Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బెలూన్లకు మార్గదర్శి అమెరికా

సత్య

తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్‌ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపలేదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరించింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసింది. ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసి ప్రపంచానికి నేర్పింది అమెరికానే. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, వాటిపై సినిమాలుతీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిన చిత్రాల సంగతి తెలిసిందే. ఆ గ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాసలేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు.
ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లోలేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తాము సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు అప్గానిస్థాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలుఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారంచేసి రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, వారిని అణచివేసి, చివరికి వారితోనే రాజీ చేసుకున్న సంగతి తెలిసిందే. వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించి నట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలి తీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి. పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హోవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తనదగ్గర ఎంత ప్రమాదకరఅస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్థించు కొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడు. స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికివచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది. అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారుచేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికాను ఢీ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా కాస్త పైచేయిగా ఉంది. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు. యుద్ధ విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేందుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘా కెమెరాలను కూడా పెడతారు. 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడు తున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘాకోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలువెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ. మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారిమళ్లించ కుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాలవిమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉంది. 1962లో భారత్‌చైనా యుద్దం తరువాత చైనామీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ`భారత గూఢచారసంస్థ ప్రతి నిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పనిచేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసింది. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితరప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. బెలూన్‌ ఉదంతంమీద అమెరికా చేసిన రచ్చ దానికే ఎదురుతన్నింది. ట్రంప్‌ హయాంలో అమెరికా గగనతలం మీద చైనాబెలూన్లు కనిపించినా కూల్చివేతవంటి పనులకు పాల్పడలేదు. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చచేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాలప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img