Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహత్తర పోరాటాలకు నాంది పలికిన కొత్తపట్నం వేసంగి రాజకీయ పాఠశాల ` 1937

గడ్డం కోటేశ్వరరావు

కొత్తపట్నం రాజకీయ పాఠశాల కేవలం 20 రోజులపాటే జరిగినా అందులో పాల్గొన్న విద్యార్థులు 1937 తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించి పార్టీని పెంచారు. అనేక ప్రజాపోరాటాలు చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి రద్దు కోసం, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి, నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముందుపీఠీన నిలిచారు.

ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో, కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించడానికి, సామాజికోద్యమాలు నిర్వహించ డానికి గొప్పగా దోహదపడిరది కొత్తపట్నం రాజకీయ పాఠశాల. ఇందులో శిక్షణ పొందినవారే ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. ఒకనాటి గుంటూరు జిల్లాలోని ఒంగోలు తాలూకా, ఒంగోలుకు తూర్పు దిక్కున 10 మైళ్ళ దూరంలో (సుమారు 16 కి.మీ.) సముద్రతీరాన కొత్తపట్నం గ్రామం ఉంది. అది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది.
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నాటి కాంగ్రెసు నాయకుల మద్దతుతో, యువజన సంఘాల యాజమాన్యం క్రింద 1937 మే 1 నుండి జూన్‌ 10వ తేదీ వరకు దాదాపు 40 రోజులపాటు ఆర్థిక, రాజకీయ పాఠశాలను కొత్తపట్నంలో నిర్వహించ తలపెట్టారు. కొత్తపట్నంలోని శ్రీరాం వెంకటరంగా సత్రం పరిసరాల్లో నిర్మించిన శిబిరంలో ఈ పాఠశాల నిర్వహించారు. పాఠశాల నిర్వహణ లక్ష్యం 40 రోజులే అయినా, ఆనాటి జస్టిస్‌ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ‘‘నడమంత్రపు’’ మంత్రివర్గం (సర్‌ కూర్మా వెంకటరెడ్డి నాయుడు ముఖ్యమంత్రిగా నడిచే ప్రభుత్వం) పాఠశాలను మే 20వ తేదీన నిషేధించడంతో, పోలీసు లాఠీచార్జీ మూలంగా పాఠశాల మే 21వ తేదీ నుండి అర్ధాంతరంగా మూసివేయాల్సి వచ్చింది. ప్రపంచ పరిస్థితులను తెలుసుకోడానికీ, క్లిష్ట సామాజిక సమస్యలను అవగాహన చేసుకోడానికీ, సమాజాన్ని పురోగామివైపు నడిపించడానికీ, ప్రజల్లో సౌభ్రాతృ త్వాన్ని నెలకొల్పడానికీ, భారత స్వాతంత్య్ర పోరాటం విజయవంతం కావడానికీ, యువజనులు, విద్యార్థులు నిర్వహించవలసిన కర్తవ్యాలను తెలుసుకోడానికి లక్ష్యంగా పాఠశాల నిర్వహించారు. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 180 మంది యువకులు, యువతులు ఈ పాఠశాలకు హాజరైనారు. విద్యార్థుల భోజన ఖర్చుల నిమిత్తం 40 రోజులకుగాను ఒక్కొక్కరి నుండి 7 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. జిల్లాల వారీగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్వహణకు అనేకమంది పెద్దలు, దాతలు విరాళా లిచ్చారు. విరాళాలిచ్చిన వారిలో ఆనాటి గుంటూరు జిల్లా కాంగ్రెసు కమిటీ, కమ్యూనిస్టుల సానుభూతిపరులు, స్వాతంత్య్ర పోరాట యోధులు ఉన్నారు. కొత్తపట్నం పరిసర గ్రామాల్లోని ప్రజలు వస్తు రూపంలోనూ, నగదుగానూ, వర్తకులు సరుకుల రూపంలోను విరివిగా విరాళాలిచ్చారు.
పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారిలో కామ్రేడ్స్‌ పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, పి.వి. శివయ్య, పోలేపెద్ది నరసింహమూర్తి, జొన్నలగడ్డ రామలింగయ్య, మునుపల్లె రామారావు, కంభంపాటి సీనియర్‌, అన్నాప్రగడ కామేశ్వరరావు, దొడ్డవరపు కామేశ్వరరావు, వాసిరెడ్డి శివలింగ ప్రసాద్‌, వి.రామ కోటయ్య, సాగి విజయ రామరాజు, మద్దూరి అన్నపూర్ణయ్య, నేతి చలపతిరావు, అల్లూరి సత్యనారాయణ రాజులు ప్రముఖులు.
