Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంటెక్కదూ మరి?

పురాణం శ్రీనివాస శాస్త్రి

కాంగ్రెస్‌కి గాంధీ ఎక్కువైపోతే బీజేపీకి తక్కువైపోయాడు. స్వాతంత్య్రం వచ్చాక గాంధీతో తూగలేక కాంగ్రెస్‌ పక్కనబెట్టింది. గాంధీలో బోలెడు ఓట్లున్నాయని ఆలస్యంగా గ్రహించిన బీజేపీ హఠాత్తుగా ఆయన్ని తలకెత్తుకుంది. ఆగస్టులో చేనేత రోజు అనేది చేనేత కోసం మొత్తుకున్న గాంధీగార్ని గౌరవించే పండగే అనడానికి, దాని వెనక స్ఫూర్తి బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం అయినా ‘కాంగ్రెస్‌ చేయని మంచిపని మోదీ చేసినట్టే. ఈ మధ్య కాలంలో ఎంతమంది కాంగ్రెసోళ్లు గాంధీ ఆశ్రమంలో నూలు వడికారో తెలియదు గానీ మోదీ ఆ పని ఆ మధ్య చేశారు. ఓట్ల గేలం కోసమైనా తాము నమ్మే గాడ్సేని పక్కనబెట్టి గాంధీని నెత్తిన పెట్టుకున్నందుకు శభాష్‌ అనాల్సిందే. అసలు గాంధీని చంపినోళ్లు ఇప్పుడు నాలిక్కరుచుకుంటున్నారు. కానీ గాంధీని ఇంటి పేరుగా చేసుకున్నవాళ్లు ఆయన తమకు అక్కరకు వచ్చే దినుసుగా కూడా చూడలేకపోతున్నారు. నాస్తిక, హింసావాద భావాన్ని ఎంతగా గాంధీ ఈసడిరచినా అది పునాదిగా ఉన్న కమ్యూనిస్టులను మాత్రం అంతగా తిట్టలేదు. పైగా ‘కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణమైన జీవనం సాగించాలని తాను కోరుకుంటున్నట్లు’ యంగ్‌ ఇండియాలో (1924) రాశారు.
గాంధీ పిడివాది కాదు. ఏవి తన విధి విధానంగా ప్రకటించాడో వాటినే ఆయన పట్టుదలగా చేస్తాడు తప్ప మొత్తానికి పట్టు విడుపులు ఉన్నవాడే. గొప్ప హిందూనని ఎప్పుడూ చెప్పుకోకపోయినా సనాతనిజాన్ని అంతగా డప్పు కొట్టలేదు. నిజానికి సనాతన కాలానికి, ఇజానికి లేని మానవతా దృష్టి ఆయనకు ఉంది. గాంధీ సిద్ధాంతాలని కమ్యూనిస్టు సిద్ధాంతాలని గాంధీ తిట్టినట్టు కనపడదు. పైగా తన జీవ సరళికి కమ్యూనిస్టు సూత్రాలని పునాది చేసుకోదలిచానని స్వయంగా ప్రకటించాడు.
కమ్యూనిస్టులు కూడా నేటి పరిస్థితులు చెబుతున్న పాఠం ఒంటబట్టించుకుని ఆయన మీద ‘వెలి’ ఎత్తేశారు. గాంధీలాంటి మతానుయాయే తప్ప మతవాది కాని వాడితో గొడవెందుకు అని కనువిప్పుకొచ్చేశారు. అసలు ఎవరైనా (ప్రజలైనా, పార్టీలైనా) చేయాల్సిందదే. పేదలతో ఐడెంటిఫై అవుతూ తిరిగే అర్ధనగ్న అపురూపంతో పేచీ కాదు ఆయన సూత్రాలు ఆచరణకు పూచీ పుచ్చుకోవడమే బెస్టు. గాంధీతో చిక్కేమిటంటే మహాత్ముడు అవుదామని అనుకోకపోవటం! లంకని గెలిచిన రాముడు దాన్ని ఏలుకోకుండా విభీషణుకి అప్పగించినట్లు స్వతంత్రం గెలిచిన గాంధీ భారత్‌ను ఏలుకోకుండా పాలన కాంగ్రెస్‌కి అప్పగించాడు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కంటే గాంధీని ఇంటి పేరు చేసుకున్న కుటుంబమే ఎక్కువగా ఆయన్ని నెత్తిమీద పెట్టుకుని బాగుపడిరది.
స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్‌ని గాంధీయిజం నడిపించినట్లు స్వాతంత్య్రం తరువాత దేశంపై ఏలుబడిని నెహ్రూయిజం చక్కగా నడిపించింది. దశాబ్దాల కన్సిస్టెన్సీకి ఇదే నా నమోవాకాలు! ఏదీ ఆశించని గాంధీ తత్వమే అన్నీ ఆశించే అసమర్థులకి దేశం ఇంటి తలుపులు తెరిచింది. ఐతే ఆ తెరవడాన్ని అధికారంలోని కాంగ్రెస్‌ ఆలస్యం చేసింది. అందుకే మత మత్తేభాలకి కాంగ్రెస్‌ మీద అంత ఇది. ఆరని కడుపు మంట అయిపోయింది పాపం వాళ్లకది. నాలుగేళ్ల క్రితం క్విట్‌ ఇండియా 75 ఏళ్ల ఉత్సవం జరిపింది కూడా మోదీ హయాంలోనే. ఆ రకంగా గాంధీపై కాంగ్రెస్‌, బీజేపీలు తమ కళ్లజోళ్లను మార్చుకుంటున్నాయని కాదు అర్థం. బీజేపీ విజయాల వెతుకులాటలో గాంధీని ఎత్తుకుందని చెప్పుకోవాలి మనం. ఇక నేటి కాంగ్రెస్‌కు గాంధీ ‘నాటి మేటి’ తప్ప ‘నేటి సాటి’ కాకుండా పోతున్నాడనుకోవాలి. ఇక జనానికి గాంధీ ఇప్పుడంతగా పట్టడం లేదు అనిపిస్తోంది. అవును మరి ఆయన తిట్టినవాళ్లతోఉన్నది జనమే మరి. చర్చిలు, దేవాలయాలు, మసీదులు, మోసాల, వేష భాషల, వంచన చక్రవర్తుల నిలయాలు అన్నాడు ఆయన. అయిందా ఇక కార్మికుల సంక్షేమం. చాలామంది కమ్యూనిస్టులు పుట్టకముందే సౌతాఫ్రికాలో తాను చేసింది అదేనన్నాడు. ఇక దళిత సమస్య. అది సమస్యే కాని ‘‘మన సమస్యని ముందు స్వాతంత్య్రం ద్వారా మనది చేసుకోవాలి. అందుకు బ్రిటిష్‌ పాలన బందు కావాలి’ అన్నాడు. హిందూమతం పేరెత్తితే అస్పృశ్యత, అపరిశుభ్రత పోవా లన్నాడు. ఇలా ఆయన దృష్టి అన్నింటా తీక్షణంకావడంతో పాలనాధికారంకోసం అర్రులుచాస్తున్న వాళ్ళకి మంటెక్కిపోదూ మరి!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img