Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మన కాలం వీరులు…

కాలం కడుపుతో ఉండి కారల్‌ మార్క్స్‌ని కంది. ప్రతీ తరంలోనూ కాలం కడుపుతో ఉండి గొప్పవారిని కంటుంది. వాళ్లని గుర్తించడం కష్టమే. గుర్తించామా ఇక వాళ్లకి ఆకాశమే హద్దు. మనకి ఆనందమే హద్దు. కాలం ఒక్క కమ్యూనిస్టులనే లోకానికి ఇవ్వదు. కళాకారులను ఇస్తుంది. నటుల నిస్తుంది. కవులు, రచయితలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఆలా అన్ని రంగాల నుంచి గొప్పవారిని ఎంపిక చేసి ఇస్తుంది. అన్నట్లు ఆటగాళ్లని కూడా ప్రతి తరానికి ఇస్తుంది. అలాకాలం ప్రపంచానికిఇచ్చిన బహుమతులే బ్రాడ్‌మెన్‌, రిచర్డ్స్‌, ఫుట్‌బాల్‌ దిగ్గజాలు పీలే, మరడోనా, టెన్నీస్‌లో మార్టినా నవ్రతి లోవా, మన దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కొహ్లీ, చెస్‌ రారాజు విశ్వనాథన్‌ ఆనంద్‌…ఇలా అన్నమాట. ఈ తరం నుంచి కూడా కాలం తన పని తాను చేసింది. ప్రతికాలానికి ఓ రూపం ఉంటుంది. ఈ కాలానికి ఆ రూపం పేరు ఐపీఎల్‌.
ఆ కుర్రాడ్ని చూశారా. మిలట్రీ కటింగ్‌. నూనూగు మీసాల నూత్న యవ్వనం. ముఖ్యంగా ఆ కళ్లని గమనించండి. ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ప్యాడ్‌లు కట్టుకుని, హెల్మెట్‌ పెట్టుకుని, గ్లౌజ్‌ తొడుక్కుని పిచ్‌ మీదకి వచ్చిన సమయం కూడా పట్టలేదు. అలా వచ్చీ రాగానే మొదటి బంతి సిక్స్‌…రెండోబంతి మరో సిక్సర్‌. ఆ తర్వాత మూడుఫోర్లు… మొత్తం 26 పరుగులు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా. ఇంకెవరు యశస్వి జైస్వాల్‌. దిగువ మధ్యతరగతికి చెందిన ఈ యశస్వి జైస్వాల్‌… బ్యాటింగ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. నిజానికి తొలి ఓవర్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌కి విజయం అందించాడు ఈ కుర్రాడు జైస్వాల్‌.
ఆ ఓవర్‌ ముగిసిన తర్వాత తెలుగు వ్యాఖ్యాతలు అన్నారూ…కోల్‌కతా కెప్టెన్‌ నితీష్‌ రాణా ఆ తొలి ఓవర్‌ వేయకుండా ఉండాల్సిందని…. కానీ, ఆ తర్వాత బౌలింగ్‌ చేసిన వారికీ ఇదే చేదు అనుభవం. ‘‘బౌలింగ్‌ ఎవరు చేస్తున్నారన్నది కాదు….కొట్టామా…? లేదా…?’’అని జైస్వాల్‌ సమాధానం. మళ్లీ ఇంకో మాట కూడా అనే ఉంటాడు మరాఠీలో ‘‘చరిత్ర అడక్కు… కొట్టింది చూడు’’. ముంబాయి కుర్రాడు కదా…. అందుకని మరాఠీలోనే జవాబు ఇచ్చి ఉంటాడని నాకనిపించింది. గురువారం రాత్రి సరిగ్గా 9-15 నిమిషాలకు కొల్‌కతా వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ చూసిన వారందరికీ ఇలాగే అనిపించింది. అనిపించాలి కూడా. ఇదేదో లక్కు తగిలి ఇలా కొట్టాడనుకోకండి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో జైశ్వాల్‌ ఆడిన మ్యాచ్‌ల్లో ఒకటో, రొండో ఫెయిల్యూర్లు ఉన్నాయి తప్ప మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ బౌలర్లకు ఊచకోతే. ఈ బ్యాటింగ్‌ వీరంగాన్ని మాయంటామా… మిథ్యంటమా…. కళ్లముందు కనపడుతున్న వాస్తవం అనాల్సిందే.
ఈ కుర్రాడే కాదు…హైదరాబాద్‌ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌ కూడా ఇలా వచ్చిన వాడే. అంతెందుకు మా కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో సంచలన విజయాలు సాధిస్తున్నాడు. అన్నట్లు ఇలాంటి కుర్రాళ్లెవరికీ ర్యాంకుల బాధ లేదు. ఈ మాట ఎందుకంటే ర్యాంకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చాలామంది సాధిస్తారు. ఓ జైశ్వాల్‌, మరో సిరాజ్‌, మన సాత్విక్‌ సాయిరాజ్‌… వీళ్లకి ఎలాంటి ర్యాంకులు ఇవ్వాలి. అన్నట్లు వీళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలనుంచి వచ్చినవారే. గురువారం క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన జైశ్వాల్‌ ఫ్లాట్‌ ఫాం మీద పానీపూరీ విక్రయించే కుటుంబం నుంచి వచ్చాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఓ ఆటో డ్రైవర్‌ కుమారుడు. ఇక సాత్విక్‌ సాయిరాజ్‌… మా రంకిరెడ్డి కాశీగాడు అని ప్రేమగా పిలుచుకునే ఉపాధ్యాయ దంపతుల పుత్రుడు. ‘‘అగాథమౌ జలనిధిలోనా… ఆణిముత్యమున్నటులే’’ అని శ్రీశ్రీ అన్నట్లుగా వీరంతా ఆణిముత్యాలు. వెదకాలంతే. పట్టుకోవాలంతే. అవకాశాలు ఇవ్వాలంతే. అలా… ఇలా అవకాశం ఇచ్చిన ఐపీఎల్‌కి థాంక్స్‌ చెప్పాల్సిందే. ఈ కుర్రాళ్లను కొనుగోలుచేసిన ఫ్రాంఛైజీలకు థాంక్స్‌ చెప్పాల్సిందే. వీరికే కాదు…. ఇలాంటి వారిని ఎన్నో త్యాగాలుచేసి మనకందించిన ఆ తల్లిదండ్రులకు ప్రణమిల్లాల్సిందే. చిన్నమాట…విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఏడవ తరగతిలో పరీక్ష తప్పాడు. తన స్నేహితుడికి ఫస్ట్‌ర్యాంక్‌ వచ్చిందని చాలా ఆనందంగా తన తాతనోట్లో పంచదార పోశాడు రవీంద్రుడు. అన్నట్లు…ఆ ఫస్ట్‌ర్యాంక్‌ వచ్చిన స్నేహితుడెవరో మీరెవరైనా చెప్తారా….ఆ ర్యాంకర్‌ స్నేహితుడు ఎవరో నేనే కాదు ప్రపంచమంతా చెబుతుంది. ఈ లాజిక్‌ మిస్‌ అవుతున్నారేమిటో….
సీనియర్‌ జర్నలిస్ట్‌, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img