Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మే నెల-ఉపశ్రేణుల ఉద్యమాలకు ప్రేరణ కావాలి

డి.వి.వి.యస్‌. వర్మ
మే నెలకు ఒక ప్రత్యేకత వుంది. మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే 5- కార్ల్‌ మార్క్స్‌ జయంతి. మే 9 – ఫాసిజం పై విజయం సాధించిన రోజు. వర్తమాన దేశ రాజకీయాల విశ్లేషణకు కొత్త తరహా ప్రజా ఉద్యమాలకు, నినాదాలకు ఇవి ప్రేరణ ఇస్తాయి. మే డే నాడు 8 గంటల పనిదినం కోసం సాగిన చికాగో పోరాటం, కార్మికుల రక్త తర్పణం గుర్తు చేసుకుంటారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న నినాదం ఇస్తారు. వాస్తవానికి ఈ రెండు మే డే ఉద్యమంలో పుట్టిన నినాదాలు కావు, దానికి ప్రేరణ ఇచ్చిన నినాదాలు. 1866లో మార్క్స్‌ సారథ్యంలో ఏర్పడిన మొదటి ఇంటర్నేషనల్‌ 8 గంటల పని దినాన్ని డిమాండ్‌ చేసింది. 1848లో మార్క్స్‌- ఏంగెల్స్‌లు రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక ముగింపు నినాదం ‘‘ప్రపంచ కార్మికులారా! ఏకం కండి!’’ దానికి ముందు ‘‘వారు గెలుచుకోడానికి ఓ ప్రపంచం వుంది’’ అన్న వాక్యం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇది దోపిడీలేని ప్రపంచాన్ని సాధించే కార్యాచరణకు ఇచ్చిన పిలుపు. ఎందుకో ఇది మే డే ప్రసంగాలలో, నినాదాలలో ప్రాధాన్యత లేనిదైంది. మే డే ఉద్యమం హక్కుల ఉద్యమంగా ప్రారంభమైనా ఆ నినాదాల వెనక దోపిడీ వ్యవస్థను కూల్చే రాజకీయం వుంది. దానికి కార్మిక వర్గాన్ని సంసిద్ధుల్ని చెయ్యాలి.
ప్రస్తుతం మన ముందు కొన్ని సవాళ్లు వున్నాయి. వాటిని పరిశీలించు కుందాం. 1. మనదేశంలో శ్రామిక వర్గం ఒకే రూపంలో లేదు. పారిశ్రామిక కార్మిక వర్గం కంటే వివిధ రంగాలకు విస్తరించిన అసంఘటిత కార్మికవర్గం అత్యధికంగా వుంది. బహురూపాలలో విస్తరిస్తున్న సేవారంగం వివిధ రకాల ఉద్యోగ బృందాలను సృష్టిస్తున్నది. మరో పక్క గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, చాలా అనేక దొంతర్ల రైతులు వున్నారు. దీనికితోడు సమాజంలో వివక్ష వుంది. అణిచివేత వుంది. దళితులు, బహుజనులు, వివిధ మతాల మైనారిటీలు మహిళలు వున్నారు. వీరంతా ఒక పక్క దోపిడీకి, మరోపక్క వివక్షకీ గురౌతున్నారు. ఆంటోనియో గ్రాంసీ మాటల్లో ఇవన్నీ ఉపశ్రేణి తరగతులు ఈ ఉపశ్రేణులను ఐక్యం చెయ్యడం ఎలాఅన్నది మన మొదటి సమస్య. 2. రెండవ అంశం: ఈ ఉపశ్రేణులు గెలుచుకోవలసిన మరో ప్రపంచం, అంతరాలు లేని సమ సమాజం. అయితే ప్రస్తుతం దేశం నడక దీని విరుద్ధంగా వుంది. సంపద కొద్ది మంది దగ్గర మేటలు వేస్తున్నది. పేదరికం మరోచోట తిష్ట వేస్తున్నది. మోదీ 9 ఏళ్ల పాలనలో సంపద కేంద్రీకరణ శరవేగంతో సాగుతున్నది. 2013 నాటికి 60 మంది వున్న బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 119 కి పెరిగింది. 10 శాతం సంపన్నుల చేతిలో 77 శాతం దేశ సంపద పోగు పడిరది. ప్రతి ఏటా పెరిగే సంపదలో 73 శాతం కేవలం 1 శాతానికి చేరిపోతున్నది. 67 కోట్ల మంది కేవలం 1శాతం సంపదను పంచుకుంటున్నారు.
