Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వారు మారేదే లేదు!

కూన అజయ్‌బాబు

‘అందరిదొకదారి…ఉలిపికట్టదొక దారి’…అన్నట్లు ప్రపంచమంతా మారుతున్నా…పోలీసులుమాత్రం మారరు, మారలేరు. వారి పట్ల ప్రజలకు ఎంత విశ్వాసం సన్నగిల్లినా…‘మేమింతే’ అని అంటూ ఉంటారు. నిజానికి పోలీసుల్లో ప్రతి వెయ్యి మందికి ఒకరు మాత్రమే నిజాయితీగా పనిచేయ గలరు. రాజకీయ ఒత్తిళ్లు ఏ శాఖపై లేనంతగా పోలీసుశాఖపై ఉండటమే అందుకు ప్రధాన కారణం. దాదాపు ప్రతి పోలీసూ నిజాయితీగా పని చేయాలని ఖాకీ చొక్కా వేసుకునేటప్పుడే ప్రమాణం చేస్తారు. కానీ రాజకీయ శక్తులు వారిని ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయరు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో జరిగినసంఘటన అందుకు ఒక ఉదాహరణ. అక్కడ ఖుండేల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేవ్‌దాయ్‌ గ్రామంలో ఒక ముస్లిం కుటుంబంపై హిందుత్వ, మతోన్మాదమూకలు దాడిచేసి తక్షణమే ఊరి విడిచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఈ దాడిలో ఐదుగురు ముస్లిం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిపాలయ్యారు. షారుఖ్‌ లోహార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొమ్మిదిమంది హిందుత్వ వాదులపై ఎఫ్‌ఐఆర్‌ను ఐపీసీలోని సెక్షన్లు 324, 394, 506, 427, 147, 148 కింద నమోదు చేశారు. దాడి జరిగిన ఎనిమిది గంటల తర్వాత కేసు నమోదు అయింది. అంతలోనే దృశ్యం మారిపోయింది. తెల్లవారేటప్పటికి బాధితులపై ‘రివర్స్‌’ (కౌంటర్‌) కేసు దాఖలైంది. ముస్లిం కుటుంబంలోని ఐదుగురిపై ఐపీసీలోని 323, 394, 506, 147, 148 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వికాస్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త పెట్టిన కేసు యిది. కేసు తారుమారు కావడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణ మని తేలిపోయింది. అలాంటిదేమీ లేదని పోలీసులు చెపుతున్నారు. అది సహజం. హిందుత్వ మూకలు ఇనుపరాడ్లతో ఆ మైనారిటీ కుటుంబంపై దాడి చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా అవయవాలను ప్రదర్శించి, శరీరంలోని మార్మిక భాగాలపై చేతులు వేయడం… వంటి దుశ్చర్యలేవీ ప్రభుత్వ వర్గాలకు గానీ, పోలీసులకు గానీ కనబడలేదు, అర్థం కాలేదు. కానీ ఇది తన వ్యాపారానికి సంబంధించిన కేసు అని ఓ ఉన్మాది చేసిన వాదనలో పోలీసువర్గాలకు నిజాయితీ కన్పించడం విచిత్రం.
పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ సుప్రీంకోర్టు రెండు నెలల క్రితం అసహనం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెల్సిందే. కేసుల నమోదులో పోలీసుశాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి తీరు ఇబ్బందికరసంప్రదాయంగా మారిందని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆక్షేపించారు. ‘‘పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టే ధోరణి. ఇలాంటి దుస్థితికి తెరపడాల్సిన అవసరంఉంది. చాలా రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదవుతున్నాయి. అధికారం మారగానే ప్రత్యర్థులపై కేసులు నమోదవుతున్నాయి. అధికార పార్టీ ప్రాపకం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. కొందరు పోలీసుఅధికారులు తమ అధికారాన్ని దుర్వి నియోగం చేస్తున్నారు’’ అని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఓ అధికారిపై రాజ ద్రోహం కేసు నమోదుచేసిన వైనంపై జస్టిస్‌ రమణ చేసిన వ్యాఖ్యలివి.
నేతలకు మోకరిల్లే దయనీయపరిస్థితి నుంచి పోలీసులు ఎప్పుడు బయటపడతారన్నది చెప్పడం కష్టసాధ్యమే. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే ఒప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 పైచిలుకు పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి తాము, పోలీసుశాఖలోని మరికొందరి సహకారంతో ఓటర్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామని, ఇంత సాయం చేసినా ఇప్పటివరకు వారు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని స్వయంగా స్పెషల్‌బ్రాంచికి చెందిన ఓ పోలీసు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. అశ్లీలచిత్రాల కేసులో అరెస్టయిన నటి గహనా వశిష్ట్‌ ఈమధ్య ముంబయి పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ. 15లక్షలు లంచంగాఇవ్వాలని ముంబయిపోలీసులు డిమాండ్‌ చేశారని, చివరకు తప్పనిపరిస్థితిలో రూ.8లక్షల వరకు సిద్ధం చేసుకున్నట్లు ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని రోజుల క్రితం కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్‌ అయింది. దువ్వూరు మండలంలోని తమ 1.5 ఎకరాల భూమిని ఆక్రమించిన స్థానిక అధికారపార్టీ నేత పోలీసులతో కలిసి తనను బెదిరిస్తున్నారని, జీవనాధారమైనపొలాన్ని ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని ఆయన విన్నవించుకోవడంతో చివరకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సివచ్చింది. అలాగే, అనంతపురంజిల్లాలో సిపిఐ నాయకుడు వేమయ్యపై స్థానిక పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారు. ప్రజాసమస్య లపై ఉద్యమాలు చేస్తే రౌడీషీట్‌ నమోదుచేస్తారా? ఇదేం పోలీసున్యాయమో ఎవరికీ అర్థంకాదు. ఇంకో వైపు, రాష్ట్రంలో రౌడీషీట్‌ నమోదైన వారంతా ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలుగా చెలామణి అవుతున్నారు. బ్రిటిష్‌ సేనలైనా, ఆ తర్వాత మన పోలీసులులైనా ఇప్పటివరకు చేసిన లాఠీఛార్జీల్లో 99 శాతం లాఠీ ఛార్జీలు ప్రజాస్వామ్యవాదులపైనా, జన సమస్యలపై పోరాడుతున్నవారిపైనే జరిపారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పాలకులకు ‘నీకాల్మొక్తా…బాంచన్‌ దొరా!’ అనే వ్యవస్థ నుంచి పోలీసులు బయటపడాల్సిన అవసరం వుంది. సరైన ఆలోచనలతో, సమగ్రమైన విచారణలతో బాధితులకు, అలాగే హక్కులకోసం పోరాడేవాళ్లకు తోడ్పాటును ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తెరగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img