Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నాకు తెలిసిన మా రాఘవాచారి

కూన అజయ్‌బాబు

గోల ఉండాలె…గోస ఉండాలె…సందడి ఉండాలె…సవ్వడి ఉండాలె. ఎందుకో అవేవీ లేకపోతే హాయిగా ఉన్నట్లనిపించదు, రాత్రికి నిద్ర కూడా పట్టదు! అన్నింటికీ మించి చుట్టూ ఉన్నోళ్లు మాట్లాడకపోతే, వారి నస విన్పించకపోయినా నాకు మంచిగుండదు. అందుకే నిశ్శబ్దం చాలా భయంకర మైనది. మౌనమంటే నాకు మరీ భయం. …ఇలా భయభక్తులు లేకుండా పుటకే కమ్యూనిస్టుగా ఉన్న నాకు 1996 చివరి త్రైమాసికంలో తొలిసారి ఓ ‘మౌన ముని’ని చూసి భయపడ్డా! ఇంతకీ నన్ను భయపెట్టిన వారెవరో తెలుసా? రాఘవాచారి గారే! మన రాఘవాచారి గారే! ఆయన గురించి తెలిసిన వారికెవరికైనా… అంత సౌమ్యుడు కూడా భయపెడతాడా అన్న సందేహం కలగకమానదు. కానీ ఇది ముమ్మాటికీ నిజం. నిశ్శబ్దం, మౌనం అంటే భయపడే నేను విశాలాంధ్రలో సబ్‌ ఎడిటర్‌గా చేరిన తర్వాత తొలిరోజే (1996 సెప్టెంబరు 23) మక్కెన సుబ్బారావుగారు నన్ను రాఘవాచారిగారికి పరిచయం చేశారు. ‘ఇక నుంచి సిక్కోలు కేక విన్పిస్తుందన్నమాట!’ అని అందరికీ నచ్చే ఒక నవ్వును విసిరేసి ఊరుకున్నారు. ఆనాటి నుంచి బహుశా ఆయన పదవీ విరమణ చేసేవరకు డెస్క్‌లోని జర్నలిస్టులతో ఒక్క మాట ఆడిన సందర్భమూ లేదు. నాలాంటి చిన్న పాత్రికేయులు మూడు నాలుగుసార్లు చదివితే తప్ప ఆయన సంపాదకీయం అర్థమయ్యేది కాదు. ఆయన భాషాపటిమ అంత గొప్పది. ఆయన ప్రసంగాలు వినడానికి చెవులు కోసుకునేవాళ్లం. ఇంత జరిగినా, ఆయన డెస్క్‌లో నోరువిప్పకపోవడం నాకు అంతుపట్టని సమస్యగా మారింది. ఆ ‘నిశ్శబ్దం’ అంతు తేలుద్దామని అనుకున్న మాట వాస్తవం. కాకపోతే, కాలక్రమేణా అన్ని విషయాలు తెలిశాయి, అర్థమయ్యాయి.
రాఘవాచారి గారు గొప్ప మేధావి, పాత్రికేయుడు, పండితుడు, బహుభాషా కోవిదుడు, సంపాదక చక్రవర్తి, స్నేహశీలి, నిరాడంబరుడు, కమ్యూనిజం పట్ల అకుంఠిత దీక్ష, నిబద్ధత కలవారు, సమసమాజ స్థాపనపై అచంచల విశ్వాసం గలవ్యక్తి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో వుంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కొత్త విషయాలు కావు. కాకపోతే ఆయనతో నాకు గల ‘కాస్త’ అనుబంధంలో కొన్ని సంఘటనలు చెప్పాలని వుంది. ఆ ఉదంతాల్లో పైన చెప్పిన ఆ లక్షణాలన్నీ కన్పిస్తాయో లేదో చూడండి!
