Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం

ఎస్‌.టి.జి.శ్రీధర్‌
బలమైన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య మనుగడకు వెన్నెముక అని ఒకపక్క గంభీరమైన ప్రకటనలు చేస్తూ మరో వైపు నుంచి ప్రతిపక్షాలను సమూలంగా భూస్థాపితం చేయడానికి అత్యంత నైపుణ్యంతో పావులు కదుపుతున్న భార తీయ జనతా పార్టీ అధినాయకత్వం తన లక్ష్యసాధనలో మరో అడుగు ముందుకు వేసింది. తాము చేస్తే సంసారం పక్క వాడు చేస్తే వ్యభిచారం అన్న నానుడిని రుజువు చేస్తూ బీజేపీ అధినాయకత్వం చాప కింద నీరు లాగా పావులు కదిపి మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. తన చేతికి మట్టి అంటకుండా తనపై ప్రత్యర్థులు దుమ్మెత్తి పోయకుండా చూసుకుంటూ మహా రాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వాన్ని అత్యంత చాకచక్యంగా కూల్చేసింది. ఇదే ప్రక్రియను కాంగ్రెస్‌ చేసి ఉంటే ఈపాటికి వీధులకెక్కి పెద్ద ఎత్తున గొడవ చేసి అల్లకల్లోలం సృష్టించి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ కానీ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా వ్యవహరించవలసిన పత్రికలు గాని నోరు విప్పడానికి సాహ సించటం లేదు. 1984, 1994లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం వెన్నుపోట్లకు గురై ఎన్టీఆర్‌ పదవీచ్యుతులయ్యారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు అతి తక్కువ మంది శాసనసభ్యుల మద్దతుతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్ర య్యారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నెల రోజులపాటు జరిగిన ఆందో ళనలో పత్రికలు, ప్రతిపక్షాలు కీలక పాత్ర వహించాయి. 1994లో ఎన్టీఆర్‌ సొంత అల్లుడే ఆయనకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇటు పత్రికలు, అటు ప్రతిపక్షాలు 1984లో జరిగిన ఉద్యమాన్ని తిరిగి నిర్వహించడంలో విఫల మయ్యాయి. నేడు మహారాష్ట్రలో చరిత్ర పునరావృతమైంది. 39 మంది శాసన సభ్యుల అండతో ఏక్‌నాథ్‌ షిండే అనే శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు ప్రకటించి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అయ్యారు. షిండేకు కొండంత అండగా బీజేపీ తెరవెనక నుంచి పూర్తి మద్దతు అందజేసింది. తిరుగుబాటు శాసనసభ్యులను రెండు రాష్ట్రాలు తిప్పి తిరిగి ముంబాయి తీసుకురావడంలో బీజేపీ నాయకులదే ముఖ్య భూమిక. ఇందుకు అయిన ఖర్చు అంతా ఎవరు భరించారో అందరికీ తెలుసు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని చెప్పటానికి అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన సంఘటనలే సజీవ ఉదాహరణలు. తాము ఏ ప్రభుత్వాన్నీ కూలతోయలేదని, నాయకత్వంతో సరిపడక బయటకు వచ్చిన అసమ్మతి వాదులకు మద్దతు ప్రకటించామని బీజేపీ చెప్పుకొస్తోంది. మహారాష్ట్రలో 2019 ఎన్నికలలో బీజేపీ, శివసేన కలిసే పోటీ చేసాయి కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలు పొత్తు చీలికకు దారితీసాయి. అధిక స్థానాలు సాధించిన శివసేన మరో రెండు పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుండీ బీజేపీ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాచుక్కూర్చుంది. ఠాక్రే ప్రభుత్వం పరస్పర వైరుధ్య కారణా లతో తనకు తానుగా కూలిపోతుందని బీజేపీ నాయకులు అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని రుజువు చేసే తీరులో ఠాక్రే వ్యవహరించారు. కుమారుడైన ఆదిత్య ఠాక్రేని మంత్రివర్గంలోకి తీసుకుని పెద్ద తప్పిదం చేశారు. ఆదిత్య ఠాక్రే కీలక మంత్రిత్వ శాఖలలో వేలు పెట్టడం ముఖ్యమైన ఫైళ్లను తన పరిశీలనకు పంపవలసినదిగా జారీ చేసిన ఆదేశాలు మంత్రివర్గంలో కలకలం లేపాయి. ముఖ్యంగా తిరుగుబాటు నాయకులు షిండే ఈ మొత్తం వ్యవహారా లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సమయం చూసి షిండే దెబ్బతీశారు. రాజకీయాలలో ఆరితేరిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా అసమ్మతి కార్యకలాపాలను పసిగట్టలేకపోయారు. తండ్రి బాల్‌ ఠాక్రేతో పోల్చి చూసుకుంటే ఉద్ధవ్‌ ఠాక్రే అన్ని విషయాలలో బలహీనుడు. తండ్రి చాటు బిడ్డగా ఎదిగాడే తప్ప సొంతంగా తనదైన రాజకీయ వ్యూహాన్ని, నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయాడు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ఆయన కార్యా లయంలో ఇన్నర్‌ సర్కిల్‌గా ఏర్పడిన ముగ్గురు అధికారులు, కొడుకు ఆదిత్య ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి నడిపించి ముఖ్యమంత్రిని ఉత్సవ విగ్రహంగా నిలబెట్టారు. ముఖ్యమంత్రి కూడా శాసనసభ్యులను కలవటానికి ఇష్టపడేవారు కాదు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. వీటితోపాటు శివసేన హిందుత్వ సిద్ధాంతానికి దూరమైం దన్న అభిప్రాయం ఉంది. అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్‌సిపి, కాంగ్రెస్‌ లను దూరం చేసుకోవడం ఇష్టం లేక ముఖ్యమంత్రి హిందుత్వ సిద్ధాంతాన్ని నీరు కారుస్తున్నారని తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే బహిరంగంగా ఆరోపించిన సంగతి విదితమే.
