Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంచిబుద్ధే అభివృద్ధికి బాట

రా బావ ఆడవాళ్లకు ఆశలెక్కువ అంటున్నావు. కాకపోతే ఏంటి బావ మీ చెల్లెలు ఆశలు పందెపు గుర్రం స్వారి లాగ పరుగుపెడు తుంటే ఏం చేయాలి చెప్పు. అది సరే ఆడవాళ్లకే ఆశలు ఎక్కువ అని బహిరంగంగా అన్నావనుకో. మహిళా సంఘాలు మీ ఇంటిమీదకు వచ్చిపడతాయి. ఈ రోజు ఏమైంది అసలు మనకున్న ఆర్ధికస్థోమతను బట్టి ఆశలుండాలిగానీ జమిందారులకు మల్లే ఆశలుంటే ఎలా చెప్పు. అసలేమైందయ్యా ఈ రోజు విరుచుకుపడుతున్నావు. ఏం లేదు ఉక్క పోతకు నిద్రపట్టడంలేదు. ఏ.సీ కొనాలంటుంది. ఎ.సీ ఉంటే వచ్చే కరెంటు బిల్లు కట్టగలగాలి కదా. అది సరే ఆశలు అవసరాలను బట్టి ఉంటాయి. ఇప్పుడు ప్రజల అవసరాలు పెరుగుతుంటే ప్రభుత్వాలు తీర్చలేక తలపట్టుకుంటున్నాయి. సమాజంలోని ఒకరిని చూచి మరొకరు ఆశలు పెంచుకుని మధ్య తరగతి కుటుంబాలుపడే అవస్థ తెలసిందే. ఆశలనేవి మగవారికి, ఆడవారికి ఇద్దరికి ఉంటాయి. ఇంటిపెద్దగా మగవారైనా, ఆడవారైనా తమకు వచ్చే ఆదాయంతో సమతుల్యత పాటించి బుద్ధితో ఆలోచించి ముఖ్యావసరాలు తీర్చుకోవ డానికి ప్రయత్నించాలి. అసలు మనకు కనబడని మనసు నుండి ఆశలు పుడతాయి. కానీ మనం బుద్ధిబలంతో ఉన్న ఆర్థికస్థోమతనను సరించి మంచి, చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అత్యవ సరాలు ముందుతీర్చుకొని మిగిలిన సొమ్ముతో ఇతర అవసరాలకు కేటాయించాలి.
మనల్ని ఆడిరచే మనసు మంచి, చెడులు నిర్ణయించే బుద్ధి రెండు మనకు కనబడకపోయినా ఆ రెండే మనల్ని సన్మార్గులు గానో, దుర్మార్గులుగానో మారుస్తాయి. అది సరే ఇంత వివరం ఎంత మందికి తెలసు. ఆశల్ని బుద్ధిబలంతో విశ్లేషించుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిజమే బావ మన లాంటి సామాన్యులకే కాదు, మన పాలకులకే తెలియక కొన్ని విషయాలలో ప్రజల సొమ్ము మట్టిపాలు చేస్తున్నారు. మనం ప్రభుత్వం ఏం చేయాలన్నా చేయ గలదని అనుకుంటాం. కానీ ఉద్యోగులు పెన్‌డౌన్‌ అనగానే భయపడే ప్రభుత్వాలను కూడా మనం చూస్తున్నాం. అలాగే సామాన్యుల సంగతి మాకెందుకు మా జీతాలు పెంచవలసిందే అనే ఉద్యోగుల్ని చూస్తున్నాం. ఏతావాత మన కర్థమయ్యేదేమిటంటే స్వార్థబుద్ధే విజయం సాధిస్తోందని. మంచి చెడులు చేసే సమాజంలో మంచివాడని పిలుచుకున్నా, చెడ్డపనులు చేసి చెడ్డవాడు, దుర్మార్గుడు అనిపించుకున్నా అందుకు కారణం మన నిర్ణయాలే. మామూలుగా చెడ్డపని చేసినవాడిని బుద్ధిలేని వాడనీ, బుద్ధి ఏమైందిరా అంటుంటాం. అందుకని చేసే ప్రతిపనిని మనసు ఆర్డరువేస్తే బుద్దితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, ఎటువంటి అనర్థాలు జరగవు. అదుపుతప్పిన మనసును అదుపులో పెట్టుకోవాలంటే బుద్ధితో ఆలోచించాలి. మంచి, చెడులు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే అంతా సవ్యంగానే మంచి మార్గంలోనే జరుగుతాయి.
అది సరే ప్రస్తుతం సమాజంలో సన్మార్గులు తగ్గిపోయి దుర్మార్గులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అందుకు కారణమేంటి బావ. మనం కొందరిని చూచి స్వార్థపరులని, మరి కొందరిని చూచి నిస్వార్థులని అంటాం కదా. స్వార్థంతో ఇతరులకు అన్యాయం చేసేవారిని స్వార్థపరులని, తాము నష్టపోయినా ఇతరుల క్షేమం కోరేవారిని నిస్వార్థులని అంటాం. కాని అలాంటి నిస్వార్థులు ప్రస్తుతం ఉన్నారంటావా. ఎందుకుండరు అందరూ స్వార్థంతో అలోచించరు కద. అందరూ స్వార్థపరులైతే ఒకరిని మరొకరు మోసగించలేరు. నిస్వార్థుల మెతకతనాన్ని ఆసరా చేసుకుని స్వార్థపరులు మోసం చేస్తున్నారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పార్లమెంటులో కూర్చుంటున్నారు. ఆ విషయం పత్రికలలో వచ్చినా, ఏ మాత్రం సిగ్గుపడకుండా పెద్ద మనిషిలా తిరుగుతున్నారు. నిజమే ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనుకునేవారు అలాగే తిరుగుతారు. కానీ ప్రజాప్రతినిధులుగ అటువంటి వారు ఉండటం వలన దేశం ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడంలేదు. అందుకే వ్యక్తుల మంచి బుద్దే దేశాభివృద్ధికి కారణం. చెడు బుద్ధివారి వల్ల ఎటువంటి అభివృద్ధి జరగదు. ప్రజల సొమ్ము చెడుబుద్ధి కల స్వార్థపరుల ఖాతాలో జమ అవుతోంది. ప్రతిమనిషి పక్కవాడిని దోచుకోవాలనే చెడ్డబుద్ధి ఉండటం వలన సన్మార్గులు నష్టపోతున్నారు. కనుక బావ ఇంటి యజమానికి మంచి బుద్ధి ఎంత అవసరమో దేశాన్ని ఏలేవారికి అంతకంటే అవసరం. మంచి బుద్ధే దేశాభివృద్ధికి కారణం కాగలదు.
సెల్‌: 985569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img