పాఠశాలకు హాజరైనవారిలో ప్రముఖులు
పైన పేర్కొన్నవారితోపాటు కొల్లా వెంకయ్య, మోటూరి హనుమంతరావు, మాకినేని బసవపున్నయ్య, పిడతల రంగారెడ్డి, బసవారెడ్డి శంకరయ్య, తుమ్మల వెంకట్రామయ్య, ఏటుకూరి బలరామమూర్తి, కడియాల గోపాలరావు, సంకు అప్పారావు, చండ్ర సావిత్రి, వాసిరెడ్డి హనుమాయమ్మ, ఉద్దరాజు మాణిక్యమ్మ, వై.అన్నపూర్ణ, దాట్ల సూర్యనారాయణ రాజు, పుచ్చలపల్లి గోవిందమ్మ, అన్నాప్రగడ సరళాదేవి వగైరా ప్రముఖులతో కలిపి 180 మంది హాజరైనారు.
పాఠ్యాంశాలలో ముఖ్యమైనవి
ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, వివిధ దేశాల రాజకీయ చరిత్రలు, అక్కడ జరిగిన విప్లవాలు, వాటి పరిణామాలు, మార్క్సిజం వివిధ దశలు, రష్యా విప్లవం, పెట్టుబడిదారీ విధాన నిజ స్వరూపం, ఫ్రెంచి విప్లవం, భారత స్వాతంత్య్ర పోరాటం, రైతాంగ సమస్యలు, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర వగైరాలున్నాయి. విద్యార్థులను తెలుగు, ఇంగ్లీషు విభాగాలుగా చేసి, సిలబస్‌ ప్రకారం పాఠాలు చెప్పారు. మిలటరీ డ్రిల్లు చండ్ర రాజేశ్వరరావు నేర్పేవారు. వలంటీర్ల బాధ్యతలను, కర్తవ్యాలను గురించి చెప్పేవారు. సాగి విజయరామరాజు కర్ర, కత్తిసాములను నేర్పేవారు. అన్నాప్రగడ కామేశ్వరరావు గెరిల్లా సమర చాతుర్యాన్ని గురించి చెప్పే వారు. తుపాకులు పేల్చడం వగైరాలు కూడా నేర్పేవారు. డా॥ ఆమంచర్ల చలపతిరావు ప్రథమ చికిత్సలో శిక్షణనిచ్చారు.
అధ్యాపకుల్లో ప్రముఖులు
బాట్లీవాలా, డాంగే, సజ్జాద్‌ జహీర్‌, జయప్రకాశ్‌ నారాయణ, స్వామీ సహజానంద సరస్వతి, దినకర్‌ మెహతా, ఇందూలాల్‌ యాజ్ఞిక్‌, బి.శ్రీనివాసరావు, అచ్యుత పట్వర్థన్‌, ఎన్‌.జి.రంగా, కంభంపాటి, పోలేపెద్ది నరసింహమూర్తి, సుందరయ్య వగైరాలు.
పాఠశాలను మే 1వ తేదీన కేరళ కమ్యూనిస్టు నాయకులు పి. కృష్ణపిళ్లే ప్రారంభించారు. ఈయన కేరళ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ప్రథమ కమ్యూనిస్టుగా ప్రసిద్ధిగాంచారు. పాఠశాల అత్యంత క్రమశిక్షణాయుతంగా సాగిం దని ఎన్‌.జి.రంగా లాంటి కాంగ్రెసు నాయకులు కొనియాడారు. క్రమం తప్పక రోజూ పాఠాలు బోధించేవారు. వ్యాయామ క్లాసులు క్రమశిక్షణతో జరిగేవి. నిర్వాహకులు రోజుకు దాదాపు 18 గంటలు పనిచేసి పాఠశాలను విజయ వంతంగా 20 రోజులపాటు నిర్విఘ్నంగా నడిపారు. పాఠశాల నడుస్తున్న తీరు చూసిన నాటి బ్రిటీషు అనుకూల ప్రభుత్వానికి ‘‘కన్నుకుట్టింది’’. వామపక్ష ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం బలపడుతుందని భావించి, పాఠశాలను నిషేధించడానికి పూనుకున్నారు.
1937 మే 18న అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మంత్రివర్గం కొత్తపట్నం రాజకీయ పాఠశాలపైన నిషేధాజ్ఞలు విధించింది. ఉత్తర్వులు జారీచేసింది. ఆ విషయాన్ని మద్రాసు నుండి ఒక కామ్రేడ్‌ రహస్యంగా రెండు రోజులు సైకిల్‌పై ప్రయాణం చేసి 20వ తేదీన కొత్తపట్నం పాఠశాల శిబిరానికి వచ్చి చెప్పాడు. ‘‘ఆత్మగౌరవాభిమానధనులు, స్వాతంత్య్ర సమరయోధులు, పౌరసత్వ ధర్మవిధులు అయిన విద్యార్థులు, హాజరులో ఉన్న అధ్యాపకులు ఈ అక్రమ ఉత్తర్వులను ఉల్లం ఘించడానికి నిర్ణయించుకున్నారు’’ అని ఆనాటి పత్రికల్లో వార్తలు ప్రముఖంగా వచ్చాయి.
