Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దిగ్భ్రాంతి కలిగిస్తున్న దిగుమతులు

భారత్‌లో ఏటా పెరుగుతున్న విదేశీ దిగుమతులు ద్వారా పెరుగుతున్న వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు, క్షీణిస్తున్న కరెన్సీ విలువ పాలకుల్లోనూ, ఆర్ధికవేత్తలలోనూ, విధానకర్తలలోనూ, విద్యావేత్తలలోనూ చర్చనీయాంశంగా మారింది. మొదటి పంచవర్ష ప్రణాళికాకాలంలో నమోదైన రూ.730 కోట్లు దిగుమతులు 2001-02లో 56,277 మిలియన్‌ డాలర్లకు చేరి 2021`22నాటికి భారీగా 5బిలియన్ల డాలర్ల స్థాయికి ఎగబాకాయి. ఒకవైపు మన ఎగుమతులు కూడా పెరుగుతున్నా, రెండిరటి మద్య తేడా ఏటా పెరుగుతునే ఉంది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా దిగుమతులు పెరగడం సహజం. దిగుమతి చేసుకున్నవి దేశ ఆర్ధిక అభివృద్ధికి దోహదపడితే అవి ఎంతైనా ఎవరూ తప్పుపట్టరు. కాని ఒకవేళ అవి అను త్పాదకమైనవి, దేశాభివృద్ధికి తోడ్పడనివి, స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగిన వాటిని దిగుమతి చేసుకోడం సహేతుకం కాదు. భారత్‌ ఎగుమతులు 2021-22 లో రికార్డుస్థాయిలో సుమారు 418 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కాని గమనించవలసిందేమిటంటే, వస్తు ఎగుమతుల కన్నా వాటి దిగుమతులు అత్యంత వేగంగా పెరగడం ఆందోళన కల్గించే అంశం. ఒక్క గత ఏప్రిల్‌లో వాణిజ్యలోటు 20.07 బిలియన్‌ డాలర్ల్లు నమోదైంది. ఈ లోటు దేశ ఆర్థికవృద్ధి రేటును పరుగు లెత్తించడానికి సహకరిస్తే, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. పైగా దానిని స్వాగతించాలి. ఉదాహరణకు యంత్ర పరికరాల దిగుమతులు దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయి. కాని బంగారం దిగుమతులు ఆక్షేపణీయం. 19వ శతాబ్ది అంతా వాణిజ్య లోటుతో ఉన్న అమెరికా నేడు మంచి స్థితికి చేరుకొంది. పెట్టుబడి వ్యయం, మౌలికవసతులపై భారీగా వెచ్చించింది. నేడు ప్రపంచంలో బలమైన, ధనిక దేశంగా పేరుగాంచింది. ఈ స్థాయికి రావడానికి ఆ దేశానికి 100 ఏళ్ళు పైనే పట్టింది. మనదేశంలో లభ్యంకానివి, కొరత ఉన్నవి, అభివృద్ధికి సహకరించేవి దిగుమతి చేసుకున్నా ఒక అర్ధముంది. కాని దీనికి భిన్నంగా ఉన్నవాటిని దిగుమతి చేసుకుంటేనే సమస్యంతా. భారత్‌లో బంగారు గనుల కార్యకలాపాలు కుంటుపడడంతో, మన వినియోగంలో సుమారు 99 శాతం దిగుమతి చేసుకొంటున్నాం. బంగారం ఒక పెద్ద అనుత్పాదక వస్తువు. దీని దిగుమతులవల్ల దేశానికి ఎట్టి ప్రయోజనంలేదు. కాని ముడి చమురు, బొగ్గు, యంత్ర పరికరాల దిగుమతులు దీనికి భిన్నం. ఇవి దేశ అభివృద్ధికి తోడ్పడు తాయి. మన దేశంలో చాలినంత ముడిచమురు వనరులు లేనందున దిగుమతులపైనే భారీగా ఆధారపడుతున్నాం. ఒక్క గత ఏప్రిల్‌ నెలలోనే ముడిచమురు దిగుమతులు 81శాతం పైగా, బొగ్గు సుమారు 137శాతం పెరిగాయి.
నిర్మాణాత్మక సమస్యలు
2021-22 దిగుమతులు, ఆ ఏడాది వస్తు దిగుమతుల గణాంకాలు చూస్తే, మన విదేశీ వాణిజ్యంలో నిర్మాణాత్మక సమస్యలు, లోపాలు దర్శనమిస్తాయి. భారత్‌ ప్రపంచంలో కెల్ల ఐదవ అతి పెద్ద బొగ్గు నిల్వలున్న దేశం. ప్రపంచ బొగ్గు సరఫరాలో భారత్‌ వాటా సుమారు 10శాతం. అయిన మనం గత ఏడాదిలో 31.7 బిలియన్‌ డాలర్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకున్నాం. అలాగే భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద పత్తి పండిరచే దేశం. కాని గత ఏడాది 559.47 మిలియన్‌ డాలర్ల విలువ గల పత్తిని దిగుమతి చేసుకున్నాం. వ్యవసాయ ఉత్పత్తులలో మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. ప్రపంచానికి ఆహారమందించే స్థాయికెదిగిన దేశం మనది. కాని మనం తాజాగా 18.9 బిలియన్‌ డాలర్ల విలువచేసే వంటనూనె లను, 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన పప్పుధాన్యాలను, 2.6 బిలియన్‌ డాలర్ల విలువచేసే పండ్లను దిగుమతి చేసుకున్నాం.
