Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాకిస్థాన్‌ కాదు కల్లోలిస్థాన్‌

టి.వి.సుబ్బయ్య

దేశ విభజన జరగడంతో పాకిస్థాన్‌ అవతరించింది. అది మత పరమైన విభజన. దేశ విభజన సమయంలో కనివిని ఎరగని సామాజిక సంక్షోభం, హత్యాకాండ జరిగింది. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అన్నిటి కంటె ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య ద్వేషం, పగ ప్రతీకారం ప్రజల్లో జీర్ణించుకుపోయాయి. ముఖ్యంగా కశ్మీరు సమస్య రగులుతూనే ఉంది. పాకిస్థాన్‌లో సైనిక ఆధిపత్యం, మతాధిపత్య రాజ్యం కావడంతో ఏనాడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి పటిష్ఠం కాలేదు. మతాధిపత్యం, సైనిక పెత్తనం కొనసాగుతున్న అనేక దేశాల్లో కల్లోల పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో అనేక సంక్షోభాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ మాజీ ప్రధాని, క్రికెట్‌ మాజీ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడంతో ఒక్కసారిగా అనేక జిల్లాల్లో గృహ దహనాలు, లూటీలు విచ్చలవిడిగా సాగాయి. సైన్యం రంగంలోకి దిగింది. ఈలోపు బుధవారం మరో అవినీతి ఆరోపణపై ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు 8 రోజుల రిమాండ్‌ విధించి యాంటీ కరప్షన్‌ వాచ్‌డాగ్‌కు అప్పగించింది. ముఖ్యంగా పంజాబ్‌, ఖైబర్‌ ఫతుంఖ్వా జిల్లాల్లో అల్లర్లు, ఘర్షణలు జరిగాయి. అలాగే లండన్‌ తదితర చోట్ల కూడా ఇమ్రాన్‌ఖాన్‌ అభిమానులు నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రధాన మంత్రి షహబాజా షరీఫ్‌ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని వార్తలు వచ్చాయి. ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులను 2018`2022 కాలంలో అక్రమంగా ఇమ్రాన్‌ఖాన్‌ అమ్ముకున్నారన్న అభియోగాలను ఎన్నికల కమిషన్‌ ధృవీకరించింది. నిధుల దుర్వినియోగం కేసుతో పాటు బహుమతుల విక్రయ కేసు ఇమ్రాన్‌ఖాన్‌ మెడకు చుట్టు కున్నది. అల్లర్లలో చాలామంది చనిపోయారు. ఇమ్రాన్‌పై కొన్ని డజన్ల కేసులు నమోదై ఉన్నాయి. కొన్నికేసులు విచారణలో ఉన్నాయి. ప్రధానంగా సైన్యంతో విరోధం పెంచుకొని తలపడుతున్నాడు.
సైన్యం సహాయంతో ఇమ్రాన్‌ అధికారంలోకి వచ్చారు, సైనిక జనరల్‌ అషీమ్‌ మునీర్‌ సైతం ఇమ్రాన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌ స్వాతంత్య్రదేశంగా అవతరించి 75ఏళ్లు అయింది. అయి నప్పటికీ కశ్మీరు సమస్య పరిష్కారం కాకుండా పాకిస్థాన్‌ సైన్యం అడ్డుపడు తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కశ్మీర్‌ సమస్య కొనసాగడానికి ప్రధాన కారణాలు ఇటీవల గోవాలో జరిగిన షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొన్న పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో సైతం ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్టే మాట్లాడారు. ఆరేడు దశాబ్దాల కాలంలో ఏనాడు ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అవినీతి విజృంభించింది. అన్నిరకాల వస్తువులు, పెట్రోలు, డీజిల్‌ధరలు అమాంతం పెరిగి అత్యధిక ప్రజలు విలవిలలాడుతున్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. ఒక నెలకు సరిపడ దిగుమతులకు మాత్రమే నిల్వలు న్నాయని వార్తలు. ఐఎంఎఫ్‌ ఇస్తానన్న రుణం కూడా ఇంతవరకు అందలేదు. మత మైనారిటీలుగా ఉన్న హిందువులపై విద్వేష దాడులు, ఆలయాలను ధ్వంసం చేయడం మత విద్వేషాన్ని ప్రస్పుటం చేస్తోంది. భారతదేశంపై ద్వేషాన్ని వెళ్లగక్కడం చాలాకాలంగా