Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పోలవరం ఎత్తు తగ్గితే, అపార నష్టం

అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుండి 135 అడుగులకు అంటే 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలపై నీళ్ళు చల్లినట్లుగా ఈ చర్య ఉన్నది. ఒకరిపై ఒకరు చెప్పుకొని రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేక సాగిలపడుతున్నది. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నది. పార్లమెంటులో 28 మంది యం.పి.ల మద్దతు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతున్నది.
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు. 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి పైగా తాగునీరు విశాఖ పట్నానికి చెందిన వివిధ పరిశ్రమలకు నీరు అందించడం జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చెయ్యడం ద్వారా యావత్‌ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లోని సాగును క్రమబద్ధీకరించడం జరుగుతుంది. నిత్యం కరువు కాటకాలకు గురయ్యే వెనకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకు నికర జలాలు అందించటానికి ఆధారమౌతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు.
నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పార్లమెంటు సాక్షిగా ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చు భరించాలని నిర్ణయించడం జరిగింది. తదుపరివచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటానికి తెలంగాణాకు చెందిన 7మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చెయ్యడం జరిగింది. ఈ 7 ముంపు మండలాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉన్నది. ఈ మండలాల్లో 2 లక్షల ఎకరాలకు పైగా పంట భూములు నీట మునుగు తున్నాయి. 2 లక్షలకు పైగా కుటుంబాలవారిని వేరేచోటకు తరలించాల్సిన అవసరం ఏర్పడిరది. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. వారికి ఆర్‌.ఆర్‌. ప్యాకేజీ ద్వారా నష్టపరిహారం, ఇండ్ల నిర్మాణం, యువకులకు ఉద్యోగ కల్పన తదితరాలకు 33 వేల కోట్లకు పైగా నిర్వాసితులకు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేశారు. గత ప్రభుత్వంలో ఒక ఎకరానికి 1లక్షా 15 వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించారు. తదుపరి వచ్చిన ప్రభుత్వం 10 లక్షలకు పైగా పెంచడం జరిగింది. మొదట తీసుకున్న వారికి ఇది వర్తించదన్నారు. అందువల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో కూడా కనీసఅవసరాలు కానీ, ఉపాధిపనులు కానీ కల్పించ నందువల్ల ఇది నిర్వాసితులకు ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది.
201011 సంవత్సరాల వ్యయ అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 16 వేల కోట్లుగా లెక్కించారు. 201314 నాటికి 33 వేల కోట్లకు పెరగగా ఇప్పుడది 56 వేల కోట్లకు చేరింది. దీనిని కేంద్రానికి చెందిన డి.పి.ఆర్‌. ఆమోదించడం జరిగింది. రాష్ట్రప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టినందువల్ల ఇకనుండి అయ్యే మొత్తం ఖర్చును నూటికి నూరుశాతం కేంద్రమే భరిస్తుందని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పిస్తున్నది. విద్యుత్‌ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును భరించలేమంటున్నారు. నిర్వాసితుల ఖర్చు మినహాయిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం 56 వేల కోట్ల నుండి 30 వేల కోట్లకు కుదించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎత్తును 45.72 మీటర్ల నుండి 41.15మీటర్లకు తగ్గించనున్నారు. దానివల్ల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 190 టియంసిల నుండి 80 టియంసిలకు పరిమితం చేస్తామంటున్నారు. అలాగే 41.15 మీటర్ల లోపు మునిగే ప్రాంతాలలో వున్న నిర్వాసితులకు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ఎత్తు తగ్గించబోమని 45.72 మీటర్లు కడతామని, కానీ నీటి నిల్వను 41.15కు పరిమితం చేస్తామంటున్నారు. మిగిలింది తర్వాత పూర్తిచేస్తామంటున్నారు. ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలుగా చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాపితంగా 26 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టును రక్షించు కోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరిపై ఎంతైనా ఉన్నది. రాజకీయాల కతీతంగా యావత్‌ రాష్ట్ర ప్రజలు ఒక తాటిపై వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలి. దానికోసం రైతులు, వివిధ వర్గాల ప్రజలు అందరూ కలిసి బలమైన ఐక్య ఉద్యమానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ఎఐకెఎస్‌ అధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img