వీటినన్నింటిని మనం అంత స్థాయిలో దిగుమతి చేసుకోనవసరం లేదు. మనకున్న అవకాశాలను, వాతా వరణ పరిస్థితులను, వనరులను విస్మరించి కష్టపడకుండా దిగుమతి చేసుకోడమే సులభమార్గమని భావిస్తున్నాం. ఉదాహరణకు బొగ్గు విషయమే తీసుకుందాం. దేశవ్యాప్తంగా నేడు వివిధ రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు, కొరతలు చూస్తున్నాం. దీనికి కారణం ప్రపంచ బొగ్గు సరఫరాలో మనది 10 వ వంతు అయినా మన విద్యుత్‌ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గును అందించలేకపోతున్నాం. మైనింగ్‌ రంగంలో సాంకేతికతను మెరుగు పరచడంతో బాటు, తగిన మౌలిక వపతులను కల్పించి ఈ సమస్యను అధిగమించగలం. అయినా మనం ఆ దిశగా అడుగులు వేయటంలేదు. రకరకాల పండ్లు పండిరచడానికి అనువైన వాతావరణంతో కూడిన వివిధ ప్రాంతాలు భారత్‌ సొంతం.
ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాల క్రింద ప్రాంతాలలో పండిన పండ్లు దేశీయ, విదేశీ మార్కెట్లలో వాణిజ్యీకరణ చేయకుండా చెట్ల కొమ్మలకే వదిలేస్తున్నాం. తాజాగా గత కొన్నేళ్ళ నుండి విదేశాలనుండి దిగుమతి చేసుకొంటొన్న ఆపిల్‌ పండ్లును, స్ట్రాబెరీస్‌లను ఏపీిలోని అరుకు ప్రాంతంలో పండిరచగల్గుతున్నాం. భారత్‌ ప్రభుత్వం 2024 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్డ్గానంచేసి ఆ దిశగా అడుగులు వేయకుండా చైనా, పాకిస్తాన్‌లనుండి విలువైన డాలర్లను చెల్లించి కొంటున్నాం. అలాగే మొబైలుఫోన్ల తయారీలో భారత్‌ విజయం ప్రశంశనీయం. ప్రధాని ‘‘భారత్‌ లో తయారీ’’ నినాదానికి ఆత్మనిర్బర్‌ నినాదానికి దీటుగా హేండ్‌ సెట్లు భారీగా తయారవుతున్నాయి. కాని వాటి ప్రతీ 100 డాలర్ల విలువగల సెల్‌ఫోన్ల తయారీకి 80 డాలర్ల విలువగల విడి భాగాలను దిగుమతి చేసుకొంటున్నాం. ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే. టెక్స్‌టైల్స్‌, ఫాబ్రిక్స్‌ దుస్తులు విషయంలో భారత్‌ ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. కాని వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. టెక్స్‌టైల్స్‌ ప్రపంచ ఉత్పత్తిలో చైనా 51 శాతం వాటా ఉంటే, భారత్‌ కేవలం 6.9 శాతమే. ఇక వస్త్రాలు తయారిలో అతి పెద్ద ఉత్పత్తి దారునిగా భారత్‌ పేరుగడిరచినప్పటికీ 2 బిలియన్‌ డాలర్లకు పైగా విలువ గలిగిన వస్త్రాలు గత ఏడాది దిగుమతి చేసుకొన్నాం. చిన్న దేశమైన బంగ్లాదేశ్‌, చైనా, వియత్నాంల తర్వాత మూడో అతిపెద్ద జీన్స్‌ ఎగుమతి దేశంగా పేరుగాంచింది. వీటిని చివరకు పాకిస్థాన్‌ కూడా భారత్‌ కంటే భారీగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది.
పైన పేర్కొన్న ఉదాహరణలన్నీ మన వ్యవస్థలోని నిర్మాణాత్మక లోపాలను ప్రతిబింబిస్తూ ఎనలేని నష్టాన్ని కల్గిస్తున్నాయి. మన దిగుమతుల్లో సింహభాగాన్ని ఆక్రమించిన ముడి చమురు దిగుమతులను కట్టడిచేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఇందుకై ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో కొంత పురోగతి సాధించాయి. విదేశీమారక నిల్వలు చైనాకు 3357 బిలియన్ల డాలర్లు కాగా, భారత్‌కు కేవలం 520.23 బిలియన్లతో ఆరోస్థానంలో ఉంది. అవకాశమున్నంత వరకు పాలకులు దిగుమతులను హేతుబద్దీకరించాలి. అప్పుడే అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించ గలుగుతాం.
డా. యస్‌.వై.విష్ణు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img