Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నైపుణ్యంతో… హేతుబద్ధంగా : డా. జి.వి. పూర్ణచందు

సమాజ హితం కోరటం, అహితాన్ని హెచ్చరించటం, అపోహల నుండి, ప్రలోభాలనుండి, వ్యామోహాలనుండి, మూఢ నమ్మకాల నుండి జన సామాన్యాన్ని వెలుగులోకి తేవటమే సాహిత్య ప్రయోజనం అయితే, నా సాహిత్యం నిబద్ధతతో ఆ బాధ్యత నిర్వహిస్తోందనే నమ్ముతున్నాను. ప్రొద్దుటి నుండి రాత్రి వరకూ, ఒక్కోసారి అర్ధరాత్రి పూట కూడా ఫోన్లో పాఠకులు నాతో మాట్లాడుతూ అనేక వైద్య ఆరోగ్య, కుటుంబపర సమస్యలకు సలహాలు పొందుతూనే ఉంటారు. పాఠకులతో అంత ఆత్మీయ సాన్నిహిత్యం నాకు ఏర్పడిరది. సామాన్యుడి కోసం వైద్య గ్రంథాలు ఎక్కువగా రాయటం, శీర్షికలు నిర్వహించటం కారణంగా ఈ అవకాశం నాకు దక్కింది.
మౌలికంగా నేను ఆయుర్వేద వైద్యంలో పట్టభద్రుణ్ణి. డిగ్రీలో సంస్కృతం చదువుకున్నాను. సిలబస్‌లో సాంఖ్య, న్యాయ, వైశేషికాది దర్శనాల అధ్యయనం ఒక పాఠ్యాంశంగా ఉండేది. వాటిని తేలిగ్గా అర్థం చేసుకునే క్రమంలో, ప్రాక్పశ్చిమ తత్వ శాస్త్రాల తులనాత్మక అధ్యయనం కూడా కొంత చేశాను. నా రచనల పైన వాటి ప్రభావం గణనీయంగా ఉంది. కాశ్యప సంహిత అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో మనసు ఎలా ఏర్పడుతుందనే అంశం గురించి ఒక అధ్యాయం ఉంది. ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలు కూడా చదవటం వలన కాశ్యప సంహితలోని ఆ విషయాలు తేలిగ్గా అర్థం అయ్యాయి. ‘ఈద్‌ (తమోగుణం), ఇగో (రజోగుణం), సూపర్‌ ఇగో (సత్వగుణం). ఈ మూడు గుణాల ఆధారంగా ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ శాస్త్రం నిర్మించాడు. ఈ త్రిగుణాత్మక సిద్ధాంతాన్ని ఫ్రాయిడ్‌ తన గురువైన జర్మన్‌ వేదాంతి జార్జి గాడ్రెక్‌ ద్వారా గ్రహించాడు. గాడ్రేక్‌ ఇండియాలో కొన్నాళ్ళు ఉన్నాడని, ఇక్కడి తత్వ శాస్త్రాలు అధ్యయనం చేశాడని అతని చరిత్ర చెబుతోంది.
వ్యక్తిత్వ హీనమైన అవ్యక్తం లోంచి ‘నేను తత్వం’ పరిణమించే క్రమం గురించి సాంఖ్యమూ, జార్జి గాడ్రెక్‌ సమానంగానే చెప్పారు. సత్వ, రజో గుణాలను తమోగుణం ప్రభావితంచేసే ప్రక్రియని కాశ్యప సంహితలో చెప్పినట్టే, ఫ్రాయిడ్‌ సిద్ధాంతాల్లోనూ కనిపించింది. ఫ్రాయిడ్‌ గానీ, నియో- ఫ్రాయిడియన్లుగానీ అనుసరించినమార్గాలు సాంఖ్య ధోరణులకు దగ్గరగా ఉన్నాయి. నేటి సామాజిక సమస్యలకు పరిష్కారాల దృష్టితో వాటిని దర్శించాలని ప్రయత్నిస్తూ, 1980లో ‘అమలినశృంగారం’ పుస్తకం రాశాను. అనేక మానసిక సమస్యలకు మూల కారణాల అన్వేషణ ఆ పుస్తకంలో కనిపిస్తుంది. అది నా తొలి గ్రంథ రచన.
