Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మత గ్రంథాలు హింసనెందుకు ప్రేరేపించాయి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ప్రపంచ శాంతిని కోరు కునేది ఇస్లాం. ఇస్లాం మానవత్వానికి ప్రతిరూపం. ఇస్లాం అంటే శాంతి. ఒక మనిషిని చంపితే ఇస్లాం ప్రకారం మొత్తం మానవాళినే మట్టుబెట్టినట్టు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్లాం మత పెద్దలు ఈ విషయాలు చెపుతూ ఉన్నా, లక్షల మంది ముస్లిం యువకులు ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారూ? ఆలోచించవల్సిన విషయం! మత గ్రంథాల్లోని విషయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనుషుల మీద ఏమైనా ప్రభావం చూపుతున్నాయా? పరి శీలించవల్సిన విషయం!! ఉగ్రవాదులు సాటి మనుషులను అత్యంత కిరాతకంగా ఎందుకు చంపు తున్నారు? ఇతర మతస్తులతో పాటు ఒక్కోసారి ముస్లింలు కూడా చనిపోతున్నారు కదా? పిల్లలను మానవ బాంబులుగా మారుస్తున్నారు కదా? ఉగ్రవాదులు ఏ మతస్తులయినప్పటికీ వారు మానవత్వానికి మాయని మచ్చనే!
ఇస్లాం మత గ్రంథం ఖురాన్‌లోనూ, ఎక్కువమంది ముస్లింలను ఆకర్షించే హద్దీతులను పరిశీలిస్తే నిజంగా ఇస్లాం శాంతిని ఏ విధంగా ప్రభోదించిందో తెలుస్తుంది. సురా 2:256/ సురా 15:94 మాత్రమే చదివిన వారికి ఇస్లాం ఎంతో సహనాన్ని ప్రబోధించింది అని అనిపిస్తుంది. కానీ, అందులోనే ఇంకా లోపలికి వెళ్ళి సురా 2:190191193/సురా 4:748995/సురా 8:6065/సురా 9:5142952 వంటివన్నీ నిశితంగా అర్థం చేసుకుంటే సుమారు 164 వచనాలు హింసను ప్రేరేపించేవేనని తెలుస్తుంది. ఇబ్న్‌ జుజాయి ప్రకారం ‘‘విగ్రహారాధకులు (ముశ్రికున్‌) ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. ఖురాన్‌లో ఉన్న ఇతర శాంతి ప్రవచనాలను చదివి అనుమానంలో పడొద్దు! ఎందుకంటే ఈ వచనం చాలా శక్తివంతమైంది. ఇది ఇతర వచనాలన్నింటినీ ఖండిస్తుంది’’ అని ఉంది. అంటే దీని ప్రకారం విగ్రహారాధకులకు, ఇస్లాం మతస్తులకు మధ్య ఉన్న సంధి ఒడంబడికలు, స్నేహసౌహార్ద్రాలు, శాంతి వర్తమానాలు ఏవీ నిలవవు. ‘ఖురాన్‌లోని ఆయతు (ఖడ్గం అనే ఆయః) చాలా శక్తివంతమైంది’ అని హద్దీతులు చెప్పడం గమనించదగ్గ విషయం. ఇస్లాంలో ‘జిహాద్‌’కు ఆరవ స్తంభం అని పేరు. మిగతా అయిదు స్తంభాల కంటే దీనికే ప్రాముఖ్యం ఉంది. ఇది ఆచరించనివాడు ముస్లిమే కాదు అని చెప్పే మత పెద్దలు కూడా ఉన్నారు. జిహాద్‌ అంటే ఆత్మీయ పోరాటమేనని, ఇది కేవలం ముస్లింలను హింసించడానికే ఉద్దేశించినదని, నిజమైన పోరాటం కాదని, మరికొందరు విశ్లేషిస్తారు. మరి అదే నిజమైతే ఖురాన్‌లో 8:39/9:53641లు ఎందుకున్నాయి? ఆ భాగాలు