Friday, April 19, 2024
Friday, April 19, 2024

తిరగబడ్డ మహిళ

కూన అజయ్‌బాబు

అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల పునరాగమనం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులకు, హక్కుల కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహిళలు, పాత్రికేయుల పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన వారంరోజులవ్యవధిలో తాలిబాన్లు తమవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయితే మహిళలు, పాత్రికేయులు ఈసారి తిరగబడటం అనూహ్య పరిణామం. భరించరాని వ్యవస్థ ఏర్పడినప్పుడు విప్లవం పుట్టుకొస్తుందని మరోసారి రుజువైంది. 1996-2001 వరకు తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ మహిళలు, జర్నలిస్టుల దుస్థితి భయానకం. తాలిబన్లు కనిపిస్తే చాలు మహిళలు బెదిరిపోయేవారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోయేవారు. ఎక్కడ తమపైదాడులు, అత్యాచారాలకు పాల్పడతారోనని భీతిల్లిపోయేవారు. కానీ పదిహేనేళ్లలో వారి మానసిక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. మహిళల్లో చైతన్యం పెరిగింది. మరోసారి ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ దురాగత పాలనకు తెరలేపినప్పటికీ.. మా హక్కులను కాలరాసే అధికారం మీకెక్కడిదంటూ అక్కడి వనితలు నినదిస్తున్నారు. దుష్టమూకల ఆరాచక పాలనకు ఎదురొడ్డుతున్నారు. తాలిబాన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత కో-ఎడ్యుకేషన్‌పై ఆంక్షలు విధించారు. బాలికలకు మహిళలు మాత్రమే విద్య బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులకు, మహిళలకు మధ్య నిలువెత్తు గోడలు కట్టారు. ఇలా మహిళా స్వేచ్ఛకు భంగం కలిగేలా పలుచర్యలు చేపట్టారు. ఈ అరాచక పాలనపై నారీలోకం భగ్గుమంది. రోడ్లపైకి చేరి నినదిస్తున్నారు. హెరాత్‌ నగరంలో మొదలైన తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకున్న కాబూల్‌ మహిళలు.. మరింత ఉద్ధృతితో ముందుకు సాగుతున్నారు. ప్లకార్డులు చేతబూని దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో సైతం తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు. తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. అఫ్గానిస్థాన్‌ వ్యహహారాల్లో పాకిస్థాన్‌ జోక్యంతో పాటు తాలిబన్ల చర్యలను నిరసిస్తూ అక్కడి పౌరులు పాక్‌ రాయబార కార్యాలయం వద్దకు చేరుకొని గళమెత్తారు. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కాబూల్‌, హెరాత్‌నగరాలు మార్మోగిపోయాయి. ఆ సమయంలో తాలిబన్లు వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా, తుపాకులు తిరగేసి కొట్టినా… వారు వెనుదిరగలేదు.
స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను తాలిబన్లు ఎక్కడికక్కడ అణచివేస్తున్న దృశ్యాలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపైనా తాలిబాన్లు కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేస్తున్నారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పశ్చిమ కాబూల్‌లోని కర్తే ఛార్‌ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళలు చేపట్టిన ఆందోళనను కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడ్డారు. అఫ్గాన్‌ మీడియాసంస్థ ఎట్లియా ట్రోజ్‌కు చెందిన వీడియో ఎడిటర్‌ తాఖీ దర్యాబీ, రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సదరు మీడియా సంస్థ వెల్లడిరచింది. వారిని తీవ్రంగా కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. శరీరంపై గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలను ఆ సంస్థ ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసింది. ఇటీవల మహిళల నిరసనను కవర్‌ చేస్తున్న ఓ వీడియో గ్రాఫర్‌ను తాలిబన్లు అదుపులోకి తీసుకుని ముక్కు నేలకు రాయించిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్టును కాలితో తన్ని అతడి వద్ద ఉన్న కెమేరాను లాక్కున్నారు. తాలిబన్ల పాలనలో మానవ హక్కుల దయనీయ పరిస్థితికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. తాలిబన్లు సృష్టిస్తోన్న మారణహోమాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజంతోపాటు ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలని అక్కడి నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ మొరపెట్టుకుంది. మరోవైపు తాలిబాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం.. కాబూల్‌ లోని పలుప్రాంతాల్లో ఇంటర్నెట్‌సేవలను నిలిపివేసింది. ఇవన్నీ హక్కులపై సమ్మెట పోటే. అయితే షరియా చట్టానికి అనుగుణంగా పరిపాలిస్తామని తాలిబన్లు ఇంకోసారి తేల్చి చెప్పారు. ‘‘తాలిబన్ల పాలనలో పీహెచ్‌డీలకు, ఎంఏలకు విలువ లేదు. మీరు చూడండి.. అధికారంలో ఉన్న ముల్లాలు, తాలిబన్లకు పీహెచ్‌డీ, ఎంఏ డిగ్రీలు ఉన్నాయా..? వారికి కనీసం హైస్కూల్‌ విద్య కూడా లేదు. కానీ, వారే అందరికంటే గొప్పగా ఉన్నారు’’ అని తాలిబన్‌ విద్యాశాఖమంత్రి షేక్‌ మౌల్వీ నూరుల్లా మునీర్‌ చేసినవ్యాఖ్య అఫ్గాన్‌పయనమెటో, అక్కడి హక్కులదారెటో చెప్పకనే చెపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img