Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోరాడితే పోయేదేమీ లేదుగా…!

మహిళా దినోత్సవం పేరు వింటానికి బాగుంటుంది. ఆ ఒక్కరోజు మహిళలను గౌరవించినంత మాత్రాన సరిపోదు. మహిళ మంచికి మమతలకు నెలవు. తనకు ఎన్ని బాధలున్నా నలుగురిలో ఎంతో గుంభనంగా ఉంటుంది. అహర్నిశలూ తన కుటుంబం కోసమే పాటుపడుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో విజయాలను చవి చూస్తోంది. ఆకాశంలో సగం మీదేనంటారు. అవనిలో చోటే లేకుండా చేస్తారు. ఇటీవల జరిగిన ఉదంతాలను చూస్తే మహిళలకు అసలు రక్షణ ఉందా! అనిపిస్తుంది. ఇటీవల ఒక మహిళను గృహ నిర్బందంలో పెట్టి సంవత్సరాల తరబడి ఉంచారు. తన సంతానం కూడా తనని గుర్తుపట్టలేని విధం కల్పించారు. మరి ఆ చేసిన వారు ఏమీ చదువు సంధ్యలేనివారనుకుంటే పొరపాటే. ఉన్నత విద్యావంతులు మరి. ఏటికేళ్ళు దొర్లిపోతూనే ఉంటాయి. మహిళల పరిస్థితిలో మార్పు మాత్రం ఇసుమంత కూడా కనిపించదు. మరిక మహిళా దినోత్సవ స్ఫూర్తి ఎక్కడికి పోతోంది. ఈ పరిస్థితి ఒక్క మనదేశంలో మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నిటా ఇదే పరిస్థితి. మహిళా దినోత్సవం పేరుతో మహిళలు అన్ని రంగాల్లో సాధించిన విజయాలను చెప్పుకుని పొంగిపోవడంతో సరిపెట్టేసుకుంటే కుదరదు. అసలైన హక్కుల సాధనకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమించాలి. మగువలపై వివక్షను తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలి. స్థానిక ప్రాంతాల నుంచి పోరాటాలను చేపట్టాలి. లింగ వివక్షకు వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టాలని ప్రతి మహిళా దినోత్సవాన నాయకులంతా ప్రతిజ్ఞ చేస్తారు. ఇది ఎంతవరకు అమలు జరిగింది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి! ఈ మాటలు, ఈ చేతలు ఒక్క మహిళా దినోత్సవానికే పరిమితమైతే మహిళల దుస్థితి ఎప్పటికీ మారదు! ఈ మహిళా దినోత్సవ స్ఫూర్తి ఎన్నాళ్లు కొనసాగుతోందన్నదే ఇప్పుడు ఉన్న ప్రశ్న! ఈ పోరాటం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. తమకు సరైన విలువ, గౌరవం ఇవ్వాలనే డిమాండ్‌ తీసుకురావాలి. హక్కుల కోసం, సమానత్వం కోసం మహిళ అనాదిగా పోరాడుతోంది కనుకనే ఇప్పుడు తాను అనుకున్నది చేసేందుకు కొంతైనా స్వేచ్ఛను అందుకోగలుగుతోంది. హక్కుల్ని సాధించుకోవడమే కాదు, చట్ట సభల్లో సగం స్థానాలు సంపాదించుకునే స్థాయికి మహిళ ఎదగాలి.
మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు!
శతాబ్ధకాలంగా ఈ మహిళా దినోత్సవాలు నిర్వహించుకొంటున్నాం. తొలిసారిగా 1908లో న్యూయార్క్‌లో మహిళలు తమ హక్కుల కోసం గొంతెత్తడంతో ఇది ప్రారంభమైంది. తమపై అణిచివేత, తమకు జరుగుతున్న అన్యాయాలపై ఆనాడు 15 వేల మంది మహిళలు న్యూయార్క్‌ నగరంలో పెద్ద ప్రదర్శన జరిపారు. సరైన వేతనాలు ఇవ్వాలని, ఓటింగ్‌ హక్కులు కావాలని, పనిగంటలు తగ్గించాలని గొంతెత్తి గట్టిగా అడిగారు. ఈ పోరాటం జరిగింది మార్చి 8వ తేదీనే. తర్వాత రెండేళ్ళకు మళ్ళీ 1910లో రెండో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగింది. అప్పటి నుంచీ దఫదఫాలుగా మహిళలు తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తర్వాత ఏడాది కొన్ని దేశాలు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి. 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం ప్రారంభించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్నే అమెరికా మహిళలు సమ్మెకు దిగారు. ఇదే ఇప్పుడు సంచలన విషయంగా మారింది. అమెరికా, ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో మహిళల శక్తి, ప్రాధాన్యతల గురించి చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమ్మెను చేపట్టారు అక్కడ మహిళలు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు జరుగుతున్న ఆర్థికపరమైన అన్యాయాలను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం. పురుషులతో పోలిస్తే మహిళలకు వచ్చే వేతనాలూ చాలా తక్కువ ఉంటున్నాయని ఈ సమ్మె నిర్వాహకులు చెప్పారు. మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అతి పెద్ద కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు సమానత్వం అందాలంటే చకోర పక్షిలా ఎదురు చూడాల్సిందే. ఇది తాజానివేదికలు, సర్వేల్లో తేలినఅంశం. శ్రామిక మహిళల్లో సగానికి సగం మంది మహిళలకు అసలు వేతనాలే అందడం లేదు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. విశ్వవ్యాప్త భూమిలో మహిళలకు సొంతమైనది కేవలం 20 శాతం మాత్రమే. స్కూళ్ళు, కార్యాలయాలు, పని చేసే ప్రాంతాలు ఎక్కడ చూసినా మహిళలపై వివక్షే.
