Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రస్తుతం కామన్‌ స్కూళ్లే శరణ్యం!

ఈ సమస్యలన్నింటికి పరిష్కారం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్లుగా తిరిగి విద్య మొత్తంగా ప్రభుత్వరంగంలోనే ఉండాలి. కామన్‌ స్కూలు విధానంతో అందుబాటులో ఉండే పాఠశాలనే దీనికి చక్కని శాస్త్రీయ పరిష్కారం. ఎలాగో ప్రభుత్వరంగంలో ఆంగ్ల మాధ్యమం కూడా ఉంది కాబట్టి, ఎంచక్కా పిల్లల్ని అందుబాటులోని ఆవాస ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకే తల్లిదండ్రులు పంపించాలి.

డా॥ లచ్చయ్య గాండ్ల

గత ఏడు దశాబ్దాలుగా విద్యారంగంలో పోగుపడిన సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జఠిలమై చిన్నారులకు ఉరితాళ్లుగా మారాయి. పరిమాణాత్మకంగా విద్యాలయాల సంఖ్య గణనీయంగా పెరిగినా, గుణాత్మకంగా విద్యారంగం సామాజిక వికాస హేతువుగా ఎదగలేక పోయింది. దీనికి గత, ప్రస్తుత పాలకు లెంత కారణమో, ఈ రంగంలో ప్రధాన భూమికను పోషించే ఉపాధ్యాయ వర్గం, వీరిని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నసంఘాలు అంతే కారణం! ఇక తల్లిదండ్రులది, బుద్ధి జీవులది, మేధావులది అంటీ ముట్టని వ్యవహారమే! దాదాపు గత సంవత్సరన్నర కాలంగా, పిల్లలు ఇంటికే పరిమితమై బాహ్య సమాజానికి దూర మయ్యారు. దీంతో విద్యతోపాటు అందాల్సిన సామాజికపరిజ్ఞానం పిల్లలకు అందకుండాపోయింది. గోరుచుట్టుపై రోకటిపోటులా, మూడో తరంగం ముప్పు ముంగిట తచ్చాడుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. మొదట్లో ఆన్‌లైన్‌ తరగతులు మురిపించినా, అవి నిజమైన విద్యాబోధన సూత్రాలకు విరుద్ధ మని తేలిపోయింది. ఉపాధ్యాయుడు లేని తరగతి గది ఎంత దండగ మారిదో యావత్‌ ప్రపంచానికి అనుభవంలోకి వచ్చింది. చివరికి పిల్లలే ఈ విషయాన్ని గుర్తించి పాఠశాలలు తెరిస్తే బరబర పోవాలనే సంసిద్ధతతో ఉన్నారు. అయితే ఇది ఊహించినంత సులభమైనది కాదనే గుబులు, భయం తల్లిదండ్రుల్ని వెంటాడుతుంటే, పాఠశాలల్ని, కళాశాలల్ని తెరిస్తే ఎలాంటివిపత్తును..తిరిగి ఎలాంటి నిందారోపణల్ని ఎదుర్కోవలసి వస్తుందో ననేది ప్రభుత్వాల భయం. విద్యాలయాల పనితీరు వల్ల పిల్లలకు ప్రాణహాని కలిగితే, ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలన్న సుప్రీంకోర్టు హెచ్చరిక ఆశనిపాతంలా ఉంది. ఈ దశలో కామన్‌స్కూలు విధానం మంచిది.
ఏ సమస్యకైనా కొన్ని పరిష్కారాలు, ఉపశమనాలుంటాయి. కాబట్టి, కరోనా నేపథ్యంలో పిల్లల విద్యారంగ సమస్యలకు పరిష్కారం ఆలోచించాలి. దీనికై విద్యార్థులు ప్రాథమికంగా ఎదుర్కొనే మౌలిక సమస్యల మూలాలు తెలియాలి. విద్యార్థుల ప్రాథమిక సమస్య.. ‘వారికి అందుబాటులో పాఠశాల’ ప్రధానమైంది. నిజానికి 80 శాతానికి పైగా ఆవాస ప్రాంతాలకు ప్రభుత్వ బడులు అందుబాటులోనే ఉన్నాయి. గతంలోలాగా, ఈ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, దూరపు కొండలు నునుపు అన్నట్లుగా, ప్రయివేట్‌ విద్య ఆడంబరంగా మారి, విద్యార్థులు సుదూర ప్రాంతాల పాఠశాలలకు బలవంతంగా వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ విద్య అంటరానిదిగా మారింది. ఇందుకు ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఆంగ్ల మాధ్యమం. దీన్ని నిలువరించలేని పాలకులు నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ప్రభుత్వ రంగంలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఏకంగా తెలుగు మాధ్యమానికి మంగళమే పాడారు. చివరికి గ్రామీణ స్థాయిలోనూ దాదాపు 60 శాతం మంది పిల్లలు ఈ ప్రయివేటు రుగ్మతకు గురవుతున్నారు. దీంతో ఉదయం 9గం॥లకు ప్రారంభమయ్యే పాఠశాలకు 7గం॥లకే తయారై వెళ్లాల్సి వస్తుంది. సుమారుగా గంట సమయాన్ని ప్రయాణానికే వెచ్చించాల్సి వస్తున్నది. ఇది ఎన్ని రకాల సమస్యలకు కారణమౌతోందో ప్రతి తల్లిదండ్రికి తెలుసు. ఇది కేవలం ఆర్థిక సమస్యే కాదు, పిల్లలపై ఒత్తిడి పెరిగి శారీరక, మానసిక సమస్యలకు దారి తీసింది.
