Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

లోగుట్టు పెరుమాళ్ల కెరుక

అదాని ఎఫ్‌పిఓ(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఎపిసోడ్‌ ముగిసినట్లు కనిపిస్తుంది. కానీ దీని వలన రేకెత్తిన ప్రశ్నలకు మాత్రం ముగింపు ఉన్నట్లు కనిపించడంలేదు. అన్ని రంగాల్లో లాగానే కార్పొరేట్‌రంగంలో తెరవెనుక జరిగే రకరకాల తంతులకు ఇది తాజా తార్కాణం. పబ్లిక్‌ నుండి వారికి కావాల్సినవి తీసుకున్నారు. తిరిగి ఇచ్చివేశారు. ఇది బహిరంగమే.వీటికి బడ్జెట్‌ మించి ప్రాధాన్యత మీడియాలో లభించింది. పార్లమెంట్‌ దద్దరిల్లింది. అనేక కంపెనీలు ఆయా నిబంధనలకు నియమా లకు లోబడి ఈ ఎఫ్‌పిఓ ల ద్వారా పబ్లిక్‌ ఆఫరిస్తాయి. ఇది అన్ని విధాలా తొలి పబ్లిక్‌ ఆఫర్‌ లాంటిదే. అయితే అప్పటికి కంపెనీ వాటాలు స్టాక్‌ ఎక్స్చేంజిలో లిస్ట్‌ అయి ఉండవు. ఈ తొలి, మలి మూలధన (ఈక్విటీ) పెంపుని కంపెనీలు చాలా విధాల ఉపయోగించు కుంటాయి. అది నూతన సాంకేతిక కొనుగోలు ఉత్పత్తి సామర్థ్యం పెంపు, నూతన ఉత్పత్తుల విస్తరణ, నూతనప్రాజెక్టులకు లాంటి వాటికి ఉపయోగిస్తారు. ఈ మూలధనం(ఈక్విటీ) పెంపుద్వారా వారికి అదనపురుణం ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి పొందే సదుపాయం ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా ఆయా కంపెనీలు పొందేదంతా పరోక్షంగా ప్రజల సొమ్ము. సాధారణంగా వీటి గురించి ఆయా లావాదేవీలు చేసే వారు తప్ప ఇతరులు ఎవరు అంతగా పట్టించుకోరు.
కానీ ఆదాని ఈ ఎఫ్‌పీఓ ని వెనక్కి తీసుకోవడంతో అందరి దృష్టి దీనిపై మరలింది. అందుకు తగిన నేపథ్యం అప్పటికే ఏర్పడి ఉంది. అది అన్ని విధాల ప్రేరితమైన, వారి గ్రూపు షేర్లు మార్కెట్లో కుప్పకూలడానికి కారణమైన హిండెన్‌బర్గ్‌ నివేదిక వివిధ రూపాల విశ్వవ్యాప్త ప్రకంపనలు సృష్టించింది. మన ఆర్థికమంత్రి దీని ప్రభావం మన ఆర్థిక రంగంపై ఏమాత్రం లేదన్నా, దేశ ప్రతిష్ట ఆ గ్రూపు సంస్థల ప్రతిష్టతో పాటు మసకబారిందనేది కాదనలేని వాస్తవం. కోల్పోయిన ప్రతిష్ట, విశ్వసనీయత పునరుద్ధరణకు, ఎఫ్‌పీఓ ఉపసంహరణకు తెరవెనుక కారణాలు. ఈ ప్రయత్నంలో భాగంగా వారు తాము తాకట్టు పెట్టి రుణాలు పొందిన షేర్లు దాదాపు తొమ్మిదివేల కోట్ల రూపాయలు చెల్లింపులకు గడువు మార్చి చివరి వరకు ఉన్నా ముందుగానే చెల్లించటానికి సంసిద్ధులు అవ్వడం గమనార్హం. దీన్నిబట్టి వారు ఎంతపటిష్టంగా ఉన్నది ప్రపంచానికి చెప్ప దలిచారు. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లలో 12 శాతం, సంస్థ ఉద్యోగులలో 55శాతం మాత్రమే కేటాయించిన షేర్లని వినియోగించుకోవడంలో వారి సంస్థ పట్ల వారికి నమ్మకం ఏ రీతిలో ఉందో తెలుస్తుంది. ఇందులో కీలక పాత్రధారులుగా వీరికే చెందిన ఎలారా క్యాపిటల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మోనార్క్‌ నెట్వర్క్‌ క్యాపిటల్‌ అనే సెల్‌ కంపెనీలను వారి నిర్వాహకాలను ప్రస్తావిస్తున్నారు. అన్నింటిని మించి ఆదాని 418 పేజీల సమాధానాలు ఇచ్చి ఇంకా 63 ప్రశ్నలకు ఎలాంటి బదులు లేదంటున్నారు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వారు.
