Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్ర ప్రభుత్వ సున్నితత్వం

ప్రభుత్వానికి సమస్యపై అవగాహన, పరిష్కారం పట్ల చిత్తశుద్ధి, స్పందించే గుణంలో సున్నితత్వం ఉంటేనే సుపరిపాలన సాధ్యం. నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఒక నూతన విధానం ఆహ్వానించదగింది. పదవ తరగతి దాటిన విద్యార్థులకు దరఖాస్తుతో సంబంధం లేకుండానే కులధ్రువీ కరణ పత్రాలు అందజెయ్యడం ఒక మంచి ప్రయత్నం. సున్నితమైన స్పందనకు నిదర్శనం. పైకి చిన్న విషయంగా కనబడుతున్నా కులధ్రువీకరణ పత్రాలు సంపాదించడానికి ఆయా వర్గాలు, ప్రత్యేకించి పేదలు, ఆదివాసీలు, దళితులు ఎంత కష్టపడాల్సి వస్తుందో చెప్పనలవికాదు. పదవతరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పూర్తిచేసి పైచదువు కోసం దరఖాస్తుచేస్తే కులధ్రువీకరణపత్రం జత చెయ్యడం తప్పనిసరి. ఒక వైపు జాయిన్‌ అవ్వాల్సిన సమయం దాటిపోతోంది. మరోవైపు ఎప్పటికీ సంబంధిత కార్యాలయం (మండల కేంద్రంలో ఉంటుంది) నుండి ఉలుకూపలుకు ఉండదు. ఫైల్‌ సులభంగా కదలదు. కదిలించు కోగల శక్తి పేద కుటుంబానికి ఉండదు. దానితో బాటు ఆ పత్రాలకై విపరీతమైన రద్దీ ఒకేసారి ఉండడం అధికారులవైపు నుండి ఒక వాదన. వెరసి పాస్‌ అవ్వడం కన్నా, ఆయా పత్రాలు పొందడం పెద్ద గగనం. ఒక్కోసారి ఈ ఒక్క కారణంతోనే ఒక విద్యాసంవత్సరం కోల్పోవడం కూడా అసాధారణం కాదు. నాకు, నాలాంటి ఎంతోమందికి ఇది ప్రత్యక్ష అనుభవం. వారాలు, వారాలు ఇదే పనిమీద మా పేద తలిదండ్రులు పనులన్నీ పక్కనబెట్టి కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. పత్రం చేతికందిన రోజు ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వడం కన్నా గొప్పగా ఉండేది. తరువాత మీసేవ కేంద్రాలు వచ్చాక గత కొన్నేళ్లుగా పరిస్థితి కొంత కుదుటపడిరది. అప్పటిలా అంతస్థాయి పోరాటం లేకపోయినా కొంత సులభమైంది. రొటీన్‌గా రావాల్సిన పత్రాలకి కూడా పెద్దల సిఫార్సులు అవసరమయ్యే పరిస్థితి. ఆ కష్టం తెలిసిన వారికి ఈ రోజు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం ఎంత గొప్పదో, ప్రజలపై ఎంత గౌరవప్రదమైన స్పందనో అన్నది అర్ధమౌతుంది. 40 లక్షల కుటుంబాలకు, 10 లక్షలమంది పదవ తరగతి విద్యార్థులకు అడగకుండానే వారివారి కులధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచడం, అందించడం గొప్ప మేలు.
డా.డి.వి.జి.శంకరరావు, 94408 36931

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img