Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

త్వరలో భారత్‌ వెలుగు..జిలుగులు..!

మర్ల విజయ కుమార్‌

భవిష్యత్‌లో భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి..! ఘనత వహించిన సర్కారు, 56 ఇంచీల ఛాతీతో, అంతకుమించి పూర్తి డొల్ల అయిన బుర్రతో వెలిగిపోతున్న మహానాయకుడు ప్రయివేటీకరణ కాండలో ఆరి తేరారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు. బస్టాండులు, రైళ్లు, బస్సులు, ప్రభుత్వ రంగ సంస్థలు సర్వం అమ్మివేసి ఆరు లక్షల కోట్లు రాబట్టుకుంటారట. ప్రతి వార్షిక బడ్జెట్‌లో ధనికులకు, కార్పోరేట్లకు ఏడు లక్షల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చుకోవటంతో ఖజానా ఖాళీ అయి ఎలుకలు చచ్చిన గబ్బు కొడుతోంది. ఇక మహానాయకుడు, ఆయన ఖాఖీ నిక్కరు సలహాదారులు ఆలోచించి, చించి ఇక ఏమేమి ప్రయివేటు పరం చెయ్యాలా అని తలలు పట్టుకున్నారు. ఇప్పటికే వైద్యం, విద్య, పోలీసు, న్యాయ వ్యవస్థ ఆదిగా అన్నీ ప్రయివేటు చేతుల్లోకి వెళ్లి పోయాయి. ఇక మిగిలిందల్లా జైళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వోద్యోగుల క్వార్టర్స్‌ – అవి అమ్మినా 15 రోజుల ఖర్చుకు కూడా సరిపోదు. ఆర్థిక మంత్రిణి ఏమి చెయ్యాలో అర్థంకాక ఎప్పటిలాగే వెర్రి చూపులు చూస్తున్నది. అప్పుడు మహా నాయకుడికి తలలో ఒక గొప్ప మెరుపు మెరిసింది. ‘‘ఇప్పటికే జాతీయ రహదారులన్నిటిని అమ్మేశాం. ఇక రాష్ట్ర స్థాయి, పట్టణ, గ్రామ స్థాయి రోడ్లన్నీ అమ్మకానికి పెట్టండి. ఇక మన పార్టీకి డబ్బులే డబ్బులు!’’
సీను కట్‌ చేస్తే వీర్రాజు తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. అతడి భార్య అతడ్ని తట్టి లేపి, ‘‘ఏమండీ, మీ అమ్మగారికి గుండెల్లో బరువుగా ఉందంటు న్నారు. బిపి, గుండె నొప్పి మందులు అయిపోయాయి. వెళ్ళి త్వరగా తీసుకు రండి. పక్కవీధిలో మెడికల్‌ షాపు 24 గంటలు తెరిచి ఉంటుందట’’ అన్నది. వీర్రాజు షర్టు వేసుకుని మందులు తెస్తానని అమ్మకి చెప్పి, రోడ్డు మీదకి వచ్చాడు. వీధిలో అలారం మ్రోగటం ప్రారంభించింది. ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు అతడ్ని చితకబాది ప్రయివేటు లాకప్‌లో పడేసారు. మందుల హడా విడిలో టోల్‌ కార్డు జేబులో పెట్టుకోవటం మరచిపోయాడు. తెల్లారేక ఫైన్‌ కట్టి ఇంటికి చేరేసరికి అతని తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అమ్మ దహన సంస్కారానికి ప్రయివేటు కంపెనీకి లక్ష రూపాయలు చెల్లించి ఆ రాత్రికి ఇంటికి చేరాడు వీర్రాజు. అమ్మను హాస్పిటల్‌లో చేర్చి ఉంటే ఐదు లక్షలకి తక్కువ కాకుండా బిల్లు అయి ఉండేది. తన దగ్గర ఎట్లాను అంత డబ్బులేదు. ఆర్థిక పరిస్థితి ఇట్లా దిగజారుతుంటే మమతలు, మమకారాలు పరిస్థితులకు తలవొగ్గ వలసిందే! ఒక కథలో చదివినట్లు మరణశయ్యపై ఉన్న కన్నతల్లికి వైద్యం చేయించే స్థోమత లేక, ‘‘అమ్మా, సచ్చిపోయే! నీకు మందులు కొని వైద్యం చేయించలేని చేతగానోణ్ని,’’ అని కొడుకు విలవిలా రోదిస్తుంటాడు. ‘‘ఇప్పుడు నా పరిస్థితి ఇంతే కదా!’’ అనుకున్నాడు.
