Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచీకరణ ` విద్యారంగ సంక్షోభం

షేక్‌ కరీముల్లా

ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు, మందుగుండు సామగ్రి లాంటివి అవసరంలేదు. నాసిరకం విద్యను అందిస్తే చాలు ఆ దేశం దానంతట అదే పతనం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన బ్రిటీష్‌ వారు సుసంపన్న భారతీయ చరిత్ర, సంస్కృతిని నాశనం చేయటానికి మెకాలేని నియమించారు. మెకాలే భారతదేశం నలుమూలలా తిరిగి ఈ దేశాన్ని మనం జయించలేమని, భారతీయ సంస్కృతి, మానవీయ సంబంధాలు గొప్పవని బ్రిటీష్‌ పార్లమెంటుకు ఉత్తరం రాసాడు. నివ్వెరపోయిన బ్రిటీష్‌ ప్రభుత్వం చేసిన సూచనతో మెకాలే 1834 నుండి వారికి అవసరమైన గుమస్తాలను తయారు చేసే ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. స్వాతంత్య్రానంతరం కూడా మెకాలే విద్యా విధానమే అమలవుతున్నది. ఫలితంగా నేడు భారతదేశం పతనం అంచున నిలబడి ఉంది. బ్రిటీష్‌ వారి లక్ష్యం నేడు నెరవేరింది. 74 ఏళ్ల స్వాతం త్య్రానంతరం కూడా భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, అవసరా లకు అనుగుణంగా దేశం అభివృద్ధికి సమగ్ర ప్రజాతంత్ర విద్యావిధానం రూపొందించి అమలుపరచలేదు. దీని ఫలితమే నేటి ఈ దుస్థితి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేళ్లకే సార్వత్రిక విద్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఏలికల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో ఉంటుంది. ఈ విషయం వారికి బాగా తెలుసు కాబట్టే ప్రజలను జ్ఞానవంతులు కానివ్వరు. మరోవైపు కులం, మతం, మూఢభక్తిని పెంచుతూ ప్రజలలో అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తారు.
ఏ పాలకులైనా ఓటు బ్యాంకు కోసం ఉచిత పథకాలు చాలా ఇస్తారు. మంచి విద్యను మాత్రం ఇవ్వరు. ఎందుకంటే విద్య జ్ఞానాన్ని పెంచి ప్రశ్నలు జనించేలా చేస్తుంది. విద్య, వైద్యం, న్యాయం ప్రజలకు ఉచితంగా అందిస్తే చాలు. మరేవీ ఉచితంగా ఇవ్వనవసరం లేదంటారు అంబేద్కర్‌. నేడు దేశం అభివృద్ధి చెందకపోవటానికి అసలు కారణం ఇదే అని ప్రజలు గుర్తించాలి. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం జాతీయం చేసి ఉచితంగా అందించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి పెద్ద ఎత్తున రావాలి. అసలు తరగతి గదిలో ఏం జరుగుతోంది. భావి పౌరులు అక్కడ ఏం చేస్తున్నారు? అనేవి సమాజానికి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ప్రస్తుత మన సమాజం ఈ ప్రశ్నల గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనబడటం లేదు. దీని ఫలితంగా భావి పౌరులు, ఈ సమాజం పెద్ద మూల్యాన్నే చెల్లిస్తున్నది. ఎంతో నష్టం జరుగుతోంది. 1991 నుంచి దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు ముఖ్యమైన, అత్యంత మాన వీయ అవసరాలైన విద్య, వైద్య రంగాలను అంగడి సరుకును చేసి, వ్యాపారంగా మార్చేశాయి. అప్పటి నుండి విద్యారంగం సంక్షోభంలో చిక్కుకుంది. పాలకుల విధానాలు ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి. మానవజాతి సుదీర్ఘ కాలం అనుభవ సారంతో సాధించుకొన్న విజ్ఞానం, సంస్కృతి, నాగరిక ఫలాల వారసత్వాన్ని భావితరాలకు విద్య రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ పరిజ్ఞానాన్ని నిర్దిష్ట ధరకు అమ్మటం అంటే ఆ వ్యవస్థ పతనం అయిందని అర్థం. విద్యను కొనలేని బడుగు, బలహీన వర్గాల పిల్లలే దీనికి బలి పశువులవుతున్నారు. సిలబస్‌ మార్పు, పుస్తకాల మార్పు, విద్యా విధానాల మార్పు అంటూ హడావిడి చేయటం తప్ప ప్రజలకు మంచి నాణ్యమైన విద్యను అందిం చటం లేదు. ఫలితంగా అందరికీ విద్య ఓ మిథ్యగానే నేటికీ మిగిలిపోయింది.
