Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నట ‘బ్రహ్మ’ రూపం

బ్రహ్మానందం తెలుసుకదా.. తెరమీద కనపడగానే నవ్వుల పువ్వులు పూయించిన బ్రహ్మానందం అనుకుంటున్నారు కదా! అవును ఆయనే కాని, నట విశ్వరూప బ్రహ్మానందాన్ని చూడలేదు కదా! ఇన్నాళ్లు తెరపై వెకిలి నవ్వులు, దెబ్బలు తినడాలు, లేదూ తినిపించుకోవడాలు చేస్తున్న బ్రహ్మా నందం కాదు. అసలు సిసలు నటనతో కన్నీళ్లు కార్పించిన బ్రహ్మానందాన్ని చూడాలనుకుంటున్నారా! మళ్ళీ ఆ అవకాశం వస్తుందో రాదో రంగ మార్తాండ సినిమా చూడండి. ఈ బ్రహ్మానందాన్ని ఇన్నాళ్లు తెలుగు తెర ఎందుకు వెకిలిగా చూపించిందో అని దిగులు వేస్తుంది.. కోపం వస్తుంది.. ప్రేక్షకుల్ని నవ్వించడం కోసం మూడున్నర దశాబ్దాలుగా తనను తాను హింసించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు ఆ ప్రేక్షకుడి కంట కన్నీరు కార్పించేందుకు తన నటనా విశ్వరూపాన్ని చూపించారు.
7వ దశకం నుంచి తెలుగు నాటక రంగాన్ని దేదీప్యమానంగా వెలిగించిన అనేకానేక మంది తెలుగు నాటకాల్లోని పాత్రలు రంగ మార్తాండలో అలా కళ్ళముందు కదలాడుతాయి. రంగమార్తాండ సినిమా ప్రారంభం కాగానే నాకు ప్రకాష్‌ రాజ్‌ కనపడలేదు. మన నాటకాన్ని అగ్రభాగాన నిలిపిన పద్మశ్రీ ఎన్‌.ఆర్‌. కృష్ణ, రాజా రాందాస్‌, మొదలి నాగభూషణ శర్మ, చాట్ల శ్రీరాములు కళ్ల ముందు కదలాడారు.
ప్రకాష్‌ రాజ్‌ తన అనుభవాలను చెప్తూ ‘‘మా చక్రిగాడు… చక్రధర్‌ అయితే’’ అంటూ ఆ పాత్రలో వున్న బ్రహ్మానందాన్ని చూపిస్తుంటే కళ్ళముందు తల్లావరaల సుందరం కదలాడారు. ఆ సీన్‌ లో వెండితెర మీద మిత్రుడు తనికెళ్ళ భరణి వున్నారు కాని సాక్షాత్‌ రంగస్థలం మధ్యలో ఉన్నట్లుగానే అనిపించింది. ఆ మహానటులు, దర్శకులను తెలుగు నాటక రంగం కొన్ని సంవత్సరాల పాటూ కడుపుతో ఉండి వీళ్ళకి జన్మనిచ్చిందేమో అనిపించింది. ఆ కుదురులోంచి వచ్చిన వాళ్ళే బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్‌.నారాయణ వంటి వారు. ఈ అద్భుత రంగస్థల నటుల్ని వెండితెర ‘‘కామెడీ’’ గా చంపేసింది. బ్రహ్మానందాన్నైతే గుర్తుపట్టలేనంతగా వెకిలి చేష్టలు చేయించి మరీ చంపేసింది.
ఈ దుఃఖం పోయేందుకు అప్పుడెప్పుడో ‘‘బాబాయ్‌ హోటల్‌’’ అంటూ బ్రహ్మానందాన్ని కరుణ రూపంలో చూపించేందుకు ప్రయత్నించారు. అయితే, తెలుగు ప్రేక్షకులు దెబ్బలు తింటూ నవ్వించే బ్రహ్మానందమే కావాలనుకున్నారు కానీ ఆయన చూపించిన కరుణను కాసింతైనా అంగీకరించలేదు. మళ్ళీ ఇదిగో ఇన్నాళ్లకు రంగమార్తాండలో అసలు సిసలు బ్రహ్మానందాన్ని చూసి ‘‘ఇంత గొప్ప నటుడ్ని ఎలా మిస్‌ అయ్యాం’’ అనుకుంటున్నారంతా.
మాసిన గడ్డం, మోకాళ్ళ పైకి లాల్చీ, కళ్లద్దాలు, చేతిలో మందు బాటిల్‌. ఇదీ బ్రహ్మానందం ఆహార్యం రంగమార్తాండ సినిమాలో . తెలుగు నాటక రంగంలో దాదాపుగా నటులందరి ఆహార్యం అదే నిత్య జీవితంలో. కొందరి చేతుల్లో మందు బాటిల్‌ లేదేమో.. మోకాళ్ళ వరకూ నిక్కరు, బొమ్మల చొక్కాలు, తన మొఖం మీద తాను కొట్టుకుంటూ నవ్వు తెప్పించేందుకు ప్రయత్నించే బ్రహ్మానందాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు రంగమార్తాండలో బ్రహ్మానందాన్ని చూసి అవాక్కయ్యారు. ఇది మొదటి షాక్‌ అయితే, తన స్నేహితుడి పిల్లల దగ్గరికి వాళ్ళ ఆఫీసుకే మందు బాటిల్‌ తో వచ్చి వాళ్లకి చివాట్లు పెడుతూ మధ్య మధ్యలో గొంతులో కొన్ని మందు చుక్కలు పోసుకుంటున్న బ్రహ్మానందాన్ని చూసి తేరుకోలేని షాక్‌.
తన భార్య మరణించినప్పుడు, తనని ఏకాకి చేసిన తన స్నేహితుడు రాఘవరావు పాత్రధారి ప్రకాష్‌ రాజ్‌ వచ్చినప్పుడల్లా బ్రహ్మానందం లోని నట విశ్వరూపం చూసి చొక్కాలు, చీరలు ఎందుకో తడిసాయో ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్న. ఇది చూసాక… ప్రేక్షకులు ‘‘ఇన్నాళ్లూ ఎంత పోగొట్టుకుంటున్నాం ఈ నటుడి నుంచి’’ అనుకున్నారు.
‘‘ముక్తి ప్రసాదించరా’’ అని బ్రహ్మానందం… ప్రకాష్‌ రాజ్‌ని అడిగాడు కాని ఈ చెత్త కామెడీ నుంచి దర్శకుడు కృష్ణవంశీయే బ్రహ్మానందానికి ముక్తి ప్రసాదించినట్లు అనిపించింది.
‘‘మీరు చూస్తున్నారు మేం తీస్తున్నాం’’ అనే చెత్త ప్రకటనలు ఆపి ‘‘మీరు తీయడంవల్లే గతిలేక ప్రేక్షకులు చూస్తున్నారు’’ అని ఈ దర్శక, నిర్మాతలకి చెప్పాడనిపించింది రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందాన్ని చూస్తే.. గొప్ప నటనను లోపల దాచేసుకున్న బ్రహ్మానందానికి, అది చూడలేకపోతున్న ప్రేక్షక లోకానికి ఆ చెత్త నుంచి ముక్తి ప్రసాదించండని ముక్త కంఠంతో కోరుతున్నాం..
బ్రహ్మానందం గారూ.. బలహీనులం.. సినిమా చూడకుండా ఉండలేం..అప్పుడప్పుడైనా రంగమార్తాండలో పాత్ర వంటివి చేస్తూ మాకు ముక్తి ప్రసాదించరూ…
సీనియర్‌ జర్నలిస్ట్‌, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img