Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నగదీకరణతో అన్నీ భారమే

రుద్రరాజు శ్రీనివాసరాజు

ప్రపంచంలో ఈ నగదీకరణ విధానం అవలంబించిన దేశాలేవీ మంచి ఫలితాలు సాధించలేదు. 2013లో ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో కెంబ్లా రేవును, బోటానీ రేవును అద్దెకిచ్చింది. దానివల్ల ధరలు, వినియోగదారుల సమస్యలు, నిరుద్యోగం పెరిగింది తప్ప సాధించిన ప్రయోజనం ఏమీ లేదు. అలాగే న్యూసౌత్‌ వేల్స్‌లో ఎలక్ట్రి సిటీ లైన్లు స్తంభాలు ప్రైవేటీకరించారు. దాని ఫలితం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. సింగపూర్‌లో సబర్బన్‌ రైళ్లను సిగ్నలింగ్‌ వ్యవస్థను ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఇచ్చారు. అక్కడా ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు. దానిని తిరిగి జాతీయం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇన్ని వైఫల్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోకుండా ముందడుగు వేయడం ఎంతమాత్రం మంచిది కాదు.

ఒకటి కాదు రెండు కాదు 74 సంవత్సరాల నుండి దేశ ప్రజల శ్రమతో, కట్టిన పన్నులతో ఏర్పడిన సంపద మనది. ప్రభుత్వ ఆధ్వ ర్యంలో కోట్లాది మందికి ఉపాధి అందిస్తున్న వ్యవస్థ మనది. ఈ సంపదను, వ్యవస్థను నేడు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న రైల్వే, ఓడరేవులు, జాతీయ రహ దారులు, టెలీ కమ్యూనికేషన్లు, సహజ వాయువు, విద్యుత్‌ ఉత్పత్తి, ఖనిజ తవ్వకాలు, గ్యాస్‌ పైప్‌లైన్లు ఇలా అనేకం అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు.
ప్రపంచీకరణ ప్రభావంతో సరళీకృత ఆర్థిక విధానాలను అవలం బించడంతోనే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయి. నష్టాల సాకుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో పాక్షికంగా లేదా పూర్తిగా ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు మోని టైజేషన్‌ అంటున్నారు. దీని ప్రకారం ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వానిదేనట. ఒక నిర్ణీత కాలానికి ప్రైవేట్‌ సంస్థలకు అద్దెకు ఇస్తారు. ఈ ప్రక్రియలో వచ్చిన ధనాన్ని మౌలిక ఆస్తుల రూపకల్పనకు ఖర్చు చేయడం ద్వారా దేశాన్ని మరింత ప్రగతి పథంలో తీసుకు పోవడానికి వీలు పడుతుందన్నది ప్రభుత్వం వాదన. దేశాభివృద్ధికి ఇది కీలక నిర్ణయం అంటూ ప్రభుత్వం జాతీయ నగదీకరణ కార్యక్రమాన్ని సమర్థించు కుంటున్నది. ఈ విధానంపై రాజకీయ కోవిదులు, ఆర్థిక నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిరర్థక ఆస్తులు అని చెప్పేవాటిని ప్రైవేటు సంస్థలు ఎందుకు తీసుకుంటాయి. ప్రైవేటు లక్ష్యం లాభార్జన. ప్రభుత్వాలకు నిరర్థకమైనవి ప్రైవేటుకు ఎలా లాభదాయకం అవుతాయి. ప్రైవేట్‌ నిర్వహణా సామర్థ్యం మెరుగైనది కాబట్టి లాభాల బాట పట్టిస్తారు నిజమే. అంటే ప్రభుత్వ రంగానికి నిర్వ హణా సామర్థ్యం లోపించింది అని ఒప్పుకోవడమే కదా.. ఇప్పుడు అప్పగించే ఆస్తుల జాబితాలో ఉన్నవన్నీ నిరర్థక ఆస్తులేనా.. వాటి నుండి వస్తున్న ఆదాయాల వివరాలు గోప్యమా. సామాజిక శ్రేయస్సు లక్ష్యంగా నిర్వ హిస్తున్న ఆస్తులను వ్యక్తిగత లాభార్జన ధ్యేయంగా నడిచే ప్రైవేటుకు ధారాదత్తం చేయడం సమంజసం కాదు. ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వలన పోటీతత్వం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ ధరలకే లభిస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే అద్దెపేరుతో ఆస్తులు ముట్ట చెబుతున్నది బడా కార్పొరేట్లకు. వారిలో కూడా ప్రభుత్వానికి అను గుణంగా ఉండే వారికి మాత్రమే.
ఈ కాంట్రాక్టులను దక్కించుకున్న బడా సంస్థలు పెట్టుబడుల కోసం బ్యాంకులనే ఆశ్రయిస్తాయి. బ్యాంకులలో ప్రజలు పొదుపు చేసిన డబ్బునే ఋణాలుగా తీసు కుంటాయి. అంటే ప్రజల డబ్బుతోనే ప్రజల సంపదను, వనరుల్ని ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకుంటున్నారు. ఈ బడా కార్పొరేట్‌ శక్తులు వ్యూహాత్మకంగా దివాళా పేరిట రుణాలను ఎగవేస్తే జరిగే నష్టం ప్రజలకే. అద్దెకు తీసుకున్న ఆస్తులను పీల్చి పిప్పి చేసి తరిగిపోయిన ఆస్తులను తిరిగి అప్పగిస్తే ఏం చేస్తారు? ఈ ప్రక్రియలో ఆర్జించిన లక్షల కోట్ల రూపాయలు మౌలిక వసతుల నిర్మా ణానికి కేటాయిస్తామంటు న్నారు. వీటిని కూడా మళ్ళీ ప్రైవేటుకే ముట్ట చెబుతారుగా. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇప్పుడు లేని నిర్వహణా సామర్థ్యం అప్పుడు ఎలా వస్తుంది? అందుచేత మరలా ప్రైవేటు ప్రయోజనాలే పరమావధిగా ఈ ఆస్తులను వారికే కట్టబెడతారు. ఇలా ఈ వలయం కొనసాగుతుంది తప్ప దీనివలన దేశానికి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.
