Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

న్యాయ నిపుణుడి వింత వాదన!

టి.లక్ష్మీనారాయణ

ఒక న్యాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, సమాచారహక్కు చట్టం అమలు కోసం నెలకొల్పిన కేంద్ర సమచార విభాగం పూర్వ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ‘‘కృష్ణా.. గోదావరి కేంద్రం గుటకాయ స్వాహా’’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాన్ని విశాలాంధ్ర దినపత్రికలో చదివాను. ‘‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు’’ కోసమే పోరాడి తెలంగాణను సాధించుకొంటే ‘‘ఉద్యోగాల సమస్య , దారి మళ్లుతున్న నిధుల సమస్య తీరనేలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విషయంలోను అన్యాయం జరుగుతూనే ఉన్నదంటూ, నిష్ఠురంగా, అసంబద్ధమైన, చట్టవ్యతిరేకమైన పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘నీటి వివాదం ట్రిబ్యునల్‌ పరిష్కరించాలి’’ అంటూనే అమలులో ఉన్న బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో 70 శాతం కృష్ణా జలాలు ప్రవహిస్తుంటే (బహుశా ఆయన ఉద్దేశం పరివాహక ప్రాంతం అని కావచ్చు) 50 శాతం కంటే తక్కువ వాటా లభించడమేంటి?’’ అంటూ తెలంగాణ ప్రభుత్వ వాదననే వినిపించారు. న్యాయ స్థానంలో న్యాయవాదిగా వినిపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు సుమా!
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 44 శాతం ఉన్న కర్నాటక, కృష్ణా నదికి ఎక్కువ నీటిని సమకూర్చుతున్న మహారాష్ట్ర తమకు ఎక్కువ నీటిని కేటాయించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు పెద్ద ఎత్తున వాదించాయి. ఒక దశలో కర్నాటక రాష్ట్రం బచావత్‌ ట్రిబ్యునల్‌ విచారణను బహిష్కరించే వైపు కూడా అడుగులు వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఘాటైన హెచ్చరికలతో దారికొచ్చింది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న నీటి చట్టాలు, వివిధ దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో అమలులో ఉన్న విధానాన్ని ప్రామాణికంగా తీసుకొన్న బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని, నికర జలాలను నిర్ధారించి, అప్పటికే నీటిని వినియోగించుకొంటున్న ప్రాజెక్టులకు, అంటే 1960 నాటికి వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల వార్షిక నీటి వినియోగాలను నిర్ధారించి, ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. పర్యవసానంగా, మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, నాటి ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీల చొప్పున కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులను భవిష్యత్తులో నియమించే ట్రిబ్యునల్స్‌ సాధ్యమైనంత వరకు సమీక్షించకూడదని కూడా తీర్పులో పేర్కొన్నారు.
1972 నుండి 1982 మధ్య కాలంలో నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య తెలంగాణ వారే. ఆ కాలంలోనే బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారంపై విచారణ చేసి, తీర్పు ఇచ్చింది. 1976 జూన్‌ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక వాస్తవాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు గడువు ముగిసిన మీదట ఏర్పాటైన బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులో, 75 శాతం ప్రామాణికంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను ‘‘డిస్టర్బ్‌’’ చేయడం లేదని విస్పష్టంగా పేర్కొన్నది. మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ కల్పిస్తే, ఆ స్వేచ్ఛను బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కాలరాసింది. పర్యవసానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దావా వేసింది. విచారణ కొనసాగుతూనే ఉన్నది.
కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం డిమాండును కేంద్ర ప్రభుత్వం న్యాయ పరిశీలనకు పంపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మిగిలిన రాష్ట్రాలు అంగీకరిస్తే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటవుతుందేమో! బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు సుప్రీం కోర్టులో ‘‘పెండిరగ్‌’’ లో ఉండగా మరొక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడం సాధ్యమా! లేదు, రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ ట్రిబ్యునల్‌ వేయడం సాధ్యమా! ఈ విషయాలు ముందు తేలాలి. వేచి చూద్దాం! బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన నికర జలాల కేటాయింపులను సమీక్షించవచ్చా! లేదా! అన్నది మరొకసారి తేలిపోతుంది. కనీసం 50:50 నిష్పత్తిలో వాటా కావాలన్న తెలంగాణ డిమాండ్‌, ఎక్కువ, తక్కువ కేటాయింపుల వాద ప్రతివాదనలకు భవిష్యత్తులో తప్పని సరిగా సమాధానాలు లభిస్తాయి.
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు పరిధులు నిర్ణయించి, నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 కట్టబెట్టింది. శ్రీధర్‌ మాటల్లో ‘‘కేంద్రానికి ఈ పెత్తనాన్ని కట్టబెడుతున్నది, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి రెండు నదీ జలాల బోర్డుల ఏర్పాటుకు, వాటి అధికార పరిధిని నిర్ణయించేందుకు అవకాశం ఉంది’’ అంటూ వాస్తవాన్ని గుర్తిస్తూనే గజిట్‌ నోటిఫికేషన్‌తో ‘‘ఇక రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని దిల్లీ చక్రవర్తి పాదాల ముందు అన్యాక్రాంతం చేయాల్సిందే’’ అంటూ సెలవిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 సమాఖ్య వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేసిందన్న భావన శ్రీధర్‌ ముగింపు వాక్యంతో అర్థం చేసుకోవచ్చా!
వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి
అధ్యయన వేదిక సమన్వయకర్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img