ఆర్థిక స్వేచ్ఛ హుళక్కే!
మహిళలపై అణిచివేత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తే చాలు. మహిళలు చాలామంది నేడు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేయక తప్పడం లేదు. అయినా వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. కన్నీళ్ళని కళ్ళలోనే దాచుకునే మహిళలు ఎందరో. ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగినా, మహిళలకు ఎన్ని పథకాలువచ్చినా వాటిఫలాలు వారికి అందుతున్నాయా? ఇది ఆలోచించాల్సిన విషయమే. మహిళలను గౌరవించడం అనేది ముందు ఇంటినుంచే ప్రారంభం కావాలి. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి పరిఢవిల్లుతుంది అన్నారు మన పెద్దలు. ఇది జరుగుతోందా! ఆచరణలో కనిపిస్తోందా!
ఆరోగ్యాన్నీ పట్టించుకోని మహిళలు
పిల్లలకు, భర్తకు కావలసినవి సమకూరుస్తూ, వాళ్ళు తిన్నారో లేదో చూస్తూ వారికి అన్ని అమరుస్తుంది. కానీ తన గురించి తాను పట్టించుకోదు. అందర్నీ ఎవరి విధుల్లోకి వాళ్ళని పంపిన తరువాత తనుకూడా తినీ తినకుండానే ఉద్యోగానికి బయలుదేరే వారి సంఖ్యే ఎక్కువ. ఆఫీసుకు వెళ్ళిన తరువాత విధులలో నిమగ్నమవుతుంది. సాయంత్రం ఇంటికి వస్తూనే పిల్లలు, భర్త సరిగా తిన్నారో లేదో అని ఆలోచిస్తుంటుంది. పిల్లలకు స్కూల్లో ఇచ్చిన హోంవర్కులను పూర్తి చేయిస్తుంది. ఒక ఉపాధ్యాయినిలా వారికి సలహాలు ఇస్తుంది. వారిలో ఉండే లోపాలను సరిచేస్తుంది. చాలామంది మహిళలు తమ కుటుంబాలకు ఇచ్చిన ప్రాధాన్యతను వారి ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. ఇటీవల జరిపిన సర్వేల ఫలితంగా తేలినదేమంటే మహిళలు ఎక్కువగా పోషకాహార లేమిని ఎదుర్కొంటున్నారు. కేన్సర్‌, గుండెపోటు లాంటి భయంకర రుగ్మతల బారిన పడుతున్నారు. ఏం సాధించాలన్నా, ఎలాంటి పోరాటాలు చేయాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ముందు ఆరోగ్యంపై దృష్టిపెట్టండి. హక్కుల్ని సాధించుకోవాలంటే శారీరక బలంతో పాటు మానసిక బలమూ కావాలి. ఇంటాబయటా హక్కుల కోసం నిలబడండి. సమానత్వ సాధన కోసం ఉద్యమించండి. మహిళా దినోత్సవ స్ఫూర్తిని ఆ ఒక్కరోజు కాదు ఎప్పుడూ కొనసాగించండి. మహిళా దినోత్సవం అంటే….ఆటలు, పాటలు, వేడుకలతో సరిపెట్టేయడం కాదు. మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం నిలబడడం. మహిళలపై వివక్ష, అణిచివేత లేని సమాజం కోసం పోరాడడం! దాన్ని అందుకోవడం! సమానత్వాన్ని సాధించడం దిశగా పోరాడుతూనే హక్కులను సాధించుకోవాలి. ఇదే లక్ష్యంగా మహిళలంతా ముందుకు సాగాలి. పోరాడితే పోయేదేమీ లేదుగా!
విశాలాంధ్ర మహిళా డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img