Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిరుద్యోగం,పేదరికంలో అగ్రగాములం

రావుల వెంకయ్య

దేశ ప్రధాని మోదీ బెంగళూరులో మాట్లాడుతూ రక్షణ, విమాన రంగాల్లో దేశం స్వావలంబనదిశగా ఉందని అన్నారు. దిగుమతుల స్థాయి నుండి ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని సెలవిచ్చారు. వాస్తవానికి దేశం అగ్రగామిగా ఉన్నది నిరుద్యోగం, పేదరికం, నీచత్వం, దారిద్య్రం, జీవన ప్రమాణాలు దిగజారడం, అనారోగ్యం, అవిద్య, దివాళాకోరుతనం, అజ్ఞానం, కాలుష్యం, అభద్రతాభావం, ఆహార కల్తీ, విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడంలో, మేధో వలసలు ఎక్కువగా ఉన్న సంగతి ప్రపంచానికి మనం చెప్పక్కర్లేదు. అధిక ద్రవ్యోల్బణం, గరిష్ట స్థాయికి నిరుద్యోగం, ప్రజాస్వామ్యం అణచివేత విద్వేష రాజకీయాలు, రూపాయి విలువ భారీగా పతనం, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, సమాజంలో విభజన, దేశ భద్రతలో వైఫల్యం, ప్రజాస్వామ్యం, సెక్యూలరిజం, సహనం లేకుండా పోవడం ఈ నవ వసంతాలలో ఎక్కువగాఉన్న సంగతి ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రతి అడ్డమైన పనికి దేశభక్తి, దేశ సంస్కృతి ముడిపెట్టి ప్రచార ఆర్భాటాలకు పరిమితమైన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈ సంవత్సరానికి తృణధాన్య సంవత్సరంగా నామకరణం చేశారు. తృణధాన్యాలు పండిరచే రైతుకు ప్రోత్సాహకం లేకుండాచేసి వినియోగ పంటలనుండి వాణిజ్య పంటలకు మారే దుస్థితి వచ్చింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచీ 500 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యంకాని నగరాలు ఏదైనా ఉన్నదా అంటే దీనికి సమాధానం దిల్లీ అని చెప్పవచ్చు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. దిల్లీ, యూపీ, హర్యానా పంజాబ్‌ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వలన, పరిశ్రమల నుండి వెలువడుతున్న విషవాయువులు, వాహనాలు వెలువరించే కాలుష్యం వల్ల విపరీతమైన ఈ దుస్థితి ఏర్పడిరది. ఈ పాపం నాది కాదు అంటే నాదికాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దేశ సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తగ్గిపోతున్నది. మితిమీరిన క్రిమిసంహారక మందులు వాడటంతో భూములు నిస్సారం అవుతున్నాయి. భూసారం గురించి మంచి వ్యవసాయ పద్ధతులు పాటించే వారు కరువయ్యారు. కలుపు నివారణకు నిషేధించిన చేసిన గ్లైసిల్‌, పెండ మీథేన్‌, స్టాంప్‌ లాంటి భయంకర రసాయనాలు వాడుతున్నారు. ‘మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది’ వాటిలో ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి. ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది.
పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు అధికోత్పత్తిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచు తుంది. ప్రతిరోజు సమతుల ఆహారం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లు. పోషకాహరం లోపిస్తే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి. పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహారలోపం సమస్య ఉంది కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువుకంటే తక్కువ బరువువున్న పిల్లలు 40శాతం మన దేశంలోనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగంవరకూ శిశు మరణాలు పౌష్టికాహార లోపంవల్లే సంభవిస్తున్నాయి. ప్రధానంగా మహిళల్లో పౌష్టికాహారలోపం సమస్యతో 56శాతంమంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు తెలియజేశాయి. దీనికి కారణం పేదరికం, నిరక్ష రాస్యత, ఎక్కువగా పిల్లలు వున్న కుటుంబాల్లో పౌష్టికాహారం లోపం మరింతగా ఉంది. శీతలపానీయాల్లో ఎక్కువశాతం పురుగులమందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్‌ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇండియా దశాబ్ది క్రితమే తేల్చి చెప్పింది. వీటిల్లో ఉండే కార్బోనేటేడ్‌ వాటర్‌, కార్న్‌ సిరప్‌, పంచదార, ఎస్పిరటం, కారమెల్‌,ఫాస్ఫరిక్‌ ఆమ్లం, కెఫిన్‌, సిట్రిక్‌ ఆమ్లం, పొటాషియం బెంజైట్‌, పొటాషియం సిట్రేట్‌ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పానీయాల్లో ఉండే ఆర్గానో క్లోరిన్‌, అర్గోనో ఫాస్ఫరస్‌ పురుగుల మందులైన లిండేన్‌,డిడిటి, మలాథియాన్‌ ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్నా, ప్రభుత్వాలు వీటిని నిషేధించడంలేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విదేశీ కూల్‌డ్రిరక్స్‌ కంపెనీలు ఏటా లక్షల కోట్లు దోచుకుంటున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకోవడం, కొరియా, చైనా, తైవాన్‌, మలేసియా, సింగపూర్‌ దేశాల నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతి పదిహేనుశాతం అధికంగా ఉంటున్నది. మన దేశంలో ఒక్క మొబైల్‌ యూనిట్‌ తయారీ లేదు. ప్రపంచ ఆకలి సూచికలో 129 స్థానం, ఆర్థిక సూచికలో108 స్థానం, మానవ అభివృద్ధి సూచిక, సంతోష సూచిక, ఆరోగ్య సూచికల్లో ఎప్పుడూ వంద స్థానానికి తక్కువ లేకుండా చేసుకుంటున్నాం. అయితే రూపాయి విలువ దిగజారలేదని, డాలర్‌ విలువ పటిష్టమైందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడం, ఆర్థిక బుడగలు పేలిపోవడం, ద్రవ్య(కరెన్సీ) సంక్షోభం, ప్రభుత్వం తాము చేసిన అప్పులు చెల్లించకపోవడం ఆర్థిక సంక్షోభం కిందికి వస్తాయి.
ఆర్థికవేత్తలు ఆర్థిక సంక్షోభాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని ఎలా నివారించాలనేదానిపై అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాటి శాస్త్రీయత మీద ఆర్థికవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత దీన స్థితిలో నెట్టాయి. పాఠం నేర్చుకోకపోతే ఏ దేశమైనా శ్రీలంకలాగా మునగక తప్పదు. మన దేశంలో ఆర్థికవృద్ధి అంచనాలు గత రెండు సంవత్సరాలుగా పేలవంగా ఉన్నాయి. ఉద్యోగాల సృష్టి ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధం. జనాభా రీత్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారతదేశం తన యువ కార్మికశక్తిని ఇముడ్చు కోవాలంటే ఏటా 1.20 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. అయితే 2016 నవంబరులో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు దెబ్బకు, జీఎస్‌టీ అమలుతో చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో వ్యవసాయం, నిర్మాణరంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మిక శక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాల్లో ఉద్యోగాలు సృష్టించలేక పోతున్నాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నతస్థితికి చేరాల్సిందిపోయి, నీచ స్థితికి చేరడం మొదలయింది. దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోయింది. ఏది కొనాలి అన్న, తినాలి అన్న భయపడే రోజులు వచ్చాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. వైద్యులకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి. టీ, కాఫీ, పాలు,తేనె, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి.
డాక్టర్‌ యం.సురేష్‌బాబు, ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img