Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భూ పంపిణీ పునరుద్ధరించాలి

డా.సోమ మర్ల

భారతదేశంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి సొంత భూమి అత్యంత కీలకమైంది. దేశానికి బ్రిటీషు వలసపాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలకాలం గడిచింది. అయినప్పటికీ నేటికీ భూస్వామ్యవర్గాల అధీనంలోనే అత్యధిక భూ కమతాలున్నాయి. రైతు కుటుంబాలకు చెందిన సన్నకారు రైతులు, భూమిలేని రైతులు 80శాతం మంది ఉన్నారు. పేదరికం నిర్మూలనకు, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు ఎక్కువ మంది రైతులకు భూములు లేకపోవడం పెద్ద అడ్డంకి. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు భూమి, ఆహారం మార్కెట్‌లో విక్రయించే వస్తువులుగా మారిపోయాయి. స్వాతంత్య్రం వచ్చినవెంటనే జమిందారీ వ్యవస్థను రద్దుచేసి భూ సంస్కరణలు ప్రతిపాదించారు. భూమిలేని సన్నకారు రైతులకు భూము లివ్వాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేశారు. అయితే భూ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలు జరగలేదు. 1960లలో వచ్చిన హరితవిప్లవం ఆహార ఉత్పత్తిని పెంచింది. అయితే ఇది సన్న, చిన్నకారు రైతులు, సంపన్నులైన రైతులమధ్య అసమానతలు పెంచింది. దేశంలో చాలావేగంగా భూ సంస్కరణలు తిరోగమనం పట్టాయి. సీపీఐ నాయకత్వంలో తెలంగాణలో మహత్తర రైతాంగ పోరాటం, తిభగ (పశ్చిమబెంగాల్‌) ఉద్యమం 1950లలో జరిగాయి. ఈ రాష్ట్రాల్లో భూస్వాముల అధీనంలో ఉన్న దాదాపు పదిలక్షల ఎకరాల భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేశారు. 1960లలో, 1970లలో అలిండియా కిసాన్‌సభ(ఏఐకెఎస్‌) భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌లు(బికెఎంయు) నాయకత్వంలో మిలిటెంట్‌పోరాటాలు జరిగాయి. ఫలితంగా భూ సంస్కరణలు ప్రధాన అజెండాగా ప్రధానస్రవంతిలోకి వచ్చాయి. ఈ పోరాటాల కారణంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్కరణల అమలును మళ్లీ పరిగణలోకి తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టం చేశాయి. భూ పరిమితిని విధించి భూస్వాముల నుండి కొంతభూమిని స్వాధీనం చేసుకున్నారు. చాలా నామమాత్రంగా చట్టం అమలైంది. సింహ భాగం భూములు అత్యధిక సంపన్న, మధ్య తరగతి రైతుల అధీనంలోనే ఉండిపోయాయి. వివిధరాష్ట్రాల్లో భూ సంస్కరణలఅమలు విఫలంకావడంతో గ్రామాల్లో పేదరికం, నిరుద్యోగ సమస్యలు ఎక్కువభాగం పరిష్కారం కాలేదు. 2020 నాటికి 82.2శాతం చిన్న, సన్నకారు రైతులు రెండు హెక్టార్లలోపు సొంతభూములు కలిగిన వాళ్ల్లున్నారు. వీరికి 47.3శాతం పంట భూము లున్నాయి. తక్కిన 52.7శాతం భూములు అతికొద్దిమంది పెద్ద భూస్వాములు, మధ్యతరహా రైతుల చేతుల్లోనే ఉన్నాయి.
తెలంగాణలో భూ సంస్కరణలు(పంట భూములపై పరిమితి) చట్టం1973 ప్రకారం పంట భూములపై పరిమితి (భూదాన భూములు సహా) విధించి మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. కేవలం 2.1శాతం పంట భూములను మాత్రం భూమిలేని పేద రైతులకు పంపిణీ చేశారు. అయితే ఈ భూముల్లో అత్యధికం భూస్వాములు చేతుల్లో ఉండటం లేదా న్యాయపరమైన చిక్కులు, నిరంకుశ అధికార యంత్రాంగం కారణంగా ప్రతిష్టంభన ఏర్పడిరది. ఈ విధంగా భూమిలేని రైతులకు పంపిణీ లక్ష్యం అపరిష్కృతంగా ఉండిపోయింది. జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎఫ్‌) ప్రకారం పంజాబ్‌, బిహార్‌లలో 80శాతం భూమి పదిశాతం పెద్దపెద్ద భూస్వాములు చేతుల్లో ఉండగా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌లలో 55శాతం సాగుభూమి, 10శాతం భూస్వామ్య కుటుంబాల అధీనంలోనే ఉంది. దేశంలో 4.9శాతం పెద్ద రైతుల చేతుల్లో 32శాతం సాగుభూమి ఉంది. సన్నకారు రైతుకంటే పెద్దరైతుకు 45రెట్లు ఎక్కువగా భూమిఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిలేని రైతులు 40లక్షలమంది (56.4శాతం)ఉన్నారు. పంటలు పండే మొత్తం భూమిలో 82శాతం