Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పీఎస్‌బీల రక్షణకు ఐక్యపోరాటం

సి.హెచ్‌. వెంకటాచలం
ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు ఐక్య పోరాటం చేయాలని ఇటీవల జరిగిన ఏఐబీఈఏ మహాసభ తీర్మానించింది. మే 13 నుంచి 15, 2023 వరకు ముంబైలో జరిగిన ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) 29వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశం నలుమూలల నుండి 3,000మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ముఖ్యంగా నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, జమ్మూ, కాశ్మీర్‌ సహా అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పబ్లిక్‌ సెషన్‌ మే 13 సాయంత్రం జరిగింది. రిసెప్షన్‌ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ పాత్రికేయుడు పి సాయినాథ్‌ పాల్గొన్నారు. స్వాగత ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ సంక్షోభానికి మద్దతుగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. గత 10 ఏళ్లలో 4 లక్షల మంది రైతులు చనిపోయారని స్వాతంత్య్రంవచ్చిన 75వ సంవత్సరంలో భారతదేశం అత్యంత అసమానత కలిగిన దేశంగా నమోదైందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికారణంగా దేశంలో దాదాపు 4.5మిలియన్లమంది మరణించారు. 750మందికి పైగా జర్నలిస్టులు మరణించారని పేర్కొన్నారు. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక ఆధారంగా అంతర్జాతీయంగా పేదరికం సూచీలో, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచీల్లో మనం అత్యంత అథమస్థితిలో ఉన్నాం. కానీ, ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో మాత్రం మూడవ స్థానంలో ఉన్నాం. అంటే అసమానత నిష్పత్తిలో మాత్రం ముందంజలోఉన్నాం.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌ కౌర్‌ తన ప్రారంభోప న్యాసంలో మాట్లాడుతూ, 1920లో ముంబైలో ఏఐటీయూసి స్థాపించినట్లు పేర్కొన్నారు.. ఏఐటీయూసీి కార్మికుల అభ్యున్నతి కోసమే కాకుండా స్వాతంత్య్ర పోరాటంలో రాజకీయపాత్ర పోషించిందని ఆమె వివరించారు. బీజేపీ ప్రభుత్వ విధానాల అమలుతో దేశంలో అన్ని రంగాలు క్షీణించాయని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వాల నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు పోరాడుతున్నా యన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణల ఎజెండాలో నిరుద్యోగిత రేటు, ఉద్యోగ నష్టాలు, రైతుల కష్టాలను ఆమె ప్రస్తావించారు. గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా, 2014 నుండి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హయాంలో గౌతమ్‌ అదానీల పెరుగుదలను ఆమె హైలైట్‌ చేశారు. సంఘటిత కార్మిక సంఘాలు తమ ఆందోళనలు, సమ్మెల ద్వారా అద్భుతాలు సృష్టించగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులకోసం యూనియన్లు పోరాడాలని, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం నుండి రక్షించడానికి అన్ని రంగాల స్థాయి ట్రేడ్‌ యూనియన్‌లతో ప్రభుత్వం ఏకీభవించాలని కౌర్‌ సూచించారు.
కార్మిక సంఘాల డిమాండ్‌లను నిర్వీర్యంచేసేందుకు ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని కౌర్‌ హెచ్చరించారు. లేబర్‌ కోడ్‌లు భారతదేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’ లక్ష్యంగా తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక చట్టాలు సంఘటిత కార్మికులకు మాత్రమే రక్షణ కల్పిస్తాయి. అసంఘటిత కార్మికులకు కార్మిక చట్టాల ప్రకారం రక్షణ లేదు. ఇప్పటికీ శ్రామిక శక్తిలో 90 శాతానికి పైగా ఉన్న అసంఘటిత కార్మికులు పోరాటాలు, సమ్మెలు చేస్తూనేఉన్నారు. కార్మిక సంఘాలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని, దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించేందుకు పోరాటాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. జనవరి 30, 2023న న్యూఢల్లీిలో జరిగిన అన్ని కార్మికుల సదస్సులో దేశ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏడాది పొడవునా సమ్మెలు, పోరాటాలు వంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. ఏఐబీఈఏ బ్యానర్‌ కింద బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, కార్మికులకు అండగా ఉండి, మత శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు, దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనే పార్టీలకు ఓటు వేయాలని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రభుత్వ రంగాన్ని కాపాడేందుకు పోరాటాలు చేపట్టాలని సూచించారు.
భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే దానికి ప్రభుత్వ రంగ బ్యాంకులే ప్రధాన కారణం. 2008 ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం తట్టుకోగలిగి, బ్యాంకు ఉద్యోగులు 30 ఏళ్లపాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 1990లో భారతదేశంలో డాలర్‌ బిలియనీర్‌ లేడు. 1994లో ముగ్గురు డాలర్ల బిలియనీర్లు ఉన్నారు. 2012 నాటికి, 53 మంది డాలర్ల బిలియనీర్లు ఉన్నారు. 23 సంవత్సరాలలో 56 మంది డాలర్ల బిలియనీర్లు నమోదయ్యారు. 2014 నుండి 9 సంవత్సరాల కాలంలో, మన దేశంలో 166 డాలర్ల బిలియనీర్లు నమోదుకానున్నారు. ఇది బీజేపీి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంటే పది సంవత్సరాలలో 110 మంది బిలియనీర్లు నమోదయ్యారు. 10 సంవత్సరాలలో, గౌతమ్‌ అదానీ సంపద 3400 శాతానికి పెరిగింది. ఎల్‌ఐసి, ఎస్‌బీఐ గౌతమ్‌ అదానీ గ్రూపులోకి నిధులను భారీ స్థాయిలో పంపినట్లు తాజాగా జరిగిన స్కామ్‌లో తెలుస్తోంది.
ఈ సందర్భంగా 105 మిలియన్ల కార్మికుల తరపున డబ్లుఎఫ్‌టీయూ జనరల్‌ సెక్రటరీ పాంబిస్‌ కిరిట్సిస్‌ సదస్సును అభినందించారు. బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను పరిరక్షించడంలో ఏఐబీఈఏ కృషి చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల తప్పుడు విధానాలతో కార్మికలు స్వేచ్ఛ, ఉద్యోగ అభద్రతలో ఉన్నారని దీనికి భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదని అన్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు, బీమా రంగం కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేతనాల పెంపుదల, పెన్షన్‌ సంస్కరణలకోసం పోరాడా లన్నారు. మన దేశంలో ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం ద్వారా కార్పొరేట్లు, గుత్తాధిపత్యం,బహుళజాతి సంస్థలకు మద్దతు ఇచ్చే మితవాద విధానాలను అనుసరిస్తోందని ప్రస్తుత ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణకు యత్నిస్తోందని హెచ్చరించారు. ఈ సదస్సులో యుఎఫ్‌బియు కన్వీనర్‌ సంజీవ్‌ బంద్లీష్‌ పాల్గొన్నారు. కిసాన్‌ నాయకుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ, పంజాబ్‌లో, జిఎస్‌టి పెరగడం వల్ల ట్రాక్టర్లు ధరలు పెరిగాయిని, ట్రాక్టర్ల కొనుగోలుకు రుణాలుపొందడం, వడ్డీ చెల్లింపులు రైతులకు సమస్యగా మారిందని అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రుణాలు తీసుకోవడానికి వెళ్లేవారు అయితే ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులు ఎంత రుణం కావాలని రైతుల వద్దకు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం వ్యవసాయ భూములను బహుళజాతి కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రెజిల్‌, మలేషియా, డెన్మార్క్‌, ఈజిప్ట్‌, పాలస్తీనా, బెలారస్‌, సిరియా, మారిషస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, సైప్రస్‌లకు చెందిన బ్యాంక్‌ యూనియన్‌లకు చెందిన విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని శుభా కాంక్షలు తెలిపారు. బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ ప్రయత్నాలను మరింత ప్రతిఘటించాలని సమావేశం తీర్మానించింది. ప్రభుత్వం బ్యాంకు ప్రైవేటీకరణ బిల్లుతో ముందుకు వెళితే నోటీసులతో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సభ్యులకు ఈ సమావేశం పిలుపునిచ్చింది. బ్యాంకుల్లో తగిన రిక్రూట్‌మెంట్‌ల కోసం దేశవ్యాప్త పోరాటాలు చేపట్టాలని కూడా సదస్సు నిర్ణయించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రజల, రైతులు, కార్మికుల,పేదల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఆర్థికరంగాన్ని, ప్రజలను, దేశాన్ని కాపాడేందుకు గాను ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ప్రచారం, పోరాటం చేయాలని సభ తీర్మానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img