దేశంలో విమానాశ్రయాలు, పోర్టులు, ఆయిల్‌నిక్షేపాలు, ఖనిజ సంపదను కార్పొరేట్లు వశం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలన్నీ వారి పరం అవుతున్నాయి. వివిధపార్టీలు వీటిపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. వాటిలో ప్రజలు భాగస్వాములు కావడంలేదు. ఇంతగా కార్పొరేట్లు దేశాన్ని దోచుకుంటున్నా ఈ శక్తులను సవాలుచేసే ప్రజాఉద్యమం రావడం లేదు. ఇది మరో పరిశీలనాంశం. మూడో అంశం: మోదీ పాలన ప్రజానుకూలం కాకపోగా ప్రజావ్యతిరేకమైంది. దేశానికి అచ్ఛేదిన్‌ రాలేదు. విదేశాలలో మూలుగు తున్న నల్లధనం తేలేదు. ప్రజలకు పంచలేదు. పెద్దనోట్లు రద్దుచేసి దేశంలో నల్లధనం వెలికి తీస్తానన్నది జరగలేదు. బ్యాంకుల దగ్గర క్యూలలో సామాన్యులు బారులు తీరారు. అక్కడే 200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. జి.యస్‌.టీ తో ధరలు తగ్గుతాయన్న హామీ తిరగబడిరది. నిత్యవసరాల ధరలు పెరిగాయి. పెట్రోలు, గ్యాస్‌ ధరలు ప్రతి ఇంటా మంటపెడుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు అన్నమాట అటకెక్కింది.
ఒకనాడు తాత్కాలికంగా ఉల్లిపాయల ధరలు పెరిగితే ప్రజలు ప్రభుత్వాలను మార్చేశారు. ఇప్పుడు అన్నీ పెరిగి జీవితం భారం అయినా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. పైగా దేశంలో జరుగుతున్న సర్వేల ప్రకారం మోదీయే ప్రధాని కావాలనుకునేవారు ఇప్పటికీ 52 నుండి 62 శాతం వున్నారు. ఇదీ మనం పరిశీలించుకుని తీరాల్సిందే. మోదీ బలం ఆయన ఆర్థిక విధానాలలో లేదు. పరిపాలనాదక్షతలో లేదు. మోదీ నడుపుతున్న రాజకీయంలో వుంది. తనకు తాను హిందూ జాతీయవాదినని ప్రకటించుకున్నారు. భారత జాతీయవాదం దేశపౌరులందరినీ సమానంగా చూస్తుంది. హిందూ జాతీయవాదం ఈ దేశం హిందువులది మాత్రమేనని ఇతరులంతా పరాయివారుగా విభజిస్తుంది. విద్వేష రాజకీయాన్ని సాగిస్తుంది. ఈ భావజాలమే దేశానికి ఒక ఉక్కు మనిషిని అవసరం చేస్తుంది. ఒక హీరోని ముందుకు తెస్తుంది. భక్తులనీ, ఉన్మాదులను తయారు చేస్తుంది. ఈ అగ్గి చల్లారకుండా రోజుకొక మతవివాదాన్ని ముందుకు తెస్తారు. ఒక మందిరం తర్వాత మరొక మందిరం, ఒక కట్టడం తర్వాత మరో కట్టడం, ఒక పేరు మార్పిడి తర్వాత మరొకటి, చరిత్రను తిరగరాయడం, పురాణాలే చరిత్రలుగా ప్రకటించడం మనువాదమే. మన రాజ్యాంగం అనే వివాదాలే నిత్య ఎజెండాగా ఉంది. పార్టీల స్పందనలు దీని చుట్టూ సాగుతాయి. నిత్య చర్చల పేరుతో మీడియా ఈ విద్వేషాన్ని రోజువారీ టానిక్కుగా ప్రజలకు అందిస్తాయి. ఇలాంటి ఉన్మాదం, విద్వేషం ప్రజల తలకెక్కితే నిత్యజీవిత సమస్యలు తెరమరుగౌతాయి.
ఇదే మోదీకి బలంగా మారుతున్నది. ప్రశ్నించేవాడు దేశద్రోహి అవుతాడు. కాదన్నవాడు జైలుపాలవుతాడు. అన్ని రకాల ఫాసిస్టు పద్ధతులకు ద్వారాలు తెరుచుకుంటాయి. దీనిని ఎదుర్కోనడం ఎలా అన్నది మరో కీలక అంశం. మనం మూడు అంశాలను ప్రస్తావించుకున్నాం. వాటికి ఆచరణయోగ్యమైన సమాధానాలను అందరూ ఆలోచించాలి. 1. ఉపశ్రేణుల ఐక్యత: ఈ ఉప శ్రేణుల ఐక్యతను సాధించకుండా రాజకీయరంగంలో ఆశించిన మార్పులు రావు. ఇవి వృత్తిపరంగా భిన్నమైనవి. పట్టణ-గ్రామీణ ప్రాంతాలు నివాస పరంగా భిన్నమైనవి. వివక్షకు గురి కావడంలోనూ భిన్నమైనవి. వీటి మధ్య ఎంతోవైవిధ్యం. ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. పట్టణాలలో, గ్రామాలలో కింది స్థాయి నుండీ యీ శ్రేణుల మధ్య ఐక్యతకు ప్రయత్నాలు జరగాలి. ఒకరి సమస్యలపై మరొకరి సహకారం ఈ ఐక్యతకు పునాది అవుతుంది. ఇదిమాత్రమే సరిపోదు. ఈ ఉపశ్రేణులన్నింటి ఆకాంక్షలను వక్తీకరించేదీ, వారి జీవితాలకు కొత్తరూపును ఇచ్చే ఒక కొత్త నినాదాన్ని రూపొందించ గలగాలి. అలాంటి ఆచరణయోగ్యమైన నినాదం మాత్రమే వారి మధ్యగల వైరుధ్యాలను వెనక్కినెట్టి ఐక్యతకు దారి తీస్తుంది. దీనిని రూపొందించగలిగితే అది వ్యవస్థ మీద పోరాడే గొప్ప ప్రజా ఉద్యమానికి ప్రేరణ అవుతుంది.