ప్రభోదిస్తున్నదేమిటీ? అనేది తప్పక తెలుసుకోవాలి. వీటి ప్రకారం ‘‘ముస్లిమేతరులను ఇస్లాంలోకి ఆహ్వానించాలి. వారు ఆహ్వానాన్ని మన్నించక పోతే పోరాడాలి, అణచిపెట్టాలి. ఇస్లాం ధర్మశాస్త్రాలకు కట్టుబడి ఉండేలా చేయాలి. అదీ సాధ్యం కానప్పుడు చంపాలి ఇలా చేయమని స్వయంగా దేవుడైన అల్లా మహ్మదు ప్రవక్తను ఆజ్ఞాపించాడు’’ అని ఉంది. ఇస్లాం సాహిత్యం చెప్పేది ఈ విధంగా ఉంటే ఇస్లాం శాంతిని స్థాపించే మతమని ముస్లిం పండితులు చెప్పేది అబద్దమని తెలిసిపోతూ ఉంది కదా? ఖురాన్‌లో వచనం 60:89లో ఒక ముసలి కవి హత్యకు గురైన ఉదంతం గూర్చి ఉంది. అతను చేసిన నేరం ఏమిటంటేమహమ్మదును తన కవిత్వం ద్వారా తీవ్రంగా విమర్శించడం! కోపోద్రిక్తుడైన మహ్మద్‌ తన అనుచరులను పిలిచి ‘‘ఆ ముసలి కవిగాడి సంగతి ఎవరు చూస్తారూ?’’ అని ప్రశ్నిస్తాడు. అనుచరుల్లో సలీం అనే అతను ముందుకొస్తాడు. మహ్మదు అతనికి అనుమతిని, అవకాశాన్నీ ఇస్తాడు. అప్పుడు ఆ సలీం వెళ్లి మహమ్మదును విమర్శించిన ముసలి కవిని హతమారుస్తాడు. వారి దృష్టిలో అది దుష్ట సంహరణ అన్నమాట! అందుకే ఆ ఘట్టాన్ని వారి సాహిత్యంలో అమోఘంగా వర్ణిస్తూ వీరోచిత కార్యంగా రాసుకున్నారు. అలాగే వారి ఇబ్న్‌ ఇష్క్‌, సిరాత్‌ రసూలుల్లాప్‌ా 676లో ఇలాంటిదే మరో సంఘటన కూడా ఉంది. మర్వాన్‌ కుమార్తె మహమ్మద్‌ను దుర్భాషలాడిరదని మహమ్మద్‌ ఆమెను చంపిస్తాడు. ఆమె చనిపోయిన తర్వాత, ఆమె సంతతినంతా పిలిచి, దమ్ముంటే తనతో యుద్ధం చేసి గెలవాలనీ లేదా నోరు మూసుకుని ఇస్లాం స్వీకరించాలని మహమ్మద్‌ వారిని ఒత్తిడి చేస్తాడు.
క్రైస్తవ దృష్టికోణంలోంచి ఇస్లాంను పరిశీలించిన రైనా సామ్‌ సమౌన్‌ ప్రకారం అందులో మూడు దశలున్నాయి. సురా 43:8889 ప్రకారం ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్నప్పుడు శాంతితో ఇస్లాం ప్రచారం చేయాలి. సురా 2:190194/సురా 22:3941 ప్రకారం ముస్లిం సంఖ్య ఒక మోస్తరుగా ఉన్నప్పుడు ఇస్లాంను సమర్థించుకుంటూ పోరాడాలి. అలాగే ముస్లిమేతరుల కంటే ముస్లింలే అధిక సంఖ్యలో ఉంటే, వారిని అణచిపెట్టి ఇస్లాంను వ్యాపింప జేయాలి. అవసరమైతే వారిని చంపైనా ఆధిపత్యం చలాయించాలి అనే విషయం సురా 9:161 సురా 9:2831లలో ఉంది. దీనికి సాక్ష్యాలు కావాలంటే, నాటి హైదరాబాదు రాష్ట్రంలో నిజాం పరిపాలనలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవచ్చు. విగ్రహారాధకుల్ని వరుసగా నిలబెట్టి వారి నుదుట ఉన్న నిలువుబొట్లను నాలుకతో నాకించి అవమానపరిచిన సన్నివేశాన్ని దాశరథి రంగాచార్య తన ‘చిల్లర దేవుళ్ళు’ నవలలో చిత్రించారు. పెద్ద ఎత్తున జరిగిన మత మార్పిడుల గురించి విపులంగా రాశారు.
