Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీ స్వప్న సౌధం కొత్త సెంట్రల్‌ విస్తా

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

హిట్లర్‌ జర్మేనియాలో కొత్త రాజధాని ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. అల్బర్ట్‌ స్పీర్‌ వాస్తుశిల్పి. ఈ కల నెరవేరలేదు. మోదీ కొత్త సెంట్రల్‌ విస్తా పథకానికి బిమన్‌ పటేల్‌ వాస్తుశిల్పి. మోదీ కలల, కళల భారత్‌ ను నిర్మిస్తున్న గజరాతీ. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో ప్రణాళిక, వారసత్వం, ప్రతిమాశాస్త్రాలను గజిబిజి చేసి మాట్లాడారు. సెంట్రల్‌ విస్తాను ఇంద్రుడు సకాలంలో పూర్తి చేస్తాడన్నారు. బ్రిటిష్‌ రూపశిల్పి ఎడ్విన్‌ లత్యేన్స్‌, వాస్తుశిల్పి హర్బర్ట్‌ బేకర్‌ సెంట్రల్‌ విస్తాతో సహా కొత్త దిల్లీని నిర్మించారు. కొత్త దిల్లీని లత్యేన్స్‌ దిల్లీ అంటారు. 1920లో మొదలై 1929కి పూర్తయిన సెంట్రల్‌ విస్తాను 1931లో వైస్రాయ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. శ్వేత జాత్యహంకారుల నిర్మాణం భారతీయతలో కలిసింది. భారతీయతను హిందుత్వతో గజిబిజిచేసిన జాతీయవాదుల భవనం, మోదీ స్వప్న సౌధం త్వరలో ఇక్కడ రాబోతోంది.
రాష్ట్రపతి భవన్‌-ఇండియా గేట్‌ ల మధ్య 3 కి.మీ. పొడవున 1,100 ఎకరాల చారిత్రక ప్రదేశమే సెంట్రల్‌ విస్తా. 2019 సెప్టెంబర్లో మోదీ సర్కారు ఈ స్థలంలో కొత్త భవనాల పథకం ప్రకటించింది. పాత భవనాలు కూలిపోతున్నాయని అబద్దాలు చెప్పింది. పలు నగరాలలో 18 వ, 19 వ శతాబ్దాల భవనాలను సైన్యం వాడుతోంది. నేటి పార్లమెంటు భవనం పక్కన త్రికోణాకారంలో కొత్త భవన సముదాయం నిర్మిస్తారు. రేఖాగణితంలో త్రికోణం హిందుత్వ పవిత్ర చిహ్నం. ఇక్కడ ప్రధాని కార్యాలయం, నివాసం, ఉప, రాష్ట్రపతుల భవంతులు, మంత్రుల కార్యాలయాల కోసం బహుళ అంతస్తుల 10 ఆధునిక భవనాలు నిర్మిస్తారు. 10.12.’20న శంకుస్థాపన చేస్తూ మోదీ భారత ప్రాచీన సంప్రదాయ ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, ఆచరణల్లో నమ్మకం ఉందన్నారు. స్వతంత్ర, ఆత్మనిర్భర భారత ప్రజాస్వామ్యానికి కొత్త పార్లమెంటు సంకేతమన్నారు. ట్రంప్‌ అమెరికా ముందు లాగా భారత్‌ ముందని ప్రజలను ప్రమాణం చేయమన్నారు. ఈ మాయ మాటలు మోదీ చీకటి కోణాలను, పారదర్శక లోపాలను, ప్రజావసరాల నిర్ణయంలో, అమలులో ఏకపక్షతత్వాన్ని బయటపెట్టాయి. మోదీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటులో చట్టాలపై చర్చలు, సెలెక్టు కమిటీలు లేవు. ప్రకటన, ఆచరణల మధ్య విరుద్ధ వైఖరి, దుర్లక్ష్యాల అమలులో దూకుడు ఉంటాయి. రాజకీయ నిర్ణయాలు భ్రమలు కల్పిస్తాయి.
భారత ప్రభుత్వం 2012లో సెంట్రల్‌ విస్తాతో పాటు దిల్లీని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 2015లో మోదీ సర్కార్‌ ఈ అభ్యర్థనను ఉపసంహరించింది. సెంట్రల్‌ విస్తా రహస్య పథకానికి ఇది నాంది. పార్లమెంటులో సెంట్రల్‌ విస్తాపై చర్చ జరగలేదు. 1957 దిల్లీ అభివృద్ధి చట్టంతో సహా అనేక వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రక్షణ చట్టాలను పట్టించు కోలేదు. సంయుక్త సంస్కృతి, వారసత్వాల సంరక్షణ పౌరుల విధి అన్న రాజ్యాంగ అధికరణ 51-ఎ(ఎఫ్‌)ను, జీవించే హక్కు (అధికరణ 21) ను, జాతీయ ప్రాముఖ్యత ప్రదేశాలను రాజ్యం రక్షించాలన్న అధికరణ 49 నీ ఉల్లంఘించారు. సంస్కృతి, వార సత్వాల సంపూర్ణ సంరక్షణ జీవిత భాగాలని, జీవించే హక్కు పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ రాజ్యాంగ విరుద్ధ ప్రాజెక్టును ఆపమని 60 మంది విశ్రాంత పౌర అధికారులు ప్రధానికి విన్నవించారు. ఆరోగ్యార్థిక అత్యవసరంలో ఇది అనుచితమని సీతారాం ఏచూరి సూచించారు. విజ్ఞుల విన్నపాలు వినే మామూలు మనిషి కాదు మోదీ.
