Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మూడో దశకీ సమన్వయం ఏదీ?

డా. జ్ఞాన్‌ పాఠక్‌

దేశంలో కొవిడ్‌`19 మూడోదశపైన విస్తృతంగానే చర్చ జరుగు తోంది. సామాన్యులు, నిపుణులు, ప్రతిపక్షం, పాలకపక్షం రాజకీయ నాయకులు మూడో దశ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అనేక వారాలుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మూడో దశపైన చర్చిస్తున్నాయి. తాము దేవదూతలుగా భావించి మాట్లాడుతున్న కేంద్ర పాలక వర్గం రానున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఐక్య పోరాటం చేయాలనిమాత్రమే ప్రజలను హెచ్చరిస్తోంది. అయితే ఆచరణలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయమూ లేదు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయటం, రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంది. ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవలసిన అంశం. అయితే ఇప్పటికే ఆర్థికంగా, వైద్య సౌకర్యాల కల్పనలో, టీకాల పంపిణీ, మందులు, ఆక్సిజన్‌ లాంటి అంశాలలో రాష్ట్రాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయి. రాష్ట్రాల సమన్వయంతో కొవిడ్‌ను నియంత్రించవలసి ఉన్నప్పటికీ కేంద్రం ఆదేశాల మేరకే రాష్ట్రాలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ఉదాహరణకు కేంద్ర పాలిత దిల్లీని తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రాంత ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కానీ భాగస్వాములను చేయలేదు. వాస్తవంగా కొవిడ్‌ నియంత్రణ కార్యక్రమాలను చేస్తున్నది మాత్రం కేజ్రీవాల్‌ ప్రభుత్వమే. సమాంతరంగా సమావేశం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇలాంటివి మూడో దశ కరోనా ఏర్పాట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఏకపక్షంగా సమావేశం పెట్టిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బైజల్‌ ప్రభుత్వ సమన్వయంతో పని చేయాలని మాత్రం పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకుండా సమన్వయం ఎలా సాధ్యం?
రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య ప్లాంట్లను, ఎల్‌ఎమ్‌వో స్టోరేజీ ట్యాంకులను, క్రయోజెనిక్‌ ప్లాంట్లను ఆగస్టు 31 నాటికి సిద్ధంగా ఉంచాలని బైజల్‌ కోరారు. ఆగస్టు 15 తరవాత ఎప్పుడైనా మూడో దశ రావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. బైజల్‌ మాత్రం 31 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖను కోరడం వింతగా లేదూ! మొదటి, రెండో దశలలో దిల్లీలో ఎక్కువగానే పాజిటివ్‌ కేసులు, డాక్టర్లతో సహా వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్‌ కొరత వల్ల డాక్టర్లు కూడా చనిపోయారు. కేంద్రం మాత్రం ఆక్సిజన్‌ లేక ఎవరూ చనిపోలేదని బుకాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కొవిడ్‌ మరణాలను అదుపు చేసింది. బైజల్‌ సమావేశం జరిపిన రోజు దిల్లీలో ఒక్క మరణం కూడా లేదు. అయితే మరణాలను అదుపు చేసిన ఖ్యాతిని తామే కొట్టేయాలని మోదీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. పని మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిది. కరోనాను అదుపు చేసిన ఘనత తమదేనని కేంద్రం ప్రచారం చేసుకుంటోంది.
కేరళ మరో ఉదాహరణగా తీసుకుందాం. దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో సగం కేరళ వాటానే అనేది సందేహం లేదు. ఆగస్టు 5న ఒక్కరోజే 23,676 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నియంత్రణ చర్యలలో కేరళ పని విధానమే ఉత్తమంగా ప్రశంసలు పొందింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. అందువల్ల కేరళ ప్రభుత్వాన్ని విమర్శించటం కంటే అక్కడ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, తాము అందించవలసిన సహాయ సహకారాలు గురించి ఆలోచించటం మంచిది. ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ అంశం. కేంద్ర ప్రభుత్వం మాత్రం దిల్లీలో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తూ రాజకీయాలు నడుపుతోంది. డెల్టా వేరియంట్‌ లాంటివి వేగంగా విస్తరిస్తూ మరింత ముప్పు కలిగిస్తాయని, రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఈ వేరియంట్‌ను నియంత్రించేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. కనీసం దీనిపై పార్లమెంటు చర్చించనే లేదు. మూడో దశ గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అవసరమైన వైద్య, మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పాటు ఆరోగ్య సిబ్బందిని, కార్యకర్తలను సిద్ధంగా ఉంచాలి.
మూడో దశను ఎదుర్కొనేందుకు గత నెలలో 23,123 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించింది. ఈ నిధులను రాష్ట్రాలు, కేంద్రం పంచుకోవాలి. కేంద్రం వాటా 15 వేల కోట్లు ఉంటుంది. అయితే ఆర్థిక కష్టాలు తలెత్తాయని, ఆరోగ్య కేంద్రాలకు, ఆసుపత్రులకు, ఇతర సంస్థలకు కేటాయించిన తరవాత మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అందజేస్తారు. ఈ నిధులలోను 15 శాతం కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. మరి కొద్ది వారాల్లోనే మూడో దశ ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్న ప్రభుత్వం తక్కువ సమయంలో కొద్ది మొత్తంతో సమర్థమైన వైద్య చికిత్స ఏర్పాట్లు సాధ్యమేనా! టీకాల పంపిణీ విషయంలోనూ చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతన లేదు. తగినన్ని టీకాలు లేవని అనేక రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. అయినా ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దాదాపు లేవనే చెప్పాలి.
పాజిటివ్‌ రేటు 10 శాతానికి మించి ఉన్న పది రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించాలని కేంద్రం కోరింది. మహరాష్ట్ర, కేరళ, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మిజోరం, అసోం, మేఘాలయ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం పాజిటివిటి రేటు నమోదవుతోంది. కొద్ది వారాలుగా మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబరు, నవంబరు మధ్య మూడోదశ ప్రారంభం కావచ్చునని మరి కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img