ఇక ఆదానీ ప్రధానుల అన్యోన్యత జగద్విదితం. కొన్ని దేశాలు సైతం అధికారికంగానే దీన్ని, ప్రభావాన్ని ధృవీకరించడం బహిరంగ రహస్యం. ఎవరి వెనక ఎవరెవరు ఉన్నది ఎవరికి ఎవరు చెప్పనవసరం లేదు. ఒకే సంస్థ గొడుగు కింద ఉండే వివిధ కంపెనీలు ఆ గ్రూపునకు చెందిన హోల్డింగ్‌ కంపెనీకి చెందుతాయి. అవి అంతర్గతంగా పరస్పరం సహకరించుకుంటాయి. అవసరమైనప్పుడు ఆపత్కాలంలో కావాల్సిన నిధులు సమకూర్చుకుంటాయి. సర్దుబాటు చేసుకుంటాయి. వాటి అంతర్గత లావాదేవీలు ఎన్ని నియంత్రణలు ఉన్నా లోపాయి కారీగా జరగకూడనివి అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇకఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి అయితే వారి పోకడలు ఇక చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబం దేశాధినేతకు చేరువైతే ఇక వారికి అడ్డు ఏమి ఉంటుంది? అనతికాలంలోనే ఆకాశానికి ఎదగడం తప్ప. ఇక్కడ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇదే. ఇంతకుముందు సినిమాలకు సంబంధించి విమర్శలు, గుజరాత్‌ గురించి బిబిసి డాక్యుమెంట్లు, హిండెన్‌ బర్గ్‌ రిపోర్టే కాక తాజాగా(7/2/2023) వాషింగ్టన్‌ పోస్టులో మెయిన్‌/ లోపలి పేజీలలో మన దేశంలో మతమార్పిడులపై జరిగిన దాష్ట్టికాలపై సాధికార కథనం వచ్చింది. వీటన్నింటికీ వేరెవరివో విద్వేషపూరిత కుట్రలని వారిపై విమర్శతో సరిపెట్టుకోవడం సరి కాదు.
కార్పొరేట్‌ రంగంలో ఈ అనారోగ్య దుష్పరిణామాల కారణంగా పెద్దలంతా బాగానే ఉంటారు. ఈ పరిణామాలు కారణంగా విపరీతంగా నష్టపోయిన అమాయక మదుపు దారులంతా ఏమైపోవాలి? వారి గోడు ఎవరికి పడుతుంది? అందులో వీరు గత రెండు సంవత్సరాలలో ఐదారు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా రెట్టింపునకు మించి దాదాపు 7కోట్ల పైగా ఉన్నారు. గతంలో హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేక్‌ కారణంగా ఎందరో బలయ్యారు. అనేక కుటుంబాలు బజారుపాలయ్యాయి. మరి ఇప్పుడు ఎందరెందరు ఏఏ రూపాల్లో మౌనరోదనలో కకావికులయ్యారో!? ఛిద్రమైనారో తెలియదు. అంతుబట్టదు. వారి కుటుంబాలు ఏమైపోవాలి? వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంత కాలం ఇవి ఇలా కొనసాగాలి? మార్కెట్‌ మాయాజాలంలో జరిగే నిత్య అకృత్యాల అగ్ని కీలలకు ఎందరెందరో నిశ్శబ్దంగా సెలబాలుగా మాడిమసైపోతున్నారో! ఇలాంటి అనూహ్య ఉపద్రవాలప్పుడు తలకిందులు అయిపోతారు. ఇప్పుడు ఈ ఎఫ్‌పీఓని రద్దు చేయడం ద్వారా వీరందరికీ, సభ్య సమాజానికి ఎలాంటి సందేశం అందుతుంది? ఈ మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం ద్వారా వారికి సేకరించిన సొమ్ము అవసరం లేదనే కదా! దీని ప్రమేయం లేకుండానే తమ వ్యాపార విస్తరణాధి కార్యక్రమాలు జరుపుకోగలమని తెలపటమే కదా!. అలాంటప్పుడు ఈ జరిగిన జరిపిన బృహత్తర ప్రక్రియకు అర్థం ఏమిటి? వీటికి ఉదారంగా అనుమతులు ఇచ్చే రెగ్యులేటర్ల లాంటి ప్రభుత్వ సంస్థల మాటేమిటి? ఇలాంటి సంస్థల కారణంగా వారి ప్రతిష్ట మంట కలిసి పోవడం లేదా?. ఇలాంటివి గతంలో ఎందరెందరో రాష్ట్రం నుండి దేశం నుండి ప్రపంచ స్థాయిలో ఎందరో చేశారు. తమకు ఆ నిధుల అవసరం లేకుండానే సేకరించి వాటిని ప్రక్కదారి పట్టించారు. నిరర్థకాస్తులు పెంచారు. సెరపరంపరగా డొల్ల కంపెనీలు పెట్టారు. విదేశాల్లో తలదాచుకుంటారు. మదుపుదారులకు శఠగోపం పెట్టారు.
బి.లలితానంద ప్రసాద్‌(రిటైర్డ్‌ ప్రొఫెసర్‌), 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img