Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేవతా వస్త్రం ` మత రాజ్యం!

పురాణం శ్రీనివాస శాస్త్రి

హిందూ రాజ్యం కాన్సెప్ట్‌ ఎక్కడ ఉంది. వేదాల్లోనా, భగవద్గీతలోనా, రాజ్యాంగంలోనా? భారత్‌ను హిందూ రాజ్యం చేయడానికి నిచ్చెన లాంటి వ్యవస్థ కావద్దూ? దాన్ని పట్రాడానికి ప్రాతిపదిక లేదా నిర్వచనం మీద ఆధారపడాలి? బ్యాంకింగ్‌, కోర్టులు, జీవిత విధానాలు, ఉద్యోగ కల్పన లాంటి ప్రధాన రాజ్య విధానాలు ఏ తోటలో నడుస్తాయ్‌? ఏ కాల్వ లేదా నదిలో ఈదుతాయ్‌. రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించకుండా కేవలం పాలక ఏలికలు కోరుతున్నాయని హిందూ రాజ్యంగా భారత్‌ను మార్చేస్తారా? అసలు హిందూ అంటే ఏమిటి? శైవం అంటారు కొందరు. మరికొందరు వైష్టవం అంటారు. ఇందులో ఏది ఖరారు? రెండూనా? నిర్ణయించేదెవరు? ఒక నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమా? ఎవరికి వారు కులం గుర్తింపు వదులుకుంటారా? హిందూ రాజ్యం అంటున్నారు కాని అసలు ఇది మతం సంబంధితం కాదు. హిందూ అనే పదమే వివాదాస్పదం. అది డొమైన్‌ నేమ్‌. మతం పేరు కాదు. హిందూ మతం అనే పేరు వైదిక మతం అనడం మానేశాక వచ్చింది. వైదిక మత రాజ్యాంగం తెస్తే నియోగ, ద్రావిడ బ్రాహ్మణ్యం కోర్టుకు ఎక్కకుండా ఉండరు కదా?
అసలు వేదం జనజీవితాల్లో లేనప్పుడు వైదిక మతం అనే పేరు పోయింది. కాబట్టి హిందూ మతం అని పిలుస్తున్న దానికి వేదం ప్రమాణం అనుకుంటే అదసలు ఎక్కడో వెదకాలిప్పుడు. పండితుల నోళ్లలో తప్ప ఎక్కడా లేదు. ప్రపంచంలో మతరాజ్యాలేవీ రాజ్యాంగాలను అంత సుల భంగా రాసుకోలేకపోయాయి. 1947లో ఏర్పడ్డ పాకిస్తాన్‌ పదేళ్ల తర్జన భర్జనల తరవాత 1957లో ఆమోదించింది. ఇస్లామిక్‌ రాజ్యం కావాలన్న జిన్నా ఇస్లామిక్‌ డెమోక్రసీని వరిస్తే తెగింది కాదు. తర్వాత తొలి ప్రధాని లియాకత్‌ అలీఖాన్‌ 1957లో రాజ్యాంగాన్ని ఆమోదించినా మతపరమైన విచికిత్స కొనసాగేదేమో. ఆయూబ్‌ఖాన్‌ సైనిక నియంత్రణ తెచ్చి రాజ్యాంగాన్ని అటకెక్కించాడు.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే పాక్‌ మతరాజ్య ప్రయోగం విఫలమై ముల్లాలు, ఉలేమాలు పొడుచుకొచ్చి మూడు రాజ్యాంగాల్ని గాలివాటంగా పండిరచింది. మరో మత రాజ్యం నేపాల్‌ ఆరు రాజ్యాంగాల్ని మార్చుకుని చివరికి మార్క్సిస్టుల చేతుల్లోకి పోయింది. హిందూ రాజ్యానికి అధికార నిర్వచనకర్తలు లేరు. పాక్‌లో ఇస్లాం నిర్వచనానికి ఏర్పాటైన కమిషన్‌ భయంతో చేతులెత్తేసింది. మన దేశంలో హిందూ మతం ఊరుకో రకం, వీధికో రకంగా ఉంది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో వేర్వేరుగా ఈశాన్యంలో అసలు కనపడకుండా ఉంది హిందూ రాజ్యం కాబట్టి మహాజనులారా ఓ దేవతా వస్త్రం అని తెలుసుకోండి.
దేవతా వస్త్రం అనేది కనపడనిది కాబట్టి కట్టుకోనక్కర (కట్టుబడనక్కర) లేని వాగ్దానం. అదిగో పులి అంటే ఇదిగో చార అనే రకం వాగ్దానం కూడా! మత రాజ్యానికి రాజ్యాంగం నామ్‌ కే వాస్తే రుద్దినా చివరికి ఆబోరు దక్కే మార్గం లేదు. ఈ విషయంలో 1947 నుంచి 1958లో రద్దయేదాకా రాజ్యాంగ వేషం కట్టడానికి పాకిస్తాన్‌ పడ్డ పాట్లు ‘అదంత వీజీ కాదు’ అని చెప్పకనే చెబుతున్నాయి. అయినా మత రాజ్యమే కావాలా? ఐతే ముందు మతాన్ని శుద్ధి చేసుకుని, ఓ నియమావళితో రెడీ కండి. ఘర్షణలు, కోర్టు కేసుల పర్వానికి తయారవండి!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img