Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వెండితెరపై కళాతపస్వి కవిత్వం

కాశీనాథుని విశ్వనాథ్‌ సినిమా దర్శకుడు. ఆయన కవిత్వం రాసారా. ఒకటో, రెండో చిన్న చిన్నవి రాసుండువచ్చు. ప్రేక్షకులకు వాటి గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. మరి ఇదేమిటి విశ్వనాథ్‌ కవిత్వం రాసాడంటాడేమిటి అనుకుంటున్నారా. అవును విశ్వనాథ్‌ కవిత్వం రాసారు. పెన్నుతో కాగితం మీద కాదు. కెమెరా కన్నుతో వెండితెర మీద కవిత్వం రాసారు విశ్వనాథ్‌. అది కూడా కవిత్వ వ్యక్తీ కరణలో ఎన్ని పార్వ్శాలుం టాయో వాటన్నింటిని విశ్వనాథ్‌ వెండితెర మీద దర్శకుడిగా కంటే కూడా ఓ కవిగా చూపించారు. సాగర సంగమం సినిమా గుర్తుంది కదా…అసలు మరిచిపోతే కదా అంటారా. సరే, ఆ సినిమాలో హీరో కమల్‌ హాసన్‌ తాగేసి నూతిమీద తకిట తకిట తందానా అని పాడుతూ నూతిలోకి పడిపోయే సమయంలో నుదుటన నిండు చంద్రుడంతటి బొట్టుతో హీరోయిన్‌ జయప్రద నూతిలో పడిపోకుండా చెయ్యి పట్టుకుని లాగేస్తుంది చూడండి. ఆ సమయంలో కురుస్తున్న వర్షానికి హీరోయిన్‌ బొట్టు చెరిగిపోకుండా కమల్‌ హాసన్‌ తన అరచేతిని హీరోయిన్‌ నుదిటికి అడ్డంగా పెడతాడు కదా… అదే అచ్చమైన ప్రేమ కవిత్వం. ఆ పాటలోనే చేతిలో కాలుతున్న సిగరెట్‌ నుసిని పారేయడానికి యాష్‌ట్రే కోసం చుట్టూ వెతికి సిగరెట్‌ నుసిని నూతిలో వేస్తాడు కదా… అది ఆ చిన్న సీన్‌ ఓ తాగుబోతు మినీ కవిత్వం.
మెగాస్టార్‌ కావడానికి ముందు చిరంజీవి నటించిన స్వయంకృషి సినిమాలో చెప్పులు కుట్టే సాంబయ్యని తెలుగు వారెవరు మరచిపోతారు. ఆ సాంబయ్య పెంచిన కొడుకు చిన్నా కోర్టులో తన తండ్రి కావాలని చెప్పిన తర్వాత సాంబయ్య కోర్టు నుంచి నేరుగా తన షాపులో ఉన్న చాంబర్‌కి వెళ్లిపోతాడు. ఆ చాంబర్‌లో తన రహస్య గదిలోకి వెళ్లి చాలా కోపంగా పాత సాంబయ్య బయటకు వచ్చి చెప్పులు కుడతాడు కదా. ఆ సీన్‌లో ఉన్నది ఆవేశ కవిత్వం. కమలహాసన్‌దే మరో చిత్రం స్వాతిముత్యం. అమాయకపు పాత్రలో కమల్‌హాసన్‌ను విశ్వనాథ్‌ అద్భుతంగా చూపించిన సినిమా. ఓ పక్క తల్లి మరణిస్తే గోడకి ఆనుకుని కూర్చుని గోడ సందుల్లో ఇరుకున్న చీమలతో ఆడుకుంటున్న హీరో కమలహాసన్‌ ‘‘చిట్టీ ఆకలేస్తోంది. అన్నం పెట్టవా’’ అని అడుగుతాడు చూడండి అది ఆకలి కవిత్వం. మరణం కంటే ఆకలి ప్రమాదకారి అని చెప్పిన చిక్కనైన విప్లవ కవిత్వం వెండితెరపై ఏదైనా ఉందంటే అది స్వాతిముత్యం సినిమాలో కవి, దర్శకుడు విశ్వనాథ్‌ చూపించిన ఈ సీన్‌ మాత్రమే. విశ్వనాథ్‌ కేవలం దర్శకుడే అయి ఉంటే ఈ కవిత్వాన్ని మనకి ఇచ్చేవాడేకాదు. అతనిలోని ఓ భావుకుడు, ఓ నిండైన కవి ఉన్నాడు కనుకనే వెండితెరపై ఈ కవిత్వాన్ని చూపించాడు. విశ్వనాథ్‌దే మరో కవిత్వ పంక్తిలాంటి సీన్‌ సిరివెన్నెల సినిమాలో చూపించారు ఈ వెండితెర దర్శక కవి. సిరివెన్నెల సినిమాలో అంథుడైన హీరో సర్వదమన్‌ బెనర్జీకి అతను ఆరాధించిన హీరోయిన్‌ మున్‌ మున్‌ సేన్‌ ఆత్మహత్య చేసుకుందని తెలియదని సినిమా చూస్తున్న వారే కాదు, చిత్రంలో ఇతర పాత్రలు కూడా భావిస్తాయి. కాని, సినిమా చివరిలో చెల్లెలుతో ‘‘సంయూ.. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను శ్మశానానికి వెళ్లొస్తా’’ అంటాడు. ఆ తర్వాత అతనే మళ్లీ ‘‘ఏమ్మా… మనసుతో ప్రకృతిని చూపించిన ఆమే ప్రకృతిలోనే కలిసిపోయిందని నాకు తెలియదమ్మా’’ అంటాడు. దీన్ని ఏ కవిత్వమంటారు. నేనైతే ఈ సీన్‌ని మనసు కవిత్వం అంటాను.
అమ్మ చూపించే ప్రేమనేకాదు అమ్మకవిత్వం చెబితే ఎలా ఉంటుందో కూడా విశ్వనాథ్‌ ఓ సీన్‌లో కవిత్వీకరించారు. సూత్రధారులు సినిమాలో గంగిరెద్దుల కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు ఐఏఎస్‌ పాసై కలెక్టర్‌గా వస్తే ఊరంతా సంబరాలు చేసుకుంటుంది. ఆ ఐఏఎస్‌ని గ్రామంలో ఊరేగిస్తుంది. పూలదండలు వేస్తుంది. హారతి పడుతుంది. అదిగో అప్పుడే తన పొయిటిక్‌ సీన్‌కి తెర తీసారు విశ్వనాథ్‌. కలెక్టర్‌గా వస్తున్న కొడుకు తిరుమలదాసుకు ఊరు చెప్పబోయే స్వాగతానికి మురిసిపోతుంది తల్లి. ఆ ఆనందాన్ని పంచుకుందుకు పరుగు పరుగున ఇంటికి వెళ్తుంది ఆ తల్లి పాత్రలో ఉన్న సుజాత. ఇంటి బయట బట్టలారేస్తున్న భర్తని గబగబా ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెడుతుంది. ప్రేక్షకులకే కాదు తండ్రి పాత్రలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావుకి ఎడతెగని ఉత్కంఠ. అదిగో అప్పుడు. సరిగ్గా ఆ సమయంలో తడి కళ్లతో ‘‘ఎంత మంచి కొడుకు నిచ్చావయ్యా’’ అంటూ భర్త అక్కినేని బుగ్గన ముద్దు పెడుతుంది. ఇదీ తల్లి చెప్పే కవిత్వం. భక్తి పాళ్లు ఎక్కువగా ఉన్న విశ్వనాథ్‌ ఆ కవిత్వాన్ని కూడా చూపించారు తన సినిమాల్లో. అదే సప్తపది. ఈ సినిమాలో ఆలయ పూజారి హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత తొలిరేయి తన భార్య అమ్మ వారిలా కనిపించడం, అందుకు ప్రతిగా ఆమెకు దండంపెడుతూ హరిగిరి నందిని నందిత మోహిని అంటూ పరవశుడై స్తుతించడం భక్తి కవిత్వం కాక ఇంకేమంటాం. ఇవి కొన్ని మాత్రమే. విశ్వనాథ్‌ ప్రతి సినిమాలోనూ ఇలాంటి కవిత్వ పంక్తులు చాలానే ఉంటాయి. తెలియాలంతే. తెలుసుకోవాలంతే.
సెల్‌: 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img