Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మొండి బకాయిలపై అబద్ధాల ప్రచారం

భారతదేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. అలాంటి వ్యవస్థల్లో బ్యాంకింగ్‌ రంగం ఒకటి. భారత దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులన్నీ బడాపరిశ్రమ దారులకు, భూస్వాములకు, కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్లలో రుణాలు అందచేస్తున్నాయి. వ్యవసాయదారులైన రైతులకు మాత్రం నామమాత్రపు రుణాలు ఇచ్చేందుకు కూడా అనేక ఆంక్షలు, షరతులు పెడుతున్నాయి. వడ్డీ వసూళల్లో కూడా బడా పారిశ్రామికవేత్తలు, రైతుల మధ్య వ్యత్యాసం కొనసాగుతున్నది. రుణాల వసూళ్లలోనూ ఆ వివక్ష కొనసాగుతోంది. గత పది సంవత్సరాలపైగా బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరుగుతూ ఉన్నాయి. అందుకు కారణమైన బడా పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను వదలిపెట్టి, ఆరుగాలం పొలంలో చెమట బిందువులు చిందించి దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతాంగమే మొండి బకాయిలు పెరగటానికి కారణంగా ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రచారం. మొండి బకాయిల్లో కార్పొరేట్ల, రైతుల రుణాలు పరిశీలిస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వాల బడా పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుతున్నతీరు వెల్లడౌతోంది.
బ్యాంకింగ్‌ రంగంలో అత్యంత కీలకమైన అంశం నిరర్థక ఆస్థులు (మొండి బకాయిలు). బ్యాంకులు జారీచేసిన రుణాలకు సంబంధించిన ఒక వర్గీకరణ ఇలా పేర్కొంది. రుణాలు తీసుకున్న వారు సమయానుకూలంగా చెల్లింపులు జరపటంలో విఫలమైతే అలాంటి వాటిని ఎన్‌పీఏలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అయితే ఈ చెల్లింపులు నిర్దిష్టకాలంపాటు జరగకపోతే, వాటిని మొండి బకాయిలుగా పేర్కొంటారు. అనేక విమర్శల నేపథ్యంలో మోదీప్రభుత్వం కూడా మొండి బకాయిల వివరాలు వెల్లడిరచక తప్పలేదు. ఒక ప్రశ్నకు సమాధానంగా గత ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో మొండి బకాయిలు 10,09,511 కోట్లు ఉన్నట్లు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 13-12-22న పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మొండి బకాయిలన్నీ పెద్ద పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కంపెనీలవే కావటం గమనించాల్సిన అంశం. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఒక్కో బ్యాంకు వసూలు చేయని మొండిబకాయిలు ఎన్ని లక్షల కోట్లు, పారిశ్రామిక వేత్తలు ఎగనామంపెట్టిన అప్పులు ఎన్ని ఉన్నాయి అంటూ యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ ఫౌండర్‌ రాజేంద్ర పల్నాటి రిజర్వుబ్యాంక్‌కు సమాచారం, హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేశారు. అందుకు స్టేట్‌బ్యాంక్‌ 16-12-22న సమాధానం ఇస్తూ, 1,71,953 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలుచేయలేక పోతున్నామని, వీటికి తోడు పారిశ్రామికవేత్తలకు ఎన్‌పీఏల కింద ఇచ్చిన రుణాలు రూ.1,06,804 కోట్లుగా ఉందని ఇంకా తిరిగి జమకాలేదని ఆ బ్యాంక్‌ పీఐవో ములుకుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లక్షల కోట్ల మొండిబకాయిలు ఉన్న బడా పారిశ్రామిక వేత్తల, కార్పొరేట్ల గురించి మాట్లాడకుండా, బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు రైతుల మొండి బకాయిలు కారణమని అధికారులు చెప్పటం వాస్తవాలను మరుగున పర్చటమే. బ్యాంకుల లెక్కల ప్రకారం, 2017లో 11,400కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని, అవి ఇప్పుడు 60వేల కోట్లకు చేరుకున్నాయని బ్యాంకు అధికారులు తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వలన పంటలు నష్టపోయారని, పంటఖర్చులు పెరిగాయని ఫలితంగా వ్యవసాయరంగంలో మొండి బకాయిలు పెరుగుదలకు కారణమన్న వాస్తవాన్ని బ్యాంకులు తెలియచేశాయి. ఈ పెరిగిన మొండి బకాయిల్లో కూడా చిన్న, సన్న కారు రైతులు చాలా తక్కువ. వ్యవసాయ రుణాల పేరుతో భూస్వాముల, కోల్డ్‌ స్టోరేజీ యజమానులు, సంపన్నవర్గాల రుణాలే మొండి బాకీలుగా 90శాతం పైగా ఉన్నాయి. రైతులు తల తాకట్టు పెట్టయినా అప్పు తీరుస్తారు. పంటలు నష్టపోయి, అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలే పరిష్కారమని భావిస్తున్న పరిస్థితుల్లో, బ్యాంకుల అప్పులు కట్టటం ఆలస్యం అయితే వారిని ఎగవేతదారులుగా ముద్రవేయటం నీచమైనదేకాక, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయటమే. అహ్మదాబాద్‌లో జరిగిన 173వ ఎస్‌ఎల్‌బిసి(రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, వ్యవసాయరంగాల్లో నిరర్ధక ఆస్తులు 2021లో 5,696 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 6,572 కోట్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపులో కార్పొరేట్లతో పోలిస్తే, రైతులు చాలా మెరుగ్గా ఉన్నారని పేర్కొంది.
ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్‌ వ్యాపారులవద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు 1.46 కోట్లు. ఈ కార్పొరేట్ల పేర్లు కూడా చెప్పరు. అప్పులపాలై రుణాలు చెల్లించలేకపోయిన రైతులకు మాత్రం అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నారు. అలా పంజాబ్‌లో రెండువేలమంది రైతులపై అరెస్టువారెంట్లు జారీచేశారు. పంజాబ్‌లోని 71వేలమంది రైతుల మొత్తం బకాయిలు 3,200కోట్లు మాత్రమే. బకాయిలు చెల్లించని రైతుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్న బ్యాంకు అధికారులు, కార్పొరేట్‌ సంస్థల ముందు ఎందుకు చేయటం లేదు. గుజరాత్‌లో ఒక రైతు 31 పైసలు చెల్లించలేదని నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. ప్రైవేట్‌, ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం ఎవరికీ తెలియకుండా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల కోట్ల మేరకు వారు చెల్లించాల్సిన బకాయిలను రద్దుచేశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని ఆరు నెలల్లో వరుసగా బ్యాంకులు 46,382 కోట్ల, 39వేల కోట్ల మొండిబకాయిలు రద్దు చేశాయి. రెండు సెక్షన్ల బ్యాంక్‌ రుణాల ఎగవేతకు రెండు రకాల నిబంధనలు ఉన్నాయి. భారతీయ రిజర్వుబ్యాంక్‌ చట్టం 1934 సెక్షన్‌ ‘45 ఈ’ ని ఉపయోగించి కార్పొరేట్‌ డిఫాల్టర్ల గుర్తింపును బహిర్గతం చేయటానికి బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ తిరస్కరిస్తుంది. దీనికి గోప్యత కారణం అంటున్నారు. న్యాయస్థానాలు ఆదేశించటంతో కొంతమంది పేర్లు బైటపెట్టారు. వారిలో వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, నీరజ్‌ మోడీ లాంటి వారు ఉన్నారు. కార్పొరేట్‌ సంస్థల బకాయిల్లో బ్యాంకులు పదిశాతం కూడా వసూలు చేయలేదని ఆర్‌బీఐ ఆధారిత నివేదికలు తెలుపుతున్నాయి.
బ్యాంకుల మరొక పాలసీ నిర్ణయం స్పష్టమైన వివక్షతను ఎత్తి చూపు తున్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల పంటలను మద్దతు ధరలకు కొనుగోలుచేసిన తర్వాత చెల్లించాల్సిన డబ్బులో కిషాన్‌క్రెడిట్‌ కార్డుకింద ఇచ్చిన రుణాన్ని మినహాయించి చెల్లిస్తున్నారు. ఇది రైతును తొక్కిపడ వేయటమే. కాని పరిశ్రమాదిపతులకు తాజాగా రుణాలు మంజూరు చేసేటప్పుడు, వారి నిరర్ధక రుణాల మొత్తాన్ని బ్యాంకులు ఎందుకు తీసుకోవటంలేదు. ఇది వివక్ష కాదా! నిరర్ధక రుణాలను రికవరీచేసే ఒక సాధనమైన ఐబీసీ ప్రొసీడిరగ్స్‌ ప్రకారం, పరిశ్రమాధిపతులు సగటున 65 నుంచి 95శాతం నిరర్ధక ఆస్తులు కలిగి న్నాయి. అయినా అవి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. అదే విధంగా రైతులకు తిరిగి రుణాలు ఇచ్చి రైతుల సేద్యానికి ఎందుకు తోడ్పటంలేదు. రైతుల ఎడల వివక్ష ఎందుకు చూపుతున్నారు. బ్యాంకుల్లో పెరుగుతున్న బడా పారిశ్రామిక వేత్తల, కార్పొరేట్‌ సంస్థల మొండి బకాయిలను గమనిస్తే, రైతులు చెల్లించాల్సిన బకాయిలు నామ మాత్రమే. రుణాల ఎగవేతను బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే, పంటలు కోల్పోయి అప్పులపాలైన రైతులు రుణాలు చెల్లించలేకపోవటంలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. బడాపారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్లు చెల్లించాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను బ్యాంకులు, ప్రభుత్వం వసూలు చేయగలిగితే, రైతాంగం చెల్లించాల్సిన రుణాలు రద్దు చేసినా, బ్యాంకులకు ఎటువంటి సమస్య ఉండదు.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌ : 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img