Friday, April 26, 2024
Friday, April 26, 2024

మౌనమేల మోదీజీ…?

డాక్టర్‌. సీ.ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి
9059837847

ప్రధాని నరేంద్ర మోదీ చాలా ధైర్యవంతుడనేది బీజేపీ నేతల నమ్మకం. నిత్యం ప్రజల కోసమే పని చేస్తాడని, ఆయనకు వేరే జీవితం లేదని, దొరికిన ప్రతి అవకాశాన్ని ప్రచారానికి వాడుకుంటారు. దీనికి అనుగుణంగానే ప్రధాని మోదీ అప్పుడప్పుడూ జాతిని ఉద్దేశించి గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. మన్‌ కీ బాత్‌ పేరుతో వివిధ అంశాలపై మాట్లాడతారు. ముందు దేశ ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన చాలా ప్రశ్నలున్నాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలి సహా పాలన పరమైన అంశాలకు సంబంధించి పౌరసమాజం నుంచి ఎదురైన కీలకమైన ప్రశ్నలకు మోదీ ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు.
ప్రధాని మోదీని బోనులో నిలబెడుతూ పుల్వామా ఘటనపై జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు తోడు మాజీ ఆర్మీ చీఫ్‌ శంకర్‌ రాయ్‌ చౌదరి లేవనెత్తిన ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానమిచ్చి తీరాల్సినవి. పుల్వామా దారుణం అనంతరం ఏకంగా ప్రధాని తనకు ఫోన్‌ చేసి ఆ విషయంపై మీరు నోరు తెరవకండని ప్రధాని మోదీ తన నోరు నొక్కేశారని ఆయన అన్నారు. ఈ విషయం మోదీ నిజాయితీని నిలదీస్తోంది. 40మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సత్యపాల్‌చేసిన వ్యాఖ్యలు మన దేశభద్రతకు, జాతీయ భద్రత పరిరక్షణకు చెందినవైనా ప్రధాని మోదీ కిక్కురుమనడం లేదు. ఆయన మౌనం వ్యూహాత్మక మౌనం అనుకునే అవకాశాలే లేవు. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో బైటపెట్టి ఉంటే కొట్టి పడేసే అవకాశం ఉండేది. స్వపక్షంలోని కీలక వ్యక్తి ఎత్తి చూపిన అంశాలు విస్మరించడానికి వీల్లేనివి. ఈ విషయంలోనూ మోదీ మౌనం వీడడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35ఎ అధికరణలు రద్దు చేసిన తీరు, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంపై ఇదే సత్యపాల్‌ మాలిక్‌ చేసిన ఆర్థికపరమైన ఆరోపణలపైనా మోదీ నుంచి సమాధానం రాలేదు.
ఇటీవలి కాలంలో నరేంద్ర మోదీ విద్యార్హత పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఆయనే. వివిధ సందర్భాల్లో తన చదువుపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తాను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశానని, పాఠశాల స్థాయి వరకే చదువుకున్నానని వేరు వేరు సందర్భాల్లో మోదీ స్వయంగా ప్రకటించారు. తర్వాత ఆయనే స్వయంగా డిగ్రీ చేశానని తెలిపారు. హోం మంత్రి అమిత్‌షా కూడా మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు గతంలో ప్రదర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో మోదీ పొందు పర్చిన విద్యార్హతలపైనా అనుమానాలు రేకెత్తాయి. వీటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వ్యక్తిగతంగాను, అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఆయనపైనే ఉంది. అయితే ఈ విషయంలోనూ మోదీ మౌనం వహించారు. ఆయన చేసిన డిగ్రీ, పిజి పట్టాలకు సంబంధించిన సమాచారాన్ని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కి అందించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్‌ దిల్లీ, గుజరాత్‌ యూనివర్శిటీలకు ఆదేశాలు జారీ చేయడం, వివరాలు ఇవ్వాలని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరినా తప్పించుకునేందుకే చూశారు. దీంతో కేజ్రీవాల్‌ గుజరాత్‌ కోర్టును ఆశ్రయించి భంగపడ్డా మోదీ విద్యార్హతల అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశారు. ప్రధాని