Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్య. ఉద్యోగ పరీక్షలు తెలుగులోనూ జరపాలి

భారతదేశంలో అత్యున్నత స్థాయి అధికారులుగా ప్రజాసేవ చేయాలనే ఆశయంతో నిరంతరం సాధన చేస్తూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు సిద్ధమవు తుంటారు. అయితే తెలుగు విద్యార్థులకు విషయ పరిజ్ఞానంపై పట్టుఉండి వివిధఅంశాలలో నిపుణులై ఇతరులతో పోటీపడే సామర్థ్యం ఉన్నప్పటికి కేవలం ‘భాష’ కారణంగా విజయం సాధించలేక పోతున్నారు. యూపీఎస్సీ ప్రాథమికపరీక్ష (ప్రిలిమ్స్‌) కేవలం హిందీ ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహిస్తుంది దీంతో తెలుగు వారికి తీవ్ర నష్టం జరుగుతుంది ప్రధాన పరీక్ష(మెయిన్స్‌) తెలుగులో నిర్వహిస్తు న్నప్పటికీ మొదటి ప్రాధమిక పరీక్ష వద్దనే అడ్డుకట్ట వేస్తుంటే రెండోదశ పరీక్షకు ఎలా వెళ్లగలరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా భాష వివక్ష కొనసాగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించే ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు ఉద్యోగ పరీక్షలు అన్నీ హిందీ, ఇంగ్లీషులోనే నిర్వహిస్తూ హిందీయేతరులకు ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తూనే ఉన్నారు. సమాన అవకాశాలు కల్పించే విధంగా జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షలు నిర్వహణ కోసం జాతీయ నియామకాల సంస్థ (ఎన్‌అర్‌ఎ) ఏర్పాటు చేసి మొదట 12 భాషలలో తరువాత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న 22 అధికారిక భాషలలో పరీక్షలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2020`21 బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించడమే కాక 1517 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ప్రాథమిక స్థాయిలో అమ్మ భాషలో విద్య అవసరమని భారత రాజ్యాంగం అధికరణ 350 ఎ, కొఠారి కమిషన్‌ నూతన జాతీయ విద్యా విధానం 2020, యునెస్కోతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు అన్ని చెబుతున్నాయి చెప్పటమే కాకుండా వారి అమ్మ భాషలో ప్రాథమిక విద్య బోధిస్తున్నాయి. తెలుగులో చదివితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం లేదనేది కొంతమంది వాదన. అలా అని ఇంగ్లీషులో చదివిన వారందరికీ ఉద్యోగాలువచ్చినదాఖలాలులేవు. ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలూ విఫలం అయ్యాయి. ఉన్నత విద్యా ప్రవేశ అర్హత పరీక్షలు ఉద్యోగపరీక్షలు తెలుగులో నిర్వహించటం వలన నాణ్యతప్రమాణాలు దెబ్బ తింటాయని ఇంగ్లీషులోనే ఉండాలనేది వాదన సరైంది కాదు. భాష ప్రామాణికంగా నాణ్యతాప్రమాణాలు కొలవలేము. ఏభాషలో చదివినా స్థానికభాష మాట్లాడేవారికోసం ఏరంగంలో అయినా సేవచేయాల్సి ఉంటుంది.
అమ్మ భాషలో చదివితే విద్యార్థుల మేదస్సు వికసించి సృజనాత్మక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైనది. ప్రభుత్వం ఒకవైపు ఉన్నతవిద్యను కూడా అమ్మనుడి(భాష)లో ఉండేటట్టు చర్యలు చేపడతామని చెబుతున్నది అయితే జాతీయస్థాయిలో నిర్వహించే విద్యా ఉద్యోగ పరీక్షలు ఎందుకు నిర్వహించరు అనేది ప్రజల ప్రశ్న? జాతీయ స్థాయి ఉద్యోగ పరీక్షలు హిందీ ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహించడం వలన తెలుగు వారికీ తీవ్రనష్టం జరుగుతుంది. సాంకేతికత కొత్త ఆవిష్కరణలు అధికారిక భాషలలో అనువాదం చేయలేదు. హిందీకి మాత్రమే అధిక నిధులు కేటాయిస్తున్నది. ఉన్నత విద్యా అర్హత ప్రవేశాల కోసం నిర్వహించే యుజిసి నెట్‌ ,సిఎస్‌ఐఆర్‌ నెట్‌, గేట్‌, జి పాట్‌ వంటి పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహించడం ద్వారా హిందీయేతరులకు నష్టం జరుగుతుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సి, ఐబీపీఎస్‌, రైల్వేడిఫెన్స్‌ ఆర్‌బిఐలలోని కిందిస్థాయి ఉద్యోగాలకు తెలుగులో నిర్వహిస్తారు. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు హిందీ ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. డిఫెన్స్‌ తదితరశాఖలలోని ఉద్యోగాలకు హిందీ, ఇంగ్లీషులో మాత్రమే నిర్వహించడం వలన హిందీయేతరులకు ముఖ్యంగా తెలుగు వారికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
రాజ్యాంగంలోని అధికరణ16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ఎటువంటి తేడా చూపకూడదని ఉన్నప్పటికీ మన ప్రభుత్వం వివక్ష చూపుతూ తెలుగువారికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. హిందీ జాతీయ భాష కాదు అయినా హిందీలోనే ఎందుకు నిర్వహించాలి? హిందీ కూడా 22 అధికారిక భాషలలో ఒకటి. హిందీలో నిర్వహించి హిందీయేతరులపై వివక్ష చూపటం వారికి అన్యాయం చేయటమే.
అఖిల భారత యువజన సమాఖ్య
కడప జిల్లా కార్యదర్శి, 9849181961

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img