Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

భూకంప మృత్యుకేళి

ఫిబ్రవరి 6 వ తేదీ ఉషోదయాన జరిగిన భయంకర భూకంప మృత్యుకేళితో టర్కీ, సిరియా నగరాలు (అలెప్పో, హామా లాంటి) విలవిల్లాడడం, పేక మేడల్లా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం కావడం, శిథిలాల దిబ్బలుగా మారడం, వేల కొద్ది జనులు శిథిలాల కింద పడి తుది శ్వాస విడవడం చూస్తుండగానే జరిగిపోయింది. ప్రసార మాధ్యమాల్లో వీడియోలు చూసిన ప్రపంచ మానవాళి నివ్వెరపోయింది. కొద్ది గంటల్లోనే రిక్టర్‌ స్కేలు పై 7.8, 7.6. 6.0 పరిమాణంతో మూడు సార్లు భూమి కంపించడంతో దక్షణ-కేంద్ర టర్కీ ప్రాంతంలో గాజియన్టెక్‌ నగరంతో పాటు మరో 10 నగరాల్లో భవనాలు (రోడ్లు, నివాస భవనాలు, కార్లు, వాహనాలు, షాపింగ్‌ మాల్స్‌, విమానాశ్రయాలు) పూర్తిగా నేల మట్టం కావడం లేదా పాక్షికంగా ధ్వంసం కావడంతో రెండు మిలియన్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. తొలి భూకంప విపత్తు తరువాత కనీసం 40 సార్లు భూమి కంపించడంతో టర్కీ, సిరియాలు గజగజ వణికిపోతూ, ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్ల వెంట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నిస్సహాయంగా పరుగులు తీసారు. గత వందేళ్ళలో ఇంతటి భూకంపం రాలేదని గాజియాన్టెక్‌ నగరానికి 33 కిమీ దూరంలో 18 కిమీ లోతులో భూకంప ప్రభావ కేంద్రం కనిపించడంతో గజియాన్టెక్‌ నగరంలోని 2,200 ఏళ్ళ క్రితం నాటి రొమన్‌ కాలపు చారిత్రక కట్టడం కూడా పూర్తిగా ధ్వంసం అయింది.
భూకంపాలకు నెలవుగా మారిన టర్కీ ఒక్క 2000 సంవత్సరంలోనే 33,000 భూకంపాలు రికార్డు అయ్యాయని, ఇందులో రిక్టర్‌ స్కేలు పై 4.0 పరిమాణంతో 332 సార్లు కంపించిందని అంచనాలున్నాయి. టర్కీ దేశం భూకంపాల ముప్పు ఉన్న టెక్టోనిక్‌ ప్రదేశంగా గతంలోనే గుర్తించారు. భూమి అంతర్భాగంలో ఉన్న 15 ముఖ్య ఫలక పొరలను టెక్టోనిక్‌ ఫలకాలు(ప్లేట్స్‌)గా పిలుస్తారు. ఈ కదిలే స్వభావం కలిగిన ఫలక పొరల మధ్య రాపిడితో పగుళ్ళు, ఆకస్మిక కదలికలతో అపార శక్తి వెలువడడం వల్ల భూకంపాలు వస్తున్నట్లు ఆర్కియాలజీకల్‌ సర్వేలు వివరిస్తున్నాయి. యురాసియన్‌, ఆఫ్రికన్‌ ప్లేట్స్‌ మధ్య చీలిక ఏర్పడిన అనటోలియన్‌ టెక్టోనిక్‌ ఫలకాల్న(ప్లేట్స్‌) ఉన్న ప్రాంతంలో టర్కీ ఉన్నది. యురాసియన్‌, అనటోలియన్‌ టెక్టోనిక్‌ ఫలకాలు కలిసే ప్రదేశమైన ‘నార్థ్‌ అనటోలియన్‌ ఫాల్ట్‌ లైన్‌’ వద్ద భూకంప విధ్వంసం అధికంగా కనిపిస్తున్నది. పేదరికం రాజ్యమేలుతున్న టర్కీ, సిరియాల్లో అంతర్గత అశాంతి మంటలతో ప్రజలు అభద్రతల నడుమ బిక్కు బిక్కున బతుకులు ఈడుస్తున్నారు. సిరియాలో అంతర్గత యుద్ధం, టర్కీలో 30 లక్షలకు పైగా సిరియన్‌ శరణార్థుల చేరడం, భవనాలు బలహీనంగా నిర్మించడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు భూకంప నష్టాలను అనేక రెట్లు పెంచాయని నిపుణులు చెప్తున్నారు.
ఫిబ్రవరి 03 శుక్రవారం రోజున ‘ఫ్రాంక్‌ హూగర్‌బీడ్స్‌’ అనే డచ్‌ పరిశోధకులు టర్కీ, జోర్డన్‌, లెబనాన్‌, సిరియా ప్రాంతాల్లో 7.5 రిక్టర్‌ స్కేలు కలిగిన తీవ్ర భూకంపం సమీప భవిష్యత్తులో రావచ్చని ట్వీట్‌ రూపంలో హెచ్చరించడం నేడు చర్చనీయాంశంగా మారింది. ఈ భూ ప్రళయం తరువాత కూడా వెంటనే తిరిగి భూకంపాలు రావచ్చని, ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండాలని కూడా ఫ్రాంక్‌ హూగర్‌బీడ్స్‌ సలహాలు ఇవ్వడాన్ని పెడచెవిన పెట్టరాదని చెప్తున్నారు.
మధుపాళి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img