Friday, April 19, 2024
Friday, April 19, 2024

మతోన్మాదుల రాజ్యమే?

కూన అజయ్‌బాబు

జ్ఞానవాపి మసీదులో శివలింగం వుందా? శ్రీకృష్ణజన్మభూమిగా చెప్పు కునే మథురలోని ఓ మసీదులో కారాగారం (శ్రీకృష్ణ జన్మస్థానం)వుందా? ఇంకో మసీదులో ఇంకో హిందూ దేవుడి విగ్రహం వుందా? ఇలా రోజుకొక వివాదం ముసురుకుంటోంది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత అక్కడ రామాలయాన్ని కట్టడానికి పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా సాగిన ప్రయత్నం సఫలమైన తర్వాత సంఫ్‌ుపరివార్‌ శక్తులు దేశవ్యాప్తంగా వున్న మసీదులపై కన్నేసిన విషయం తెలియనిది కాదు. మొన్న అయోధ్య, నిన్న కాశీ (జ్ఞానవాపి), ఈనాడు మధుర, రేపు ఇంకొకటి… ఇలా మందిర్‌మసీదు వివాదాలు దేశంలో మతోన్మాదాన్ని మరింత పెంచేలా చేస్తున్నాయి. అసలు ఈ తరహా కట్టడాలు, దానికి సంబంధించిన భూములపై హక్కులు ఎవరివి? భూమిపైనో, భూమిలోపలో, కట్టడం వెలుపలో ఏదో ఒక రూపం వుందని చెప్పి ఆక్రమించుకోవచ్చా? తవ్వుకోవచ్చా? వీటిని న్యాయస్థానాలు సమర్థిస్తాయా? ఇలా ఎన్నో సందేహాలతో ఈ మందిర్‌మసీదు వివాదాలు పెచ్ఛరిల్లుతున్నాయి. ఈ విశృంఖల యత్నాలు ఏ స్థాయికి చేరుతాయో తెలి యని భయానక పరిస్థితి నెలకొన్నది.
ఒకప్పుడు ఒక ప్రాంతాన్ని హిందూ రాజులు పాలించేవారు. అంతలోనే ముస్లింలు ఎక్కడి నుంచో వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడున్న హిందూ దేవాలయాలు నచ్చక వాటిని కూలగొట్టి మసీదులు కట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హిందూ రాజులు వచ్చినప్పుడు కొత్తగా ఆలయాలు కట్టి వుండవచ్చు లేదా మసీదుల స్థానంలో తిరిగి ఆలయాలను పునరుద్ధరించి ఉండవచ్చు. అది ఆనాటి పాలకుల శాసనం. అదే వారి రాజ్యాంగం. రోజులు మారాయి, రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. నియంతృత్వాలు తగ్గి పోయాయి. ప్రజాస్వామ్య దేశాలు పరిఢవిల్లుతున్న రోజులివి. మన దేశంలో కూడా మనకంటూ ఓ రాజ్యాంగం వుంది. దాని ప్రకారం ప్రభుత్వం నడవాల్సి వుంటుంది. వేరే అవకాశం వుండదు, ఆస్కారం లేదు. అలాంట ప్పుడు మళ్లీ ఆనాటి మతోన్మాద పరిస్థితులు కన్పిస్తున్నాయంటే… ఏమనుకో వాలి? నాటితరహా ముస్లిం మతోన్మాదులో, హిందూ మతోన్మాదులో అధి కారంలోకి వచ్చారని భావించవచ్చా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే గోచరిస్తున్నది.
అసలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది? పీవీ నర సింహారావు ప్రధానిగా వున్న సమయంలో రామ జన్మభూమి కోసం సంఫ్‌ు శక్తులు మతఉద్యమం నడుపుతున్న రోజుల్లో ఆయన ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. 