32 ఏళ్ళ తరువాత 2012లో విజయవాడ ఆకాశవాణి ద్వారా సాంఖ్యం, ఫ్రాయిడ్‌ సిద్ధాంతాల ఆధారంగా ప్రస్తుత సామాజిక సమస్యలకు కారణాలు, పరిష్కారాలను సూచిస్తూ, ధారావాహిక ప్రసంగాలు చేశాను. యాసిడ్‌ ప్రేమికులు, ఏడాదికే విడాకులు, ధన ప్రభావం, పాశ్చాత్య వ్యామోహం గ్లోబలైజేషనకు బలయ్యే ధోరణులు, హింసాత్మక ప్రవృత్తులు పెరిగి, మానవ సంబంధాలు తగ్గిపోవడం… మొదలైన సమస్యలు, పరిష్కారాల గురించి మనో విశ్లేషణ శాస్త్ర పరంగా వివరించాను. 1975 నుండి నా రచనలు అచ్చుకావటం మొదలయ్యాయి. ‘ఆత్మలతో మాట్లాడగలమా?’ పేరుతో టెలీపతి మీద నా మొదటి వ్యాసం ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది. ప్రశ్నలు చెప్పించుకోవటం, సోది చెప్పించుకోవటాలను ఖండిస్తూ ఆ వ్యాసం రాశాను. అప్పటికి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాను. డిగ్రీ చదివే రోజుల్లో సౌజన్య, జయశ్రీ, వారపత్రికల్లో చాలా రాశాను. 1978-79 సంవత్సరాల్లో సౌజన్య వారపత్రికలో ‘‘ప్రేమ- పెళ్ళి-శృంగారం’’ అనే శీర్షికను ఏడాదికి పైగా నిర్వహించాను. ఫ్రాయిడ్‌, యూంగ్‌, యడ్లర్‌, ఎరిక్సన్‌, హావెలాక్‌ ఎల్లీస్‌లను చదివేందుకు అలా నాకు మంచి అవకాశం వచ్చింది.
1982లో సిగ్గు (వీశీసవర్‌వ), మదం (Aశ్రీషశీష్ట్రశీశ్రీఱంఎ) అనే రెండు పుస్తకాలు వారధి పక్షపత్రిక అనుబంధాలుగా వచ్చాయి. 1980 సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ప్రజల్లో చాలా అపోహలు వ్యాపించిన సందర్భంలో శ్రీ మైత్రేయతో కలిసి ‘‘రేపటి గ్రహణం- ప్రపంచ భవిష్యత్తు’’ అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని తెచ్చాం. ఒక్క రోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడుపోయాయి. అది సైన్సు రచయితగా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆదివారం వార పత్రికలో ‘‘ఏమిటా రహస్యం’’ ప్రశ్నలు – సమాధానాల శీర్షిక, మయూరి వార పత్రికలో ‘‘మనసా కవ్వించకే’’, ఆంధ్రపత్రిక దినపత్రికలో ‘‘ఊహల ఉయ్యాల’’, ఆంధ్రభూమి దినపత్రికలో ‘‘పసి మనసు’’ శీర్షికల ద్వారా మానసిక శాస్త్ర పరమైన చాలా విషయాలు రాయగలిగాను. ఆత్మని, అహంకారాన్ని (నేను తత్వాన్ని), జ్ఞానేంద్రియాలను, త్రిగుణాత్మక మనసుని సంతరించుకుని, ప్రకృతి, చైతన్య వంతమై, ‘సమానం జనం, సమానం ధనం’ అనే లక్ష్యాన్ని చేరుకోగలగటం ఇతివృత్తంగా మనోవిశ్లేషణ శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా ‘‘కాంతి స్వప్న’’ వచన కవితా కావ్యాన్ని (1988లో) రాశాను. మన సామాజికవ్యవస్థలో పలుచబడు తున్న వైవాహిక బంధాలు, తల్లిదండ్రులు – పిల్లల మధ్య సంబంధాలూ, వాటి వలన ఉత్పన్నమయ్యే సమస్యలకు మనో విశ్లేషణ శాస్త్రంలోంచి పరిష్కారాలు సూచిస్తూ, ఆంధ్రభూమి దినపత్రికలో సంసారవేదం శీర్షిక నిర్వహించాను.
