Friday, April 19, 2024
Friday, April 19, 2024

మిగిలింది ఆయన ‘‘అడుగుజాడలు’’

కథ అయినా.. కవిత్వమైనా… ఇతర ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజానికి ఉపయోగపడాలని, పేదల బతుకులు, ఆకలి, నిరుద్యోగం, రాజ్యాన్ని ప్రశ్నించడం వంటి రచనలు తప్ప మిగిలినవేవీ అసలు రచనలే కాదనే ఓ అమాయకత్వంతో బతుకుతున్న రోజులవి. నాలుగు దిక్కుల మధ్య జీవిస్తున్న నాకు తూర్పు కిరణాలు తప్ప మరో ఆశా కిరణం ఏదీ లేదని బలంగా నమ్మిన కాలమది. అజంతా అన్నట్లు ‘‘ఎర్ర దీపాలే నా జీవన సామాగ్రి’’ గా నేను మార్చుకోవడమే కాదు… సృజన కారులు, సాహిత్య అభిమానులు వాంఛించాలని కలలు కంటున్న దశ. అలాంటి సృజనకే తప్ప ఇక సాహిత్యానికి విలువ ఇవ్వని ఆ నా యవ్వన బాల్య దశలో ఎలా నా ఒడిలో వాలిందో తెలీదు ఆ కథ. బహుశా, హైదరాబాద్‌ నుంచి తన తోబుట్టువును చూసేందుకు ప్రతి నెలా క్రమం తప్ప కుండా మా అమలాపురం వచ్చే కథకుడు వి.రాజారామ్మోహన్‌ రావు తీసు కొచ్చారో, విశాఖపట్నంలో జర్నలిస్టుగాఉన్న కవి వసీరా ఆ విశాఖ నుంచి తీసుకు వచ్చాడో గుర్తు లేదు ఆ ‘‘సముద్రం’’ అనే కథను. మొదటి పేజీ చదవడానికి రోజంతా పట్టింది. నేను కాంక్షించేవీ ఏవీ ఆపేజీలో కానరాలేదు. ‘‘ఇలా ఎందుకు రాస్తారో’’ అని మొదటి పేజీకే విసుక్కునే వెర్రిమాలోక బాల్యం. కథని పక్కన పడేసి మార్పును కోరుకోకుండా సృజన చేయడం ఎంత దుర్మార్గం వంటి స్టేట్‌మెంట్లుకూడా ఇచ్చేసి తూర్పువైపు చూస్తూ రెండురోజులు కాలం గడిపేశాను.
భమిడిపాటి జగన్నాథరావు సముద్రం కధ చదివావా అని కవి మిత్రడు వసీరా పదే పదే అడిగిన పాపానికి సముద్రంలోకి దూకాల్సిందే అని నిర్ణయించు కుని కథని పూర్తి చేసాను. కనుచూపు మేర నీటి అలలు, చెవుల్లో మారుమోగే వాటి శబ్దాలు ఎరిగిన నాకు భమిడిపాటి జగన్నాథరావు సముద్రం కథ పూర్తయ్యే సరికి అలలు కాస్తా అలజడి సృష్టించాయి. సాహిత్యం ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడుకు న్యాయం చేస్తుందో గుర్తెరిగి రాయాలన్నా మహా రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి మాటలు నిరంతరం నా వెంటే ఉంటాయి. భమిడిపాటి వారి రచనలు ఆ కోవలోకి రావేమోననే ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఆ కథలకు దూరంగానే ఉన్నాను. సముద్రం కధ చదివిన తర్వాత నా ఆలోచనలు, ఆయన కథలపై నా అనుమానాలు పటాపంచలయ్యాయి. ఓ దంపతుల ఇంటికి వచ్చిన భర్త స్నేహితుడు ఓ రోజంతా ఆ ఇంట్లో ఉంటాడు. ఆ సమయంలో భర్త ఉద్యోగరీత్యా ఇంట్లో ఉండడు. ఆ సమయంలో ఆ అతిధిలో కనిపించిన సున్నితత్వానికి, మర్యాదకు ఆ భార్య పరవశురాలవుతుంది. అది ఎంత దూరం వెళ్తుందంటే ఆ అతిధి తనకు కావాలని కోరుకునే స్ధితికి వెళ్తుంది. అతిధి వెళ్లిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన భర్తకు ఆ విషయం చెబుతుంది. దానికి ఆ భర్త సమాధానానికి కథ చదువుతున్న వారి కళ్లు తెలియకుండానే కన్నీరు కారుస్తాయి. ‘‘నన్ను ఎంతో ప్రేమించే నిన్నే అతను తన ప్రవర్తనతో ఆకర్షించా డంటే వాడెంత సున్నితత్వం, సహృదయత ఉన్న మనిషో’’ అంటాడు. ఈ కథలో మూడుపాత్రలు మూడు మహోన్నతవ్యక్తిత్వం ఉన్న పాత్రలు. అసలు సమాజంలో ఇలాంటి పాత్రలు ఉన్నాయా. ఉంటాయా. ఎవరికైనా ఎక్కడైనా తారస పడ్డాయా అనే అనుమానం కలుగుతుంది. ఉంటాయి. ఉన్నాయి. నువ్వు చూడాలంతే అంటారు భమిడిపాటి జగన్నాథరావు ఈ కథను రాసి. నాకు జగన్నాథరావుని కలిసిన తర్వాత అతిధి పాత్రధారి కంటే భర్త పాత్రధారే ఆయనలో కనిపించాడు.