స్త్రీల శారీరక దోపిడులు జిహాద్‌లో భాగమే. చెరబట్టిన స్త్రీలతో శారీరక వాంఛలు తీర్చుకోవచ్చని 8 సంఖ్య 3253 ప్రకారం సాహి ముస్లిం గ్రంథమే చెప్పింది. బానిసలైన స్త్రీలపై అత్యాచారం చేయమని చెప్పే మతం ఏ విలువల్ని స్థాపించగలదో ఆలోచించుకోవాలి. ఇలాంటి ఇస్లాం సాహిత్యం రోజూ చదివి, అభ్యసించి జీర్ణించుకుని వీటిని దైవజ్ఞులుగా భావించడం ఎంతవరకు సబబు? ఆమెరికాపై బాంబులైనా, ముంబైలో మారణ హోమమైనా, పాఠశాలలపై కాల్పులైనా, పసికందుల్ని కాల్చి చంపడమైనా… ఇలాంటి సంఘటన ఏది తీసుకున్నా అందులో మనుషులే కనబడరు కదా? మెదళ్ళలో విషం దట్టించిన మత బోధలే కనిపిస్తాయి. అవి చేసే వికృత చేష్టలే వినిపిస్తాయి. ఇప్పుడు అవి అసహ్యంగా ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులిప్పుడు ముస్లిం దేశాల నుండి వస్తున్నారన్న విషయం తెలిసిందే. అయినా ప్రతి ముస్లిం ఉగ్రవాది కాడు. పైగా హింసను ప్రేరేపించే బోధలు ఏ ఒక్క మతంలోనో లేవు. రూపం రంగు మార్చుకుని అన్ని మత గ్రంథాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు హిందువుల భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రేరేపించింది హింస (యుద్ధం) కోసమే కదా? కృష్ణుడు అర్జునుణ్ణి రెచ్చగొట్టి సోదరులైన కౌరవులను పాండవులతోనే చంపించాడు. ‘‘అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఇది స్వర్గానికి తెరచిన ద్వారం’’ (సాంఖ్య యోగం : శ్లోకం32) అని చెప్తాడు కృష్ణుడు. మనుషుల్ని, అందునా సోదరుల్ని చంపితే స్వర్గం అని బోధించేవాడు దేవుడెలా అయ్యాడో ఆలోచించుకోవాలి. ‘‘ఈ యుద్ధం నీకు ధర్మయుద్ధం. ఒకవేళ నువ్వు దీన్ని ఆచరించకపోతే స్వధర్మం నుండి పారిపోయిన వాడవవుతావు. అందువల్ల కీర్తి ప్రతిష్ఠలు కోల్పోయి పాపానికి ఒడిగట్టినవాడివవుతావు’’ (సాంఖ్య యోగం : శ్లోకం33). ‘‘ఓ కౌంతేయ! రణరంగమున మరణిస్తే వీరస్వర్గం పొందుతావు. యుద్ధం గెలిస్తే రాజ్య భోగాలనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో యుద్ధానికి సిద్ధపడు’’ (సాంఖ్యయోగం : శ్లోకం`37). జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే అన్ని మత గ్రంథాల్లో హింస ఎలా ఉంది? ఏ మేరకు ఉంది అనేది అవగతమౌతుంది.
నిజానికి మత విశ్వాసాలు ఎవరికి వారు తమ వ్యక్తిగత స్థాయికి పరిమితం చేసుకోవడం మంచిది. ఈ మతం మంచిది. ఈ మతం చెడ్డది అని మనమిక్కడ విశ్లేషించుకోవడం లేదు. మతాలన్నీ మనుషుల్ని ఎలా విడగొట్టాయో ఎలా నాశనం చేశాయో, ఆధిపత్యం సాగించడానికి అవి ఎట్లా ఉపయోగపడుతూ వచ్చాయో అర్థం చేసుకోవడానికే మనం ఈ విషయాలు చర్చించుకోవాలి. ‘రండి! మనమంతా ఒక్కటే! మనుషులంతా ఒక్కటే!!’ అని విశ్వ మానవగీతి పాడే ‘‘మనుషులు’’ కావాలి మనకు. అలాంటివారిని వెతుక్కుంటూ, కలుపుకుంటూ మనం ముందుకు పోదాం మనం మనం జనం మనం.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img