Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పదునెక్కుతున్న రణన్నినాదం

         సీ.ఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి

మోదీ ప్రభుత్వాన్ని ఇక భరించకూడదని ప్రజానీకం చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. బీజేపీ హఠావ్‌…భారత్‌ బచావ్‌ పేరుతో పాదయాత్రలు చేపట్టాలని సీపీఐ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ పట్టణం, అల్లిపురం మార్కెట్టులో పాదయాత్ర చేస్తూ కరపత్రాలు ఇస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజలకు వివరిస్తున్న తరుణంలో ఒక పెద్దావిడ ఏంది నాయనా ఏవో పేపర్లు పంచుతున్నారని అడిగింది. నేడు దేశాన్ని ఏలుతున్న పాలకుల వ్యహార శైలిని, సమాజంలో మెజారిటీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెబుతుండగానే…ఆమెలో ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. ఈ మోదీ పాలన వద్దు బాబూ బతకలేక పోతున్నాం అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆమెను చూస్తే పెద్దగా చదువుకున్నట్టు కనిపించలేదు. రాజకీయాల గురించి తెలసినట్టు అనిపించలేదు. కానీ నిత్యం తాము పడుతున్న ఇబ్బందుల నుంచి ఆమె ఆ వ్యాఖ్యలు చేసినట్టు కనిపించింది. చూడు నాయనా రూ.300 లకు అందాల్సిన గ్యాస్‌ సిలెండరు 1200 ఇచ్చి కొంటున్నాం. ఇంత కన్నా అన్యాయం ఏముంటుందని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలన్నీ నా సెల్‌ఫోన్‌లో రికార్డుచేసి ఇది వరకే బాహ్య ప్రపంచానికి తెలియచేశాను. ఆయనకేం పెళ్లాం పిల్లలు లేరు. మావంటి వారు పడే కష్టాలెలా తెలుస్తాయంటూ నిట్టనిలువునా ప్రధాని మోదీ పేరును ఉచ్చరిస్తూ కడిగి పడేసింది. నేను అదే ముందిలే ఇంకోసారి మోదీనే గెలిపించండి అన్నాను. ఆ సమస్యే లేదు. మేము ఓటు వెయ్యం అని స్పష్టం చేసింది. ఇది ఆమె ఒక్కరి బాధ మాత్రమే కాదు. ప్రతి కుటుంబంలోని మహిళ ఆవేదనను ఆమె వ్యక్త పరిచింది. గతంలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గ్యాస్‌ బండకు దండంపెట్టి ఓటు వేయడానికి వెళ్లాలి అని మహిళలకు ఇచ్చిన పిలుపు గుర్తుకువచ్చి రానున్న ఎన్నికల్లో నిజంగానే ప్రతి మహిళా గ్యాస్‌బండకు డండం పెట్టి మరీ ఆయనకు (బీజేపీ) వ్యతిరేకంగా ఓటు వేస్తారని, బీజేపీ హఠావ్‌…దేశ్‌ బచావ్‌ అనే నినాదం పదునెక్కుతున్న రణ నినాదంగా మారుతోందనిపించింది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో బ్రిటీష్‌ తరహా పాలన సాగుతోంది. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను, నవరత్నాల్లాంటి కంపెనీలను, ప్రజల ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఎసెట్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ను తీసుకొచ్చింది. దేశంలోని 400 రైల్వే లైన్లు, 100 రైళ్లు విమానాశ్రయాలు, చమురు పైపులైన్లు, జాతీయ రహదారులను అమ్మకానికి పెట్టింది. కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ లేబర్‌ కోడ్‌లను రూపొందించింది. రూ.18 లక్షల కోట్ల వార్షిక మార్కెట్‌ ఉన్న వ్యవసాయరంగాన్ని ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వర్గాల చేతుల్లో పెట్టే ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ నల్ల చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే.
