Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మానవహక్కుల ఉద్యమకారిణి జహాన్‌ సాదత్‌

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

ప్రథమ మహిళగా జహాన్‌ లక్షలాది పేదల జీవితాలను అధ్యయనం చేశారు. అరబ్‌ స్త్రీల పట్ల ప్రపంచ దృష్టి కోణాన్ని మార్చారు. స్వచ్ఛంద కార్యకర్తగా అనేక ప్రభుత్వేతర కార్యక్రమాల్లో పాల్గొని పేదల బతుకులు మార్చారు. కంటిచూపులేని పిల్లలతో ప్రపంచ ప్రసిద్ధ్ద గాయక బృందాన్ని ఏర్పరిచారు. మహిళల స్వయంసమృద్ధి కోసం తాళ్ల సొసైటీ, క్యాన్సర్‌ రోగులకు ఈజిప్షియన్‌ సొసైటీ, రక్త నిధి, కుటుంబ వాతావరణంలో అనాథ పిల్లలను పెంచటానికి అనాథ గ్రామాలు స్థాపించారు. ముస్లిం సంప్రదాయ చట్టాల ఈజిప్టులో స్త్రీలు విడాకులివ్వగల, విడాకుల తర్వాత పిల్లలను తమతో ఉంచుకునే వీలున్న చట్టాలు చేయించారు. ‘‘జనాభాలో సగం పైగా స్త్రీలు. పురుషులతో సమానంగా స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వనంతవరకు ఈజిప్టు ప్రజాస్వామ్యం అనిపించుకోదు.’’ అని అన్వర్‌తో చర్చా వాదనలు చేసేవారు. 1979లో మహిళలకు పార్లమెంటులో 30 స్థానాల కేటాయింపు చట్టానికి అన్వర్‌ను ఒప్పించారు.