రాఘవాచారి గారు ఉదయం 9 గంటల్లోపే ఆఫీసుకు రావడం, ఒకటో రెండో పత్రికలు చదవడం (మిగతావన్నీ ఇంట్లోనే చదవి వచ్చేవారట), ఆ తర్వాత పుస్తకాలు చదువుకోవడం, మధ్యలో భోజనానికి వెళ్లి తిరిగి రావడం, ఎడిటోరియల్‌ రాయడం, సాయంత్రం సమయాన్ని బట్టి, బయట జరిగే కార్యక్రమాల షెడ్యూల్‌ను బట్టి నిష్క్రమించడం…ఇవీ రోజూ కన్పించే దృశ్యాలు. డెస్క్‌లో ఆయన మౌనం గురించి సీనియర్లను అడిగాను. ‘ఇదివరకు అందరితో సరదాగా, కలుపుగోలుగా వుండేవారు. ఈ మధ్యనే ఇలా దీక్షబూనారు’ అని చెప్పేవారు. ఉదయాన్నే నాటి విశాలాంధ్ర పత్రికలో తప్పులను దిద్ది డెస్క్‌కు పంపించేవారు. ఎక్కువగా సున్నాలే కన్పించేవి. ఆయన దిద్దిన పేపరును చూసి రోజూ భయపడి చచ్చేవాళ్లం. రాఘవాచారి గారి చేతిరాత చూసినా భయపడే వాడ్ని. అది అచ్చం వియత్నాం భాషలా ఉండేది. ఆ భాష కేవలం ఒక్కరికే అర్థమయ్యేది. ఆమె పేరు కామ్రేడ్‌ జయశ్రీ, ఆమె విశాలాంధ్రలో సీనియర్‌ డిటిపి ఆపరేటరు. అప్పటికే ఆమె రెండు దశాబ్దాలుగా ఆయన రాతపై కుస్తీపట్టీపట్టీ చివరకు విజయం సాధించింది. ఆమె సెలవులో ఉంటే మిగతా ఆపరేటర్లు భయపడేవాళ్లు. ఇంకో సీనియర్‌ ఆపరేటరు (కామ్రేడ్‌ రత్నకుమారి అనుకుంటా!) రాఘవాచారి గారి ముందు కూర్చుంటే, ఆయన సంపాదకీయాన్ని డిక్టేట్‌ చేసేవారు. అదొక ప్రవాహంగా సాగిపోయేది. అసలు ఆ ఎడిటోరియల్‌ గురించి స్టాఫ్‌ మొత్తం ఎందుకంత తంటాలు పడేవారు? ఎందుకంటే? రాఘవాచారి గారి ఎడిటోరియలే ఆనాడు మా విశాలాంధ్రకు ఆయవుపట్టు. కేవలం సంపాదకీయం కోసమే విశాలాంధ్ర పత్రిక కోసం అన్వేషించేవారు. గ్రంథాలయాలకు వెళ్లేవారు. మా ఆఫీసుకు వచ్చిపత్రికను తీసుకుపోయేవారు.ఆయన సంపాదకీయాలు చదివీ చదివీ చివరకు నేనొక విషయాన్ని కనిపెట్టాను. అదేంటంటే? ‘ప్రజాస్వామ్య హితైషులు’ అనే పదం ఆయన ఎక్కువసార్లు వాడారని గుర్తించాను.
ఒక పత్రికకు ఎడిటర్‌ కావాలంటే, నల్లజుట్టు కాస్త తెల్లజుట్టుగా మారాలి, ఖద్దరు లాల్చీ ధరించాలి, భుజాన పొడుగాటి గుడ్డసంచి వేసుకోవాలి, అందులో రెండు ఆంగ్ల పుస్తకాలు, రెండు తెలుగు పుస్తకాలు ఉండాలి, మధ్యమధ్యలో ‘మీరు ఆ పుస్తకం చదివారా? ఈ పుస్తకం చదివారా?’ అని కన్పించిన వారందర్నీ అడుగుతూ వుండాలని అనుకునేవాడ్ని. కానీ ఆ తర్వాత నిగ్గుతేలిన నిజమేమిటంటే, రాఘవాచారి గారి ఎడిటోరియల్స్‌ అన్నింటినీ కనీసం మూడు సార్లు చదివేస్తే చాలు, కచ్చితంగా ఎడిటర్‌గా మారిపోవచ్చు అని అర్థమైంది.
ఒకరోజు, రాఘవాచారి గారు చండ్ర రాజేశ్వరరావు రోడ్డులో వడివడిగా నడుస్తూ వెళ్తున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నారో చూద్దామని నేనూ అనుసరించా. కిలోమీటరు దూరం నడిచిన తర్వాత స్టేడియం పక్కనే ఉన్న ఒక కొత్త టీస్టాల్‌లో ప్రశాంతంగా టీ తాగుతూ కన్పించారు. దిగ్భ్రాంతికి గురైన నేను తిరుగుముఖం పట్టాను. ఇదే విషయం గురించి అప్పటి అసిస్టెంట్‌ ఎడిటర్‌ మాదాసు పార్థసారథిగారిని అడిగా. ‘ఎక్కడైనా కొత్త టీస్టాల్‌ గానీ టిఫిన్‌ సెంటర్‌గానీ పెట్టినట్లు తెలిస్తే, రాఘవాచారిగారు కచ్చితంగా అక్కడికి వెళ్లి (ఎంత దూరమైనా) తేనీటి విందు ఆరగించి వస్తారట! అదీ సంగతి!