దేశంలో సామాన్య, మధ్యతరగతి, పేద వర్గాలు బతకలేని పరిస్థితులు వచ్చాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉప్పు, పప్పు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు హద్దులు లేకుండా పోయింది. విద్యుత్‌ సవరణ చట్టం పేరుతో చీకట్లను నింపుతోంది. ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. బ్యాంకింగ్‌రంగాన్ని సర్వనాశనంచేసే దిశగా అడుగులు వేస్తోంది. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది. ప్రజలు దాచుకున్న సొమ్మును బడా కార్పొరేట్‌ సంస్థలకు రుణాలుగా ఇప్పించి, వారిని దేశం దాటేలా సహకరించి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించింది. మోదీ పాలనలోని ఈ లోపాలపై చర్చ జరుతుందనే భావన కలిగినప్పుడల్లా మందిర్‌, మసీదు, హిందూ, ముస్లిం అంటూ తమ మతతత్వ అమ్ముల పొదిలోని అస్త్రాలను ప్రయోగిస్తూ ప్రజల మధ్య మత చిచ్చు పెడుతోంది. మోదీ అధికారాన్ని హిందుత్వ శక్తులు తమ సొంత సామ్రాజ్యంగా భావిస్తున్నాయి. తామేమి చేసినా అడిగేవారు ఎవ్వరు అనే ధీమాతో ఇంత కాలం వారి ఆటలు సాగాయి. ఇక ఆ పరిస్థితి ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమవుతోంది. ఇందుకు కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీని వీడుతున్న ఆ పార్టీ నేతలే ఉదాహరణ.
ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న పాలకపక్షం పూర్తిగా కేంద్రం లోని బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తోంది. పోలవరం, ప్రత్యేకహోదా సహా విభజనహామీల అమలులో కేంద్రప్రభుత్వం ఏపీకి తీవ్రఅన్యాయం చేసినా…చేస్తున్నా నోరెత్తలేని పరిస్థితి. ఆ పార్టీ అధినేత తన వ్యక్తిగత అంశాల నేపథ్యంలోనే కేంద్రం చేస్తున్న అన్యాయాలపై మాట్లాడలేక పోతున్నారనే భావనను పాదయాత్రల్లో పాల్గొంటున్న కార్యకర్తల వద్ద ప్రజలే నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముద్ర వైసీపీపై ఉందనేది జనం ఉవాచ. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ సైతం బీజేపీపై పోరులో పూర్తి అవకాశవాద రాజకీయం చేస్తోందనే భావన కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కారణమైన బీజేపీని ఒక్క మాట అనలేక పోతున్నారనే చర్చ నడుస్తోంది. ప్రధానంగా స్టీల్‌ ప్లాంటు విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు వ్యవహరిస్తోన్న తీరు దారుణంగా ఉంది. కేంద్రం పదే పదే ప్లాంటును అమ్మేస్తున్నాం అని బహిరంగంగా ప్రకటనలిస్తున్నా అధికార, ప్రతిపక్షాలు నోరు విప్పకపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనే విషయం సుస్పష్టం. జనసేన అధినేత పవన్‌ బీజేపీ ఇచ్చే రూట్‌ మ్యాప్‌ కోసం తాము ఎదురు చూస్తున్నట్టు ప్రకటించినప్పుడే బీజేపీపై ఆయన పోరాటం చేయలేడనే ముద్రవేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరచడంకోసం ఉభయ వామపక్షాలు తీసుకున్న పాదయాత్ర కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
దేశ వ్యాప్తంగా పాదయాత్రలు ప్రారంభమైన తరుణంలోనే ప్రధాని మోదీ అసలు స్వరూపాన్ని జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బయటపెట్టారు. 2019 నాటి పుల్వామా ఘటనకు మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణమంటూ మాలిక్‌, మాజీ ఆర్మీ చీఫ్‌ శంకర్‌ రాయ్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రచారం అవుతుండడంతో మోదీ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. వారిరువురు లేవనెత్తిన అంశాలపై ప్రాథమికంగా ఆలోచించినా భారీ కుట్ర కోణం బయట పడుతుంది. తమ అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ఎంతకైనా తెగించే కేంద్రంలోని పాలక పెద్దల అసలు స్వరూపాన్ని కూడా ఈ పాదయాత్రల్లో భాగంగా వాడవాడలా చర్చకు పెట్టడం ద్వారా బీజేపీ హఠావ్‌…దేశ్‌ బచావ్‌ అనే నినాదాన్ని మారుమోగించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img