జహాన్‌ సాదత్‌ ఈజిప్టు మాజీ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ సతీమణి. మానవ హక్కుల, సామాజిక న్యాయ ఉద్యమకారిణి. 1970-1981 మధ్య ఈజిప్టు ప్రథమ మహిళ. ఆ హోదాలో జహాన్‌ చట్టాలు పేరుతో అనేక పౌర హక్కుల, మహిళా శిశు చట్టాలకు కారణమయ్యారు. సంస్కరణలను ప్రభావితం చేశారు. మహిళలకు ఆదర్శంగా నిలిచారు. సాదత్‌ అంటే అరబ్బీభాషలో సంతోషం.
జహాన్‌ ఈజిప్టు శస్త్రవైద్యులు సఫ్వత్‌ రవూఫ్‌, ఆంగ్లేయ సంగీత ఉపాధ్యా యిని గ్లాడిస్‌ కోటరిల్‌ దంపతులకు మూడవ సంతానంగా, మొదటి కుమార్తెగా 1933లో ఆగస్టు 29న ఈజిప్టు రాజధాని కైరోలో జన్మించారు. అరబ్‌ సాహిత్యంలో డిగ్రీ, తులనాత్మక సాహిత్యంలో ఎం.ఎ., డాక్టరేట్‌ చేశారు. కైరో కళా నిర్వహణ కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. జహాన్‌ బాల్యంలోనే పొరుగునున్న అల్‌-మనియల్‌ ద్వీపంలో ఒంటరిగా తిరిగి తల్లిదండ్రులకు స్వీయవిశ్వాసం ప్రదర్శించారు. ముస్లిం మహిళల మర్మాంగ కత్తిరింపు దుష్టసంప్రదాయాన్ని ఖండిరచారు. అన్వర్‌ సాదత్‌ ధైర్యసాహసాలు, విశ్వసనీయత, ఆంగ్లేయుల ఆక్రమణను ఎదిరించడంలో నిబద్దత గురించి జహాన్‌ యుక్త వయసులోనే విన్నారు. చదివారు. ఆయన్ను ఇష్టపడ్డారు. అన్వర్‌ రాజకీయ నేరంపై రెండున్నరేళ్ల జైలు శిక్ష నుండి విడుదలైన సందర్భంలో జహాన్‌ ఆయన్ను కలుసుకున్నారు. నిరుద్యోగ విప్లవకారునితో కూతురు పెళ్లి చేయటానికి జహాన్‌ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చివరికి 1949లో మే 29 న వారి పెళ్లి జరిగింది. పెళ్ళినాటికి జహాన్‌ వయసు 15, అన్వర్‌కు 30. అన్వర్‌ సైన్యంలో అధికారుల ఉద్యమంలో పనిచేశారు. 1952లో ఈజిప్టు-సూడాన్‌ రాచకరికాన్ని కూల దోశారు. అన్వర్‌ ఈజిప్టు అధ్యక్షుడు కావడానికి జహాన్‌ మద్దతుగా నిలిచారు. పాలనలో సహకరించారు.
ప్రథమ మహిళగా జహాన్‌ లక్షలాది పేదల జీవితాలను అధ్యయనం చేశారు. అరబ్‌ స్త్రీల పట్ల ప్రపంచ దృష్టి కోణాన్ని మార్చారు. స్వచ్ఛంద కార్య కర్తగా అనేక ప్రభుత్వేతర కార్యక్రమాల్లో పాల్గొని పేదల బతుకులు మార్చారు. 1967 అరబ్‌-ఇజ్రాయిల్‌ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్య చికిత్స, పునరావాసం, సైనికేతర ఉపాధి శిక్షణ అందించారు. కంటిచూపులేని పిల్లలతో ప్రపంచ ప్రసిద్ధ్ద గాయక బృందాన్ని ఏర్పరిచారు. మహిళల స్వయంసమృద్ధి కోసం తాళ్ల సొసైటీ, క్యాన్సర్‌ రోగులకు ఈజిప్షియన్‌ సొసైటీ, రక్త నిధి, కుటుంబ వాతావరణంలో అనాథ పిల్లలను పెంచటానికి అనాథ గ్రామాలు స్థాపించారు. ముస్లిం సంప్రదాయ చట్టాల ఈజిప్టులో స్త్రీలు విడాకులివ్వగల, విడాకుల తర్వాత పిల్లలను తమతో ఉంచుకునే వీలున్న చట్టాలు చేయించారు. ‘‘జనాభాలో సగం పైగా స్త్రీలు. పురుషులతో సమానంగా స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వనంతవరకు ఈజిప్టు ప్రజాస్వామ్యం అనిపించుకోదు.’’ అని అన్వర్‌తో చర్చా వాదనలు చేసేవారు. 1979లో మహిళలకు పార్లమెంటులో 30 స్థానాల కేటా యింపు చట్టానికి అన్వర్‌ను ఒప్పించారు. మెక్సికో నగరం, కోపెన్‌ హాగన్‌లలో జరిగిన ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా మహాసభలకు మహిళా ప్రాతినిధ్య బృందాలను తీసుకెళ్లారు. అరబ్‌-ఆఫ్రికా మహిళా సమాఖ్యను స్థాపించారు. ప్రపంచవ్యాపితంగా అనేక సమావేశాలు నిర్వహించారు. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల స్త్రీ శిశు సంక్షేమం, శాంతి స్థాపనలకు విశేషంగా కృషి చేశారు.
అన్వర్‌ సాదత్‌ 1978లో ఇజ్రాయిల్‌తో క్యాంప్‌ డేవిడ్‌ ఒప్పందాలు చేసు కున్నారు. ఇవి ఈజిప్టు ఇజ్రాయిల్‌ల మధ్య అమెరికాలో, అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి ఒప్పందాలు. వీటిలో పాలస్తీనా భూభాగాలకు సంబంధించి, ఆ దేశాన్ని సంప్రదించకుండానే, ఒప్పందం కుదుర్చుకున్నారని ముస్లిం తీవ్రవాదుల అభియోగం. ఇందులో అమెరికా కుట్ర ఉండవచ్చు. ముస్లిం తీవ్రవాదులు ఈ ఒప్పందాలకు తీవ్ర నిరసన తెలిపారు. అన్వర్‌ నిరసన కారులను జైల్లో పెట్టారు. ప్రతీకారంగా సైన్యంలో చొరబడ్డ ‘ఈజిప్షియన్‌ ఇస్లాం జిహాద్‌’ ఉగ్రవాద సంస్థ సభ్యులు సాదత్‌ను 1981లో అక్టోబరు 6 న హత్యచేశారు. సైన్యంలో ఉగ్రవాదులు దూరారని జహాన్‌ ముందే గ్రహించారు. బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకొమ్మని అన్వర్‌ను వేడుకున్నారు. ఆయన వినలేదు.
సాదత్‌ మరణానంతరం అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రం కాలేజ్‌ పార్క్‌ నగరంలో మేరీలాండ్‌ విశ్వవిద్యాలయంలో వరిష్ట బోధనాధికారిగా, అంతర్జా తీయ అంశాల అధ్యయన ఆచార్యురాలిగా, అమెరికాలో అమెరికన్‌, దక్షిణ కరో లినా, రాడ్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల అతిథి ఆచార్యురాలిగా పనిచేశారు. ‘ఈజిప్టు మహిళ’ శీర్షికతో స్వీయకథ, మారుపేరుతో అరబ్బీలో పద్యాలు, ‘శాంతి కోసం ఆశ’ శీర్షికతో స్మృతి చరిత్ర రాశారు. ప్రజాసేవ, మానవత్వ, స్త్రీశిశు సంక్షేమ కార్యక్రమాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ప్రపంచవ్యాపిత కళాశాలలు, విశ్వవిద్యాలయాలు 20 గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1993లో క్రైస్తవ సమూహ అంతర్జాతీయ శాంతి పురస్కారం, 2001లో అమెరికన్‌ రచయిత పేరుతో స్థాపించిన పీర్ల్‌ బక్‌ బహుమతి పొందారు. 87 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ వ్యాధితో దాదాపుగా రెండు నెలల క్రితం జులై 9వ తేదీన కైరోలో తుది శ్వాస వదిలారు. సాదత్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు, 11 మంది ఉప సంతానం ఉన్నారు. ఈజిప్టు ప్రభుత్వం ‘ఆర్డర్‌ ఆఫ్‌ పర్ఫెక్షన్‌’ మరణానంతర బిరుదు ఇచ్చింది. కైరో లోని ప్యారడైజ్‌ యాక్సిస్‌కు జహాన్‌ సాదత్‌ పేరు పెడతామని ప్రకటించింది. జహాన్‌ సాదత్‌ జీవితం ప్రథమ మహిళలకే గాక ప్రభుత్వాధినేతలకూ, పౌరులకూ ఆదర్శం. సామాజిక కార్యకర్తలు జహాన్‌ జీవితం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆమె జీవిత కృషిని మహిళా లోకానికి, ప్రత్యేకించి బాలికలకు ప్రచారం చేయాలి.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img