మన ఆహార అలవాట్లు, ఆరోగ్య ప్రభావం, వాటి మూలాలు, వాటి చరిత్ర గురించి 9 పుస్తకాలు రాశాను. ‘‘తరతరాల తెలుగు రుచులు’’ పుస్తకం తెలుగువారి ఆహార చరిత్ర- ఆరోగ్య ప్రభావాలపైన తొలి గ్రంథంగా మంచి పేరు తెచ్చుకుంది. ‘‘ఆహార వేదం’’ గ్రంథం ఆహార వైద్యాన్ని సర్వసమగ్రంగా విశ్లేషించి పాఠకుడికి అందించింది. ఆంధ్రభూమి వారపత్రికలో ‘‘ఆహారోపనిషత్తు’’ దూరదర్శన్‌ సప్తగిరిలో ‘‘ఆరోగ్యవేదం’’ ధారావాహికలు సాగుతున్నాయి.
ఇదంతా సామాజిక బాధ్యతతో చేసిన కృషే! 100కు పైగా పుస్తకాలు వెలువరించాను. ఇంచుమించు 30 శీర్షికలు కేవలం వైజ్ఞానిక, ఆరోగ్యపరమైన అంశాల పైన వివిధ దిన, వార, మాస పత్రికలలో నిర్వహించాను. సామాజిక విజ్ఞాన రచనలలో నాకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినవి వైద్య గ్రంథాలైతే, ఆహార వైద్య గ్రంథాలు నన్ను పరిశోధకుడిగా కూడా నిలబెట్టాయి. పండిత పామర రంజకమైన కృషి చేయడానికి నాకు ఈ రంగాలు బాగా తోడ్పడ్డాయి.
సైంటిఫిక్‌ రచనలకూ, పాపులర్‌ సైన్సు రచనలకూ కొంత వ్యత్యాసముంది. రెండూ శాస్త్ర సంబంధ రచనలే అయినా, సైంటిఫిక్‌ రచనలతీరు భిన్నంగాఉంటుంది. శాస్త్రవేత్తలు తమ పరిశీలనాం శాలను, పరిశోధనాంశాలను వ్యాస రూపంలో అందించటం సైంటిఫిక్‌ రచన. ఈ శాస్త్ర రచనలు మేధావి వర్గాన్ని ఉద్దేశించి ఉంటాయి. సామాన్యులకు, చదువుకున్న వారిక్కూడా వీటితో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. సాంకేతిక పదజాలంతో ఆ రంగానికి చెందిన వారికి మాత్రమే అర్థం అయ్యేలా ఉంటాయి కాబట్టి, అవి ఇతరులకు కొరుకుడు పడకపోవచ్చు! కానీ, పాపులర్‌ సైన్సు రచనలు ఇందుకు భిన్నంగా జర్నలిస్టిక్‌గా ఉంటాయి. సైన్సు రచయితను సైన్సు జర్నలిస్టు అనేది అందుకే! సాహిత్య పరమైన విభాగాలలోనూ, జర్నలిజం స్పెషాలిటీలలో కూడా సైన్సురచన ఒక జటిలమైన ప్రక్రియ. సైన్సు రచయితలు పాత్రికేయులైనా, ఫ్రీలాన్సర్లు అయినా ఖగోళం నుండి భూగోళం దాకా, అమీబా నుండి ఆర్మ్‌ స్ట్రాంగ్‌ దాకా ఏ అంశం గురించి అయినా కనీసం ఒక పేరా రాయగల్గిన విస్తృత పరిజ్ఞానం కలిగి ఉంటారు. సామాన్య ప్రజలకు కొత్త అంశాలు తెలియచెప్పటం, అపోహలు, మూఢనమ్మకాలు పోగొట్టడం, కొత్త ఆలోచనలు కలిగించటం, అభివృద్ధికి దారి చూపించడం లక్ష్యంగా సైన్సు రచనలు సాగుతాయి. ప్రస్తుత సామాజికపరిస్థితులకు, సామాజిక జీవనానికీ, దేశీయతకు వైజ్ఞానిక విషయాలను అన్వయించటం, రానున్న ప్రమాదాలను హెచ్చరించటం, ముందు జాగ్రత్తలు, తదుపరి జాగ్రత్తల్ని సూచించటం, ఇలా ప్రజా ప్రయోజనానికి కట్టుబడి సైన్సు రచనలు పుడతాయి. ఒక శాస్త్రవేత్తకు రాని కొత్త ఆలోచనలు అనేక విషయాలు చదివిన ఒక సైన్సు రచయితకు రావచ్చు. చాలా నూతన ఆవిష్కరణలకు సైన్సు రచయితలైన ఫ్రీలాన్సర్లు మూలకారకు లనేది నిజం, తెల్లవారేసరికి కోటీశ్వరుడు కావటమే లక్ష్యం అయి, దాన్ని సాధించే మార్గాల మంచీ చెడులు అప్రస్తుతం అయితే లోకానికి అపకారం జరుగుతుంది.