ప్రభుత్వ నిషేధాజ్ఞలను అమలుపర్చడానికి 1937 మే 21వ తేదీన జిల్లా కలెక్టర్‌ స్వయంగా కొత్తపట్నం వెళ్లాడు. రెండు వ్యానుల్లో రిజర్వు పోలీసులను, మరో రెండు లారీల్లో స్థానిక పోలీసులను వెంటబెట్టుకుని కలెక్టర్‌ వెళ్లాడు. పాఠశాల నాయకుల మీద రాజద్రోహ నేరం మోపారనీ, పాఠశాలను మూసివేసి అక్కడ నుండి విద్యార్థులు, నాయకులు వెళ్ళిపోవాలని కలెక్టర్‌ ఆదేశించాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించారు. పోలీసులు విద్యార్థులను, ఉపాధ్యాయుల పైన తీవ్రంగా లాఠీచార్జి చేశారు. అనేకమంది గాయపడ్డారు. 80 మందిని అరెస్టు చేశారు. కొత్తపట్నం నుండి ఒంగోలు వరకు మే 21వ తేదీన మిట్టమధ్యాహ్నం నడిపించుకుంటూ ఒంగోలు సబ్‌జైలుకు తరలించారు. విద్యార్థులను, అధ్యాపకులను బూతులు తిడుతూ కొట్టారు. మహిళా విద్యార్థులపైన తీవ్రమైన దౌర్జన్యం చేశారు. సాయంత్రం మూడు గంటలకు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. 80 మంది మీద రాజద్రోహ నేరం మోపారు. అందులో 17 మందికి సంవత్సరంపైగా శిక్షలు వేశారు. మే 21 సాయంత్రం ఒంగోలు కొండమీద దేవాలయం దగ్గర పెద్ద బహిరంగ సభ జరిగింది. పట్టణంలోని ప్రజలు విరివిగా పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకుడు బి. శ్రీనివాసరావు పోలీసు చర్యను ఖండిస్తూ ఉపన్యసించాడు. జిల్లాలోని కాంగ్రెసు సోషలిస్టు నాయకులు, కమ్యూనిస్టు నాయ కులు, కాంగ్రెసు నాయకులు మే 22వ తేదీన ఒంగోలులో మరో బహిరంగ సభ ఏర్పర్చారు. వక్తలు సామ్రాజ్యవాద ప్రభుత్వ దురంతాలను ఎండగట్టారు. జస్టిస్‌ పార్టీ మద్దతుతో నడుస్తున్న ‘‘నడమంత్రపు’’ మంత్రివర్గాన్ని, దాని దుశ్చర్యలను దుమ్మెత్తిపోశారు.
అఖిల భారత కాంగ్రెసు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కొత్తపట్నం రాజకీయ పాఠశాలపై జరిగిన దౌర్జన్యకాండను తీవ్రంగా నిరసించారు. పండిట్‌ నెహ్రూ, సి.పి.ఐ. నాయకుడు పి.సి.జోషి తీవ్ర పదజాలంతో సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలోనూ, దేశంలోని పత్రికలు బ్రిటీషు ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ వార్తలు ప్రచురించాయి. కొత్తపట్నం రాజకీయ పాఠశాల కేవలం 20 రోజులపాటే జరిగినా అందులో పాల్గొన్న విద్యార్థులు 1937 తద నంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించి పార్టీని పెంచారు. అనేక ప్రజాపోరాటాలు చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి రద్దు కోసం, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి, నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముందుపీఠీన నిలిచారు. అనేకమంది కాంగ్రెసు నాయకులు కూడా స్వాతంత్య్ర పోరాటంలో ఉవ్వెత్తున పాల్గొని పోరాటాన్ని నడిపారు. ప్రకాశం పంతులు, నెహ్రూలాంటి నాయకులు విద్యార్థులత్యాగనిరతిని, ధైర్య సాహసాలను, క్రమశిక్షణను గొప్పగా కొనియాడారు. కొత్తపట్నం రాజకీయ పాఠశాల రాజకీయ ప్రాధాన్యత ఎంత గొప్పదో పైన పేర్కొన్న ఘటనలు రుజువుచేస్తాయి. ఆనాటి ఉమ్మడిమద్రాసురాష్ట్రం యావత్తూ ఆ రాజకీయపాఠశాలప్రాధాన్యతను కీర్తించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img