మహారాష్ట్ర మరాఠీ వారికే అన్న భూమిపుత్రుల సిద్ధాంతం, హిందుత్వకు వేసిన పెద్దపీటతో ఆ రాష్ట్రంలో శివసేనను బలమైన శక్తిగా మార్చారు బాల్‌ ఠాక్రే. దక్షిణ భారతదేశానికి చెందిన అనేకమంది మహారాష్ట్రకు వలస వచ్చి తమ వారికి లభించవలసిన ఉద్యోగాలను తన్నుకు పోతున్నారని బాల్‌ ఠాక్రే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. 1966లో ఆవిర్భవించిన శివసేన ధాటికి దక్షిణ భారతదేశానికి చెందిన అనేకమంది తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లి పోయారు. పంచకట్టుతో కనిపించిన ప్రతి ఒక్కరికి శివసేన సైనికులు దేహశుద్ధి చేసేవారు. బాల్‌ ఠాక్రే ఇచ్చిన పిలుపు అరాచకానికి దారితీసింది. కానీ రాజకీయంగా శివసేన పటిష్టమైన స్థితికి చేరుకోవడానికి దోహద పడిరది. శివసేన ధాటికి కాంగ్రెస్‌ మట్టి కరిచింది. బాల్‌ ఠాక్రే ఉన్నంతకాలం శివ సేనకు అడ్డు లేకుండా పోయింది. 2012వరకు బాల్‌ఠాక్రేకు పార్టీలో ఎదురు లేదు. ఆయన మేనల్లుడు రాజ్‌ ఠాక్రే మొదటిసారిగా తిరుగుబాటు చేశారు. అంతకుముందు నారాయణ రాణే పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. అప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం మొదలైంది. తండ్రి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ పగ్గాలను స్వీకరించిన తర్వాత శివసేన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలైంది. బీజేపీ మహారాష్ట్రలో బలీయమైన శక్తిగా ఆవిర్భవించింది.
ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్షకు ఒకరోజు ముందే పదవికి రాజీనామా చేశారు. అంతకంటే ఘోరంగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి రాజ కీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బల పరీక్షకు సిద్ధమై విధానసభ వేదికగా ఇటు బీజేపీ నుంచి అటు తన సొంత సభ్యుల నుంచి ఎదురైన వెన్నుపోట్ల పర్వంపై విరుచుకుపడి ఉంటే ప్రజల్లోకి బలమైన సందేశం వెళ్లి ఉండేది. ఉద్ధవ్‌ ఠాక్రే ఈ అవకాశాన్ని జార విడుచుకున్నారు. శివసేన భవితవ్యం ఇప్పుడు నాలుగు రహదారుల కూడలి మధ్య నిలిచి ఉంది. శివసేన ఎన్నికల చిహ్నం భవితవ్యం కూడా ప్రశ్నార్థకమే. ఎన్టీఆర్‌ను చంద్రబాబు దెబ్బతీసి అధికారాన్ని, పార్టీని హస్తగతం చేసుకున్నప్పుడు ఎన్నికల చిహ్నంతో పాటు పార్టీ నిధులు కూడా బాబు పరమయ్యాయి. ఇదే ప్రక్రియ ఇప్పుడు షిండే పరంగా జరుగుతుందా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలలో జాతీయ పార్టీల మాదిరి ఒక విధానం, అంతర్గత ప్రజాస్వామ్యం పుటం వేసినా కనిపించవు. అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత హయాంలో నోరు విప్పడానికి అందరూ భయపడేవారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ నాయకత్వం ముందు అందరూ దాసానుదాసులే తప్పించి మాట్లాడటానికి సాహసించేవారు ఎవ్వరూ లేరు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను కలవడానికి శాసనసభ్యులు నానాగడ్డి కరవవలసి వస్తుందని విమర్శలు ఉన్నాయి. పనిచేసినా చేయక పోయినా చంద్రబాబు శాసనసభ్యులను అడపా తడపా కలుస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలలో ఈ ప్రక్రియ ఏ కోశానా కనిపించడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న ఉద్ధవ్‌ ఠాక్రే అనుభవాలు ప్రాంతీయ పార్టీల అధినేతలకు కనువిప్పు కావాలి.
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img