2017 సాధారణ ఆర్థిక నియమాల ప్రకారం దేశ సంపద నిర్మాణ, పునర్నిర్మాణ, అభివృద్ధి పథకాల కోసం పోటీ టెండర్లు పిలవాలి. ఆ పథక అధ్యయనాల వివరాలు ప్రజా పరిధిలో ఉంచాలి. పోటీ టెండర్ల నిర్వహణ, నిర్ణయాలకు న్యాయసంఘాన్ని ప్రకటించాలి. సెంట్రల్‌ విస్తాలో ఇవేమీ జరగలేదు. టెండర్లు రహస్యంగా జరిగాయి. వచ్చిన 7 టెండర్లలో ఆరింటిని సాకులతో నిరాకరించారు. టెండర్లలో 20% నిర్మాణానికి, 80% నైపుణ్యతకు కేటాయించారు. నైపుణ్యతను ప్రభుత్వమే (మోదీయే) నిర్ణయిస్తుంది. వాస్తుశిల్ప మండలి సూత్రాల కూ తిలోదకాలిచ్చారు. పోటీ టెండర్లు పిలవకుండా ఆదేశక ఆమోదంతో కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ ప్రదేశ తార్కిక యజమానులైన ప్రజలను మోసంచేశారు. గుజరాత్‌ హెచ్‌.సి.పి. డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ సంఫ్‌ు సౌధానికి ప్రణాళిక తయారుచేసింది. మోదీతో సన్నిహిత సంబంధాలున్న దీని యజమాని బిమల్‌ పటేల్‌ కు ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఈ కంపెని సబర్మతి ప్రాజెక్టు, కాశీ ఆలయాలు, గుజరాత్‌ రాష్ట్ర కార్యాలయాలు, బిజెపి కేంద్ర కార్యాలయాలు నిర్మించింది. విస్తా నిర్మాణ ఖర్చు రూ.25,000 కోట్లు. మార్పుచేర్పులు చేయడానికి హెచ్‌.సి.పి. డిజైన్‌ కు సర్వాధికారాలు ఇచ్చారు. ప్రభుత్వ నిర్మాణ, వాస్తుశిల్ప సంస్థలు ఇచ్చిన సలహాలను పట్టించు కోలేదు. పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టు టాటా కు రూ.971 కోట్లకు ఇచ్చారు. ఇపుడిది రూ. 13,450 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ సాంకేతిక సామర్థ్యాలు ఎవరికీ తెలియవు. భవన నిర్మాణానికి 80, 90 ఏళ్ల చెట్లు నరికారు. నిర్మాణ ప్రతిపాదనల ఆమోదానికి నిర్మాణ నిపుణులు, రూపశిల్పులు, పర్యావరణవేత్తలు, భూగర్భ శాస్త్రజ్ఞులు, నగర ప్రణాళిక శాఖను సంప్రదించలేదు. మొత్తం భవన సముదాయానికి కాక ఒక్కొక్క భవనానికి విడివిడిగా పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. వారసత్వ పరిరక్షణ కమిటి అనుమతి అడగనేలేదు. గాంధీ, నెహ్రూ, ఇందిర స్మారక భవనాలను కూల్చారు. గాంధీ, నెహ్రూలు పార్లమెంటులో కన్పించరు. నేటి ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ కష్టాల్లో ఈ నిర్మాణం అవసరమా? ఇది ఆర్థిక కార్యక్రమాలను పెంచి, నిరుద్యోగ సమస్యను తీర్చుతుందని మంత్రి పురి సమర్థించారు. 2022 గణతంత్ర వేడుకలను కొత్త విస్తాలో జరుపుతామని గత నెల 16న ఆయన చెప్పారు. అమెరికా నుండి రాగానే 26 రాత్రి ప్రధాని చెప్పాపెట్టకుండా విస్తా నిర్మాణాన్ని పరిశీలించారు. దేశ రైతాంగం, కార్మిక సంఘాలు 27 న భారత్‌బంద్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని బాధ్యత మరిచారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రభుత్వం ప్రజల ఆస్తుల కాపలాదారుమాత్రమే. ప్రజల (పార్లమెంటు) అనుమతి లేని ఈ రాజ్యాంగ అతిక్రమణ హక్కు ప్రభుత్వానికి లేదు. ఇది సామాజిక, ప్రజాస్వామ్య ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. పాలక-పాలితబంధం తెగుతుంది. రాజ్యాంగనేరానికి పాల్పడుతున్న పాలకులను కోర్టులుసరిదిద్దాలి. అప్రజా స్వామిక, రాజ్యాంగ విరుద్ధ పథకాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగ బడాలి. రాజ్యాంగవిరుద్ధ సాగుచట్టాల వ్యతిరేక రైతాంగ ఉద్యమం మార్గదర్శకం కావాలి.
వ్యాసరచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి, చరవాణి: 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img