Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మేసే గాడిద కూసింది

చింతపట్ల సుదర్శన్‌

పాడుబడ్డ ఇంటి అరుగుమీద తీరిగ్గా కూచుని ఉంది గాడిద. ఆ పక్కనే తోక చుట్టూ సరాదాగా తిరుగుతూ ఆడుకుంటున్నది కుక్క. అబ్బాయి ముఖం సెల్‌ఫోన్‌లో ఉంది. మైదానం చివర నుంచి పోలీసు జీప్‌ సైరన్‌ వినిపించింది. పోలీసుల జీపు ఇటే వస్తున్నది. ఈ చివర్న మనం ఉన్న కొంప తప్ప మరేమీ లేదు కదా!’ అంది గాడిద. పోలీసులు గాడిద కోసమో, కుక్క కోసమో రారు కదా నాకోసం వస్తున్నారేమో!’ అన్నాడు అబ్బాయి కీడు శంకిస్తూ, ‘ఏం చేశావన్నా! అధికార పార్టీ ఎమ్‌ఎల్‌ఏ చిటికెనవేలి గోరు/వంకరగా ఉందనికాని, ప్రతిపక్ష నాయకుడి స్పీచ్‌లో ఆవగింజంత నిజం ఉందని కానీ అనలేదు కదా’ అంది గాడిద.
స్టేషన్‌లో లాకప్‌ రూం ఖాళీగా ఉందనేమో లేక నేనిక్కడ మందుకొడు తున్నానన్న విషయం ‘సిట్‌ వాళ్లు చెప్పారేమో అంటూ ఇంటి వెనకకు పరుగెత్తాడు అబ్బాయి. జీపువచ్చి అరుగు దగ్గర ఆగింది. లాటీలు ఊపు కుంటూ పోలీసులు దిగారు. కుక్క మొరగడం మొదలుపెట్టింది. చుప్‌ రహో! కుక్కను కాల్చినట్లు కాల్చేస్తా అన్నాడో పోలీసు. ఎన్‌కౌంటరంటూ మనుషుల్నే కుక్కల్లా కాల్చేస్తారు. కుక్కలో లెక్కా మీకు అనిలోపల అనుకున్నా కుక్క నోరు మూసుకుంది. ‘ఇక్కడ మేం తప్ప ఎవ్వరూ లేరు’ అంది గాడిద ధైర్యంచేసి ‘మేం వచ్చింది నీ కోసమే. నిన్ను అరెస్టు చేస్తున్నా యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌!’ అని అరిచాడు ఇన్‌స్పెక్టర్‌. నిర్ఘాంతపోయి గాడిద తత్తర పడుతూ లేచి నిలబడ్డది. ‘ఆఫ్టరాల్‌ ఒక గాడిదను నన్ను అరెస్టు చెయ్యడమేమిటి వింతకాదూ అంది గాడిద.
వింతలూ, విడ్డూరాలూ స్టేసన్‌లో చూపిస్తాం పద అన్నాడో పోలీసుల ‘నేనేం చేశాను? నా నేరం ఏమిటి? అరెస్టు వారెంటు ఉందా?’ అంది గాడిద తలపైకీ కిందకీ ఊపుతూ, ‘పోలీసుల్నే ప్రశ్నించేంత తెలివున్న గాడిదవన్న మాట నోరుమూసుకుని మా వెహికల్‌ వెనకాలే పరుగెత్తుకురా. తప్పించుకోవాలని చూశావో తెలుసు కదా’ అంటూ రివాల్వర్‌ ఊపాడు ఉన్‌స్పెక్టర్‌. జీపు నాలుగు టైర్ల వెనుక గాడిద నాలుగు కాళ్లు పరుగెత్తాయి.