‘కారు ఇస్తేనే ఆఫీసుకు వస్తా’ అని నిర్మొహమాటంగా చెప్పే ఎడిటర్లను చూస్తున్నాం. కానీ రాఘవాచారి గారికి కారు లేదు, బైక్‌ లేదు. కనీసం సైకిలు కూడా లేదు. ఎక్కడైనా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి వుంటే బస్సులోనో, ఆటోలోనో వెళ్లిపోయేవారు. లేదంటే కార్యక్రమ నిర్వాహకులే కచ్చితంగా వాహనాన్ని పంపించేవారు. నేను విజయవాడ చీఫ్‌ రిపోర్టర్‌గా పనిచేసిన తొలిరోజుల్లో…రాఘవాచారిగారు హనుమంతరాయగ్రంథాలయంలో సాయంత్రం 6 గంటలకు ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి వుంది. ఆయనింకా ఆఫీసు నుంచి బయలుదేరలేదు కదా అని నేను కూడా జాప్యం చేస్తూ వచ్చా. ఆ కార్యక్రమ నిర్వాహకులు తొలిసారిగా సమావేశాన్ని పెట్టుకున్నారట. అందుకే రాఘవాచారి గారి గురించి తెలియక వారు ఎలాంటి వెహికల్‌ను పంపించలేదు. దీంతో కాసేపటికి ఆయన తన గది నుంచి బయటకు రావడం చూసి, ఆయనను అనుసరించాను. ఆయన నేరుగా చుట్టుగుంట బస్టాప్‌ దగ్గరకు వెళ్లి ‘29వ నెంబర్‌ బస్సు’ ఎక్కారు. మరోసారి కంగుతిన్న నేను కూడా అదే బస్సు ఎక్కాను. కాకపోతే చాలా వెనుకవైపు నిల్చున్నాను. కండక్టర్‌కు పూర్తిగా చిల్లర ఇచ్చి టికెట్టు తీసుకొని ‘ప్రయాణికులు తగినంత చిల్లర ఇవ్వవలయును’ అన్న రూల్‌ను ఆయన కచ్చితంగా పాటించారు. నేను మాత్రం పెద్దకాగితం ఇచ్చి కండక్టర్‌తో గొడవపడ్డా. ఆ తర్వాత రాఘవాచారి గారు అప్సర సెంటర్‌లో బస్సు దిగి, లెనిన్‌ సెంటరు మీదుగా హనుమాన్‌పేటవైపు నడక మొదలుపెట్టారు. నేను కూడా అనుసరించాను. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు కారు పంపించి, మధ్యలోనే ఆయనను ఎక్కించుకున్నారు. కానీ కారు కదల్లేదు. నేను చూసీచూడనట్లు కారుదాటి ముందుకు నడిచే ప్రయత్నం చేశా. అంతలోనే కారు నుంచి రాఘవాచారిగారు నన్ను పిలిచారు. తనతోపాటు కారెక్కించుకొని వెళ్లారు. ‘నేనొస్తే సరిపోదు కదా! మా రిపోర్టరు కూడా రావాలి. ఏ పేపరోళ్లు రాసినా రాయకపోయినా, కనీసం మా పేపరోళ్లయినా మీ వార్త రాయాలి కదా!’ అని ఆ కార్యక్రమ నిర్వాహకునితో రాఘవాచారి గారి అనడం నాకు బాగా గుర్తుంది. ముందుగా మన విలేకరిని మనం గౌరవించు కోవాలన్న భావనకు ఆయన ఏనాడూ దూరం కాలేదు. పైగా ‘పిల్లి పాలు తాగినట్లు’ నన్ను ఆయన చూడలేదనుకున్నా. కానీ ఆయన వెంటపడినప్పటి నుంచీ ఆయననన్నుగమనిస్తూనే వున్నారని తెలిసింది.