ఈ సమస్యలన్నింటికి పరిష్కారం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్లుగా తిరిగి విద్య మొత్తంగా ప్రభుత్వరంగంలోనే ఉండాలి. కామన్‌ స్కూలు విధానంతో అందుబాటులో ఉండే పాఠశాలనే దీనికి చక్కని శాస్త్రీయ పరిష్కారం. ఎలాగో ప్రభుత్వరంగంలో ఆంగ్ల మాధ్యమం కూడా ఉంది కాబట్టి, ఎంచక్కా పిల్లల్ని అందుబాటులోని ఆవాస ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకే తల్లిదండ్రులు పంపించాలి. సర్వశిక్షాభియాన్‌ వచ్చిన తర్వాత భౌతిక సదుపాయాలు, తరగతి గదుల కొరత దాదాపుగా తగ్గిపోయింది. నిజానికి ఉపాధ్యాయుల సంఖ్య కూడా బాగానే ఉంది. పిల్లల సంఖ్య తగ్గడంతో రేషనలైజేషన్‌ పేరున ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయడం, ఏర్పడిన ఖాళీలను నింపకపోవడం జరిగింది. ప్రజలు తలచుకుంటే, ఈ సమస్యల్ని అధిగమించడం పెద్ద సమస్య కాదు. గతంలో గ్రామ ప్రజలు ఈ విషయంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్న చరిత్ర ఉమ్మడి ఎపి రాష్ట్రంలో ఉంది.
అమ్మ ఒడి పథకం ద్వారా ఏపి, ఏటా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వాల ద్వారా మెరుగైన పాఠశాల వ్యవస్థను రూపొందించుకోవచ్చు. దీనికి తోడు విద్యాసెస్‌ ద్వారా సమకూరుతున్న డబ్బును కేంద్రం ద్వారా పొందవచ్చు. గతంలో స్థానిక సంస్థల కనుసన్నల్లో విద్యారంగం చక్కగా నడవటం తెలిసిందే! ప్రయివేటీకరణ మహమ్మారి చివరికి గ్రామీణ స్థాయి సమాజాన్ని కూడా ప్రభుత్వ బడులకు దూరం చేసింది. దీన్ని తిరిగి గాడిలో పెట్టాలి. కాబట్టి పౌర సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయస్సును కాంక్షించే ఉపాధ్యాయ సంఘాలు తిరిగి ఈ విధానం కోసం ఒత్తిడి తెచ్చి ఆచరించేలా చూడాలి. నిజానికి ఉపాధ్యాయ వర్గం జవాబుదారీతనం వహిస్తే ఇది సులభతరమే కాక, ప్రయివేట్‌రంగం కనుమరుగవుతుంది.
ఈ విధానంలో పిల్లలకు ఆవాస ప్రాంతాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా పాఠశాలలు అందుబాటులో ఉంటాయి. రమారమి ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉండగా, సెకండరీ పాఠశాల 35 కి.మీ దూరంలోపే ఉంటుంది. దీంతో పిల్లలు పాఠశాల సమయానికి కొంచెం ముందు బయలుదేరి నడుచుకుంటూ పాఠశాలకు పోగలరు. ప్రయాణ సమస్య ఉండదు, భౌతిక దూరం పాటించగలరు. అలాగే ఉపాధ్యాయులు ఆవాస ప్రాంతాల్లో లేదా సుమారు 35 కి.మీ పరిధిలోనే ఉండగలగాలి. ఇలా ఉంటే, విద్యార్థుల స్థితిగతులు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల జీవన విధానం విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలవడంతో ఇరువర్గాల మధ్యన అవినాభావ సంబంధం మెరుగుపడుతుంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు ఒకరివి ఒకరికి తెలుస్తాయి. కాబట్టి చికిత్సలు సులభమవుతాయి.
దీనికి తోడు పాఠశాల నిర్వహణను కాలానుగుణంగా మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలు సులభంగా నడవగలిగితే, సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ విధానాల్ని అవలంబించాలి. దీనికై తల్లిదండ్రుల, స్థానిక యువజన సంఘాల సభ్యుల, పౌర సమాజం సహకారంతో ఉపాధ్యాయులు పాఠశాల అవసరాల్ని, పిల్లలకు అనుగుణంగా పొందవచ్చు. ఈ విధానం గతంలో మెండుగా ఉండేది. ఇప్పటికి చాలా ఆవాస ప్రాంతాల్లో దాతలు, విదేశాల్లో ఉన్నవారు సహకరించి అభివృద్ధి చేస్తున్నది చూస్తూనే ఉన్నాం. వీరి సహకారంతో, ప్రభుత్వ డబ్బుతో లేదా తల్లిదండ్రులు తమ పిల్లలకై కడుతున్న ప్రయివేట్‌ ఫీజులో కనీసం పదిశాతాన్ని ప్రభుత్వ పాఠశాలలపై ఖర్చు చేసుకున్నా ప్రభుత్వ పాఠశాలల్ని మరింతగా మెరుగుపరచవచ్చు.
వ్యాస రచయిత డైట్‌ అండ్‌ ఎస్‌ఎఓ అధ్యక్షులు, 9440116162

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img