1947 ఆగస్టు 15 నాటికి పూర్వం మతపరమైన కట్టడాలు ఎవరి ఆధీనంలో వుంటే భూహక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్ట డాలను కదిల్చే హక్కు లేదని ఆ చట్టం నిర్థారిస్తున్నది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకు మాత్రం మినహాయింపు వుంటుందని పేర్కొంది. దీని ప్రకారమే, సుప్రీంకోర్టు రామజన్మభూమి వివా దంలో తీర్పును ఆలయ నిర్మాణానికి అనుకూలంగా ఇచ్చింది. ఈ మధ్యనే కాశీలోని జ్ఞానవాపిశృంగార్‌ గౌరీ కాంప్లెక్స్‌లో మసీదుపై సర్వేకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సర్వే పూర్తయింది. అక్కడ శివలింగం వుందని, శేషనాగుతోపాటు దేవతల పగలిన విగ్రహాలు, త్రిశూలం, ఢమరుకం కన్పిం చాయని సర్వే చెప్పింది. అలాగే అక్కడి రాళ్లగుట్టలకు 600 ఏళ్ల వయసు వుండవచ్చని కూడా భావించింది. దీంతో ఇది ప్రార్థనాస్థలాల చట్టం1991 కిందకు రాదని తాజాగా సుప్రీంకోర్టు సైతం కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదలాయించింది. ఇక్కడ కూడా మతపరమైన కట్టడాల పునరుద్ధరణ విష యంలో ఓ వర్గం విజయం సాధించే అవకాశం వుంది. దీంతో వారి కళ్లు ఉత్తరప్రదేశ్‌లోని మధురపై పడిరది. మధుర హిందూ దేవుడిగా భావిస్తున్న శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెప్పుకుంటారు. మధుర ఆలయం పక్కనే వున్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివి అన్న వాదన మొదలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టుకు చెందిన 13.37 ఎకరాల్లో షాహీ ఈద్గా మసీదు నిర్మాణం జరిగిందని 2020 సెప్టెంబరు 25నే రంజన అగ్ని హోత్రి, అతని మిత్రబృందం కేసు దాఖలు చేసింది. ఇప్పుడు ఈ మసీదునే తొలగించాలని డజనుకు పైగా కేసులు దాఖలయ్యాయి. ఇక్కడ కూడా జ్ఞాన వాపి తరహాలో సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్‌ పెరుగుతోంది. ఇతి హాసాల ప్రకారం శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవికలు బందీలుగా వున్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం ఈ మసీదు కింద వుందని, దాని తవ్వకానికి అనుమతినివ్వాలని పిటిషనర్లు కోరారు.
ఇలా..ఒకటి తర్వాత ఒకటి..మసీదులో, ఆలయాలో తవ్వుకుంటూ పోతే మతోన్మాదం పెచ్ఛరిల్లకుండా వుంటుందా? 1670లో ఆనాటి మొఘల్‌ పాల కుడు ఔరంగజేబు ఈద్గా మసీదును నిర్మించారు. శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి ఆలయానికి, మసీదుకు మధ్య 1968లోనే ఓ ఒప్పందం కుది రిందని ఆనాడు కోర్టు అగ్నిహోత్రి పిటిషన్లను కొట్టేసింది. రెండు ప్రార్థనా మందిరాల మధ్య గోడ కట్టాలన్న తీర్మానం కూడా వుంది. ఆలయాలు, మసీ దులు, వాటి భూములు, హక్కులన్నీ పక్కనబెడితే, ఈ వివాదాలు ఎన్నడూ లేనివిధంగా దేశంలో పెరుగుతుండటానికి కారణం సంఫ్‌ుపరివార్‌ శక్తులు పథకం ప్రకారం చేస్తున్న చర్యలే అని తెలుస్తోంది. లౌకిక దేశమైన భారత్‌లో ఇలాంటి పరిణామాలు అత్యంత ప్రమాదకరం. ఏ మతానికి చెందినవారైనా మతోన్మాదుల పాలనాకాలంలోనే ఇలాంటివి జరుగుతాయన్న వాదన ఉంది. ఇవన్నీ చూస్తుంటే అదే నిజమేమో అన్పిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img