కోర్టు హాలు నిండిరది. పత్రికల వాళ్లు ఫోటో గ్రాఫర్లను లాక్కొచ్చారు. టీవీల వాళ్లు బ్రేకింగ్‌ న్యూస్‌లో అడ్వర్టయిజ్‌ మెంట్లతో జనాన్ని రోజంతా తినెయ్యడానికి వచ్చేశారు. ‘జడ్జిగారు వస్తున్నారు’ అని అరిచారెవరో. అందరూ లేచి నిలబడ్బారు. నిలబడే ఉండే గాడిదకు ఆ అవసరం రాలేదు. ‘మిలార్డ్‌! ఈ గాడిద ఒక దేశద్రోహి నగరంలో గోడల మీద నగర పాలకుని ఫొటో, దాని క్రింద మేము ఈయననే నమ్ముతున్నాము అన్న వాక్యం రాసిఉన్న స్టిక్కర్లు అంటించబడ్డాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్టిక్కర్లను గౌరవనీయులైన ఆయన ఫోటోతో సహా నమిలి మింగేసి ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన ఈ అడ్డ గాడిదను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతున్నా అన్నాడు. నల్లకోటు, నల్ల ముఖమూ ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.
‘నేరాన్ని అంగీకరిస్తావా? నువ్వు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా? అనడిగారు జడ్జిగారు. కళ్లజోడుతీసి పక్కనపెట్టి గాడిదనుపరీక్షగా చూస్తూ.. ‘‘అయ్యా! దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అవసరాలకు దేశభక్తిని వాడుకునే మనుషులున్న ఈ లోకంలో, ఒక మొండితోక గాడిద, దొరికితే గడ్డి, దొరక్కపోతే కాగితాలుతప్ప మరేమీ ముట్టని ఈ గాడిద మొరవినండి’ అంది గాడిద వినయంగా తల వంచి.
‘ప్రొసీడ్‌!’ అన్నారు జడ్జిగారు. ‘నగర పాలకుడైనంత మాత్రాన ఒక వ్యక్తి ఫొటో ఉన్న స్టిక్కర్లను ఖాÄళీచోటు అనేది లేకుండా, కొత్తగా రంగులు వేసుకున్న ఇళ్లగోడలకు కూడా ఇష్టం వచ్చినట్లు అతికించడాన్ని నేను ప్రశ్నించను. ఆయా ఇళ్ల యజమానుల ఘోషను ప్రస్తావించను. మేము ఈయననే నమ్ముతున్నాము అన్న వాక్యం రాసిఉన్న కాగితాలను తిన్నానని నా మీద అభియోగం, ఆయన్ని కాదు ఈయన్ని నమ్మండి అని రాసి మరో మనిషి ఫొటోను ఆస్టిక్కర్ల మీద ఎవరో అంటించారు. వాటినే నేను నమిలాను. వాటి కింద నగరపాలకుని ఫొటో ఉందని నాకు తెలియదు నగరం నిండా బిల్డింగులు, అపార్టుమెంటులు ప్రాణం నిలబెట్టుకోడానికి స్టిక్కర్లను తిన్నమాట నిజమే’ అంది గాడిద.
ప్రాసిక్యూటర్‌ లేచి గాడిద తప్పు ఒప్పుకుంది. ‘శిక్షించండి మిలార్డ్‌’ అంటూ.. పళ్లికిలించాడు. ‘మిలార్డ్‌! ఆకలితో ఉన్న ఏ గాడిదైనా కాగితాలే కదా తినేది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 21 సూచించిన జీవించే హక్కు గాడిదలకు వర్తించదా? మావవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో 25వ నిబంధనలో ఉన్న ఆహారం, నీరు, పరిశభ్రత, వైద్య సహాయం వంటివి మనుషులకేనా? గాడిదను కాబట్టి నేను జీవించడం తప్పా జీవించడానికి స్టిక్కర్లు తినడం, నేరమా? యువరానర్‌! అయితే నేరం నాదికాదు ఆకలిది’ అంది గాడిద. జడ్జిగారు గాడిదను నిర్దోషిగా విడుదల చేశారు. అరుగుమీద గాడిద కోసం ఎదురుచూస్తున్న కుక్క గాడిదను చూసి సంతోషం పట్టలేక ‘నాటునాటు’ డాన్సు చేసింది. గాడిదకోసం బాధపడ్డానికో తిరిగొస్తే ఆనందించడానికో మందు తెచ్చుకున్న అబ్బాయి సీసా మూత తీశాడు. శాన్నాళ్ల్ల తర్వాత పట్టలేని ఆనందంలో ఒళ్లు విరుచుకుని గాడద తనకు వచ్చిన శాస్త్రీయ సంగీతాన్ని వినిపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img