ప్రభుత్వ ఆస్తులను గంపగుత్తగా ప్రైవేట్‌కు అప్పగించి ఆస్తులు మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని చెప్పటం అంటే ప్రజలను వంచించటమే. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌కు లీజుకు ఇచ్చే కాల పరిమితిని బట్టి కొన్ని తరాలు పాటు ప్రైవేట్‌ సంస్థలు వసూలు చేసే ఫీజులు ప్రజలు భరించాల్సిందే. ప్రస్తుతం ప్రైవేటు రంగం ప్రయోజనాలను ప్రభుత్వం ఎలా కాపాడుతోందో మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి ఛార్జీలు తగ్గిం చిన విషయం తెలిసిందే. ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగ దారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షిం చింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరవాత ఛార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపె నీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే జియో ఎంత చెబితే అంత చెల్లించక తప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ అయినా, మరొకటి ఇంకొకటి ఏదైనా అంతే. మొత్తం ప్రైవేటు నిర్వహణలో కెళితే వారెంత ఛార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే.
2019లో కార్పొరేట్‌ రంగానికి ప్రభుత్వం పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగులు కలిగించింది. వీటికి తోడు కార్పొరేట్‌ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుకుంటూ పోతోంది. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. ఈ చర్యలు ప్రైవేటు సంక్షేమం కోసం కాదా? మోనిటైజేషన్‌ ద్వారా వేలంలో పోటీ పడి అధిక మొత్తంతో ఆస్తులను దక్కించుకున్న సంస్థలు అధిక యూజర్‌ ఛార్జీల భారం ప్రజలపైనే వేస్తాయి. ఈ మోనిటైజేషన్‌ వలన ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థల్లో పని చేసే ఉద్యోగుల భద్రత విషయంలో, వారికి అందించే వేతనాలు విషయంలో హామీ ఉండదు. వేతనాల కోత, ఉద్యోగుల తొలగింపు ఇష్టానుసారమవు తుంది. ఇది సామాజిక శ్రేయస్సుకు బహు హానికరం.
మోనిటైజేషన్‌కు సిద్ధం కావా లని రాష్ట్రాలకూ కేంద్రం సూచించింది. అలా చేస్తే కేంద్రం నుంచి అదనపు నిధులు అందిస్తాం అనే తాయిలాలు ప్రకటించింది. ఇంతటితో వదిలి పెట్టలేదు గ్రామ పంచాయితీలపై కూడా కేంద్రం కన్ను పడిరది. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఏటా ప్రతీ పంచాయతీకి ఇంత అని లెక్కకట్టి నిధులు ఇస్తున్నది (జనాభా ప్రాతిపదికన). రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నిధులు కేంద్రం నుంచి నేరుగా పంచాయతీ లకు వస్తాయి. ఇందుకోసం ప్రతీ సంవత్సరం ఇంచుమించు 2 లక్షల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఖర్చు పెడుతున్నది. ఈ 2 లక్షల కోట్ల బరువును తగ్గించుకోవాలంటే ఉత్తమ మార్గం మానిటైజేషన్‌ అని కేంద్రం ఆలోచన చేసింది. గ్రామ సభలు నిర్వహించి ఆస్తుల వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ముట్ట చెప్పండి అనే సందేశాన్ని పంపింది. ఇదే విధానం గ్రామాలలో అమలు జరిగితే జాతిపిత ఆశించిన గ్రామ స్వరాజ్యం ప్రైవేటు స్వరాజ్యంగా మారే ప్రమాదం పొంచి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రపంచంలో ఈ నగదీకరణ విధానం అవలంబించిన దేశాలేవీ మంచి ఫలితాలు సాధించలేదు. 2013లో ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో కెంబ్లా రేవును, బోటానీ రేవును అద్దెకిచ్చింది. దానివల్ల ధరలు, వినియోగదారుల సమస్యలు, నిరుద్యోగం పెరిగింది తప్ప సాధించిన ప్రయోజనం ఏమీ లేదు. అలాగే న్యూసౌత్‌ వేల్స్‌లో ఎలక్ట్రి సిటీ లైన్లు స్తంభాలు ప్రైవేటీకరించారు. దాని ఫలితం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. సింగపూర్‌లో సబర్బన్‌ రైళ్లను సిగ్నలింగ్‌ వ్యవస్థను ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఇచ్చారు. అక్కడా ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు. దానిని తిరిగి జాతీయం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
ఇన్ని వైఫల్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోకుండా ముందడుగు వేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇంత ప్రళయం ముంచుకొస్తున్నా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన వాళ్ళు మౌనంగా ఉండటం దేనికి సంకేతం.
వ్యాస రచయిత సెల్‌ 9441239578

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img