దేశం ప్రపంచ బ్యాంకు కబంధ హస్తాలలోకి వెళ్లిపోయింది. ప్రపంచ బ్యాంకు నుండి దేశంతో బాటే రాష్ట్రాలు కూడా అప్పులు తెచ్చుకుంటు న్నాయి. ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో విధానాలు రూపుదిద్దుకొంటున్నాయి. నేటి వరకు అమలయిన విద్యారంగ పథకాలన్నీ ప్రపంచ బ్యాంకు అధికారులు రూపొందించినవే. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో దేశం, రాష్ట్రాలలో కొన్ని అనుత్పాదక పథకాలు అమలవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చే టప్పుడు కొన్ని షరతులు పెడుతుంది. వాటితో మన జీవితాల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తోంది. ప్రపంచ బ్యాంకుకు కావలసింది మన మార్కెట్‌ వ్యవస్థ మీద నియంత్రణ. స్వాతంత్య్రానంతరం ప్రజలు కష్టపడి నిర్మించుకున్న రోడ్లు, రైల్వేలు, బ్యాంకులు, విమానయానం, కమ్యూనికేషన్స్‌, ఎల్‌ఐసీ, విశ్వవిద్యాలయాలు, విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు అన్నీ ప్రైవేటుపరం చేయమంటుంది. ఇవాళ బరితెగించి మరీ మోదీ ప్రభుత్వం ఈ పని చేస్తోంది. దీని ప్రభావం ప్రజల మీద చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మానవీయ విలువలు పూర్తిగా నశించి, మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోతాయి. ఇది నేడు రుజువైన వాస్తవం. తాజాగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభ్యసన పరివర్తన సహాయ పథకం (ఎస్‌ఎఎల్‌టి) మొదలైందనీ, ఇది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు అని, ఈ పథకానికి 1860 కోట్ల రూపాయలు బ్యాంకు అందిస్తున్నదని, ఈ ప్రాజెక్టుతో ఆంద్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖా మాత్యులు గొప్పగా మీడియాతో చెప్పారు. అలాగే జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడి, చేయూత, దీవెన లాంటి ఉచిత నగదు పంపిణీ ఓటు బ్యాంకు పథకాలు ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో రూపుదిద్దుకొన్నవే. ఈ పథకాలు ప్రజలకు ఉపాధి కల్పించి శాశ్వతంగా జీవన ప్రమాణాలు పెంచేవి కాదు. ప్రపంచ బ్యాంకు అప్పు… ప్రధాన రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు లాంటి రంగాల అభివృద్ధికి, ఉత్పత్తిని పెంచ టానికి ఇవ్వరు. పైపెచ్చు తెచ్చిన అప్పులకు వడ్డీ వసూలు చేస్తుంది. ప్రపంచ బ్యాంకు కబంధ హస్తాలలో చిక్కుకున్న ఏ దేశమైనా దివాళా తీయక తప్పదు. వెనుకబడిన దేశాల చరిత్ర దీనిని రుజువు చేసింది.
కరోనా మూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం గందరగోళంలో పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు విద్యా విషయ కంగా బాగా వెనుకబడిపోయారని సర్వేలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇంగ్లీషే సర్వరోగ నివారిణి అంటూ మెకాలే ఆంగ్ల విద్యా విధానాన్ని ఒకటవ తరగతి నుండే ప్రవేశపెట్టింది జగన్‌ ప్రభుత్వం. ప్రాచీన చరిత్ర సుసంపన్న సాహిత్యం కలిగి దేశంలో 9 కోట్ల మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాష సమాధి అవుతుంది. ఒక భాష చనిపోతే ఆ జాతి చనిపోయినట్లే. మాతృభాష లేకుంటే ఆ జాతికి మిగిలేది ఏముంటుంది? తెలుగును పాలనా భాషగా చేసి, ప్రపంచంలోని జ్ఞానాన్ని తెలుగులోకి అనువాదం చేసుకొంటే సరిపోతుంది. పాలకులకు ఈ విషయం బాగా తెలుసు. కానీ అర్థం కాని చదువులతో ప్రజలు అజ్ఞానులుగా బతకాలి. ఈ గందరగోళం ఇలా ఉంటే అతి ప్రమాదకరమైన విద్యావేత్తల, మేధావుల విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం`2020ని జగన్‌ ప్రభుత్వం అమలు చేయటానికి కంకణం కట్టుకొంది. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయటానికి ఇంతవరకూ పూనుకోలేదు. అలాంటిది బీజేపీ, ప్రపంచ బ్యాంకు మెప్పు కోసం జగన్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయటానికి పూనుకుంది. ఈ విధానాల వలన సుమారు 34,000 పాఠశాలలు మూసి వేయనున్నారు. 10,000 ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోనున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే వెనుకబడిన బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరమవుతారు. శాస్త్రీయతే పునాదిగా ప్రజల అవసరాలు, భారతీయ సామాజిక భౌగోళిక అంశాల ఆధారంగా విలువలతో కూడిన ప్రజాతంత్ర విద్యా వ్యవస్థను స్థాపించాలి. అంతరాలు లేని కొఠారి కమిషన్‌ సూచించిన కామన్‌ స్కూల్‌ విధానాన్ని అమలు చేయాలి. కెజి నుండి పీజి వరకు విద్య ప్రభుత్వరంగంలోనే కొనసాగాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
వ్యాస రచయిత సెల్‌ : 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img