Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రష్యా`జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే కుట్ర!

సత్య

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (45) పుట్టినరోజు సందర్భంగా జనవరి 25న అమెరికా, జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు ఆధునిక టాంకులను అందచేస్తామని ప్రకటించడం ఉక్రెయిన్‌`రష్యాల మధ్య ఆజ్యం పోసినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఫిబ్రవరి 24నాటికి ఏడాది పూర్తి అవుతుంది. టాంకులను ఇస్తామని చెప్పిన వెంటనే తమకు జెట్‌ యుద్ధ విమానాలు కావాలని ఉక్రెయిన్‌ కోరింది. సంక్షోభంలో ఇదొక ప్రమాదకర మలుపు. భవిష్యత్‌లో ఈ యుద్ధానికి ముగింపుపలికే బదులు ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందా అన్న ఆందోళన కలుగుతోంది. తమ వద్ద ఉన్న అబ్రామ్‌ టాంకులను ఇస్తామని అమెరికా, లెపర్డ్‌ (చిరుత పులి) రకం టాంకులను ఇస్తామని జర్మనీ కొద్ది తేడాతో ఒకే రోజు ప్రకటించాయి. జర్మనీ ఆ రకం టాంకులను ఇప్పటికే అనేక నాటో దేశాలకు సరఫరా చేసింది. ఒప్పందం ప్రకారం వాటిని మరో దేశానికి విక్రయించాలంటే జర్మనీ అనుమతి అవసరం. గత రెండు మూడునెలలుగా ఆ మేరకు కొన్నిదేశాలు వత్తిడి తెస్తున్నాయి. తామే వాటిని ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అంగీకరించినందున మిగతా దేశాలకు సైతం అనుమతి ఇచ్చింది. అబ్రామ్‌ రకం టాంకులను అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించేశాడు. దీని వెనుక అమెరికా దుష్ట పన్నాగం గురించిన హెచ్చరికలు వినిపించాయి. జర్మనీ లోని యుద్ధ, ఆయుధ లాబీలను కూడగట్టుకొని అమెరికా వేసిన ఎత్తుగడలో భాగంగా జర్మనీ కూడా టాంకులను అందించేందుకు సిద్ధపడిరదన్నది ఒక కథనం. ఐరోపాలో తమ సుస్థిరానికి జర్మన్‌ పాలకవర్గ పూనికలో భాగం గానే ఇదంతా జరుగుతోందన్నది మరొక కథనం. జర్మనీని ముందుకు తోస్తే రష్యా ప్రతిదాడికి దిగితే తొలి దెబ్బ పడేది జర్మనీ మీదనే కనుక తన చేతికి మట్టి అంటకుండా ఐరోపాలో పెత్తనాన్ని పటిష్ట పరుచుకొనేందుకు అమెరికాకు వీలు కలుగుతుంది.
పశ్చిమదేశాల తీరు మొదటి నుంచీ అలాగే ఉంది. సైనిక చర్య ప్రారంభం కాగానే రష్యాతో రాజీ చర్చలంటూ తొలి అంకానికి తెరలేపారు. పరిష్కారా నికి తాము మద్దతు ఇస్తున్నామని సానుకూల వచనాలుపలికారు. తరువాత కొత్త కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చారు. చివరకు మాటా మంతీ లేని స్థితికి నెట్టారు. ఆ తరువాత రష్యాను ఎదుర్కొ నేందుకు తమకు తోడ్పడాలని జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదన లన్నింటినీ అవి రష్యాతో వైరాన్ని పెంచేవిగా ఉన్నవంటూ ముందు పశ్చిమ దేశాలు తిరస్కరించటం తరువాత ఆకస్మికంగా మారు మనస్సు పుచ్చుకున్నట్లుగా అనివార్య మైనందున అంగీకరించాల్సి వచ్చిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాయి. దాన్లో భాగంగా నాటో దేశాలు వేలాది ఎటిజిఎం(నిర్దేశిత టాంకు విధ్వంసక క్షిపణులు), మాన్‌పాడ్స్‌ను (భుజాల మీద మోసుకుపోతూ విమానాలు, హెలికాప్టర్ల మీద దాడి చేసేవి) ఉక్రెయిన్‌కు అందచేశారు. ఇప్పుడు భారీ టాంకులను, వాటిని నడిపేందుకు అవసరమైన ఇంథనాన్ని అందచేసేందుకు కూడా నిర్ణయించాయి. ఆ ప్రకటనలు ఇంకా అమల్లోకి రాకమునుపే తమకు జెట్‌ విమానాలిచ్చి పుతిన్‌ సేనలను ఎదుర్కొనేందుకు తోడ్పడాలని ఉక్రెయిన్‌ వినతులు ప్రారంభించింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ వద్ద ఉన్న సోవియట్‌ కాలం నాటి టాంకులు, విమానాలు నిండుకుంటున్నందున కొత్త వాటిని సమకూర్చుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతిఘటనంతా పశ్చిమ దేశాల సరకు, సరంజామాతోనే. నాటో కూటమికి చెందిన మిలిటరీ ప్రత్యక్షంగా పాల్గొనదు తప్ప ఆయుధాలన్నీ దాదాపు వారివే.
