Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతికూలతల మధ్య కేంద్ర బడ్జెట్‌

కోవిడ్‌-19 అసాధారణ పరిస్థితుల్లో ఏర్పడ్డ తీవ్ర అడ్డంకుల మధ్య రెండు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ రెండూ ఆర్థిక వ్యవస్థను తిరిగి సత్వరమే కోలుకోడానికై భారీగా పెంచిన పెట్టుబడి వ్యయం, బడుగు ప్రజలకు అందించిన సాయం దోహదపడ్డాయి. మరోపక్క 2020-21లో అధికస్థాయిలో నమోదైన 9.2శాతం ద్రవ్యలోటు ఈ రెండేళ్ళలో కొంత తగ్గినప్పటికీ ఇంకా పెరుగుతోంది. దేశీయంగా ఆర్థికవ్యవస్థ కొంత కోలుకున్నప్పటికీ బాహ్యరంగం దీనికి భిన్నంగాఉంది. ఈ రంగంలో ఎదురవుతున్న వివిధ సవాళ్ళే దీనికి నిదర్శనం. రేపటి బడ్జెట్‌ రూపకల్పనలో వీటి ప్రభావం ఎంతో కొంతఉంటుంది. ఒక వైపు అభివృద్ధిని పరుగులెత్తించడం, మరోవైపు ద్రవ్యలోటును పరిమితంచేయడం కేంద్ర విత్తమంత్రి పరిస్థితి రెండు వైపుల కట్టిన తాడుపై నడిచే కసరత్తే.
ఎన్‌ఎస్‌ఓ అంచనా ప్రకారం, సాధారణ వృద్ధిరేటు 2023-24లో 15.4శాతం నుంచి 10శాతానికి తగ్గవచ్చునని పేర్కొంది. స్థూల పన్నుల ఆదాయం 9.4శాతం పెరుగుతుందని ఆర్‌బిఐ, ప్రభుత్వ రంగసంస్థలు, జాతీయబ్యాంకుల ఆదాయం పెరుగుదల పరిమితంగా ఉంటుందని పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ, పెద్ద సంస్థల అమ్మకాలపై వచ్చే ఆదాయం, మార్కెట్‌పై ఆధారపడివుంటుందని అంచనా వేసింది. పన్నుల ఆదాయం, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే మొత్తం 2022-23లో కన్నా 2023-24లో 8 నుంచి 9 శాతం పెరగొచ్చని పేర్కొంది. బడ్జెట్‌ వ్యయంలో ఎనిమిదవ వంతు ఆక్రమిస్తున్న ఆహారం, ఎరువులపై ఇచ్చే రు.5లక్షల కోట్ల నుండి రు.3.7 లక్షల కోట్లకు తగ్గిస్తున్నందున ప్రభుత్వ ఆదాయం, వ్యయం పెరుగుదల 2023-24లో 3శాతం తగ్గుతుంది. దీని వలన ఎక్కువ నిధులు ఉత్పాదక కార్యక్రమాలపై వెచ్చించడానికి వీలు కల్గుతుంది. పెట్టుబడి వ్యయం 2022-23లో ప్రతిపాదించిన రు7.5 లక్షల కోట్ల నుంచి వచ్చే ఏడాది 8.5 నుండి 9 లక్షల కోట్లకు పెరగవచ్చని తద్వారా 10శాతం కన్నా హెచ్చు ఉంటుందని అంచనా వేసింది. రహదారుల నిర్మాణం, రైల్వేలు, పట్టణ మౌలికవసతులు విద్యుత్‌పై అధిక కేటాయింపులుంటాయి. ద్రవ్యలోటు 2022-23లో ఆశించిన రు17.5 లక్షల కోట్ల నుంచి 2023-24లో స్వల్పంగా రు17.3లక్షల కోట్లకు పరిమితమవుతుందని, ఫలితంగా 2022-23కి అంచనా వేసిన 6.4 శాతం నుంచి 2023`24లో 5.8 శాతానికి తగ్గుతుందని తెలిపింది.
భారత్‌కు సేవారంగం ముందంజలో ఉండి దేశఆర్థికవ్యవస్థను బలోపేతం చేసింది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని సేవారంగానికి ధీటుగా తేవాలనే సంకల్పంతో మొదటిసారిగా ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇదిగాక ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం, ఆత్మ నిర్బర్‌ భారత్‌, నూతన పరిశ్రమలకు పన్ను రాయితీలు ప్రకటన వంటి వాటితో పారిశ్రామిక రంగాన్ని ఇతోధికంగా పటిష్టం చేయనుంది. మరోపక్క జీడీపీలో మూడోవంతు ఆక్రమించిన ఎంఎస్‌ఎంఈలకు ఏటా బడ్జెట్‌ సమయంలో అనేక రాయితీలు, పథకాలు ప్రకటించడం జరుగుతోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే కార్మికశక్తిలో కేవలం పురుషులే కాకుండా మహిళల వాటా పెంచాలి. పనిముట్ల సాయంతో కాకుండా సమాచార విజ్ఞానాన్ని ఉపయోగించే దిశగా, బ్లూకాలర్‌ కార్మికశక్తి స్థానంలో గ్రే కాలర్‌ అంటే ఒక రంగంలో నిష్ణాతులైన కార్మికశక్తిని వినియోగించే దిశగా, పారిశ్రామికరంగాన్ని 5.0 ప్రపంచపటంలో ఒక ఆకర్షణీయ రంగంగా తీర్చదిద్దడానికి అడుగులు వేయాలి.
