Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ పాలనలో అంతులేని అప్పులు!

ఎం కోటేశ్వరరావు

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అప్పులు 202324 ఆర్థిక బడ్జెట్‌లో పేర్కొన్నవిధంగా దాదాపు 170 లక్షల కోట్లకు చేరనున్నది. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు. 1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోదీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది?’’ అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వివరాలు మింగుడుపడని మోదీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్రప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మ బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.
తనకు అధికారంఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోదీ 2014లో అధికారానికి వచ్చారు. ఆనాటికిఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం, 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా, 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోదీ చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేనిదానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న మోదీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు. గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయరంగంలో యాంత్రీకరణ పెరుగుదలతో రోజు రోజుకూ మానవశ్రమ పనిదినాలు తగ్గుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు నిదర్శనం. కనీసం వందరోజులుపని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 202122లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే, 202223లో 89,400 కోట్లకు, 202324లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వందరోజులు పనికల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాదిపాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని మోదీ రాతపూర్వకంగా వెల్లడిరచారు. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపోగానీ 202223లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.
అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు.5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయంరైతు సంక్షేమపద్దు కింద 202122లో రు.1,22,836 కోట్లు ఖర్చుచేశారు. దాన్ని 202223 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామన్నారు. 202223లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు. వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.
ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనంకోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామిక వేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండిరచే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వాటిల్లిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చచేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోదీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడిరది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక, బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడమని బీజేపీి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మోదీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏం మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి.
ఇటీవల ఆక్స్‌ఫామ్‌సంస్థ కొంతమందిచేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోదీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగకపోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img