సారవంతమైన, సాగుచేసుకునే భూమి అతిపెద్ద భూస్వామ్య రైతుల చేతుల్లో ఉంది. అదేసమయంలో సన్న, చిన్నకారు రైతుల పరిధిలో తక్కువ సారవంత మైన, అత్యధికభాగం వర్షాధారపంటలు పండేభూమిఉంది. భూములు కోల్పోయిన రైతులు వ్యవసాయ కూలీలుగా మారారు. వ్యవసాయం భారమైపోవడంతో ఎరువులు, డీజిలు, విత్తనాల ధరలు భారీగాపెరిగి వాటిని భరించలేక వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు. గింజల వ్యాపారంచేసే పెద్ద కంపెనీలు, మార్కెట్‌శక్తులు చిన్నరైతులను దోచుకోవడం పెరిగిపోయింది. మరోవైపు పండిన పంటకు కనీస మద్దతుధర రాక గిట్టుబాటు కావడంలేదు. దీనితో చిన్నరైతులు అప్పుల పాలవుతున్నారు. అంతేకాదు వాతావరణ మార్పుల కారణంగా పంటలు సరిగా పండక దివాలా తీస్తున్నారు. నయా ఉదారవాద నమూనా అభివృద్ధి ఉపకరణాల సరఫరా, భూ యాజమాన్యం, మార్కెటింగ్‌, పంపిణీ విషయాలలో వ్యవసాయాధారిత వ్యాపారంచేసే బడా వాణిజ్యవేత్తలు గుత్తాధిపత్యం సంపాదించారు. కార్పొరేట్‌ వ్యవసాయం ఇందుకు సాధనంగా ఉపయోగపడిరది. 2014లో చేసిన భూ సేకరణచట్టం, మూడు వ్యవసాయచట్టాలు సన్నకారు, చిన్న రైతులను వ్యవసాయం నుంచి బైటకు పంపేందుకు ఉద్దేశించినదే. సగటు వ్యవసాయ కుటుంబాల నెలసరి నికరాదాయం 201819లో కేవలం 8337 రూపాయలు మాత్రమే. సాగు వలన వచ్చే ఆదాయంకంటే ఇతర విధాలుగా పనులుచేసి తెచ్చుకునే ఆదాయం ఎకరానికిలోపు ఉండే రైతు కుటుంబాలకు ఎక్కువగా ఉంటోంది. పంటఉత్పత్తి స్థానంలో వ్యవసాయఉత్పత్తి కుటుంబాలకు ఇతరపనులు చేయడంవల్ల లభించే వేతనాలే ప్రధాన వనరుగా ఉంటోంది. వ్యవసాయ కుటుంబాలు దినసరి వేతనాలు పొందడమేకాక, పశుపోషణ, కోళ్లపెంపకం తదితరమార్గాల్లో ఆదాయం పొందుతున్నారు. ఆదాయం తగ్గిపోవడం, వైద్యం, పిల్లల విద్యకు చేసే ఖర్చు పెరిగిపోయి అప్పులపాలై భూములు కూడా కోల్పోతున్నారు. వీరి దగ్గరనుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లేదా పెద్ద కార్పొరేషన్లు, లేదా భూస్వాములు భూమి కొనుగోలు చేస్తున్నారు.
2001 గణాంకాల ప్రకారం భూమి కలిగిన రైతులు 1273 లక్షలమంది ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం భూమిగల రైతుల సంఖ్య 86 లక్షలకు పడిపోయింది. భూమిలేని, సన్నకారు రైతులు కౌలు రైతులుగా మారి పోయారు. తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో కౌలు రైతుల సంఖ్య దాదాపు 40శాతం ఉంది. కౌలు రైతులకు ప్రధానమంత్రి సమ్మాన్‌, రైతుబంధు, విత్తనాలు ఎరువులకు సబ్సిడీలు పంట నష్టానికి పరిహారం తదితర ప్రయోజనాలను కౌలురైతులకు తిరస్కరిస్తున్నారు. ఇతరరైతుల మాదిరిగానే కౌలు రైతులు భూమి సాగుచేయడానికి అధికంగా వ్యయం చేస్తున్నారు. వచ్చిన ఆదాయంలో దాదాపు సగం భూ యజ మానులకు చెల్లించడానికి సరిపోతుంది. సాగుచేసిన కౌలురైతుకు చాలా తక్కువ ఆదాయం వస్తుంది. రైతు వ్యతిరేక నయా ఉదారవాద సంస్కరణలు రైతుల ఆత్మహత్యలకు దారితీసాయి. గత రెండుదశాబ్దాల కాలంలో 3.5లక్షల మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వ్యవసాయ కార్య కలాపాలలో దాదాపు 60శాతం మంది మహిళా రైతులు పనిచేస్తున్నారు. అయితే 12శాతం మహిళా రైతులకు మాత్రమే సొంతభూమి ఉంది. పురుషులకంటే వీరు శ్రమచేసిపొందే ఆదాయం 30శాతం తక్కువగా ఉంది. కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో భూపంపిణీ జరిగింది. అలాగే జమ్ముకశ్మీర్‌లో కూడా జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలలో సీపీఐ, ఏఐకెఎస్‌, బికెఎంయూ సంఘాలు భూ ఆక్రమణ పోరాటాలు నిర్వహించగా భూసంస్కరణలు పాక్షికంగా అమలయ్యాయి. జమిందారీ, ఫ్యూడల్‌ భూస్వాములు సీలింగ్‌ తరువాత 68.72లక్షల ఎకరాల మిగుల భూమి ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ పాక్షికంగా భూ సంస్కరణలు అమలు చేశారు. చిత్తశుద్ధితో భూసంస్కరణల అమలు జరగకపోతే గ్రామాలలో నిరుద్యోగం, పేదరికం, నిర్మూలన సాధ్యంకాదు. సాగుచేసే రైతుకు వ్యవసాయభూమి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img