ఉంది. వామపక్షాలను తీవ్రంగా అణచివేశారు. మత రాజ్యం కావడం, ఇతర మతాలపై ద్వేషం పెంచుకోవడం, సైనిక పెత్తనం ఎక్కడ ఉన్నా నిరంతరం ఘర్ప్షణలు జరగడం పరిపాటి అవుతుంది. క్రమంగా నియంతృత్వం బలపడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడి పోతాయి. ఇలాంటి దేశాలు ఇజ్రాయిల్‌, మైన్మార్‌, ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ ప్రముఖంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం, బహుళత్వం, వ్యక్తిగత హక్కులు గత కాలపు చరిత్రను విస్మరించి మతపరమైన విషయాలను ప్రచారం చేస్తూ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. తిరోగమనచరిత్రను పదిల పరిచేందుకు పాలకులు పూనుకుంటారు. ఇలాంటిదేశాల్లో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోవడం సర్వసాధారణం. అంతేకాదు రాజ్యాంగాన్ని, ఇతర అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడం తప్పనిసరిగా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు వెనుకాడటం లేదు. సినిమాలు నిర్మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీడియాను లొంగదీసుకొని పాలకులకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం నిత్య కృత్యమవు తుంది. మెజారిటీ మతం ఆధారంగా ప్రభుత్వంలోకి వచ్చి మధ్యయుగాల నాటి చీకట్లలోకి నెట్టి నియంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యత్నించడం చూస్తున్నాము.
పాకిస్థాన్‌ 75 ఏళ్ల అనుభవాన్నిచూసిన తర్వాత కూడా ఏ ప్రజాస్వామ్య దేశమైనా జాగ్రత్త పడుతుంది. భారతదేశం ఏలుతున్న మత, మితవాద, అతిజాతీయవాద నయా దేశభక్తులు దేశాన్ని మధ్యయుగాలలోకి తోసి వేయాలని వ్యూహంపన్నడం అత్యంత విచారకం. దాదాపు గత తొమ్మిదేళ్లుగా నయా దేశభక్తులు దేశంలోని అన్ని వ్యవస్థలను తమ గుప్పిట పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించారు. అవినీతి విచ్చల విడిగా వికటాట్టహాసం చేస్తోంది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని మాత్రమే అనుసరిస్తూ నిరుద్యోగం, పేదరికాన్ని పెంచారు. రాజ్యాంగ విచ్ఛిన్నం, స్వాతంత్య్రపోరాట లక్ష్యాలను తుంగలోతొక్కడం, అనేక రకాలుగా మైనారిటీ మతస్థులను వేధించడం నిత్యకృత్యమైంది. పేదలు, ధనికుల మధ్య ఆర్థిక అసమానతలు గతంలో ఏనాడు లేనంతగా పెరిగిపోవడం చూస్తున్నాము. న్యాయ వ్యవస్థను సైతం అదుపు చేయాలని చూస్తున్నారు. ప్రజల కష్టంతో నిర్మించిన ప్రాజెక్టులను, అభివృద్ధి పరిచిన పరిశ్రమలను విస్మరించి గత పాలకులను తిట్టడంతో సరిపోయింది. వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌ ధరలను పెంచేసి సామాన్య ప్రజల జీవనాన్ని అష్టకష్టాల పాలుచేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి నియంతృత్వం వైపు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్‌లో సమగ్రమైన చర్చలు లేకుండానే ధనికుల అనుకూల పేదల వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని, దర్యాప్తు సంస్థలను అదుపులో పెట్టుకొని పాలకులు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారు. విద్వేష ప్రచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అంతర్‌ సంఘర్షణలకు దారితీసే పరిస్థితు లను కల్పించి, సర్వ వ్యవస్థలను స్వాధీనం చేసుకుని సమాజాన్ని తిరో గమనం పట్టించే పంథాను అనుసరిస్తున్నారు. వీటిని గుర్తించి ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు అప్రమత్తం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img