విజ్ఞానాన్ని దేశీయతకు అన్వయించి చెప్పగలగటం వలన ప్రజాప్రయోజనం నెరవేరుతుంది. అవి శాస్త్ర రహస్యాలు, సృష్టి రహస్యాలు, సాంకేతిక విషయాలు ఏవైనా కావచ్చు. వాటిని అందంగా, అలవోకగా, సరళమైన వాడుకభాషలో అరటిపండు వలిచి ఇచ్చినంత సులువుగా చెప్పగలగటం సైన్సు రచయితకు వెన్నతో పెట్టిన విద్య. కవిత్వమో, కథలో రాసేవారే రచయితలుగా చెలామణిలోఉన్న ఈ రోజుల్లో వైజ్ఞానిక రచనల కన్నా కథలూ నవలలూరాస్తే ఇంకా ఎక్కువపేరు వచ్చేదని మిత్రులన్నప్పుడు, పాఠకులతో ఇంతగా ముఖాముఖీ సాన్నిహిత్యం వాటివలన నాకుదక్కేనా.. అనడగుతాను! కొన్నిసాహిత్య విమర్శనాగ్రంథాలు, కాసినన్నికథలు, నవలలు, కవితా సంపుటాలు ఇవన్నీ పాతిక పైనే వచ్చాయి. కానీ, నాకు తృప్తినిచ్చేది పాఠకుడికి నేరుగా ప్రయోజనం కలిగించే నా వైజ్ఞానిక రచనలే.! భారతీయ దర్శనాలను పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయ పరిచే దృష్టితోనే నా అధ్యయనం సాగింది. అందువలన నాకు కలిగిన ప్రయోజనం గురించి ఒక ఉదాహరణ చెప్తాను. చరకుడుఒకసూత్రంలో ‘‘బహ్వబడ్డాబీ మేదాబీ’’ అంటాడు. పొట్టలో కొవ్వుకణాలు పెరిగి స్థూలకాయం ఏర్పడటాన్ని వివరించాడు. బహ్వబద్ధంగా- బహు అబద్దంగా- బాగా వదులుగాఉండే (ూశీశీంవ aసఱజూశీంవ ్‌ఱంంబవ) మేధస్సుఅంటే, కొవ్వు కణాలలోకి అదనపు క్లేదక కఫధాతువులు (జaశ్రీశీతీఱవం) చేరి, పొట్టదగ్గర కొవ్వుకణాలు ఉబ్బి, పొట్టపెరుగుతుంది అన్నాడు. ఇలాంటి సూత్రాలు ఆధునిక వైద్య పరిజ్ఞానంతో పరిశీలిస్తేనే ఇంత తేలిగ్గా అర్థం అవుతాయి. జాగ్రత్తగా చూస్తే, మరికొన్ని కొత్త విషయాలు కూడా కనిపించవచ్చు. అందుకే, సమన్వయ దృష్టి కావాలంటాను. ఎంత ఎక్కువ మంది సామాన్య ప్రజలను మన నైపుణ్యం ద్వారా హేతుబద్ధంగా ప్రభావితం చేయగలిగామన్నది ముఖ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img