Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మధ్యప్రదేశ్‌ బీజేపీలో కుమ్ములాటలు

ఎల్‌ఎస్‌ హెర్డెనియా

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో కుమ్ములాటలు చోటుచేసు కున్నాయి. దాదాపు డజను మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రి భూపేంద్ర సింగ్‌పై చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. సాగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్న భూపేంద్ర సింగ్‌ను అరికట్టడంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే తాజాగా రాష్ట్ర బీజేపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. మూడు వర్గాలలో ఒకటి ముఖ్యమంత్రి, మరొకటి పార్టీ అధ్యక్షుడు వి.డి శర్మ, మూడవది జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వం వహిస్తున్నది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుల మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తలు పేర్కొన్నాయి. సింధియా విషయానికొస్తే, కాంగ్రెస్‌ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రయోజనాలను కాపాడటం సింధియా ప్రధాన ఆందోళనగా ఉంది. అయితే ఈ వర్గాలు ఏ రూపం తీసుకుంటాయో ఊహించడం కష్టం.
సీనియర్‌ మంత్రి గోపాల్‌ భార్గవ, మంత్రి శైలేంద్ర జైన్‌, ప్రదీప్‌ లారియా (ఎమ్మెల్యేలు), బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి భూపేంద్ర సింగ్‌ సమ్మతి, నిర్ణయం లేకుండా ఏ అధికారిని తీసుకోనివ్వడం లేదని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారికి రక్షణ కల్పిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీనితో ప్రస్తుతం సాగర్‌ జిల్లాలో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తమ ఫిర్యాదులను పరిష్కరించకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించారు. వీరు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. అయితే సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ అసంతృప్త మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు వీడీ శర్మతో పాటు ఇతర ముఖ్య కార్యకర్తలను కూడా కలిశారు. రాష్ట్రంలో పరిపాలనా, శాంతిభద్రతల విషయంలో భూపేంద్ర సింగ్‌ జోక్యం చేసుకోవడం సమంజసంకాదని ఎత్తిచూపారు.
ముఖ్యమంత్రికి ఫిర్యాదుచేసిన తర్వాత మంత్రులు, సంబంధిత ఎమ్మెల్యేలు భోపాల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రితో మరో దఫా చర్చలు జరపాలనేది వీరి ఆలోచన. ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లాలని కూడా వారు ప్రతిపాదించారు. ఈ పరిణామంపై రాజకీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు తిరుగుబాటు మంత్రులు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ జోక్యం ఉందనేది బీజేపీ అధినేత ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను కమల్‌నాథ్‌ కొట్టిపారేశారు. ‘‘అలా జరిగితే నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఉండేవారని, ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం అని కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. నేను వి.డి శర్మ స్థ్థాయికి చెందినవాడిని కాదు, శర్మ చేసిన పనుల గురించి ఆయన నియోజకవర్గ ప్రజలనే అడగాలి, ఆయన పనులకు వారే అతి పెద్ద సాక్షి అని అన్నారు. కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ నేను కమల్‌ నాథ్‌ బాటలో నడవాలని అనుకోను. నేను ఒక పేద గిరిజనుడి ఇంటికి వెళ్లి అతనిని ఆలింగనం చేసుకుని అతనిని సోదరునిగా అంగీకరించాను. ప్రధానమంత్రి సందేశంతో అతని ఇంటికి వెళ్తాను. అతని అభివృద్ధి ప్రణాళికల గురించి చెప్పమనండి అని వాగ్బాణాలు సంధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img