Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భూతాపం జీవకోటికి ప్రమాదకరం

మానవ ప్రేరేపిత అనాలోచిత విశృంఖల విధ్వంసక చర్యల కారణంగా ప్రమాదకర వాతావరణ మార్పులు జరిగి ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయని వాతావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వాల బృందం(ఐపిసిసి) తన నివేదికలో హెచ్చరించింది. ప్రపంచ దేశాలు సత్వరమే తగు చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో అతి తీవ్రమైన వాతావరణ దుష్ప్ర భావాలను ఎదుర్కోవలసి వస్తుందని నివేదిక స్పష్టం చేస్తున్నది. వాతావరణ ప్రతికూల మార్పులు జరిగినపుడు జీవవైవిధ్యంతో పాటు పర్యావరణ సమతుల్యత, భూగోళ సహజత్వం పట్టుతప్పి మానవాళి సాధారణ జీవనవిధానం ప్రశ్నార్థకం కానుందని పర్యావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులే కొనసాగితే రానున్న రెండు దశాబ్దాలలో భూతాపం1.5 – 2.0 డిగ్రీల సెల్సియస్‌ పెరుగు తుందని, దీనితో కోలుకోలేని దుష్ప్రభావాలు మానవాళిని వెంటాడు తాయని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికను 195 దేశాల సభ్యులు ఆమోదించి, శాస్త్రీయ సూచనలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన అతి పెద్ద విశ్లేషణలో ఐపిసిసి అధ్యయనంలో 67 దేశాలకు చెందిన 270 మంది పర్యావరణ శాస్త్రజ్ఞులు, 675 మంది పర్యావరణ హితవరులు, 34,000 రెఫరెన్సులు, 62,418 మంది అభిప్రాయాల్ని సేకరించారు. అనాలోచిత, స్వార్థపూరిత మానవ ప్రేరేపిత చర్యలతో వేడిగాలి తరంగాలు(హీట్‌ వేవ్‌), కరువుకాటకాలు, వరదలు ఆసాంతం పెరిగి వృక్ష, జంతు జాతుల మరణాలు అధికం అవుతాయని తెలుస్తున్నది. దీనికి తోడు ఆసియా, ఆఫ్రికా, దక్ష్షిణ అమెరికా ప్రాంతాల మిలియన్ల మానవాళికి తీవ్ర ఆహార కొరత, నీటి ఎద్దడి, అనారోగ్యం, ఆకలిచావులు పెరుగు తాయని ఈ నివేదిక కఠిన వాస్తవాన్ని బహిర్గత పరిచింది. ఇలాంటి అవాంఛనీయ మార్పులను కట్టడి చేయడానికి కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్‌ హౌజ్‌ వాయువులను కట్టడి చేయడం, పర్యావరణ హిత ఇంధన వాడకాలను ప్రోత్సహించడం సత్వరమే చేపట్టాలి.
వాతావరణ ప్రతికూల మార్పులవల్ల కలిగే ప్రమాదాలను సరిచేయడం మన చేతుల్లో ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులతో జీవరాశులకు కనీస అవసరాలైన ఆహారం, నీరు, గూడు, ఆరోగ్యం సమకూరి జీవవైవిధ్యం నెలకొంటుంది. విశృంఖల పట్టణీ కరణ, సామాజిక అసమానతలు, ప్రకృతి విపత్తులు, మహమ్మారి ప్రళయాలు వాతావరణ మార్పులతో సన్నిహిత సంబంధాలను కలిగి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. శాస్త్రసాంకేతికతతో స్వదేశీ స్థానిక ఆలోచనలు జోడిరచి సుస్థిరాభివృద్ధి దిశగా ముందుకు అడుగులువేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతానికి పైగా జనాభా నగరాలలో ఉండడంతో నగర వాతావరణ మార్పుల ప్రభావం, అనుసరణ, దుర్బలత్వాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ మార్పులతో వేడిగాలులు, తుఫానులు, కరువులు, వరదలు, సముద్ర మట్టాలు పెరిగితే మానవ జీవితాలు జీవనోపాధి, ఆరోగ్యం, మౌలిక వనరులు, స్థిరాస్తులు, ఇంధన లభ్యత, ప్రజారవాణ లాంటివి ప్రభావితం అవుతూ పేదరికం,నిరుద్యోగం రాజ్యమేలుతాయి. వాతావరణ ప్రతికూల మార్పుల నియంత్రణకు హరిత పర్యావరణ హిత గృహ నిర్మాణాలు, సురక్షిత నీటి సరఫరా, పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణహిత ప్రజారవాణ నెలకొల్ప వలసి ఉంటుంది. హరిత గృహ వాయు ఉద్గారాలు రోజురోజుకు పెరిగి మనిషి ‘పెనం లోంచి పొయ్యిలో పడుతున్నాడని’ అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, అవసరమైన ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయ ధృడసంకల్పం, సమర్థవంతమైన భాగస్వామ్యం లాంటివి మాత్రమే వాతావరణ సానుకూల మార్పులకు దోహదపడతాయి. వాతావరణ మార్పులతో సహజంగానే జీవరాశులు కూడా ప్రభావితం అవుతాయి. మానవ ప్రేరేపిత దుశ్చర్యలతో ఇతర జీవరాశులు, పర్యావరణాలకు శాపంగా మారుతున్నాయని, భవిష్యత్తు తరాల ఆరోగ్యకర మనుగడకు సానుకూల వాతావరణాన్ని ఇవ్వడం మన కనీస బాధ్యత. వాతావరణ మార్పులతో నేల ఎడారీకరణ, అటవీవిస్తీర్ణం, పొడినేలలు, పర్వతాలు, జీవవైవిధ్యం ప్రభావితం అవుతాయి. ప్రపంచ మానవాళి వాతావరణ ఆరోగ్యాన్ని కాపాడుతూ, భవిష్యత్తుతరాలకు నివాసయోగ్య భూగ్రహాన్ని బహుకరిద్దాం, శాస్త్రజ్ఞుల హెచ్చరికలకు అనుగుణంగా సమాధానాలను వెతికి, గుర్తించి ఆచరణలో పెడదాం.
డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img