Friday, April 19, 2024
Friday, April 19, 2024

వానరులు.. వాలధారులా? తోకల కోతులా!?

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

అసలు రచయితల పురాణాలకు వర్ణనలకు, మారిన సామాజిక సంప్రదాయాలకు అనుగుణంగా పలువురు మరు రచయితలు, అనేక అంశాలను కలిపారు, తీసేశారు, మార్చారు. తమతత్వాలను చొప్పించారు. సంస్కృత పదాల నానార్థాలలో సందర్భోచిత అసలు అర్థాలతో కాక తమకు తెలిసిన, తోచినఅర్థాల పదాలతో అనువదించారు. ఈ ప్రక్రియలు రామాయణంలోనూ జరిగాయి.
హృషికేశ్‌ ముఖర్జి సినీ దర్శక సృష్టికర్త, కూర్పరి, రచయిత. సెన్సార్‌ బోర్డు, చలనచిత్రాభివృద్ధి సంస్థల అధ్యక్షుడు. పద్మవిభూషణ్‌, ఫాల్కేపురస్కారాల గ్రహీత. ఆయన దర్శకత్వ చిత్రాల్లో 1983 నాటి‘కిసీసే న కహ్నా (ఎవరితో చెప్పకు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. దీనికి యు(అందరికి) ధృవపత్రం ఇచ్చారు. ఆ సినిమాలోబ్రాహ్మణ కథానాయకునిగా ఫరూఖ్‌ షేక్‌, అభ్యుదయ పండిత పాత్రలో సయీద్‌ జాఫ్రీ ఇప్పుడు సంఫ్‌ుకు నచ్చలేదు. సినిమాలో హనీమూన్‌ హోటల్‌ బోర్డును హనుమాన్‌గా దిద్దారని హీరో హీరోయిన్‌తో అంటాడు. హనుమాన్‌ పేర వ్యాపారీకరణను దర్శకుడు దృశ్యీకరించారు. నిజనిర్ధారణ అంతర్జాల పత్రిక ఆల్ట్‌-న్యూస్‌ సహ నిర్మాత మహమ్మద్‌ జుబైర్‌ ఈ దృశ్య కత్తిరింపును‘2014 ముందు హనీమూన్‌ 2014 తర్వాత హనుమాన్‌’ అని నాలుగేళ్ల మూడునెల్ల క్రితం ట్వీటారు. ఇది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. మంకీ గాడ్‌ అని ఆంజనేయుని అవమానించారని, జనాలను కవ్వించారని సంఫ్‌ు గోల చేసింది. గుర్తేలేని 40 ఏళ్ల నాటి సినిమా 4 ఏళ్ల క్రితపు ట్వీట్‌ ఇపుడు ఎవరిని రెచ్చగొడతాయి? భగవాన్‌ హనుమాన్‌ను కోతి అని అవమానించారని జువైద్‌పై అభియోగం.
గోధ్రా మారణహోమంలో పార్లమెంటు పూర్వ సభ్యుడు ఎహ్సాన్‌ జాఫ్రిని, తన ఇంటిలో తలదాచుకున్న 68 మందితోపాటు, దారుణంగా చంపారు. అస్మదీయులతో నిండిన ప్రత్యేక దర్యాప్తు బృంద న్యాయస్థానం మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జాఫ్రిభార్య జాకియా అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘‘గుజరాత్‌ లో అసంతృప్త ఉద్యోగులు, ఇతరులతో కలిసి అబద్ద సాక్ష్యాలిచ్చారు. ఈ దురుపయోగ ప్రక్రియకు పాల్పడ్డవారిని బోనులో (జైల్లో)ఉంచాలి. వారిపై చట్టచర్యలు తీసుకోవాలి.’’అని వ్యాఖ్యానించింది. దీనికి స్పందిస్తూ కేంద్ర గృహమంత్రి అమిత్‌ షా గుజరాత్‌ పోలీసులకు స్వేఛ్ఛనిచ్చారు. వారు మానవహక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, మాజీ డిజిపి ఆర్‌.బి. శ్రీకుమార్‌, జువైద్‌లను అరెస్టు చేశారు.
పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, కిన్నెర కింపురుష యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొన్న స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. కపి పదాన్ని కోతి అని అనువదించారు. కపికి సూర్యుడు, తామరతూడు అన్న అర్థాలున్నాయి. బ్రహ్మ ప్రత్యేక సృష్టి అహల్య. ఇంద్రునికి అహల్యకు వాలి, సూర్యునికి అహల్యకు సుగ్రీవుడు, వాయుదేవునికి అంజనీదేవికి ఆంజనేయుడు పుట్టారు. మానవ స్త్రీలకు, మానవాకార దేవుళ్ళకు కోతులు పుట్టవు. జన్యుశాస్త్రమే కాదు, పౌరాణిక తర్కవిజ్ఞత కూడా దీన్ని ఆమోదించదు.
సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొన్నారు. వీరు వాలం (తోక) కల, తోక లాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఒరియా భాషలో పొడవు తోకను లాంబో లాంజియ అంటారు. వీరిని పొడుగు తోకల వారని పిలిచేవారు. చాలా తెగల ఆహార సేకరణకు, జీవన విధానానికి అనువైన గోచీని మగవాళ్ళే కట్టుకుంటారు. అందుకే వాలి భార్య తార, సుగ్రీవుని శ్రీమతి రుమాదేవి, ఆంజనేయుని అమ్మ అంజనీదేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. రామాయణం మగవానరులను కోతులుగా వర్ణించింది. నాటకాలు, సినిమాలు అదే పని చేశాయి. రామాయణ యుద్ధంలో పాల్గొన్న వానరులు గిరిజన ఆదివాసీ తెగలవారు. కొండల్లో, దట్టమైన అడవుల్లో జనావాసాలు ఏర్పర్చుకొని నివసించిన ప్రజలు. వీరికి చాలా భాషలు తెలుసు. మహాభారతంలో ఖాండవదహనంలో మూకుమ్మడిగా హత్యకు గురైన నాగులు ఈ తెగలో భాగం. లంకలో సీతను చూసిన హనుమంతుడు ఆమెను ఏ భాషలో పలుకరించాలా అని ఆలోచించాడు. సంస్కృతంలో మాట్లాడితే రావణుడు మారు రూపంలో వచ్చాడని అనుమానిస్తుందేమో అనుకున్నాడు. దీన్ని బట్టి వానరులు పండిత నరులని తెలుస్తోంది. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణల అర్థాలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారంచేశారు. వీటిని రాముడు నిర్ధారించాడు. యుద్ధంలో వానరులు మానవ రూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతి చేష్టలు అంటగట్టి వినోదించారు. రావణుని నుండి సీతను రక్షించబోయి మరణించిన జటాయువు, ఆంజనేయాదులకు సీత ఉనికిని చెప్పిన, జటాయువు అన్న, సంపాతి పక్షులుకాదు. గరుడజాతి ఆటవికులు. వీరిని పక్షులుగా మార్చడంలోనూ ఆర్యజాతి పాత్ర ఉంది. సంపాతి, జటాయువుల మాటల్లో కూడా వానరులు నరులని తెలుస్తుంది. వానరజాతి చిహ్నాలను యుద్ధంలో(రామ)రాజ్యం నిషేధించింది. ఏదిఏమైనా వానరులకు మానవ రూపాన్ని నిషేధించటం అంటే వారు మానవులని, కోతులు కారని అర్థం.
వానరులు యోధులు, సైనిక బలవంతులు. విస్తృత పరిజ్ఞానం కలవారు. అందుకే రాముడు వారిని ఆశ్రయించాడు. కిష్కిందనగరం మేడలతో, సుగంధ ద్రవ్యాలు, మధువు(సారా) అమ్మే వీధులతో అందంగా ఉందని కిష్కింధ కాండలో వర్ణించారు. రక్షకభటులున్న 7 ప్రాకారాలు దాటి లక్ష్మణుడు సుగ్రీవ అంతఃపురం చేరాడు. సుగ్రీవుడు పట్టుబట్టలతో, సువర్ణాభరణాలతో, వజ్ర వైఢూర్యాలు పొదిగిన సింహాసనంపై కూర్చున్నాడు. కిష్కింధ మానవ రాజుల రాజధాని. కోతుల గూడు కాదు. సుగ్రీవాదులు మనుషులు. కోతులు కారు.
వాణిజ్యవేత్తలు హనుమాన్‌ హోటళ్ళు, బార్లు, మాంసం అంగళ్ళు, వ్యాపార కేంద్రాలతో ఆంజనేయుని లాభాలకు వాడుకుంటున్నారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. వీరే నిందితులు. హేతుబద్ద ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత విజ్ఞులది,భాషా కోవిదులది, సామాజిక శాస్త్రవేత్తలది.
వ్యాసరచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి,
చరవాణి: 94902 04545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img