డార్విన్‌ సిద్ధాంతం మనకు తెలియజేసింది. వివిధరకాల మొక్కలు, జంతువులను గురించి ఈ సిద్దాంతం తెలియజెప్పింది. వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కొన్నిరకాల జీవులు క్రమంగా మార్పునకు లోనయ్యాయి. అన్నిరకాల క్రిమికీటకాలలో ఒకేరకమైన డిఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ, జీవక్రియ, శరీరధర్మ, ఉమ్మడి జన్యువారసత్వం (జీవపటలం) గురించి జీవశాస్త్రం మనకు తెలియజేస్తుంది. కొత్త యుగాన్ని ఆవిష్కరించిన డార్విన్‌ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం మూలంగా జీవశాస్త్రంలో జన్యువుల ఉనికి స్థిరపడిరది. అనంతరం వివిధ జంతువుల మధ్యగల పోలికలు, సంబంధాలను గురించి తెలుసుకునేందుకు ఈ సిద్ధాంతం ఉపయోగపడిరది. ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ తన వ్యాసం ‘‘కోతి మానవుడిగా రూపాంతరం చెందడానికి శ్రమ నిర్వహించిన పాత్ర’’ లో ప్రస్తుత ఆధునిక మానవుడిగా పరిణామం చెందడంపై విశ్లేషణ చేశారు. ఈ పరిణామక్రమంలో మానవుని శ్రమ పాత్రను ఆయన ప్రశంసించారు.
పరిణామ క్రమంపై ప్రపంచమంతా ఉన్న అవగాహనకు పూర్తి విరుద్ధంగా బీజేపీకి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి సత్యపాల్‌(జనవరి 2018) డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని సవాలు చేశారు. అంతేకాదు, ‘‘కోతులు మనిషిగా మార్పుచెందుతుంటే ఎవరూ చూడలేదు’’ అలాగే డార్విన్‌ సిద్ధాంతం (మానవ పరిణామం శాస్త్రబద్ధంగా తప్పు అని కూడా సత్యపాల్‌ చెప్పారు. విద్యార్థుల పుస్తకాల్లో పాఠ్యాంశాలను మార్చివేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో పాఠ్యపుస్తకాల నుండి డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని, రేఖా గణితాన్ని తొలగించి వీటి స్థానంలో పుక్కిటి పురాణాలలో భాగమైన దశావతారాలను ప్రవేశపెట్టారు. వేదగణితాన్ని కూడా ప్రవేశపెట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరంలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తుతం కేంద్రంలోఉన్న ప్రభుత్వం సైన్సును, తార్కిక ఆలోచనను లక్ష్యంగా చేసుకున్నారు. తద్వారా విమర్శనాత్మక ఆలోచనను, విద్యార్థులు ప్రశ్నించడానికి వీలులేని విధంగా మార్పు చేసేందుకు పూనుకున్నారు.
ఆధునిక భారతదేశాన్ని అజ్ఞానం, మనుస్మృతి, కులతత్వం ఉన్న చీకటి యుగాలకు తీసుకువెళ్లాలని వీరు పథకాన్ని రూపొందించుకున్నారు. ఇది ఎంత మాత్రం సరైందికాదని పాఠ్యాంశాల నుండి తొలగించిన పాఠాలన్నింటినీ తిరిగి చేర్చాలని దాదాపు 1800 మందికిపైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు డిమాండ్‌ చేశారు. వీరితోపాటు ప్రజలు కలిసి తొలగించిన పాఠ్యాంశాలను తిరిగిచేర్చాలని ఎన్‌సిఆర్‌టీని, కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను డిమాండ్‌చేస్తూ పోరాటం చేయవలసిన అవసరం ఉంది.
వ్యాస రచయిత ఐసిఎఆర్‌లో (న్యూదిల్లీ)
జినోమిక్స్‌ హెడ్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌(రిటైర్డ్‌)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img