పన్నుల విధానం మార్చాలి
ఈ సారైనా బడ్జెట్‌ 2023-24 పన్నుల విధానాన్ని పటిష్టం చేయాల్సిన అవసరముంది. పన్ను ఎగవేతదారులు, బ్లాక్‌మార్కెట్‌లో వాణిజ్య కార్యకలాపాలు చేసేవారిని, కృత్రిమ కొరత సృష్టించేవారిని, స్పెక్యులేటర్లను, కమీషన్‌ ఏజెంట్లు, స్థిరాస్థి వ్యాపారస్థులు, బడా వ్యవసాయ రైతులు, ఫిల్మ్‌రంగ వ్యక్తులు, ఇన్‌వాయిస్‌ తక్కువ చూపించే వర్తకుల వంటి వారిపై నిఘాపెట్టి వారి ఆదాయాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. జీయస్‌టీ ఎగవేత అనేక రకాలుగా జరుగుతుంది. సరుకులు సరఫరా చేయకుండా నకిలీ ఇన్వాయిస్‌ జారీ చేయడం, తద్వారా ఇన్‌ పుట్‌ టేక్స్‌, క్రెడిట్‌ క్లైం చేయడం, ఈ-వే బిల్లు గడువులోపు ‘‘రౌండ్‌- ట్రిప్పింగ్‌’’ ముఖ్యంగా రవాణా దూరం తక్కువగా ఉన్నపుడు పాల్పడడం వంటివి కొన్ని మచ్చుతునకలు. మొత్తం పన్నుఆదాయంలో అత్యల్ప వాటా కల్గివున్న వేతన-ఉద్యోగులను పన్నుచెల్లింపు ప్రక్రియ నుంచి తొలగించాలి. అత్యధిక శ్రమతో కూడిన వీరి పన్నులు లెక్కింపు ఆదాయపు పన్నుశాఖ సిబ్బందికి పని భారం తగ్గుతుంది. ఒక వేళ ఇది వీలుకాకపోతే, వీరికి చెల్లిస్తున్న రిటైర్మెంట్‌, పెన్షనుపైనా ఆదాయపు పన్ను మినహాయించాలి. పన్నులు ఏటా పెరుగుతున్నా, దేశ జీడీపీలో పన్నుల వాటా ఉండవలసిన 15శాతం కన్నా తక్కువగా ఉంటోంది. 2018-19లో ఇది 11శాతం నుంచి 2019-20లో 9.9శాతానికి దిగజారి, 2020-21లో స్వల్పంగా 10.2 శాతానికి పరిమితమైంది. 2021-22లో ఇది 10.8శాతంగా ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ వర్ధమాన దేశాల సగటు 21శాతం ఓఈసీడీ దేశాల సగటు 34శాతం కన్నా తక్కువ.
ప్రధాని మోదీ 2022-47 కాలాన్ని అమృతకాలంగా వర్ణించారు. ఈ కాలంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన ఆశయం. దీనికిగాను సామాజిక, మౌలిక వసతులపై ఇతోధికంగా వెచ్చించాల్సిన అవసరముంది. ఇందుకు అవసరమమైన ధనాన్ని రుణాలు, పన్నులు రూపంలో కేంద్రం సిద్దం చేయాలి. పన్నుల ఎగవేత భారత్‌లో సర్వసాధారణం. పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం ద్వారా 13,331 కోట్లు, ఆల్కహాలు బెవరేజెస్‌ ద్వారా రు 15,262 కోట్లు పన్ను ఏటా ఎగవేస్తున్నారని ఫిక్కీ నివేదిక పేర్కొంది. మొత్తం పన్ను ఎగవేతలో ఇది 49శాతం. దేశంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అయిదు లక్షలకు పైగా ఆదాయం గల వారు కేవలం 1.46 కోట్లు మంది మాత్రమే కాగా దేశంలో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనదారుల సంఖ్యతో పోలిస్తే ఈ రెండిరటి మధ్య చాలా తేడా కనబడుతోంది. బడ్జెట్‌లో దీనిపై దిద్దుబాటు చర్యలు ఎంతైనా అవసరం. చట్టాల్లో ఉన్న లోపాలను, లొసుగులను అవకాశాలుగా తీసుకోవడంతో బహుళ జాతీయ సంస్థలు 2020-21లో సర్కారు రు75,00 కోట్ల పన్ను ఆదాయంను కోల్పోయింది. రాబోయే ఏడాది నుండి పి.యం. కిసాన్‌ కింద అర్హులైన రైతులకు మూడు వాయిదాల్లో చెల్లిస్తున్న రు.6000 లను మరో రు.2000 పెంచి నాలుగు వాయిదాలలో చెల్లించే ఆలోచన కేంద్రం చేస్తుంది. ఇది కార్యరూపం దాల్చితే బడ్జెట్‌ వ్యయం, ద్రవ్యలోటు ఆమేరకు పెరగక తప్పదు.

  • డా. యస్‌.వై విష్ణు. సెల్‌ : 9963217252.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img