ఇంకో సందర్భంలో, ఆటోమొబైల్స్‌ టెక్నీషియన్‌ హాలులో ఏదో కార్యక్రమం జరిగింది. దానికి ఆయనే అధ్యక్షత. కవరేజీ కోసం నేను వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆఫీసులో బయలుదేరే ముందే ఆయన నాకు ఆటోనగర్‌ వెళ్లే బస్సు నెంబర్ల వివరాలను విడమరిచి మరీ చెప్పారు. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు నెంబర్లన్నీ ఆయనకు తెలుసు! నువ్వు సిటీని సింపుల్‌గా చుట్టి రావాలంటే పంజా టు పంజా 28వ నెంబర్‌ బస్సు ఎక్కమని నాకు ఓసారి చెప్పారాయన. ఆర్టీసీ వాళ్లకు ఆదాయం ఎక్కువైపోయి, ఇప్పుడా బస్సు సర్వీసును రద్దుచేసినట్లున్నారు.
విశాలాంధ్ర స్టాఫ్‌కు ఎప్పటికప్పుడు రాజకీయ, వైజ్ఞానిక తరగతులు జరిగేవి. ఆయన కనీసం రెండు క్లాసులు చెప్పేవారు. రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ గురించి, ఐపీసీలోని ప్రతి సెక్షన్‌ గురించి కరతలామలకంగా చెప్పేవారు. ఓసారి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ ఎన్నో తెలుసా? అని అడిగారు. నాకు ఓవరాక్షన్‌ ఎక్కువై ‘420’ అని చెప్పాను. ‘నా ఆశలను వమ్ము చేశావ్‌, నన్ను దగా చేశావ్‌, మోసం చేశావ్‌’ అని వ్యంగ్యంగా తిడుతూనే ఐపీసీలోని 420 గురించి చెప్పారు. నేను ఆ క్షణం నవ్వులపాలైనా, ఆ రెండు అంశాలమీద పట్టు సంపాదించాలన్న ప్రయత్నానికి అదే స్ఫూర్తినిచ్చింది. రాఘవాచారి గారికి న్యాయశాస్త్రంపైన, భారత రాజ్యాంగంపైనా ఎంతగా పట్టుందో ఆయనతో అనుబంధం వున్నవారికే ఆ విషయం తెలుస్తుంది. ఏ పత్రిక స్పృశించని అంశాలను ఎడిటోరియల్స్‌లో ప్రస్తావించి, పాత్రికేయులందరికీ మార్గ దర్శకుడయ్యారు. ఆయనకు నమస్కారం చేసినా, సార్‌ అని పిలిచినా చిరాకు. రాఘవాచారి గారూ అని పిలిస్తే సరిపోతుంది. కామ్రేడ్‌ అని పిలిస్తే ఆయన ముఖం వెలిగిపోయేది. ఆయన వచ్చినప్పుడు మర్యాద కోసం లేచి నిలబడడం ఆయనకు అస్సలు పడదు. ‘నన్ను మీ మనిషిగా చూడండి’ అని చెప్పకనే చెప్పేవారు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో 1939 సెప్టెంబరు 10న జన్మించిన చక్రవర్తుల రాఘవాచారి గారు న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. తొలుత దిల్లీ నుంచి వెలువడే పేట్రియేట్‌ ఆంగ్ల పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత సిపిఐ ఆదేశాల మేరకు 1971లో విశాలాంధ్రలో చేరి, కొద్దికాలానికే సంపాదకులయ్యారు. 28 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు ఎడిటర్‌గా పనిచేశారు. పార్టీ సైద్ధాంతిక భావన నుంచి ఒక్క క్షణం కూడా బయటకు రాకుండా, ఆ పరిధిలోనే పనిచేస్తూ, గొప్ప వామపక్ష సంపాదకునిగా పేరుగడిరచారు. జీవితాంతం విలువలకు కట్టుబడి పనిచేస్తూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనొక విజ్ఞానఖని, నడిచే గ్రంథాలయం. ఇతిహాసాల నుంచి అధునాతన వైజ్ఞానిక విషయాల వరకూ అన్నింటినీ ఆపోసన పట్టారు. రాఘవాచారి గారు ఏ కార్యక్రమంలోనైనా వేదికపై వున్నారని తెలిస్తే, హాలు 100% నిండిపోయేది. ఆయన ప్రసంగాలకు అభిమానులు లేక్కలేనంతమంది ఉండేవారు. 2019 అక్టోబరు 28న రాఘవాచారి గారు తుదిశ్వాస విడిచారు. అయినా ఆయన జ్ఞాపకాలు మాలాంటి వారి జీవితాల్లో ఇంకా దొర్లుతూనే వున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img