ఇప్పుడు ఇంటి నుండి బయటకు వస్తే టోల్‌ చెల్లించాల్సిందే. ప్రతి పౌరుడు నెలకి వెయ్యి రూపాయలు టోల్‌ కార్డుకు చెల్లించాలి. ఐదేళ్లలోపు పిల్లలకి, ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఛార్జి ఐదువందలే. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌ యూనివర్సిటీ యోధులు, ‘‘రోడ్ల ప్రయివేటీకరణ మీ మంచి కోసమే! ఇక దేశం శరవేగంతో అభివృద్ధి అయిపోయి, చైనా, అమెరికాలను మించిపోయి ప్రపం చంలో అగ్రగామి దేశం అయిపోతుందని, ఇదంతా మహా నాయకుని అద్భుత మహిమేనని’’ ప్రచారం ఊదర గొట్టేస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ స్మార్ట్‌ సిటీ కదా. జగన్నాధపురం బ్రిడ్జి దాటినప్పటి నుండి మసీదు జంక్షన్‌ వరకూ ఒక టోల్‌ ఛార్జి. అక్కడనుండి టూటౌన్‌ జంక్షన్‌ వరకూ మరొక ఛార్జి. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దాటి భానుగుడి వరకూ మరొక ఛార్జి. ఇట్లా ప్రతి కిలోమీటరుకు గోళ్ళూడ కొట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. చైనాలో షెన్‌జన్‌ నగరాన్ని తలదన్నేలా ప్రతి ఊరినీ అభివృద్ధి చేయబోతున్నామని జనం బుర్రలు మొద్దుబారేలా ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. ఊరిలో ప్రతి రోడ్డు పైనా ‘‘మాస్కు ధరించండి. జేబులో టోల్‌ కార్డు ఉంచుకోవటం మరచిపోవద్దు’’ అని హెచ్చరికలు దర్శనమిస్తాయి.
కిలోమీటరు దూరం ఉన్న స్కూలు దగ్గర పిల్లల్ని దింపాలంటే టోల్‌ ఛార్జి బైక్‌కి పది రూపాయలు. పెట్రోలు లీటరు 250 రూపాయలు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్ళి వస్తే మొత్తం వంద రూపాయలు వదుల్తాయి. పోనీ ఆటోలో వెళ్తే ఒకవైపు ఛార్జి ఆటోకి వంద, టోల్‌ ఛార్జి అదనం. బస్‌ ఎక్కినా ఇదే తంతు. జీతంలో నాలుగవ వంతు పెట్రోలుకు, టోల్‌ ఛార్జీలకే అయిపోతుంది. ఇక వంట గ్యాసు బండ రేటు 4000 రూపాయలు. ఏ కూర ఆయినా వందకు తక్కువలేదు. భార్యకు రక్తహీనత కారణంగా నీరసం. రోజూ ఒక గుడ్డు తినాలని డాక్టరు చెప్పేడు. కాని ఒక్కొక్క గుడ్డు ధర 25 రూపాయలు. పరిస్థితి ఇట్లా ఉంటే చేసే ప్రయివేటు కంపెనీలో మేనేజిమెంట్‌ కృత్రిమ మేధ స్సుతో పనిచేసే రోబోలను ప్రవేశపెట్టి, ఒక్కొక్క రోబోకు పదిమంది ఉద్యోగులకు ఉద్వాసన చెపుతోంది. ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఉద్యోగం పోయి జీవనాధారం లేకపోతే జీవితం కొద్ది రోజుల్లోనే తల్లకిందులవు తుంది. రోడ్ల ప్రయివేటీకరణతో రోడ్లు, రోడ్డు ప్రక్కన జాగాలు అన్నీ ప్రయివేటు పరమయిపోతున్నాయి. ఉద్యోగాలు పోగొట్టుకుని జీవనాధారం కోల్పోయి, కూలీ దొరకక రోడ్డున పడ్డవాళ్లు కోకొల్లలు. రోడ్లన్నీ ప్రయివేటు చేతుల్లోకి వెళ్లటంతో రోడ్డు పక్కన ఖాళీ జాగాల్లో గుడిసెలన్ని టిని తొలగించి రోడ్డుకి ఇరుపక్కలా వ్యాపార ప్రకటనలకు నిలువెత్తు బోర్డులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయి కంపె నీలు. ఉద్యోగాలు పోగొట్టుకుని, బతికే మార్గం లేక రోడ్డున పడ్డ వాళ్ళని ప్రయి వేటు సెక్యూరిటీ గార్డులు గొడ్లను బాది నట్లుగా చితగ్గొట్టి ఊరి పొలిమేరల నుండి తరిమేస్తారు. ఇక పోరంబోకు స్థలాల్లో మురికి పేటల్లో నాలుగు తడికల మధ్యన జీవితం వెళ్లబుచ్చాలి. రౌడీలు, గుండాలు యథేచ్ఛగా దాడులు చేసి దొరికినదల్లా ఎత్తుకెళుతుంటారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడో ప్రయివేటు పరం కావటంతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నారు. బైకు దొంగి లించారని పోలీసు స్టేషన్‌కి వెళితే లోనికి అడుగు పెట్టగానే సర్వీసు ఛార్జి వంద రూపాయలు డెబిట్‌ కార్డునుండి ఆటోమేటిక్‌గా కట్‌ ఆయిపోతాయి. ఏభై వేల బైకు తిరిగి రావాలంటే పాతికవేలు ఫీజు చెల్లించుకోవాలి. తరచుగా వారి ఏజం ట్లే బైకులు దొంగిలించి, వాళ్ళ కమిషన్‌ తీసుకుంటారు. పేదవాళ్లకు న్యాయం జరగటం అసంభవం. ఎంత నేరం చేసినా, డబ్బు పడేస్తే జైలులో అన్ని సౌఖ్యాలు అందుబాటులో ఉంటాయి. ముదిరిపోయిన నేరస్థులు, జైలునుండి యథేచ్ఛగా బయటకు వెళ్ళి, హత్యలు, దోపిడీలు చేసి తిరిగి జైలులోకి వచ్చి పడు కుంటారు. ఆంతా డబ్బు మహిమ.
ఇంతలో వీర్రాజు స్టోర్స్‌ క్లర్కుగా పనిచేసే హోమ్‌ డెలివరీ కంపెనీ ఒకేసారి 50 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. వారి స్థానంలో రోబోలు వినియోగి స్తారట. ఇక కంపెనీ ఇచ్చిన 15 రోజుల జీతంతో ఇంటికి చేరి ఏమి చెయ్యాలా అని ఆలోచించారు వీర్రాజు దంపతులు. మరొకఉద్యోగం దొరకటం అసాధ్యమే! అసలే రోజు గడవటం కష్టంగా ఉంది. ఊరవతల మురికిపేటలో బతుకుదా మంటే ఉన్న డబ్బులు కాస్తా రౌడీలకు సరిపోతుంది. ఇక ఎట్లా బతకాలి? వాళ్ళ స్వగ్రామం తాటిపల్లి. కాకినాడకు 15 కిమీ దూరంలో ఉంది. తాత ఇచ్చిన అరెకరం స్థలంలో పెంకుటిల్లు ఉంది. అరడజను కొబ్బరి చెట్లు ఉన్నాయి. కోళ్లు పెంచుకుని, కొబ్బరి కాయలు అమ్ముకుని బతకవచ్చునని భార్య సలహా ఇచ్చింది. రహదారికి ఒకటిన్నర మైలు దూరంలో రోడ్లు లేని కుగ్రామం తాటి పల్లి. రోడ్లే లేనప్పుడు ఇక ఆ ‘‘మహానాయకుడు’’ ఏమి అమ్ముతాడు? ఇంటద్దె బాకీ చెల్లించి పెట్టే బేడాతో, సకుటుంబముగా ఊరి దారి పట్టాడు వీర్రాజు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img