కాలంతో పాటు మనిషిలో కూడా అనేకానేక మార్పులు వస్తున్నాయి. మానవత్వం అనే మాటను ఇప్పుడు పత్రికల్లో వార్తగానే చూస్తున్న దశలో ఉన్నాం. ఇది మన దృష్టి లోపమా… అసలు అలాంటి వారు మన ఇళ్లల్లోనే కాదు…. సమాజంలో చాలా చోట్ల ఉన్నారు. నువ్వు చూడాలంతే అన్నట్లుగా చెప్పారు భమిడిపాటి జగన్నాథరావు. అడుగుజాడలు అనే కథ భమిడిపాటి జగన్నాథరావునే కాదు. తెలుగు కథనే ఓ స్ధాయికి తీసుకువెళ్లింది. పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఓ అయ్యర్‌ కుటుంబ కథ. ఈ కథని చెప్పిన పద్ధతి, కథకుడిగా భమిడిపాటి జగన్నాథరావు అందులో లీనమైన తీరు బహుశా తెలుగులో వచ్చిన అతి గొప్ప పది కథలలో ఒకటిగా నిలుస్తుంది. ఎక్కడో తన ప్రయాణం ప్రారంభించి, కుటుంబాన్ని వెంటేసుకుని ఊర్లు తిరుగుతు తన అస్తిత్వాన్నే కాదు… కుటుంబ అస్తిత్వానికి దెబ్బ తగలకుండా ఆ అయ్యర్‌ లోలోపల పడుతున్నవేదన, ఆ వేదన ప్రభావాన్ని బయటకు కనిపించనీయకుండా పైకి ఎంతో గంభీరంగా ఉన్న తీరు అద్భుతంగా చెప్తారు భమిడిపాటి జగన్నాథ రావు. ఈ అడుగుజాడలు కథ ‘‘నిరంతర అన్వేషణ ఎంత పురాతనమైనదో’’ అంటూముగిస్తారు. ఇదికథకి సంబంధించినముగింపుకాదు. మొత్తం సమాజానికి వర్తించే ముగింపు. ఓ సినిమా సభలో ‘‘అది చదివాక జేబులో చేతులు పెట్టుకుని అలానడుచుకుంటూ వెళ్లిపోయాను’’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆ వ్యాఖ్యఅప్పటిదే. కాని అడుగుజాడలు కథలో ముగింపు గుర్తొచ్చినప్పుడల్లా నేనేకాదు…. ప్రతి ఒక్కరూ అలానడుచుకుంటూ వెళ్లిపోవాల్సిందే.
భమిడిపాటి జగన్నాథరావు స్నేహానికి, అభిమానానికి వయసు ఏనాడు అడ్డు కాలేదు. అలాగే ఓ కథ నచ్చితే ఆ కథను తన భుజాన మోస్తూ ఊర్లు తిరిగి ఆ కథను, ఆ కథకుడ్ని ప్రచారం చేసే గొప్ప సాహిత్య మనసు భమిడిపాటి వారిది. ఇది నాకు అనుభవం కూడా. నా కూచిమంచి అగ్రహారం కథలను తనకు తెలిసిన వారందరికీ పంపించారు జగన్నాథరావు. పంపడమే కాదు…. నా ఫోన్‌ నంబరు కూడా ఇచ్చి అతనితో మాట్లాడండి అని చెప్పేవారు. అలా నాకు పదుల సంఖ్యలో ఫోన్లువచ్చాయి. తెలుగుసాహిత్యంలో ఒకే ఇంటిపేరుతో ఎక్కువమంది రచయితు లన్నది బహుశా భమిడిపాటి వారే. ఇదే వారికి శాపం కూడా అయ్యిందేమో. భమిడిపాటి కామేశ్వరరావు, భమిడిపాటి రాధాకృష్ణ, భమిడిపాటి రామగోపాలం (భరాగో), భమిడిపాటి జగన్నాథరావు. వీరంతా చాలా గొప్ప రచయితలు. కాని చిత్రం ఏమిటంటే ఏ భమిడిపాటిని చదివామో అనే చింత పాఠకుడ్ని నిరంతరం వెంటాడుతుంది. నామటుకు నాకు వీరందరిలోనూ భమిడిపాటి జగన్నాథ రావుతో నాకు ప్రత్యక్ష పరిచయంఉంది. ఇది నా అదృష్టం. భమిడిపాటి రామ గోపాలం అనే భరాగోగారితో నాకు ప్రత్యక్షవైరంనడిచింది. అది ఆయన అదృష్టం.
సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img