విద్యార్హతలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా అని దేశ ప్రజల చేత ప్రశ్నించేలా చేశారు. ప్రధాని ఏమి చదువుకున్నారో బహిర్గతం చేస్తే వచ్చే నష్టమేమిటని దేశం యావత్తు నిలదీసినా నయా మౌన ముని మౌనం వీడడం లేదు. సొంత పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మోదీకి ఎక్కాలు కూడా రావు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రచారం అయ్యాయి. ఇదే తరుణంలో అమిత్‌ షా చూపిన సర్టిఫికెట్టు కూడా ఫేక్‌ అనే ప్రచారం ఎక్కువైంది. అందులో మోదీ చేసిన కోర్సు మొదలు, ఆ యూనివర్సిటీ వ్యవహారం తీరుపైనా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ఇంత జరుగుతున్నా విద్యార్హతలో గోప్యత ఎందుకనే చర్చకు నడుస్తున్న క్రమంలోనే భావోద్వేగ రాజకీయాలకు తెర లేచింది. తన ముందున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కొంతమంది తన వ్యక్తిత్వానికి భంగం కలిగించాలని చూస్తున్నారని, తనకు సమాధి కట్టాలని ప్రయత్నిస్తున్నారని, సుపారీ హత్యకు కూడా ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించి చర్చను పక్కదారి పట్టించాలని చూశారనే విమర్శలు వచ్చాయి.
దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుపు కుదిపిన అదాని ఆర్థిక అవకతవకలపై మోదీ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదిక అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చింది. పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని మద్దతుతోనే అదానీ ప్రపంచ కుబేరుడయ్యాడని విమర్శలు తీవ్రంగా వచ్చాయి. పార్లమెంటులో ప్రసంగిస్తూ మోదీ ఇద్దరు మిత్రులు ఒక అడవికి వెళ్లారు అంటూ ఏదో కథ చెప్పబోతే ఆ ఇద్దరు మిత్రులు అదానిని ప్రధాని అని ప్రతిపక్షం గేలిచేసినా మోదీ నుంచి సమాధానం రాలేదు. అదాని షెల్‌ కంపెనీల్లో 20 వేల కోట్ల బినామీ సొమ్ము ఎవరిదని రాహుల్‌ వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి నిలదీసినా మోదీ మౌనంగానే ఉండిపోయారు. భారత ప్రధాని స్వయంగా అదాని ఏర్పాటు చేయనున్న పవర్‌ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి సహకరించాలని తనపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంక ప్రధాని తమ పార్లమెంటులో చెప్పినా ప్రధాని వ్యాఖ్యానించినా మోదీ మౌన ముద్రలోనే ఉండిపోయారు. బ్యాంకుల నుంచి జనం సొమ్ము దోచేసి విదేశాలకు చెక్కేసిన వారిలో మోదీ సొంత రాష్ట్రం వారే అధికంగా ఉన్నారు. ఆ రాష్ట్రం వారే ఎందుకలా చేశారని ప్రతిపక్షాలు నిలదీసినా ఆ వ్యవహారంతో తనకేమి సంబంధం లేదని చెప్పలేని నిస్సహాయుడు మన ప్రధాని.
శ్రీరామనవమి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో మత ఘర్షణల పైనా ప్రధాని మోదీ మౌనమే వహించారు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ట్విట్టర్‌లో స్పందించే మోదీ దేశంలో మతపరమైన ఘర్షణలు జరిగినా మిన్నకుండిపోయారు. ఈ విషయంలో మౌనం ఆ ఘర్షణలను మరింత ప్రోత్సహించడానికేనా అనే అనుమానాలు వ్యక్తం చేసినా ఆయన నుంచి స్పందన కరువైంది. కర్నాటకలో మత చిచ్చుకు కారణమైన హిజాబ్‌ వ్యవహారం, యూపీలో తాజాగా జరుగుతున్న అల్ల్లర్లు, ఉన్నావ్‌ దారుణం సహా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గో రక్షణ పేరుతో హిందుత్వ శక్తులు చేస్తున్న ఆగడాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు సందర్భంలో చేసిన ప్రసంగాలకు భిన్న ఫలితాలపై వచ్చిన ప్రశ్నలు సహా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏ ఒక్క ప్రశ్నపై మోదీ స్పందించలేదు. మన పెద్దలు కూడా మౌనం అర్థాంగీకారం వంటిదే అంటుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img