Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భవిష్యత్‌లో అమృతం కొనుక్కోవచ్చు…!

బండారు రాధాకిృష్ణ

మనదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం మరోమారు దేశ ప్రజల్ని మాటలతో మాయచేసి మంత్రముగ్దుల్ని చేసే ప్రయత్నమే. రాబోయే 25 సంవత్సరాలు అమృతకాలమట. ఇప్పుడు తాగటానికి నీరు కొనుక్కుంటున్నాం గదా, యిక ఆ కాలంలో ఏకంగా అమృతమే కొనుక్కోవచ్చు. ఒకసారి అబద్దం ఆడవచ్చు, ఒకసారి మోసం చేయవచ్చు కానీ ఎల్లకాలం మోసం చేయలేరని ఒక మేధావి అన్నట్లు భారత ప్రజల్ని ఎల్లకాలం అబద్దాలతో మోసం చేయడమంటే కుదరదని మోదీ తెలుసుకుంటే మంచిది. నల్లధనం బయటకు లాగి ఒక్కో ఇంటికి 15 లక్షలు పంచుతానని ఊరించాడు. నల్లధనం సంగతి అలా ఉంచితే అదే కార్పొరేట్లకు విశాఖ స్టీలు ప్లాంటు లాంటి పరిశ్రమలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగు లుండరన్నారు. పట్టణవాసులకు ధీటుగా అన్ని సౌకర్యాలు పల్లెలకు కలుగ చేస్తానన్నారు. గత ఏడు సంవత్సరాలుగా ప్రజల్ని మాటలతో ఊరించడం తప్ప అవి ఆచరణకు నోచుకున్న పాపాన పోలేదు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న తాను చేసిన వాగ్దానాలు ఆయన మరచిపోయినా ప్రజలు మరచిపోతారని భావిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం అవే వాగ్దానాలతో ప్రజల్ని ఊరించే ప్రయత్నం చేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచాయి. తెల్లవాళ్లను తరిమికొట్టి వందల సంవత్సరాల దాస్య శృంఖలాలు తెంచుకున్నామని సంబరాలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం సంబరాలే తప్ప తెల్లవాళ్ల పాలనకు మన పాలనకు తేడా కన్పించక సామాన్యుడు తెల్లముఖం వేసుకుని టీవీ ముందు కూర్చుంటున్నాడు. ఇప్పటికీ రోడ్లు, రవాణా సౌకర్యం లేని పల్లెలు అనేకం ఉన్నాయి. మనల్ని మనమే పరిపాలించుకుంటున్నామని, ప్రజలే ప్రభువులని ఎన్నో చెప్పుకున్నాం. తెల్లదొరల కాలంలో బానిస బతుకు కన్నా హీనంగా మన నాయకులు ప్రభువులై సామాన్యుల్ని నోరు విప్పనివ్వని నియంతలుగా మారారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకుంటున్నాంగాని ప్రశ్నించిన వాడికి లాఠీలు సమాధానం చెప్పే ప్రజాస్వామ్యమిది. ఆనాడు యిల్లు వదలి స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. కాని ఆనాడు జరిగిన జలియన్‌వాలాబాగ్‌ లాంటి మృత్యుహేల గురించి తెలియని మన నాయకులు వినాయకులుగ మారి ప్రజలు చెమటోడ్చి పన్ను రూపంలో కట్టిన సొమ్ము మింగి నయా జమీందారులుగా మారు తున్నారు. దోచుకున్న డబ్బుతో ఓట్లు కొని గద్దెనెక్కి మరల దోచు కోవడానికి అలవాటుపడి ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష నాయకులను జైౖలుపాలు చేస్తున్నారు. ప్రశ్నించాలనే ఆలోచన రానీయ కుండా చేసేందుకు తమని అనుసరించి తమలాగ సంపాదించుకోమని యువతకు సంకేతాలిస్తున్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డ యువత అటువంటి నాయకులకు వందిమాగదులగా తయారవుతున్నారు.
సమాజానికి అన్నం పెట్టే రైతులు తమకు నష్టం కలిగించే చట్టాలను ఉపసంహరించుకోమని నెలల తరబడి పోరాటం చేస్తుంటే వారిని విధ్వంసకులని ఒక కేంద్రమంత్రి అనడం శోచనీయం. స్వాతంత్య్రం వచ్చింది యిందుకేనా అని రైతులు వాపోతున్నారు. దేశంలో ఎక్కువ జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి హాని తలపెట్టే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందో మోదీ చెప్పాలి. వివిధ మతాలు, కులాల సమాహారం మన భారతదేశం. కాని మోదీ ఒకే జాతి, ఒకే దేశం అని ఈ మధ్య కొత్త నినాదం మొదలుపెట్టారు. దేశం ఎలాగో ఒకటే.. కాని వివిధ మతాలు, వివిధ సంస్కృతులతో సమైక్యంగా జీవనం సాగించే ప్రజలు ఒకే జాతి ఎలా అవుతారో మోదీ చెప్పాలి. మతాలే కాదు వివిధ కులాలు కూడ కలిసి మెలిసి బతకనీయకుండా రాజకీయాలు చేస్తున్నారు. మతాల వారీగ కులాల వారీగ పార్టీ టికెల్లు కేటాయించి అదే రీతిలో పదవుల పంపకం చేస్తూ అన్నదమ్ముల్లా కలిసి గ్రామాల్లో బతుకుతున్న వారిలో రాజకీయ కుంపట్లు రగిల్చి ఒకే నేషన్‌ అనడంలో ఔచిత్యం ఏమిటో ప్రధాని సెలవియ్యాలి. ప్రభుత్వం మాది అనే మాట ప్రజలు పూర్తిగా మరిచిపోయేలా చేశారు. పాలకులు పీఠాధిపతులకు, స్వాముల వార్లకు ప్రజల ఆస్తులైన విలువైన భూములు ధారాదత్తం చేసి ప్రజల్ని మూఢ భక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికైనా అనవసరపు వాగ్దానాలతో కార్పోరేట్ల కోసం పని చేయకుండ పీడిత తాడిత బలహీన వర్గాల అవసరాలు తీర్చే ఆలోచన చేసి వాగ్దానాలు చేస్తే భరతజాతి సంతోషిస్తుంది.
వ్యాస రచయిత సీనియరు జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img