  1. పోగుపడ్డ సంపద పునఃపంపిణీ: ఒక నినాదం ప్రజా ఉద్యమంగా విజయం సాధించాలంటే ఆ నినాదం సమంజసమైనదేనని ప్రజలు భావించాలి. దానిని అమలు లోకి తెచ్చే మార్గాలు ఆచరణ సాధ్యమేనన్న నమ్మకం కలగాలి. దానివల్ల తమ జీవితాలు ఎలా మారతాయో వారికి స్పష్టంగా కనిపించాలి. కార్పొరేట్ల సంపద అంతా దోచుకున్న శ్రమే. అదే వారిదగ్గర పోగుపడ్డ సంపద. దానిని జాతిపరం చెయ్యడం సమంజసమే. ప్రస్తుతం దానిలో కొంత భాగమైనా తక్షణం పంపిణీ జరగాలి. ఇది మనకి కొత్తకాదు. ఒక పరిశ్రమ యజమాని దగ్గర లాభంగా పోగుపడ్డ శ్రమలో ఒక భాగాన్ని బోనస్‌గా పంపిణీ చెయ్యడం లాంటిదే.
    ఇతర దేశాలలో వలే మన దేశంలో కూడా తగిన స్థాయిలో కార్పొరేట్‌ల సంపదమీద, వారసత్వ ఆస్తి బదలాయింపు మీద పన్ను విధించాలి. తగ్గించు కుంటూ వస్తున్న కార్పొరేట్‌ పన్నును పెంచాలి. ఇలాంటి పన్నులు విధిస్తే ఆక్స్‌ఫామ్‌ సంస్థ అంచనాల ప్రకారం పునఃపంణీకి వచ్చే సొమ్ము లక్షల కోట్లలో వుంటుంది. దీనిని ఉపశ్రేణులకు వారి జీవితాలను మార్చే విధంగా పంపిణీ చెయ్యాలి. రాజ్యాంగం ప్రకారం అందరికీ జీవించే హక్కు వుంది. ప్రతి కుటుంబానికి హక్కుగా నివాసం, హక్కుగా ఉచిత ఆరోగ్యవైద్య సదుపాయం, హక్కుగా పిల్లల చదువు, వృద్ధులకు పెన్షన్లు, గౌరవంగా జీవించడానికి ప్రతి కుటుంబానికి నగదు బదిలీని ప్రకటించాలి. యువతకు ఉపాధి హక్కు లేదా నిరుద్యోగ భృతి, రైతుల పంటనంతా మద్దతు ధరకి కొనుగోలుచేసే రైతు మార్కెట్‌ వ్యవస్థ ఏర్పాటు వగైరాలు సాధ్యమౌతాయి. సంపద పునః పంపిణీ నినాదం ఉపశ్రేణుల ఉమ్మడి నినాదం అవుతుంది. ఐక్య ఉద్యమానికి ప్రేరణ అవుతుంది. 3. ఫాసిజంపై సాంస్కృతిక ఉద్యమం: మోదీ అనుసరిస్తున్న విద్వేష రాజకీయం, ఉన్మాద రాజకీయం, ఫాసిస్టు భావజాలం పౌరసమాజంలోని అత్యధికుల లోకజ్ఞానంలో భాగంఅయింది. దీనిని విచక్షణాజ్ఞానంగా మార్చడం కేవలం నినాదాలతో సాధ్యపడేది కాదు. మన పౌరసమాజంలో ఒకగొప్ప భావ జాల సంఘర్షణ జరగాలి. వ్యక్తుల బుర్రలనుండి, సమూహాల చైతన్యంలో చొర బడ్డ మనువాద ఆధిపత్య భావజాలాన్ని, తొలగించడానికి తగిన సాంస్కృతిక సంఘర్షణ జరగాలి. లేకపోతే ప్రజాస్వామ్య భావజాలం మనుగడ సాగించ లేదు. మే నెలలో నిర్వహించే కార్యక్రమాలు-ఉపశ్రేణుల ఐక్యతకి, సంపద పునః పంపిణీ ఉద్యమానికి, ఫాసిస్టు విద్వేష భావజాలంపై సాగించే ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి ప్రేరణ ఇచ్చేవిగా వుంటాయని ఆశిద్దాం.
    దారి దీపం సంపాదకులు, సెల్‌: 8500678977

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img