తదుపరి తమకు పెద్ద ఆటంకం ఫైటర్‌ జెట్స్‌ మాత్రమే అని ఉక్రెయిన్‌ రక్షణమంత్రి సలహాదారు యూరీ శాక్‌ చెప్పాడు. నాలుగవతరం ఆధునిక విమానాలను సాధ్యమైనంత త్వరలో పొందేందుకు చేయాల్సిందంతా చేస్తాము అన్నాడు. వాటిలో అమెరికా ఎఫ్‌16 సహా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. ‘‘తొలుత వారు మాకు భారీ ఫిరంగులు ఇవ్వాలను కోలేదు, తరువాత ఇచ్చారు. అణ్వాయుధాలు తప్ప మేం పొందలేనిది ఏదీ లేదు’’ అని శాక్‌ చెప్పాడంటే పశ్చిమదేశాల పథకం గురించి తెలియదని అనుకోలేం. తమ గగన తలంలోకి రష్యా చొరబడకుండా ఉండేందుకు తమకు విమానాలు కావాలని గతేడాది జెలెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను కోరాడు. ఆ కోర్కెను అంగీకరించటమంటే అది నాటో కూటమి రష్యాతో ప్రత్యక్షంగా తలపడటంతో సమానం కనుక మరీ ఎక్కువగా ఆ డిమాండ్‌ను ముందుకు తీసుకురావద్దని సలహా ఇచ్చినట్లు వార్తలు. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించటమంటే వాటిని కూడా అందచేసేందుకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్దం చేస్తున్నారనే అనుకోవాలి. అందుకుగాను ప్రచార యంత్రాంగాన్ని ఒకవిధంగా ఇప్పటికే రంగంలోకి దించారు.
కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు తగ్గటం వెనుక భారీ దాడులకు సిద్దం కావటమే అంటూ కథనాలు రాశారు. మరో దేశానికి మారణాయుధాలు అందిస్తే అమెరికా సమాజంలో వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉంది. అంతకు ముందే రష్యాను ఒక బూచిగా చూపుతున్న సంగతి తెలిసిందే. ‘‘వారికేమి కావాలో తెలుసుకొనేందుకు కీవ్‌ (ఉక్రెయిన్‌) నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. మరిన్ని ఆయుధాలు కావాలని కోరుతున్న ఉక్రెనియన్లను కూడా మనం తప్పు పట్టలేం. యుద్ధ విమానాల గురించి వారు మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. దాని గురించి చేసేందుకు నా వద్ద ఎలాంటి ప్రకటనలు లేవు’’ అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి జాన్‌ కిర్బీ చెప్పాడు. అంటే తరువాత వీలు చూసుకొని రష్యా ఏకపక్ష దురాక్రమణ కారణంగా ఇవ్వటం మినహా తమకు మరొక మార్గంలేదని పెంటగన్‌ చెప్పేందుకు చూస్తున్నదనుకోవాలి. టాంకులు ఉక్రెయిన్‌ ప్రాంతాలను కాపాడటం తప్ప రష్యాకు ముప్పుతెచ్చేందుకు కాదని అమెరికా విదేశాంగ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ చెప్పాడు. తమ ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇచ్చి, నాటోను విస్తరించబోమని, ఉక్రెయిన్‌ను తమ పక్కలో బల్లెంగా మార్చబోమని నాటో కూటమి హామీ ఇస్తే సైనిక చర్యను వెంటనే ఆపివేస్తామని ప్రారంభంలోనే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.
జర్మనీ తొలుత 14 చిరుత రకం టాంకులు ఇస్తామని చెబితే అమెరికా 31 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న ఇతర ఐరోపా దేశాలు కూడా తమ వద్ద ఉన్న చిరుతలను అందచేస్తామని ప్రకటిస్తున్నాయి. పశ్చిమ దేశాలు ఇప్పటి వరకు ఇచ్చిన సాయంతో పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టామని, అనేక విజయాలను సాధించినట్లు చేసిన ప్రచారం గురించి తెలిసిందే. నిజానికి అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పుడు భారీ టాంకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? విమానాలను ఎందుకు కోరుతున్నట్లు? పోనీ ఇవ్వనున్న టాంకుల సామర్ధ్యం ఏమిటి అన్న చర్చను జరిపేందుకు పశ్చిమ దేశాల మీడియా సిద్దం కావటం లేదు. టాంకులు ఇవ్వటాన్ని చారిత్రాత్మకం అని జర్మనీ వర్ణించటమే కాదు ఆట తీరునే మార్చివేస్తుందని చెప్పుకుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి పశ్చిమ దేశాల నేతలు, వారికి వంత పాడే మీడియా విశ్లేషకులు అదే కబుర్లు చెబుతున్నారు. రష్యాతో పోరుకు జర్మన్‌ టాంకులు ఇవ్వటం చారిత్రక తప్పిదం అవుతుందని జర్మన్‌ పార్లమెంటులోని వామపక్ష పార్టీ ప్రతినిధి సెవిమ్‌ డగడెలెన్‌ రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు ప్రపంచ శాంతికి, ప్రజలకు ముప్పుతెచ్చేవిగా ఉన్నాయనేది స్పష్టం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img